A Century is Not Enough: Sourav Ganguly
పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రీడాకారులు ఆత్మకథలంటూ పుస్తకాలు రాయడం కొత్తేమీ కాదు. అందులోనూ క్రికెట్ పిచ్చి బాగా ఉన్న మన దేశంలో మన క్రికెటర్ల పుస్తకాలకి బాగానే మార్కెట్ ఉంది. అందుకనేనేమో సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వీ అవ్వగానే పుస్తకం రాసేసాడు. అతని సహచరుల్లో గంగూలీ పుస్తకం ఈ మధ్యనే వచ్చింది.
ఇది ఆటోబయోగ్రఫీ కాదు. ఇక్కడ పుట్టాను. అక్కడ పెరిగాను. వీళ్ళు కుటుంబం. వాళ్ళు స్నేహితులు – లాంటి కబుర్లేవీ ఉండవు. ఈ పుస్తకంలో మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయం ఒకటి — సౌరవ్ తనకి ఆటను మెరుగుపరుచుకోడానికి సలహాలో, సహాయమో కావాల్సి వచ్చినప్పుడు, సంకోచిస్తూనే తనకు సాయం చేయగలవారిని సంప్రదించాడు. వారితో మాటా మాటా కలిపి, తన అవసరమేమిటో చెప్పి, దానికి తగ్గ సలహాలు, సూచనలు తీసుకున్నాడు. వీలైనంత వరకూ వాటిని పాటించి మంచి ఫలితాలు సాధించాడు. అలాంటి వారిని గూర్చి ఈ పుస్తకమంతా ఉంది. ఇది రాస్తున్నప్పుడూ సౌరవ్ మదిలో బహుశా తనలాంటి ఒక కుర్రాడు – ఆడాలన్న తపన తప్ప చాలా విషయాలు తెలీనివాడు ఉన్నాడు అనుకుంట. అందుకే, పుస్తకం మొత్తం అలాంటి అబ్బాయికో, అమ్మాయికో తన అనుభవాలు చెప్తూ, వాటి వల్ల తాను నేర్చుకున్న పాఠాలను పంచుకున్నట్టు ఉంటుంది. జీవితంలో ఎంతో కొంత సాధించినవాడు జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల ఉన్నవారికి హితబోధ చేస్తున్నట్టు ఉంటుందీ పుస్తకం. అందుకని ఇది పూర్తిగా మెమొయిర్ కూడా అనిపించకపోవచ్చు. ఏ జ్ఞాపకాన్ని తీసుకున్నా, ఆ అనుభవం చెప్తున్నా దానిలో చివర “ఇందులోని నీతి ఏమనగా…” అనే టోన్ వినిపిస్తూనే ఉంటుంది.
నేను సౌరవ్ సహా తక్కిన వాళ్ళు ఆడిన క్రికెట్ చాలా ఎక్కువగా చూశాను. క్రికెట్ గురించిన థియరీ ఎంతోకొంత అలవాటు అయ్యింది కానీ, క్రికెట్ ఆడింది లేదు. కానీ, ఈ ఆటగాళ్ళు ఆటను అప్రోచ్ చేసే విధానం, ఆడిన విధానం, క్రికెట్ చుట్టూ ఉన్న ఎకో-సిస్టమ్ ను – మీడియా, మార్కెటింగ్, ఫిట్‌నెస్, బిసిసిఐ లో పాలిటిక్స్ – వాళ్ళు ఒక బాలెన్స్ తో నెగ్గుకురావడం నాకు చాలా విషయాలు నేర్పించింది. అందుకని గంగూలీ పుస్తకం ఓ పెద్దన్న తన అనుభవాన్నంతా అర్థమయ్యే రీతిలో చిన్నదానికి చెప్తున్నట్టే అనిపించింది. గంగూలితో అలాంటి అనుబంధంలేని వారికి ఈ పుస్తకం కాస్త చికాకు పెట్టించచ్చు.
తొంభైల చివర్లో, ఆపైన కూడా మీడియా ఇప్పుడున్నంతగా లేదు. యూట్యూబ్, వాట్సాప్‌లు, బ్లాగులు లేవు. అప్పట్లో, పోస్ట్ మాచ్ ప్రెజెంటేషన్ లో ఏం చెప్తారో అన్నదే ఉత్కంఠత. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో వార్తాపత్రికల్లో వచ్చే ఇంటర్వ్యూలు వల్ల ఇంకొంత సమాచారం తెలిసేది – అందులో ఎప్పుడోగాని డ్రస్సింగ్ రూమ్ విశేషాలు తెలిసేవి కావు. ఇంకెప్పుడో గాసిప్ కాలమ్స్ ఇంకొన్ని కబుర్లు. అలాంటిది, మొన్న డ్రెస్సింగ్ రూమ్స్ దగ్గర్లో వార్నర్ – డి కాక్ గొడవ వీడియోల రూపంలో బయటకొచ్చింది . అంత intrusive గా ఉన్న ఇప్పటి మీడియా వాతావరణంలో వీడియోలో కనిపించిందే మళ్ళీ పుస్తకంలో చదువుకోవాల్సి వస్తే అసహనంగా ఉంటుంది. కళ్ళకి కనిపించింది కాక, జరిగిన సంఘటనలో ఇంకెన్నో కోణాలు ఉంటాయి కాబట్టి, అవి తెల్సుకోవాలి అనిపిస్తుంది. గంగూలి పుస్తకంలో అలాంటి కోణాలు చూపించే అవకాశాలు ఉన్నా దాటవేశాడు.
