శిథిలమౌతోన్న సామూహిక గానం

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్
[మల్లిపురం జగదీష్ ‘గురి’ కథల సంపుటికి ముందుమాట]
*************************

‘The fish,
Even in the fisherman’s net,
Still carries,
The smell of the sea.’

తమ నేలకూ సంస్కృతికీ దూరమైన జనం గురించి పాలస్తీనా కవీ రచయితా మొరీద్ బాగొతి (Mourid Barghouti) చెప్పిన మాటలు ఆదివాసీ రచయిత మల్లిపురం జగదీశ్ కి అతికినట్టు సరిపోతాయి. అడవికి దూరమైనా గుండె నిండా అడవితనాన్నీ వొంటినిండా అడవి పరిమళాన్నీ మోసుకుంటూ అతను బయట ప్రపంచంలో తిరుగుతూనే వున్నాడు. వాటిని మనకు తన కథల మాధ్యమంగా పంచిపెడుతూనే వున్నాడు. నిజానికి తన స్వీయానుభవ నేపథ్యం నుంచి గాయపడ్డ ఆదివాసి గుండె గోసని అపూర్వంగా సాహిత్యీకరించిన జగదీశ్ ని సాహిత్య ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొండంత యెత్తున్నఅతణ్ణి చదవడం వినడం నాకు యెప్పటికీ గొప్ప అనుభవమే. చదివాకా అతని కథలు మనల్ని వొకపట్టాన వొదలవు. గుండె లోతుల్లోకి జొరబడి కల్లోలాన్ని రేపుతాయి. అంతరంగంలో అలజడి కలిగిస్తాయి. ఆత్మశోధనకు పురికొల్పుతాయి. ఆదివాసిని అడవికి దూరం చేస్తున్న శక్తుల గురించి జగదీశ్ యింతకుముందు ‘శిలకోల’లో సంధించిన ప్రశ్నలు మనల్ని యింకా వెంటాడుతూనే వున్నాయి. ఆ ప్రశ్నలకు నాగరిక పౌర సమాజం నుంచి గానీ రాజ్య పాలకుల నుంచి గానీ సమాధానాలు లభించలేదు. అడవిబిడ్డకు మునుపు అయిన గాయాలు మానలేదు; సలుపుతూనే వున్నాయి. మళ్ళీ మళ్ళీ కొత్త గాయాలు అవుతూనే వున్నాయి. నెత్తురోడుతోన్న దేహంతో సడలని పోరాట పటిమతో రాజీలేని నిబద్ధతతో యిప్పుడు ‘గురి’ తప్పని కథలతో అభివృద్ధి లోగుట్టు విప్పి చెబుతూ మరోసారి మన ముందు నిలబడ్డాడు జగదీశ్. ఈ సారి అతని గొంతు రాటు తేలింది. చూపు నిశితమైంది.

దేశంలో అడవి మీదా దాని నేల పొరల కింద వున్న ఖనిజాల మీదా మల్టీ నేషనల్స్ కన్ను పడ్డాకా వాటికి దళారులుగా వున్న దేశీయ పాలకులకి అడవి నుంచి ఆదివాసీని తొలగించే కార్యక్రమంలో తొలి అడుగు అభివృద్ధి మంత్రం. పాత రోజుల్లో దశాబ్దాలుగా గిరిజనేతరుల దోపిడీ ఆదివాసీని అడవి లోతట్టుకి తరిమితే , ఆ తర్వాత సంక్షేమ పథకాలు అడవి అంచుకు తెచ్చాయి. ఇప్పుడు ఆదివాసీలు అభివృద్ధి వలలో విలవిలలాడుతున్నారు. బలవంతంగా నిర్వాసితులవుతున్నారు. ఒక చోట పవర్ ప్రాజెక్టు. మరో చోట యినుం కోసమో బాక్సైట్ కోసమో మైనింగ్. ఇంకోచోట భారీ ఆనకట్టలు. అడుగడుగునా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు … ఆదివాసిని నిలబడ్డ సొంత నేలనుంచి తరిమి కొట్టడానికి వెయ్యినొక్క పద్ధతులు. సామాజిక సంపదని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి వంద యెత్తుగడలు. పెసా , 1/70 వంటి చట్టాల్ని నిర్వీర్యం చేసే కుట్రలు. ఖాకీ నీడలో తుపాకి మొనమీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణలు. భూ దురాక్రమణలు. అడుగడుగునా మానవ హక్కుల వుల్లంఘన. కొత్త శతాబ్దంలో యీ ప్రక్రియ వేగవంతమైంది. వ్యవస్థీకృతమైంది. కాదంటే క్రూర హింస జడలు విప్పుకుంటుంది. సాంస్కృతిక దాడి, దొంగ సంక్షేమ పథకాలు, పోలీసు మిలటరీ చర్యలు – వ్యూహం త్రిముఖంగా అమలవుతోంది. అదేంటో యుగ యుగాలుగా యే దేశంలోనైనా అభివృద్ధి యజ్ఞంలో తొలి బలి పశువు ఆదివాసీయే. పురాణ కాలం నాటి ఖాండవ దహనం దగ్గరనుంచి యివాళ్టి దండకారణ్యం వరకూ ‘ఆకుపచ్చ’ విధ్వంస ప్రకంపన కేంద్రాలు (epicenters) యెప్పుడూ గిరిజన ఆవాసాలే.

