“నల్లమల ఎర్రమల దారులలో… యాత్ర” పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
**************

ఒక రచన మరికొన్ని రచనలకి కారణమవుతుందని మనం వింటూంటాం. ఓ రచన ‘మనసు పడిన’ పాఠకులను రిపీట్ రీడర్స్‌గా చేస్తుంది. కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. కొందరు పాఠకులు పరిచయస్తులై, ఆపై మరింత దగ్గరై సన్నిహితులవుతారు. ఈ క్రమం మరో రచనకి దారితీస్తుంది. అన్ని పుస్తకాలకీ కాకపోయినా, అందరు రచయితల విషయంలోనూ ఇలా జరగకపోయినా… పరవస్తు లోకేశ్వర్ గారి విషయంలో ఇది నిజంగానే జరిగింది.

2016 డిసెంబరు మొదటివారంలో కాశీభట్ల వేణుగోపాల్ గారి నుంచి తీసుకున్న “సలాం హైదరాబాద్” నవల చదివి, పూర్తికాగానే ఉద్వేగం ఆపుకోలేక రచయిత లోకేశ్వర్‌తో మాట్లాడి – “మీరు రాసిన పుస్తకాలు ఇంకేం ఉన్నాయి?” అని అడిగి కొరియర్‌లో తెప్పించుకుని వాటిని కూడా చదివి లోకేశ్వర్‌కి దగ్గరయ్యారు నందికొట్కూరుకి చెందిన శ్రీనాథ్ రెడ్డి. అదే నెల చివరివారంలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో లోకేశ్వర్ గారి స్టాల్‌కి సతీసమేతంగా వచ్చి కలిసారు శ్రీనాథ్. “మా ఊరికి రండి, మా జిల్లా అంతా చూపిస్తా…” అని శ్రీనాథ్, “శోభ గారితో కలిసి రావాలని” సూర్యకళ కోరడంతో 2017 జనవరిలో నల్లమల ఎర్రమల యాత్రకి ఉపక్రమించారు లోకేశ్వర్ – శోభ. వారం రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వారికి ఎన్నెన్నో అనుభవాలు ఎదురవుతాయి… తమ అరుదైన వ్యక్తిత్వంతో కొందరు వ్యక్తులు అబ్బరపరుస్తారు.

మిత్రుడిగా మారిన ఓ పాఠకుడి ఆహ్వానంపై ప్రారంభమైన ఈ విలక్షణ యాత్రలో రచయిత మనకి కొందరు విశిష్ట వ్యక్తులను పరిచయం చేస్తారు. ఆయా ప్రాంతాల చరిత్రనీ, వైశిష్ట్యాన్నీ వివరిస్తూనే తమకెదురైన కొందరు వ్యక్తుల గురించీ ఆస్తకిగా చెబుతుంటే “maps and chaps” లేదా “places and people” అన్న ఆంగ్ల పదబంధాలు సాకారమవుతాయి. ప్రాంతాలతో పాటు అక్కడి మనుషులను చూసి, కలసి, వారి కతలను విని, వారితో ముచ్చటిస్తేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుందని విశ్వసించే నిజమైన యాత్రికులలో లోకేశ్వర్ ఒకరు.

రోళ్ళపాడు అభయారణ్యంలో ప్రకృతినీ, పక్షులనీ చూస్తూ తన్మయులవుతారు రచయిత. కళ్ళకు కట్టే వర్ణనతో పాఠకులనూ మైమరపిస్తారు. రోళ్ళపాడు సమీపంలోని బరక సంజీవరాయ దేవాలయంలో నిరామయంగా కూర్చోవడం కూడా ధ్యానమేనంటారు రచయిత ఆ ఆలయ ప్రశాంతతకి ముగ్ధులై.
అలగనూరు రిజర్వాయర్‌ని చూస్తూ, శ్రీశైలం బ్యాక్ వాటర్స్‌ని ప్రస్తావిస్తూ ‘అభివృద్ధి వెనుక వెలుగునీడల ఆట’ అని అంటారు. కాలాన్ని దోసిలిలో ఒడిసి పట్టడం అంటే ఏమిటీ రచయిత చెబుతుంటే ఆయనలోని హాస్య చతురతకి పాఠకుల పెదాలపై చిరునవ్వు వెలుస్తుంది.

