Open – Andre Agassi
ఈ పుస్తకం ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, మాజీ నంబర్ వన్ అయిన ఆంద్రె అగస్సీ ఆత్మకథ. పుస్తకం రిలీజైనప్పుడు చదవాలనుకుని, సైజు, ఖరీదు చూసి జడుసుకుని ఊరుకున్నాను. ఇన్నేళ్ళ తరువాత ఎందుకో గత వారాంతంలో అగస్సీ ని తల్చుకున్నాను – దానితో లైబ్రరీలో చూస్తే ఆత్మకథ తాలూకా ఈ-పుస్తకం కనబడ్డది. నేను ఊహించిన దానికంటే వేగంగా, ఒక రోజులోనే పూర్తి చేశాను – అలా చదివించింది. అందువల్ల దాని గురించి కొంత పరిచయం చేయాలనిపించి.. ఈ వ్యాసం.
కొంత వ్యక్తిగతం: ఆంద్రె అగస్సి నా బాల్యంలో భాగం. నేను ఒక మూడేళ్ళ పాటు టెన్నిస్ క్రీడాకారిణిని స్కూల్ రోజుల్లో. ఒకట్రెండు సార్లు కర్నూలు జిల్లా పోటీల్లో, ఒకసారి అంతర్ జిల్లా పోటీల్లోనూ ఆడాను. ఆట నాకు పెద్దగా అబ్బకపోయినా, ఆట మీద అభిమానం అబ్బింది. ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు కానీ, ఆరోజుల్లో ఆటనీ, స్టెఫీ గ్రాఫ్ వంటి స్టార్లను బాగా గమనించేదాన్ని – టీవీ/పత్రికల్లో (స్టెఫీ ని ఇప్పటికీ ఫాలో అవుతాను, కేలెండర్ లో పుట్టినరోజు రిమైండర్ పెట్టుకోడంతో సహా!). అగస్సీ పై నాకు ప్రత్యేక అభిమానం లేదు కానీ, immensely talented, and extremely unbalanced అని ఆమధ్య ఒకరితో టెన్నిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నాను. అదే అతనిపై అప్పుడూ, ఇప్పుడూ అదే నా అభిప్రాయం. ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఉన్న ప్రొఫెషనల్ టెన్నిస్ లో అలా నంబర్ వన్ నుండి వంద దాటిన రాంకుకు వెళ్ళడం, మళ్ళీ నంబర్ వన్ కావడం నాకు ఏకకాలంలో ఆశ్చర్యం, స్ఫూర్తి కలిగించిన విషయం. నేను టీనేజి లో ఉండగా అగస్సీ-స్టెఫీ గ్రాఫ్ పెళ్ళి గురించి పత్రికల్లో చదివి – “అదేం కాంబినేషన్?” అనుకున్నాను – నా దృష్టిలో స్టెఫీ గ్రాఫ్ అంటే నిలకడకి, స్థిర చిత్తానికీ ప్రతిరూపం మరి. పుస్తకం పైన నా అసక్తి కి ఇదీ నేపథ్యం.
పుస్తకం పేరుకి తగ్గట్లుగానే “ఓపెన్”. తన చిన్నతనం, తండ్రి కి టెన్నిస్ ఆట పట్ట ఉన్న పిచ్చి ఇష్టం, పిల్లల్ని టెన్నిస్ స్టార్లు చేయాలన్న ధృడమైన సంకల్పం, దాని ప్రభావంలో గడిచిన అంద్రె బాల్యం మొదలుకుని, టెన్నిస్ స్టార్ గా మారాక ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలోని స్నేహాలు-అనుబంధాలు, చేసిన పనులు, ఇతర క్రీడాకారుల గురించి అతని అభిప్రాయాలు – అన్నింటి గురించి నిక్కచ్చిగా చెప్పుకొచ్చాడు. ఇదంతా కొంత నాటకీయంగా వర్ణించడం వల్ల పుస్తకం ఏకబిగిన చదివించింది (నాకైతే చార్లీ చాప్లిన్ ఆత్మకథ గుర్తొచ్చింది ఆ నాటకీయ కథనం విషయంలో). భాష కూడా బాగుంది. పుస్తకం ఇదివరలో హార్డ్ కాపీగా చూసినప్పుడు పెద్దగా అనిపించినా, చదువుతూంటే అంత పెద్ద సైజు పుస్తకంలా అనిపించలేదు.