అభివృద్ధి పడగ నీడలో పరాయీకరణ అంచుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన జాతి జనుల దు:ఖానికి విచలితుడైన రచయిత వేదన జగదీశ్ కథల్లో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. తన మూలాలకు దూరమైన అపరాధ భావన కూడా జగదీశ్ గొంతులో వినిపిస్తుంది. ‘కొండ కొనకు పూచిన సూర్యుణ్ణి డప్పుగా చేసి – గొంతుని గొగోయ్ గా మార్చి’ చెబుతున్న యీ కథల్లో అభివృద్ధి తెస్తున్న విధ్వంసం పట్ల ఆగ్రహం వుంది. కోల్పోతున్న ప్రాకృతిక సంపదని కాపాడుకోవాలన్న తపన వుంది. నిర్వీర్యమై జారిపోతున్న యువత జీవితాల్లో మానవీయ విలువల్ని నిలబెట్టాలన్న స్థిర చిత్తం వుంది. నామరూపాల్లేకుండా నాశనమవుతోన్న సంస్కృతిని వొడిసి పట్టుకోవాలన్న యెరుక వుంది. తన జాతి జనుల పట్ల అలవికాని ప్రేమ వుంది. కొన్నిచోట్ల నిస్సహాయుడి ఆక్రందన వుంది. ఆక్రోశం వుంది. ఏం చెయ్యాలో తోచనితనంలోంచి పుట్టిన దిగ్భ్రాంతి వుంది. సమస్త శక్తుల్నీ కూడగట్టుకొని పోరాటం కొనసాగించాలన్న దిటవుతనం వుంది. వాషింగ్టన్ నిర్మాణానికి తెల్లజాతికి భూములిచ్చి సర్వం కోల్పోయిన అమెరికా మూలవాసి నాయకుడు సియాటిల్ పడిన ఘర్షణ వంటి ఘర్షణే రచయిత లోపల జరుగుతూ వుంది. లేకుంటే తీవ్ర జ్వర స్పందన లాంటి ‘గత వర్తమానం’ కథ పుట్టదు. వందల కొద్దీ వూళ్ళనీ లక్షలాది యెకరాల భూముల్ని ముంచి ఆదివాసీలను నిర్వాసితులుగా మార్చిన పోలవరం శాపంగా మారిన వైనాన్ని , అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో వేలాది యకరాల పంట భూముల్ని కోల్పోతున్న రైతుల దైన్యాన్ని రెడ్ ఇండియన్ చీఫ్ సియాటిల్ ఉపన్యాసంతో కొల్లేజ్ చేస్తూ, వొక తరగతి గదిని ముంపు గ్రామంగా మార్చి, నిర్వాసితుల నివేదనల్నీ నినాదాల్నీ టీచర్ స్టూడెంట్ ల మధ్య సంభాషణగా , అంతరంగ సంక్షోభాల వినిమయ మాధ్యమంగా అల్లి, గత వర్తమానాల్ని వొకదానిపై మరొకటి వోవర్ లాప్ గావిస్తూ కథగా మలిచిన తీరు, శిల్ప పరంగా జగదీశ్ చేసిన ప్రయోగం అద్భుతం. జీవిత కల్లోలాన్ని ఆవిష్కరించడమే ప్రయోజనంగా యెన్నుకున్న టెక్నిక్ అది. ‘నేలంటే తాత ముత్తాతల అస్థికలలోంచి పుట్టుకొచ్చిన బతుకు పువ్వు … మనిషి నేలకు చెందిన వాడు కానీ నేల మనిషికి చెందింది కాదు’ అంటూ సియాటిల్ చేసిన ప్రసంగం ఆదివాసి భూ ఆక్రమణదారులకు హెచ్చరిక. అభివృద్ధి బేహారులకు కనువిప్పు. అది యింకెంత మాత్రం గతం కాదు వర్తమానమే. అది పాత కాలపు నలుపు తెలుపు చిత్రం కాదు; రాజకీయంగా ఆర్థికంగా భిన్నవర్ణాలతో వాటి షేడ్స్ తో యెంతో సంక్లిష్టంగా తయారైంది.

