నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ
వ్యాసకర్త : జయశ్రీ నాయుడు
దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే కష్టమే. అందులోనూ జాజిమల్లితో పాటు ఆరేళ్ళు ప్రయాణించిన నీల. ఎన్నో మానసిక విశ్లేషణలని చెక్కు చెదరని పద బంధనం తో అక్షర రూపం కల్పించినపుడు, నామ మాత్రపు విశ్లేషణని మించింది ఏదో పంచుకోవాలన్న తపన నుంచి కొన్ని భాగాలుగా యీ పుస్తకాన్ని చదువుతూ అర్థం చేసుకోవలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా నీల మీదుగా నా లోకి ప్రవహించిన అక్షరస్పర్శకి పులకరింతలాంటి పలవరింత.
మొదటి పేజీ నుంచి వంద పేజీ ల ప్రయాణం చేసే వరకు, పరదేశి, సదాశివం, ఆటో రాజు మనకి ఎంతో పరిచయస్తుల లిస్ట్ లో చేరిపోతారు. సూర్యం మీద నీల కు వున్నంత ప్రేమ మనలో చేరిపోతుంది. నీల తల్లి చంద్రకళ, ఆరంజోతి పాత్రలమనసు లోతులు ఉలు స్వేటర్ అల్లినట్టు క్లిష్టత కలిసిన వెచ్చదనం నన్ను తాకింది.
The lines I love to quote
* సదాశివం నీల తో “నలుగురు నాలుగు దెబ్బలు వేసినపుడు ఏడవ లేదు కదాని నువ్వూ దెబ్బ వేయకేం?”
* దుఖపు నదుల్లో ఈతలు కొట్టడం నేర్చిన వారికి ఒడుపు తెలీదా ఒడ్డుకు రావడానికి.
* ఆమె (ఆరంజోతీ) మాటలు వున్నాయి అంటే అపుడే బొడ్డు పేగు కోసిన బిడ్డ లంత నగ్నం గా వుంటాయి.
*****””. *********. ********
నీల తల్లి చంద్రకళ కి చదువుకోక పోయినా, కష్టపడి పనిచేసి జీవితాన్ని వున్నంతలో కళాత్మకం గా జీవించాలనే తపన. కానీ తండ్రి పరశి లో తాగుడూ, వాగుడూ, భార్యని హింసించడం తప్ప మరో మాట వుండదు. ఆటో రాజు పట్ల తల్లి ఆకర్షితురాలవ్వడాన్ని చాయా మాత్రం గా నీల జ్ఞాపకాలుగా నేర్పుగా కథనం లో చొప్పించింది రచయిత్రి. నీల ప్రతి స్పందనని కూడా వర్ణిస్తూ ఆ సమయం లో (జెయింట్ వీల్ లో జంటగా) వాళ్ళిద్దరూ చాలా అందం గా కనిపించారు అని చెప్పడం తప్పొప్పులని మించిన మనో ప్రపంచం నీల పాత్రలో వుందని మనకు చెప్పడం అనుకోవచ్చు.
భార్యకూ ఆటో రాజుకూ మధ్య సంబంధాన్ని పసిగట్టిన పరశి వాళ్ళిద్దరినీ చంపి జైలుకు వెళ్ళేందుకు సిద్ధమవుతాడు. అదే సమయం లో నీలకు జీవితాంతం వెంటాడే సంఘర్షణ కు పునాది ఏర్పడుతుంది. మా అమ్మ లా కాకుండా, జీవితం అంతా ఒకళ్ళనే ప్రేమించి తోడుగా వుండాలి అన్న ఆలోచన, మూడో వ్యక్తి ప్రమేయం లేని వైవాహిక జీవితం – యీ రెండూ ఆమె జీవిత గమనాన్ని శాశించే శక్తులవుతాయి.
నీలకి దగ్గరుండి పెళ్ళి జరిపించిన పాశ్తర్ ఇంకా అతని భార్యా – ఈ రెండు పాత్రలూ మనుషుల్లోని మతాతీత మానవత్వాన్ని నిరూపిస్తాయి. గ్రామాల్లోని ప్రజల సమస్యల్లో క్రైస్తవ మిషనరీల దయా పూరిత చొరవని చూపిస్తుంది.
కోరి పెళ్ళి చేసుకున్న ప్రసాదు, గ్రహణ చాయలా ఆవరించే సరళ, ఆమె తల్లి లక్ష్మి కాంతం, ప్రసాదు ప్రవర్తన లోని శాడిస్టు చాయలు, వీటి మధ్య చదువు కొన్సాగించాలని నీల లోని ఎడతెగని ఘర్షణ, లాయర్ వసుంధర ప్రోత్సాహం – ఒక సామాన్య స్త్రీ జీవితం లోని అన్ని చాయల్ని రచయిత్రి స్పృశిస్తుంది.