అతని ఫౌండేషన్ గురించి, దాని కార్యకలాపాల గురించి రాసినది బాగుంది. అతనితో మొదట్నుంచీ ఉన్న కోచ్ లు, ట్రైనర్ గిల్ (కొడుక్కి అతని పేరు పెట్టాడు), స్నేహితులు అందరి గురించీ ఆప్యాయంగా రాయడం చూసి వాళ్ళ అనుబంధం ఎంత బలమైనదో అర్థమైంది. ఆ చేత్తోనే స్టెఫీ గురించి ఇంకాస్త రాస్తే బాగుండనిపించింది. నాకైతే అగస్సీ స్టెఫీకి ముందు-తరువాత వేరే మనిషి అనిపిస్తుంది. కానీ ఆ విషయం ఎక్కువ ప్రస్తావించలేదు. డ్రగ్స్ తీసుకోవడం గురించి, మళ్ళీ దాని గురించి ఏటీపీ వారి వద్ద బుకాయించి బయటపడ్డం గురించీ అంత బహిరంగంగా రాయడం ఆశ్చర్యం కలిగించింది. కానీ, ఆ డ్రగ్స్ ఆటని ప్రభావితం చేసేవి కావని అర్థమైంది. అంటే అతను అలా చెయొచ్చని కాదు కానీ, మరత్ సఫిన్ వంటి ఒకరిద్దరు క్రీడాకారులు స్పందించినట్లు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అవీ వెనక్కిచ్చేయాలనడం సబబు కాదనిపించింది (నిజానికి ఆసమయంలో అగస్సీ క్రీడా జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ అంత గొప్పగా లేవు). ఇలాంటి అంశాలని అప్పుడేం చేసినా తరువాత ఎవరి ప్రోద్బలం లేకుండా బహిరంగంగా ఒప్పుకోవడం, “It was a period in my life where I needed help.” అని ఒప్పుకోగలగడం నా మటుకు నాకు గొప్ప విషయమే. మామూలు మనుషులకే తప్పు ఒప్పుకోవడానికి విపరీతమైన అహం. ఇక ఇలా ప్రపంచ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన వాళ్ళు అలా రాయడం నాకు ఆషామాషీగా అనిపించదు.
సంప్రాస్ గురించి పుస్తకంలో పలుచోట్ల వ్యక్తం చేసిన అభిప్రాయాలు నాకంత నచ్చలేదు (ఆయనక్కూడా నచ్చలేదట). జిం కొరియర్, బోరిస్ బెకర్, మైకేల్ చాంగ్ వంటి వాళ్ళ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసాడు గానీ, సంప్రాస్ గురించి ఇతని అభిప్రాయం మట్టుకు చాలా చోట్ల వ్యక్తం చేయడం వల్ల, ఒకట్రెండు చోట్ల తప్ప చాలామటుకు అవి అంత పాజిటివ్ గా లేకపోవడం వల్ల నచ్చలేదు. కానీ, అవి అగస్సీ వ్యక్తిగత అభిప్రాయాలు – డిప్లొమసీ చూపకుండా అలా రాసుకుపోవడం నాకు నచ్చింది. ఆత్మకథ కదా, ఎంతైనా! ఇక స్టెఫీ గ్రాఫ్ పై మొదట్నుంచీ ఉన్న ఇష్టాన్ని గురించి, తన మొదటి భార్య నుండి విడిపోయాక స్టెఫీ ని ఆకట్టుకోడానికి పడ్డ ప్రయత్నాలు చూసి కొంచెం ముచ్చటేసింది. స్టెఫీ కి నచ్చాడు కనుక ఇతగాడు పర్వాలేదు అని మొదటిసారి అనిపించింది అక్కడే నాకు 🙂 ఇక, వీళ్ళు పెళ్ళి అనుకున్నాక అగస్సీ తండ్రి మరొక నిరంకుశ టెన్నిస్ తండ్రి అయిన గ్రాఫ్ నాన్న ని కలిసే దృశ్యం పుస్తకంలో అన్నింటికంటే నన్ను బాగా నవ్వించిన అంశం.
పుస్తకంలో కాస్త బాధ అనిపించిన భాగం అతని బాల్యం లో ఉన్న విపరీతమైన కోచింగ్ అనుభవాలు. అవి లేకపోతే ఇక్కడిదాకా వచ్చేవాడా? అనుకోవచ్చు – కానీ, అతను రాసే ప్రకారం అతనికి ఇది ఇష్టం లేదు – చదువుకుని ఉంటే బాగుండేదని. ఒక చోట సంప్రాస్ గురించి రాస్తూ – అతను అలా ఎలా టెన్నిస్ ని తన జీవితంగా చేసుకుంటాడో అర్థం కాదంటాడు. ప్రపంచ చాంపియన్ గా పేరూ, దాని వెంటే వచ్చిన డబ్బూ – ఇవన్నీ తండ్రి పట్టుదల లేకపోతే వచ్చేవి కావేమో, అది వేరే విషయం.
ఇంకా రాసుకుంటూ పోవచ్చు గాని, ఇక్కడ ఆపుతాను. మొత్తానికైతే మీకు టెన్నిస్ మీద ఏకాస్త ఆసక్తి ఉన్నా చదవదగ్గ పుస్తకం.
Leave a Reply