ఒకప్పుడు – ఐటిడిఏలు, గిరిజన కార్పోరేషన్లు, గొర్రెలకు బర్రెలకు బ్యాంకు రుణాలు, వివిధ సంక్షేమ పథకాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ళు, రోడ్లు … అడవికీ మైదానానికీ మధ్య దూరం చెరిపేయడానికి అడవిని ఆధునికీకరించడానికి అడవిలో అన్నల ప్రాబల్యం తగ్గించడానికి పాలకులు చెయ్యని పనిలేదు. వెయ్యని సంక్షేమ – అభివృద్ధి పాచిక లేదు. దాంతో అడవి మార్కెట్టయ్యింది. అడవి వెలుతురు దీపాల కింద చీకటి కోన అయ్యింది. అడవి నెత్తుటి మడుగయ్యింది. అడవి ఆరని గాయమైంది. ఆదివాసీ ఆవాసాలు టూరిస్టు కేంద్రాలయ్యాయి. ఇప్పుడు అడవినే మాయం చేసే కార్పోరేట్ భూతం బయల్దేరింది. రాత్రింబవళ్ళు సెట్ లైట్ నిఘా కింద రాజ్యం దాని కోరలకి పదునుపెడుతోంది. అడవిలోకి మిలటరీ వాహనాలు నడుపుతోంది. హెలికాప్టర్లు దించుతోంది. అడవి యుద్ధక్షేత్రమైంది.

ఈ నేపథ్యం నుంచే రచయిత పుట్టెడు ప్రశ్నలు మన ముందు కుప్పపోస్తున్నాడు. అడవిలోకి పరచిన తార్రోడ్లు అడవిలోకి యేం తెచ్చాయి ? అడవి నుంచి యేం తీసుకు పోయాయి? సౌకర్యాలు యెవరి సొత్తయ్యాయి? సంపద యేమైంది సంస్కృతి యేమైంది? శ్రమ ఎవరిదీ – సిరి ఎవరిదీ అని అడిగి ఆయుధం పట్టి పోరాటాలు చేసి పొందిన భూములేమౌతున్నాయి? పోరాట మార్గానికి దూరం చేయడానికి అమలుచేసిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిందెవరు? ఇంత అభివృద్ధి నడుమ పొట్ట కూటి కోసం వలసలు యింకా యెందుకు అనివార్యమయ్యాయి? నిర్వాసితులకిచ్చిన పునరావాస వాగ్దానాలకు పట్టిన తుప్పు తొలగేదెప్పుడు? నిరుద్యోగం ఆకలి అవమానాలు యెందుకు కొనసాగుతున్నాయి? చదివిన చదువులు ఏమిచ్చాయి? అడవి బిడ్డలు ఆదివాసీలు యేమయ్యారు? ఎదిగిన వాళ్లు యెందరు వొరిగిన వాళ్ళు యెందరు?
పరాయీకరణ పొత్తిళ్ళలో పెరిగే ప్రకృతి శిశువులు అరకొర చదువులతో అటు నాగరిక ప్రపంచానికీ యిటు కొండకీ పనికి రాకుండా పోయారు. తమ భాషలో లేని బుక్కుల్తో పది పన్నెండు దాకా పాకి ఆ తర్వాత యెదగలేక- యెదిగినా తమకు తాము ‘పరాయి’ అయి స్వీయ సంస్కృతికి దూరమై నాలుగు రాళ్ళ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ దరఖాస్తులా మారిపోతున్నారు. పాలకులు విసిరే చిల్లర స్కీముల్లో లబ్ధిదారులు కావడానికి స్వతంత్రంగా జీవించే హక్కునీ స్వేచ్చనీ ఆత్మ గౌరవాన్నీ కోల్పోయి పొద్దెరుగని బిచ్చగాళ్ళవుతున్నారు (తార్రోడ్డు). ఆశ్రమ పాఠశాల హాస్టళ్ళలో వంటకుక్కులుగానో వాచ్ మెన్ గానో – జీసీసీలో సేల్స్ మెన్ గానో చేరుతున్నారు. లేదా పోలీసు కానిస్టేబుల్స్ గానో స్పెషల్ ఆఫీసర్స్ గానో యిన్ ఫార్మార్స్ గానో మారుతున్నారు. కాకుంటే కార్పోరేట్ అభివృద్ధికి బ్రోకర్ గానో అవతరిస్తున్నారు. ఇవేవీ వద్దంటే బూటకపు ఎన్ కౌంటర్లో మరణిస్తున్నారు (చంద్రన్న).