ముఖ్యంగా మైక్ డెన్నిస్ సమయంలో జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం, సైమెండ్స్- హర్భజన్ మధ్య మంకీగేట్ వగైరాలు నామమాత్రంగా ప్రస్తావించి వదిలేశాడు. సచిన్, ద్రవిడ్లు వేర్వేరు సమయాల్లో కెప్టెన్సీలు వదులుకోవటం, డబుల్ సెంచరీ దగ్గర్లో సచిన్ ఉండగా ద్రవిడ్ డిక్లేర్ చేయడం లాంటి వాటి గురించి పైపై అభిప్రాయాలు చెప్పి తప్పించుకున్నాడు. ఆఖరకు గ్రెగ్ ఛాపెల్‍తో జరిగిన వివాదాన్ని గురించి ఒక చాప్టర్ కేటాయించినా, అందులోనూ ఇంతకు ముందు తెలియని విషయాలేవీ చెప్పడు. అన్నీ మీడియాలోకి – వార్తలగానో, పుకార్లగానో – వచ్చినవే! ఇప్పుడే ఇంటర్యూలోనో ఛాపెల్ గురించి చెప్పేవే ఇందులోనూ రాశాడు.
మొత్తం రచనలో పదేపదే తెలిసొచ్చే ఒకే ఒక్క విషయం – దేశం కోసం ఆడాలనే గంగూలీ తపన. దానికోసం ఎంతటి శ్రమకైనా ఓర్చుకోవడం. డెబ్యూ నుంచి ఐ.పి.యెల్. తో సహా అన్నింటి నుండి రిటైర్ అయ్యే వరకూ ప్రయాణం ఇందులో ఉంది. వచ్చిన అవకాశాన్ని శాయశక్తులా ఉపయోగించుకోవాలని ఆరాటపడ్డం, కొన్ని సార్లు విఫలమవ్వడం, కొన్ని సార్లు విజయం సాధించడం గురించి అనుభావాలన్నీ ఉన్నాయి. ఒక క్రీడాకారుడు ఎన్ని విజయాలు సాధించినా ముళ్ళ మీద నిల్చున్నట్టే ఉంటుందని, గతమంతా మరుగున పడిపోయి చివరి మాచ్‌లోని ప్రదర్శనే ఆధారమవుతుందని, అందుకని ప్రతి మాచ్‌ను ఉన్న ఒకే ఒక్క అవకాశంగా తీసుకోవాలని గుర్తుచేస్తూనే ఉంటాడు గంగూలి.
భారత క్రికెట్ చరిత్రలో గంగూలి ఒక ప్రత్యేకమైన చాప్టర్. అతని ఆటను విమర్శించేవాళ్లకి కొదువ లేదు. అతని అటిట్యూడ్ అంటే చిరాకు పడే వాళ్ళు కోకొల్లలు. అయినా, భారత్ బాడ్మింటన్‌కి గోపిచంద్ పోషించిన / పోషిస్తున్న పాత్ర, భారత క్రికెట్‌కు గంగూలి పోషించాడు. అతడు కెప్టెన్ కావడం యాదృచ్ఛికమే అయినా, ఆ అవకాశాన్ని ఉపయోగించి భారత క్రికెట్‌ను కొత్త దారుల్లో నడిపించాడు. ఆ విశేషాలన్నీ ఈ పుస్తకంలో కొంత వరకూ చెప్పుకొచ్చాడు. కొత్తవాళ్ళని ప్రోత్సహించడంలోనూ, ఫిట్‌నెస్ వంటి ఏరియాల్లో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టడంలోనూ చేసిన పనిని చెప్పాడు. అయితే చరిత్ర సృష్టించిన కోలకత్తా మాచ్ గురించి చాలా తక్కువ రాశాడు. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన కొత్తవారిని ఒక తాటిపై నడపడంలోని కష్టాల గురించి కూడా ప్రస్తావించలేదు.
అలా కొన్ని చెప్పి, చాలా వరకూ వదిలేసిన ఈ పుస్తకం, అభినవ్ బింద్రా పుస్తకంలాంటి అనుభవం ఇవ్వలేదు. కోటలోని మహరాజు కోటనుండే మాట్లాడినట్టు ఉంటుంది కానీ, మన మధ్యలోకి రాడు. పుస్తకంలోని టోన్ మొత్తం ముందు చెప్పినట్టు సలహాలు, సూచనలు నిండిన సంభాషణలా ఉంటుంది. అక్కడక్కడా సామన్య భారతీయులకి సంబంధించిన ఉపమానాలు కూడా ఉన్నాయి – మీకు ఒక చోట ఉద్యోగం రాకపోతే ఇంకోచోట ప్రయత్నిస్తారు. టాటాలో ఉద్యోగం రాకపోతే ఇన్ఫోసిస్ ఉంటుంది మీకు. ఒక క్రీడాకారుడికి ఆ అవకాశం లేదు. ఒకటే జాబ్ ఓపెనింగ్. – లాంటివి. బెంగాలి సంస్క్రృతి, భోజనం కబుర్లు అక్కడక్కడా కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రస్తావన కేవలం క్రికెట్ పరిధిలోనే ఉంటుంది. తోటి ఆటగాళ్ళతో స్నేహం గురించిన కబుర్లు సచిన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గౌతమ్ బట్టాచార్య అనుభవం ఈ పుస్తకంలో అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది.
గంగూలిని ఆప్తునిగా అనుకునేవారికి నచ్చే అవకాశం ఉన్న ఈ పుస్తకం, మిగితావారికి బోర్ కొట్టవచ్చు. భారత్ క్రికెట్ చరిత్రను తిరగరాసిన క్రీడాకారుడు తన కథను చెప్పటంలో మాత్రం చాలా సంకోచించాడు.
Leave a Reply