తెలుగులో ఈబుక్స్
వ్యాసకర్త: డింగు
ముందుగా ఈ బుక్స్ అంటే ఫోన్ లేదా కంప్యూటర్ లో చదువుకొనే బుక్స్.
ఉపయోగాలు
1. ఎన్ని పుస్తకాలైనా ఎంచక్కా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లో చదువుకోవచ్చు.
2. పబ్లిషింగ్ ఖర్చు ఉండదు.
3. ప్రపంచంలోని అందరికి అందుబాటులో ఉంటుంది.
మరి ఇంత మంచి ఉపయోగాలున్నపుడు ఇప్పటి ప్రపంచీకరణ సూత్రం ప్రకారం చాలా ఈబుక్స్ అందుబాటులో ఉండాలి కదా… ఉన్నాయి కాని ఇంగ్లీష్ లో. తెలుగులో చాలా తక్కువ పుస్తకాలు మాత్రమే ఈబుక్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. దీనికి కారణం బహుశా పబ్లిషర్ మరియు రచయితల అవగాహన లేమి (?) అనుకుంటా.
బాగా డిమాండ్ ఉన్న రచయితల (ఉదా: ముళ్లపూడి రమణ, శ్రీశ్రీ) పుస్తకాలు ఈబుక్స్ రూపంలో అసలే లేవు. ఈతరం రచయితలు కూడ తమ పుస్తకాలు ఈబుక్స్ రూపంలో ఉంచడానికి శ్రద్ద చూపించట్లేదు. ఉదా: మహమ్మద్ ఖదీర్ బాబు, కినిగెలో ఇక్కడ చూస్తే ఎంతమంది పాఠకులు ఈయన ఇతర పుస్తకాలని చదవాలని కోరుకుంటున్నారో తెలుస్తుంది. కినిగెలో చూస్తే ఇలాంటి కామెంట్లు బోలెడు కనపడతాయి.
తెలుగులో ఈబుక్స్ అనగానే గుర్తొచ్చేది కినిగె వెబ్సైట్. వీరి వల్లే నేను చాలా ఈబుక్స్ చదివాను. అయితే కింది రెండు విషయాలు పంటి కింద రాయిలా తగులుతూ ఉంటాయి.
1. పుస్తకాలన్నీ కూడా పిడిఎఫ్ రూపంలో ఉంటాయి. PDF కంటే EPUB సౌకర్యంగా ఉంటుంది. ఇందులో అక్షరాలని ఇష్టమున్న సైజుల్లో చదువుకోవచ్చు. చిన్న సైజు ఫోన్లలో సైతం హాయిగా చదువుకోవచ్చు.
2. ప్రింట్ పుస్తకం మరియు ఈబుక్ రేట్లు దాదాపు సమానంగా ఉంటాయి. ప్రింటింగ్ ఖర్చులు ఉండవు కాబట్టి ఈబుక్ రేట్లు కొంచెం తక్కువ ఉండడం సమంజసం.
ఈమధ్య కిండిల్ కొన్నాను. కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు హాయిగా చదువుకున్నాను. కినిగె పుస్తకాలు కిండిల్ లో చదవటానికి వీలు పడదు. కిండిల్ తెలుగులో చాలా తక్కువ పుస్తకాలున్నాయి. పబ్లిషర్లు కినిగెతో పాటు అమెజాన్ కిండిల్ ను కూడా పరిగణనలోకి తీసుకొని ఈబుక్స్ అందిస్తే బాగుంటుంది. అన్నట్లు కిండిల్ బుక్స్ అన్ని ఫోన్లలోనూ చదువుకోవచ్చు.
నాకు బాలగోపాల్ గారి రచనలంటే చాలా ఇష్టం. ఆయన పుస్తకాలు దాదాపు పది దాకా చదివుంటాను. ఇందులో ఒక్క ప్రింట్ పుస్తకం కూడా లేదు. ఒకవేళ ఈ రచనలు ఈబుక్స్ లో లేకపోయింటె నేను చాలా మిస్సయేవాణ్ణి. ఇలా అందరు పాఠకులకు తమకి నచ్చిన రచయితల పుస్తకాలు ఈబుక్స్ రూపంలో కూడా అందుబాటులో ఉండాలి అని నా కోరిక.
Leave a Reply