మరి అభివృద్ధి ఫలాలు యెవరికి చేరాయంటే సమాధానం వుండదు. నిజమే , భౌతికంగా అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తుంది. గుడిసెల స్థానంలో శ్లాబ్ ఇళ్ళు వచ్చాయి. వాటి మీద టివి యాంటినాలు మొలిచాయి. బళ్ల గోర్జీలు మట్టి దార్లయ్యాయి, మట్టి దార్లు సిమెంట్ రోడ్లయ్యాయి. వాటి మీద మోటార్ సైకిళ్ళు తిరుగుతున్నాయి. జీలుగు కల్లు బదులు వంట సారా, దాని స్థానంలో ప్రభుత్వ పర్మిషన్ తో దిగిన రాయల్ స్టాగ్ వంటి బ్రాండెడ్ సరుకు గూడల్లోకి వూళ్ళలోకి దర్జాగా చొచ్చుకొచ్చాయి. ఇదంతా అభివృద్ధే ; కానీ శ్లాబ్ యిళ్ళల్లో తినడానికి తిండి గింజలుండవు. రాత్రీ పగలూ తేడా లేకుండా సీరియళ్ళలో సీరియస్ గా మునిగి పక్కవాడు చస్తున్నా పట్టించుకోరు. స్వదేశీ విదేశీ తేడా లేకుండా చీప్ లిక్కర్ యేరులై ప్రవహిస్తుంది; కానీ తాగడానికి సురక్షితమైన నీళ్లుండవు. ఎన్ని సదుపాయాలొచ్చినా గిరిజనులకి యిప్పటికీ వైద్యం అందని మాని పండే. సమయానికి వైద్యం అందక చిన్న చిన్న రోగాలతోనే (డయేరియాతోనో మలేరియాతోనో) చనిపోవచ్చు. రోగుల్ని కొండ దిగువన యెక్కడో వున్న ఆసుపత్రికి మోసుకుపోవాలంటే ‘డోలీ’ కట్టాల్సిందే. దారి చూపడానికి సెల్ ఫోన్ టార్చ్ వెలుగు తోడుంటుంది. అదీ హైటెక్ అభివృద్ధి. ఎంత పారడాక్స్?

‘ప్రకృతిని దేవతలా కొలిచే అత్యంత సహజమైన మానవులు. ఈ భూమిపైన అణువణువూ పవిత్రమైనదేనని భావించే సమూహం. తన పూర్వీకుల జ్ఞాపకాలు చెట్లలో ప్రవహించే జీవరసమనీ … పరిమళించే ప్రతి పువ్వూ అక్కచెల్లెలేనని … పలకరించే ప్రతి జీవీ అన్నదమ్ముడే అని భావించే అతి పురాతన మానవ సమాజం’ లోకి , చెట్టుకీ పుట్టకీ అడవి తల్లికీ వూరి జాకరమ్మ కీ మొక్కిన ఆదివాసీ గూడల్లోకి వారివి కాని వినాయక చవితులూ సంక్రాంతులూ వచ్చాయి. ఇప్పుడు ఊళ్ళో చర్చి, మెళ్ళో శిలువా మొలిశాయి. సొంత భాషా వేషం అన్నీ పోయాయి. ‘ఇదంతా కుట్రలా నేదా?’. చీకటి పడుతూనే, కొండ వెన్నెల పులుముకుంటూనే యిల్లిల్లూ చుట్టివచ్చే పిన్ల కర్ర గానం లేదు. కిన్నెర మోత లేదు. టిల్లకాయ ధ్వనుల్లేవు. తుడుం డప్పు శబ్దాల్లేవు. గోగోయ్ సుస్వరాల్లేవు. ఆడా మగా పదం కలిపి పాడే బృందగానాల్లేవు. థింసా అడుగుల్లేవు. సామూహిక జీవితం, ఆట, పాట, పండుగ, జాతర అన్నీ ధ్వంసమై పోయాయి. మంది బతుకునీ సామూహిక సాంస్కృతిక వ్యవస్థనీ నిలిపిన జన్నోడు దీసరి ఎజ్జోడు కార్జీలు బతికే తెరువు లేక భవననిర్మాణ కూలీలుగా చెన్నయ్యో బెంగళూరో వలసపోయి కూలిన శిధిలాల కింద సమాధవుతున్నారు (శిధిల సమూహం).