రచయితకి శ్రీనాథ్ గారి మిత్రుడు రోళ్ళపాడు సర్పంచ్ వెంకట్రామరెడ్డిగారితో పరిచయం అవుతుంది. ఆయన ‘కోటి రూపాయల సర్పంచ్’ ఎలా అయ్యారో తెలుసుకోవడం సరదాగానే ఉన్నా… దాని వెనుక ఉన్న చీకటి వాస్తవాలు అర్థమై పక్కదారి పడుతున్న ప్రత్యక్ష ఎన్నికల విధానం పట్ల సందేహాలు తలెత్తుతాయి.
తాముంటున్న గెస్ట్‌హౌస్‌లోనే బస చేసిన మోహన్, ఎడ్గార్ అనే ఇద్దరు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు/పక్షి ప్రేమికులను పరిచయం చేస్తారు రచయిత. అత్యంత బాధ్యతాయుతమైన వృత్తులలో ఉంటూ కూడా తమ అభిరుచిని కాపాడుకోడం కోసం ప్రతీ ఏడాదీ ఇక్కడికి వస్తారట వాళ్ళిద్దరూ. నవంబరు/డిసెంబరు నెలల్లో రోళ్ళపాడుకు వలసవచ్చే అమూర్ ఫాల్కన్‌లను ఫొటోలు తీయడం వీరి హాబీ. రచయిత కోరిక మేరకు ఆ పక్షుల విశిష్టతని వివరిస్తారు మోహన్, ఎడ్గార్‌లు. వాటి జన్మస్థానం సైబీరియా ఆగ్నేయ ప్రాంతం – చైనాలోని ఉత్తర భాగం మధ్యన ఉంది. ఇవి ఏటా 22 వేల కిలోమీటర్లు – సైబీరియా నుంచి దక్షిణాఫ్రికా వరకూ ప్రయాణిస్తాయట. అయితే ఆ పక్షుల జీవితంలోని విషాదాన్ని తెలుసుకుంటే మనసు మొద్దుబారుతుంది.

తుంగభద్రా నది గురించి ప్రచారంలో ఉన్న ఓ కథని పాఠకులతో పంచుకుంటారు రచయిత – మచ్చుమర్రి గ్రామం నుంచి సంగమేశ్వరాలయానికి పడవ ప్రయాణం చేస్తూ.

భారీ ఆనకట్టల వల్ల కొన్ని గ్రామాలు ముంపుకు గురవడం, ప్రజలు తమ ఆనవాళ్ళు, అస్తిత్వాలు కోల్పోవడం గురించి వివరిస్తారు. ఈ ప్రయాణంలో రచయితకి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గుంపుల వెంకటేశ్వర్లు జీవితం గురించి తెలుసుకుంటే మనసుకు కష్టం కలుగుతుంది. ఆయన స్వయంగా ఓ నిర్వాసిత కుటుంబానికి చెందిన వ్యక్తి!

ఆత్మకూరులోని డా. గౌరీనాథ్ విలక్షణ వైద్యులు. ఎటువంటి దర్పమూ, భేషజమూ లేకుండా, ఏ హడావిడీ చేయకుండా లుంగీ బనీయన్‌తో రోగులను పరీక్షించే ఆయన మానవ హక్కుల కోసం పోరాడి జైలుకు కూడా వెళ్ళొచ్చారట.

పావురాల గుట్ట సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్దిని గుర్తుచేసుకుంటారు. ఆనాటి ఘటన పూర్వాపరాలను వివరిస్తారు. నల్లమల పర్వతాల గురించి చెబుతూ ఇవి దక్షిణ భారతదేశంలో తూర్పు కనుమల కొనసాగింపు అంటారు.
నంద్యాలకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ఓంకారం’ దేవాలయం గురించి చెబుతూ ఆధునికతకి గురికాని దేవాలయాలే ఆధ్యాత్మికంగా గొప్పగా ఉంటాయని రచయిత అభిప్రాయపడతారు. అక్కడి కాశినాయన సత్రంలో కొందరు – యాత్రికులకు, భక్తులకు వండివడ్దించడం చూసి, అమృత్‍సర్ స్వర్ణదేవాలయంలో ‘కర్‌సేవ’ చేసే సిక్కు భక్తులను గుర్తు చేసుకుంటారు లోకేశ్వర్. ఈ సందర్భంగా రాయలసీమ అంతటా ప్రసిద్ధమైన కాశినాయన అనే సాధువు గురించి తెలియజేస్తారు.