ఈ 101-200 పేజీల్లో లాయర్ వసుంధర నీల తో మాట్లాడే యీ పేరా ఒక సామాజిక హెచ్చరిక:
“నానా రకాల (గృహ) హింసల నుంచి విముక్తి కోసమే అయినా మనుషులు విడిపోవడానికి సాయం చేయడం ఏవంత గర్వం గా వుండదు నీలా! వారికున్న ఉక్కిరిబిక్కిరి తనం లోంచి బైట పడెయ్యాలని చూస్తాం. విడకుల ప్రాసెస్ చాలా ఒత్తిడి పెడ్తుంది. తీరా అన్నీ ముగిసి ప్రపంచం లోకి కాలు మోపగానే చుట్టూ అంతులేని స్వేచ్చ. ఏం చేసుకోవాలో తెలీనంతటి స్వేచ్చ. బాగా పలవరించి పోతాం. కానీ స్వేచ్చ కూడా చాలా డిమాండ్ చేస్తుంది. మనకి అలవి గాకుండా వుంటుంది.
స్వేచ్చ లో మనకి మనం తప్ప ఎవరూ వుండరు. ఇష్టపడి వరిస్తాం కదా జాగ్రత్తగా హాండిల్ చేసుకోవాలి.
ఒదిగి వుండటమూ లేకపోతే తెగించేయడమూ – ఈ రెండిటి మధ్యా జీవిచే కళ ఒకటి వుంటుంది నీలా! నువు బాగా ఎదగాలి. ఎదగడం అంటే నలుగురిలో ప్రముఖం గా వెలిగిపోవడం కాదు. మన చిన్ని లోకం లో అదే…. మన అంతరంగం లో మనం ఎదగాలి. అపుడూ చాలా అందంగా మారి పోతాం”
***†************. ********* ************
పరదేశి కీ నీలకీ జాలరి జన జీవన సౌందర్యానికి ప్రతీకలా పరిచయమయ్యే పాత్ర పైడమ్మ .
పైడమ్మ ఒక ఫెమినైన్ అంతశ్చేతన అనిపిస్తుంది. తన చుట్టూ వున్న పరిస్థితుల రాపిడికి రాటు దేలినా, జీవితపు సున్నితత్వం పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోని ధైర్యం అనిపిస్తుంది. నా చిన్నప్పుడు కాకినాడలో అడ్డకట్టు చీర, ముక్కున బుళాకి, పాయలోకి దూర్చిన కొప్పుతో ప్రకృతి లో భాగం గా ఇమిడిన ఆదిమత్వం కనిపించింది.
సముద్రం లోట నాకేటి కనపడతాదని అడిగినారు తవరు. నానేటి సెప్పగల్తు!సముద్రానికి సముద్రం లోపట ఏటి కనపడతాది”
కొడుకు గురించి చెప్తూ “ఆడి ఒళ్ళు అల్లదిగో ఆ నల్లరాతి కొండ మాదిరి. కానాడి మనసు మాత్తరం సేప మెత్తన”
వలలు పైకి లాగినాక ఏటగాళ్ళంతా ఏ సేప పడినాది అదెంత బరువు తూగుతాది అని కొట్టీసుకుంతంతే మావోడు మాత్త్రం వలలోపటి పిల్ల సేపల ఊపిరి ఆగే లోపు ఆటిని తీసి సముద్రం లోకి ఇసిరే వాడంత”.
పిల్ల చేపలు బరువు తూగక అమ్ముడు పోక కుళ్ళబెట్టి పారేసే కంటే, భవిష్యత్తులో ఉపయోగపడే పెద్ద చేపలయ్యే అవకాశాం వుంటుంది. ఒక మనిషికి పర్యావరణ సాన్నిహిత్యం, పరిసరాల అవగాహన రావడానికి చదువులే అవసరం లేదు. ఇలంటి జీవన సాంగత్యం వుంటే చాలు.
“ఈ సముద్రం నాకు బిడ్డల్లేని అప్ప మాదిరి. నా బిడ్డని దాని మురిపానికి అర్పించినానని మనసు రాయి సేసుకున్నా. ”
డెబ్భైల్లో కాకినాడలో వుండటం వల్లనేమో, పైడమ్మ పాత్ర ప్రతి పదమూ నా ఎదురుగా నిలబడి సంభాషించినట్టే అనిపించింది. ఆ పాత్ర నుంచి బైటపడి మళ్ళీ కథ చదవడం కొనసాగించేందుకు ఒక వారం పట్టింది.