ఇదంతా హింసే. సాంస్కృతిక పీడనే. అభివృద్ధిలో పీడన దోపిడీ రూపం మార్చుకున్నాయి తప్ప పోలేదు. పాతరోజుల్లో వాసన నూనె సబ్బులు పౌడర్లు దువ్వెన్లు పాలిస్టర్ బట్టలు యిచ్చి అటవీ సంపదని షావుకారు దోచుకుంటే యిప్పుడు బూతు చిత్రాల్ని కరతలామలకం చేసిన సెల్ ఫోన్ కంపెనీలు , బడ్డీ షాపుల్లోకి బ్రాందీ బుడ్లు దించిన మద్యం వ్యాపారీ దోచుకుంటున్నారు. ఒకప్పుడు మైదానాల నుంచి వచ్చిన వడ్డీ వ్యాపారి భూముల్ని గుంజుకొంటే యిప్పుడు ప్రభుత్వమే పవర్ ప్రాజెక్ట్ కోసమో మరింకో పరిశ్రమ కోసమో భూముల్ని కాజేస్తుంది. సారాకి భర్త బలైతే ‘సింజీడి’ వంటి స్త్రీలు తిరగబడ్డానికి సిద్ధంగా వున్నారు, కానీ పొగలా కమ్ముకోచ్చే మార్కెట్ మాయాజాలాన్ని ‘గురి’ చూసి కొట్టడంలోనే ఆదివాసీలు దిగ్భ్రమకి లోనవుతున్నారు. సహాయం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు కార్పోరేట్ మార్కెట్ కి దళారి పాత్ర పోషిస్తున్నారు. అంతే కాదు స్వార్థంతో ఆదివాసీలని అనేక విధాలుగా ప్రలోభపెడుతూ విస్థాపన మార్గాల్ని సుగమం చేస్తూ వారి కన్ను వారే పొడుచుకొనేలా చేస్తున్నారు. వారిలోంచే జాతి ద్రోహుల్ని తయారు చేస్తున్నారు. ఆదివాసీ అస్తిత్వాన్ని పెను ప్రమాదంలోకి నెడుతోన్న యీ సంక్షోభాన్నంతటినీ జగదీశ్ వంటి లోపలి మనిషి మాత్రమే విమర్శనాత్మకంగా విశ్లేషించి సాహిత్యీకరించగలడు. స్వీయానుభవం నుంచి యేర్పరచుకొన్న దృక్పథంతో అతను దాన్నొక బాధ్యతగా కొనసాగిస్తున్నాడనడానికి యీ సంపుటిలోని ప్రతి కథా వుదాహరణగా నిలుస్తుంది.

‘తాండ్రచుట్ట’ కథలో లో రక్తం చిందించి పోరాడి సాధించుకొన్న భూమిని సైతం వూరి పిల్లల బడి కోసం ధారపోసిన బూగన్నముఖత: ఆదివాసీ అవసరాల గురించి చెప్పిన మాటలు జగదీశ్ దృక్పథాన్నీసామాజిక తాత్వికతనీ పట్టిస్తాయి. ‘నాకు ఏది సుకమో నువ్వు సెప్పకూడదు … నీనే సెప్పాల. నా సుకం గురించి నీనే మాట్లాడాల’. ఎంత మౌలికమైనవీ యెంత లోతైనవీ యీ మాటలు! అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు అసలు ఆదివాసులు యేం కోరుకుంటున్నారు అన్నది యెవరూ పరిగణనలోకి తీసుకోరు. ఆదివాసీ జీవితం గురించి గానీ అడవికీ ఆదివాసికీ వున్న విడదీయరాని బంధం గురించి గానీ వారి ఆలోచనా విధానం గురించి గానీ యే మాత్రం అవగాహన లేని నాగరికుల దృష్టి కోణం నుంచే అభివృద్ధి పథకాలు నిర్వచించడం జరుగుతుంది. ఆదివాసీ ఆవాసాలలో పనిచేసే ప్రతి అధికారీ బూగన్న మాటల్ని ప్రియాంబుల్ లా గుర్తు పెట్టుకోవాలి. బయటుండి రాసే వాళ్ళకి యీ దృక్కోణం వుండదు. ఆదివాసీ సాహిత్యం లోకి మల్లిపురం జగదీశ్ వంటి రచయితలు యిబ్బడి ముబ్బడిగా వచ్చినప్పుడు మాత్రమే యిటువంటి ఆలోచనలు వెలుగులోకి వస్తాయి. ఆదివాసి మనోభావాలు గుర్తింపు , గౌరవం నోచుకుంటాయి. అభివృద్ధికి మానవీయ ముఖం అనే మాటలు నిజమౌతాయి. జగదీశ్ గొంతు సమూహమై బలపడినప్పుడు మాత్రమే ‘ఇంతకీ ఈ దేశంలో మేమున్నట్టా లేనట్టా’ (నల్లజెండా) అని ప్రశ్నిచే ‘ఇండియా తాత’ చూపుకి సమాధానం దొరుకుతుంది.

ఆదివాసి జీవితాల్లో ఆచరణలో విలువల్లో చోటుచేసుకుంటున్న అనేక వైరుధ్యాల్ని జగదీశ్ యీ కథల్లో వొడుపుగా పట్టుకున్నాడని చెప్పడానికి నిండైన నిదర్శనం ‘అడవితనం’ కథ. ఆ కథలో రచయిత వ్యక్తం చేసిన ఆవేదన చూడండి. దాన్ని ఆవిష్కరించిన తీరు చూడండి. వస్తు శిల్పాలు రెండూ సమపాళ్ళలో వొకదాన్ని మరొకటి డామినేట్ చెయ్యకుండా నడచిన కథ అది.