ప్రయాణంలో భాగంగా ఉయ్యాలవాడ వెళుతుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెబుతారు. వారి వారసుల ఇంట ఆయన వాడిన కత్తిని చూస్తారు. రేనాటి సూర్యచంద్రులలో మరొకరైన బుడ్డా వెంగళరెడ్డి గురించి వివరిస్తారు.

సరిహద్దులుగా ఉండే నదులు దాటగానే భాషలూ, యాసలు మారడం విచిత్రంగా అనిపించినా, దేని అందం దానిదే అంటారు రచయిత – కర్నూలు జిల్లా దాటి అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుండగా.

తాడిపత్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలోని ఓ యువపూజారి జీవితం మారుతున్న జీవనశైలులకి నిదర్శనం! ఓ వైపు అర్చకత్వం చేస్తూనే, స్థానిక కాలేజీలో ఎం.సి.ఎ. చదువుతూ సాంకేతిక రంగంలో ప్రవేశించాలనుకోవడం ఓ సామాజిక ప్రభావం!

అక్కడ్నించి బెలుం గుహలకి చేరుతారు. వాటి చరిత్రని వివరిస్తారు. సమీపంలోని ‘అవుకు’ రిజర్వాయర్ చూస్తారు. పాఠకులకూ చూపిస్తారు.
“యాత్రికులకు దారిలో ఎంతోమంది కలుస్తుంటారు. కొంత దూరం కలిసి నడిచాక మళ్ళీ విడిపోతారు. వారు జీవితంలో మళ్ళీ ఎప్పుడూ కనబడకపోవచ్చు, కాని మనసు మూలల్లో ఎక్కడో అక్కడ శాశ్వతంగా దాక్కుంటారు” అంటారు లోకేశ్వర్ – ‘అవుకు’ రిజర్వాయర్ వద్ద తమతో ఉన్న మోహనరాజు అనే కానిస్టేబుల్ గురించి. ఈయన ఓ గొప్ప భావుకుడు, ప్రకృతివాది, కవి! ఖాకీ డ్రెస్సు లోపల కవి హృదయం చూసి అబ్బురపడతారు రచయిత.
యాగంటి ఆలయ వైభవాన్ని తన కళ్ళతో పాఠకులచే దర్శింపజేస్తారు లోకేశ్వర్. ‘భారతదేశపు నోస్ట్రోడామ్’గా భావించబడే పోతులూరి వీరబ్రహ్మం గారి మఠం దర్శిస్తారు బనగానపల్లెలో. బనగానపల్లె నవాబు బంగ్లా చూస్తూ రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్న సామెతను గుర్తుచేసుకుంటారు.

ఎవరో మాయలఫకీరుకు కోపం వచ్చి తన మంత్రదండంతో మనుషుల్నీ, జంతువుల్నీ రాతిశిలలుగా మార్చాడేమోనన్న భ్రాంతి కలుగుతుంది రచయితకి – ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ సందర్శించినప్పుడు.

తిరుగు ప్రయాణానికి ముందుగా కర్నూలు నగరంలోని స్థానిక అబ్దుల్ వాహెద్ సమాధి, మాసూమ్ బాబా దర్గాలను చూస్తారు. వివరాలు తెలియజేస్తారు.
కర్నూలు నగరానికి తలమానికమైన కొండారెడ్డి బురుజు గురించి చెబుతారు. చివరగా కర్నూలులో ఉండే సుప్రసిద్ధ రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌ని కల్సి మాట్లాడుతారు. అనంతరం హైదరాబాదుకి తిరుగుప్రయాణం.

భౌతిక యాత్ర పరిసమాప్తమయినా, మానసిక యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. లోకేశ్వర్ రచనాశైలి పాఠకులను అక్షరాల వెంట నడిపిస్తూ, పరిగెత్తిస్తూ – ఆయా ప్రయాణాల్లో తామూ స్వయంగా పాల్గొన్న అనుభూతిని కలిగిస్తుంది.

గాంధి ప్రచురణలు వారు ప్రచురించిన ఈ 156 పేజీల ఈ పుస్తకం వెల రూ.150/-.

ప్రాప్తి:
1. పి. లోకేశ్వర్, ఇం.నెం. 12-2-709/5/1/సి, నవోదయ కాలనీ, హైదరాబాదు – 28, సెల్: 9160680847.
2. నవోదయ బుక్‌షాప్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040 2465 2387

You Might Also Like

Leave a Reply