******************
పరదేశి, నీలల పరిచయం ప్రేమగా గాఢతని సంతరించుకునే సందర్భం లో అతను మరో అమ్మాయి గురించి ప్రస్తావించడం తో మళ్ళీ జీవితం లో భావ సంఘర్షణకి సిద్ధం గా లేని నీల, విసాఖ వదిలి హైదరాబాద్ రావడం తో పరదేశి పాత్ర పూర్తి తెరమరుగయ్యి, నెరేషన్ సదాశివ మీద ఫోకస్ అవుతుంది.
ఇందులో సదాసివ తండ్రి ప్రకాష్, అతని తండ్రి మత్తయ్య, సదాశివ తల్లి నీతాబాయి, ఆమె తండ్రి సాంబశివరావు ఇలా ఎన్నో పాత్రల్ని ఇముడ్చుకుంటూ, పాత సికిందరా బాద్ ని కథా గమనం లో చొప్పిస్తూనే, కథని ముందుకు తీసుకెళ్తూ, నీల ఆర్థికం గా మానసికంగా భావపరంగా స్థిమిత పడటాన్ని ఒక పట్టు సడలని కథా గమనం గా సాగి పోయింది.
నీల కూతురు మినో, సదాశివకి సహజ స్నేహిత. రెందు సముద్రాల హోరులో కూడా తన గొంతు విప్పుకునే జలపాతం. ఆధునికత పట్ల ఎంత అవగాహన వున్నా కూడా నీల, సదాశివా ల ని కుదిపేసే మార్పుకి ప్రతీక. దాన్ని కూడా పరస్పర అవగాహన ఆలంబనలతో సున్నితంగా ఏక్సెప్ట్ చేయిస్తుంది రచయిత్రి.
నీలని కూతురిలా చూసుకున్న పాష్టరమ్మనీ, , అలాగే నీలని పెళ్ళాడిన ప్రసాద్, ఇష్టపడిన పరదేశీ పాత్రల్ని కూడా అసంపూర్ణం గా వదిలెయ్యకుండా పీటముడులుగా బిగుసుకునే అంతస్సంఘర్షణలని తిరిగి అంతే నిష్పాక్షికంగా జీవితం లో అంగీకరించగలిగే ఎదుగుదలని పాత్రలకి ఇచ్చింది.
ఈ క్రమంలో ఎన్నో మానసిక విశ్లేషణలు చేస్తూ, నీలూ సదా శివల మధ్య ఒక బాలెన్స్డ్ బంధవ్యాన్ని, కండిషనల్ నుంచి అన్ కండిషనల్ టుగెదర్ నెస్ అంటే ఆ వ్యక్తులిద్దరూ ఎంత మెచ్యూర్డ్ గా వుండాలో ఓపికగా సన్నివేశాల్ని క్రియేట్ చేసిన నైపుణ్యం రచయిత్రిది.
చివరి వరకూ తల్లి చంద్రకళా, ఆమె ఇష్టపడిన ఆటో రాజుల నీడలు నీలని వెంటాడటం మానవు. ఆ భయాల్నీ, భావ ఘర్షణనీ ఎప్పటికప్పుడు మోస్తూనే, ఆ వత్తిడి కి లొంగకుండా ” I deserve better Life” అనుకునే నీల సంఘర్షించె ప్రతి ఒక్కరి మనసు తూలిక. ఆ నమ్మకం ఎంత అందాన్నీ, ఆర్ద్రతనీ మనలో నింపుతుందో ఆ నమ్మిక వున్నవారికే తెలుస్తుంది.
నా వరకూ “నీల” జాజి మల్లి కి మానస పుత్రిక. పుస్తకం ముగించాక ముచ్చటగా నాతో ప్రయాణించిన స్నేహ భావాలు అకస్మాత్ గా ముగిసాయేమో నన్న బెంగ కలిగింది. ఆధునికత ఎంతటి భీభత్సాన్ని అంతర్గతం గా మోస్తుందో అన్న విశ్వరూపం దాగుంది ఇందులో. ప్రతి మనసులో ఓదార్పు కి ఎంత ఆకలి క్షోభిస్తుందో, దాన్నుంచి మానవ సంబంధాల అణిచివేతలూ, తిరుగుబాటులు, ఆర్థిక అవగాహనలు, అంతశ్చేతన పిలుపులు — వీటన్నిటి ఎన్ సైక్లో పీడియా యీ “నీల”.
Leave a Reply