అడవికి దూరమైన కొద్దిమంది – అతికొద్దిమంది -ఆదివాసీలు అభివృద్ధి ముఖంగా మైదానాలవైపు పట్టణాలవైపు నగరాలవైపు నడిచినవాళ్ళు ఉద్యోగాలు పొందారు. సొంత ఇళ్ళు కట్టుకున్నారు. స్మార్ట్ ఫోన్లు టీవీలు ప్రిడ్జ్ లు ఏసీలు వాహనాలు సౌకర్యాలు అమర్చుకున్నారు. కానీ అడవి తనాన్ని కోల్పోయారు. అడవితనమంటే సామూహికత. సమూహంలో యిచ్చిపుచ్చుకోవడం . కళలో సమూహాన్ని నిర్మించినవారు నాగరికులై అడవితనాన్ని మర్చిపోయారు. నేస్తరికం చెయ్యడం, ఇవ్వడం – ఇంటికొచ్చినవారికి ఆతిథ్యం యివ్వడం, అడిగినవారికి వారికి ఆశ్రయమివ్వడం, ఆపదలో వున్నవారికి ఓదార్పునివ్వడం – యివన్నీ మర్చిపోయారు. అడవితనాన్ని కోల్పోవడమంటే మనిషితనాన్ని కోల్పోవడమేనన్నది ఆ కథ ముగింపు. కథలో రచయిత చూపిన శిల్ప పరమైన నేర్పు కూడా విశిష్టమైంది. అడవిలో వున్నప్పటి జీవితాన్నీ దూరమైన తర్వాత నగర జీవితాన్నీ జ్ఞాపకాలద్వారా పోల్చి చూసుకోవడం కనిపిస్తుంది. అడవితనాన్ని కోల్పోయాకా పోగొట్టుకున్న సంస్కృతిని పదే పదే ప్రస్తావిస్తూనే చివరికి తోటి మనిషి కష్టం పట్ల నిర్లిప్తంగా వుండే స్పందనా రాహిత్యమే అడవితనాన్ని కోల్పోవడం అని తీర్మానిస్తాడు. అయితే కథకి అదే ముగింపయితే ప్రత్యేకత లేదు. అడవికి దూరమైన వొక ఆదివాసి మహిళ చెప్పిన కథ యిది. సుఖాల మత్తులో పడి మానవత్వ స్పందనల్ని మర్చిపోయేలా చేసిన బతుకునుంచి బయటపడి ఆమె తన అడవితనాన్ని కాపాడుకోవడానికి చివరికి సిద్ధపడుతుంది. ఆ విషవలయంలో చిక్కిన భర్తని కాపాడుకుందా అన్న సందేహం అలానే వుండిపోవడంతో కథ వోపెన్ ఎండింగ్ కథగా రూపొందింది. ఆదివాసీ జీవన విలువల్ని అన్ని విధాలా వున్నతీకరించిన కథ యిది. కథలో అడవికి దూరమైనవాళ్ళకి పేర్లుండవు. పేరు కూడా కోల్పోయిన పాత్రలవి.

ఇతరేతర పరాయీకరణల మీద కంటే సాంస్కృతిక పరాయీకరణ మీదే జగదీశ్ యెక్కువ దృష్టి పెట్టాడనిపిస్తుంది. మెరుగైన జీవితం కోసం క్రైస్తవంలోకి మారి స్వీయ సంస్కృతిని కోల్పోతున్న యెందరో యువకులు రచయితగా జగదీశ్ ని బాగా డిస్ట్రబ్ చేస్తారు. ‘నా పేరు సొంబరా’ కథలో తండ్రి మతం మారడంతో సొంబరా రాబర్ట్ అవుతాడు. ఎస్టీ రిజర్వేషన్ పోగొట్టుకుంటాడు. మారిన మతం అతనికి యే విధంగానూ వుపయోగపడదు. పేదరికపు దెయ్యాన్ని అది వదిలించలేదు. అవసరం కొద్దీ మూలాల్లోకి చూసుకోవడంగా మొదలైన సొంబరా అన్వేషణ స్వీయ అస్తిత్వ స్పృహగా పరిణమించడంతో అతను మళ్ళీ ఆదివాసిగా మారడానికి నిర్ణయించుకుంటాడు. ఈ కథలోనే కాదు. ఇతరత్రా కూడా జగదీశ్ గిరిజన గూడల్లోకి ప్రవేశించిన క్రిస్టియన్ మిషనరీలు ఆదివాసిని వారి సంస్కృతి నుంచీ యెలా దూరం చేస్తున్నాయో ప్రస్తావించాడు. అయితే ‘వనవాసీ కల్యాణం’ పేరున సంఘ పరివార శక్తులు మతాంతరీకరణని అడ్డుకోవడమే కాకుండా బలవంతంగా ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని దేశమంతటా పెద్ద యెత్తున అమలుచేస్తున్నాయి. ఘర్ వాపసీ అంటే వాళ్లకు ఆదివాసీ తన సొంత జీవన విధానంలోకి – సవర గోండి కోయ … సంస్కృతిలోకి – రావడం కాదు; హిందూ మతంలోకి మార్చడం. మతతత్వవాదులు వ్యూహాత్మకంగా అమలుచేస్తోన్న హైందవీకరణలోని యీ రాజకీయ కోణం కూడా రచయిత స్పృశించాల్సిన అంశమే.

జగదీశ్ 2013 – 2018 మధ్య కాలంలో రాసిన పదమూడు కథల్ని వొకచోట చూసినప్పుడు వస్తు శైలీ శిల్పాల పరంగా అతను చేస్తున్న ప్రయోగాలు సాధిస్తున్న పరిణతి అబ్బుర పరుస్తాయి. కథా నిర్మాణంలో నిర్వహణలో కొత్త ప్రయోగ రీతుల్ని అతను ప్రయత్నిస్తున్నాడు(గతవర్తమానం). ఆదివాసీ జీవితాల్లో యింతకు ముందు స్పృశించని కోణాల్లోకి మరింత లోతుగా చూస్తున్నాడు(అడవితనం). కథల్లో వస్తు విస్తృతి పెరిగింది. ప్రధానమైన తేడా అల్లా ‘శిలకోల’ లో లాగా బలమైన స్త్రీ పాత్రలు యీ కథల్లో లేవు. అతని వచనంలో వుధృతి వుద్విగ్నత తగ్గి ఆలోచన యెక్కువయింది. సమస్యల్ని చూసే దృక్పథంలో మార్పు రాలేదు కానీ అభివృద్ధి నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి తాను తనలాంటి వారూ నడిచొచ్చిన దారి గురించి మూల్యాంకనం చేసుకోవడం బలంగా కనిపిస్తుంది. అదే అతని కథల్లో ప్రతిఫలిస్తుంది. రచనలో ’చీకటంతటినీ రెండు మూటలుగా కట్టి కావిడి చేసి భుజానికెత్తుకున్నట్టు … బొగ్గుల కావిడితో, రెండు కళ్ళనీ దోసిళ్ళు చేసి షావుకారి జేబువైపు చూస్తూ … , చీకటీ దు:ఖం కలిసి కంట్లోచి ధారగా … , ఊరు చీకటి ఊయలలో వూగుతోంది … , గడపల్లో నిన్నాగిపోయిన సీరియళ్ళు సాగడం మొదలయ్యాయి, పొద్దు కొండ మీద అలుపు తీర్చుకుంటోంది , నిత్య పురాతన గీతంలా గెడ్డ … వంటి కవితాత్మక వ్యక్తీకరణలు మరింతగా పదునుదేరాయి. ఆ శైలి జగదీశ్ కే సొంతం. అది రచయితని పాఠకులకు ఆత్మీయుణ్ని చేస్తుంది.

‘గురి’ కథలు చదివాకా నాకో పిట్టకత గుర్తొస్తుంది. జగదీశ్ లా నాకు కథ చెప్పే విద్య రాదు గానీ చేతనైన మేరకు చెప్తా వినండి:

‘ఒక అర్థరాత్రి చిమ్మచీకట్లో గొర్రెల మందలోకి వొక దొంగ జొరబడ్డాడంట. అట్టా జొరబడి నెమ్మదిగా గొర్రెల బొచ్చు కత్తిరించుకు పోతున్నాడట. కత్తెర చప్పుడుకి మేలుకొన్న వొక పొట్టేలు మిగతా వాటిని అప్రమత్తం చేసి నువ్వు చేస్తున్నపనేంటని దొంగని గట్టిగా నిలదీసిందట. రానున్న చలికాలంలో మిమ్మల్నందర్నీ చలి బారిన పడి చనిపోకుండా కాపాట్టానికి వెచ్చటి వున్ని కంబళ్ళు నేసి యిస్తానికే మీ బొచ్చు. లేకుంటే నాకేల? అన్నాట్ట ఆ ఘరానా దొంగ.’

గొర్రెలు ఆ దొంగని నమ్మాయో కుమ్మాయో అన్నది వేరే కత. అది మన ప్రాపంచిక దృక్పథాన్ని బట్టీ సంస్కారాన్ని బట్టీ మనం కట్టుకుందాం. అయితే ఆ పని జగదీశ్ కథలు చదివాకా, బతుకు పోరాటంలో బుగ్గయిన బూగన్ననీ – బుగ్గి నుంచే ఫీనిక్స్ పక్షిలా లేచి వచ్చిన సింజీడినీ – యెన్ని ఆటంకాలు యెదురైనా గురి మీదే దృష్టి పెట్టిన గీతనీ – మూలాల్లోకి తిరుగుప్రయాణం చేస్తున్న సొంబరానీ – గోచిగుడ్డనే జెండాగా యెగరేసిన ఇండియా తాతనీ – అడవితనాన్ని కోల్పోడానికి సిద్ధపడని ఆదివాసీ మహిళనీ తెలుసుకున్నాకా చేస్తేనే బావుంటుంది.
సమయం లేదు.

సిద్ధమా మరి!

తన గుండెనీ కొండనీ కథల అద్దంలో చూపిస్తున్న మల్లిపురం జగదీశ్ ని యెదకు హత్తుకుంటూ …

ఎ కె ప్రభాకర్
14 ఏప్రిల్ 2018
(బాబా సాహెబ్ పుట్టిన రోజు)

You Might Also Like

6 Comments

  1. రేసు.ఆదినారాయణమూర్తి

    ఎంత ఉదాద్దత ,సహృదయంగల అడవతల్లి బిడ్డను పరిచయంచేసారు.ఇలాంటిబిడ్డలు ఆదీవాసీలలోఇంకెంతోతయారుకావాలని ఆశపడుతున్నాను.దయచేసిఈపుస్తకాలుదొరికే చిరునామా యిస్తేబాగుంటుంది.ఎంతోహృద్యగాజగదీష్ గారిని పరిచయం చేసినవారికి ధన్యవాదాలు…

  2. Chandra Naga Srinivasa Rao Desu

    నిర్వాసితుల నివేదనల్నీ కష్టాల్ని జగదీష్ గారి నిర్మాణాత్మకమైన కోణం లో శోదించటం లో సఫలీకృతులయ్యారని అనిపిస్తోంది…………..మనః పూర్వక అభినందనలు

  3. Dr. Veldandi Sridhar

    సాధికారికమైన విశ్లేషణ…ఆదివాసీ జీవితాలు ఎలా పరాయీకరణ చేయబడుతున్నాయో, రాజ్యం ఎంత తీవ్రంగా వాళ్ళను అణచివేసి, వాళ్ళ జీవితాల్ని ధ్వంసం చేస్తోందో ‘గురి’తప్పకుండా వివరించారు డా. ప్రభాకర్ గారు. కదిలిపోయే కథలు రాసిన మల్లిపురంకు, ‘గురి’ హృదయావిష్కరణ చేసిన ప్రభాకర్ గారికీ మనః పూర్వక అభినందనలు.

  4. పాలకొల్లు రామలింగస్వామి

    ప్రభాకర్ గారికి .నమస్తే.జగదీష్ కథల గురించి విశ్లేషణాత్మకంగా మీరు రాసిన ముందు మాట చదివాను.బావుంది.లోతుగా ఆలోచనాత్మకంగా రాశారు.అంతవరకే పరిమితమవడం కొంచెం వెలితిగా అనిపించింది..కొండప్రాంతంలో వుండే ఒక గిరిజన సంక్షేమ పాఠాశాలలో ఉపాధ్యాయుడు గా పనిచేస్తోన్న జగదీష్ లాంటి ఒక ఆదివాసి బిడ్డకు తన జాతి ఉన్నతికి ఒక నిర్మాణాత్మకమైన,ప్రయోజనాత్మక సూచన చేసివుంటే బావుండేదేమో నని నా అభిప్రాయం..

  5. Anil అట్లూరి

    ‘‘పోనీ… ఇందాక నూటెనిమిదికి పిలిపించండి సార్‌!’’ దొర బతిమాలేడు. ‘‘అది పేషెంట్లకే గానీ శవాలకి కాదయ్యా’’ అని డాక్టరు గారు స్టెత్‌ వూపుకుంటూ ముందుకు కదిలిపోయారు. – డోలీ
    ఇంకా వెన్నాడుతునే ఉంది.

    పరిచయం బాగుంది, ప్రభాకర్.
    చిన్న సూచనః
    పుస్తకాలు పరిచయం చేసినప్పుడు, ప్రతులు దొరికేచోటు / ప్రచురణకర్త చిరునామా ఇస్తే కొనుక్కోవడానికి పాఠకుడికి సులువుగా ఉంటుంది.

  6. జగదీశ్ మల్లిపురం

    Sir, ధన్యవాదాలు. మీకూ, pustakam.net కూ.

Leave a Reply