వచన గానం – చింతకింది మల్లయ్య ముచ్చట కథలు

వ్యాసకర్త: సిద్ధార్థ
(సమీక్షకుడు ప్రముఖ కవి)
***********
To write is to make oneself the echo of what cannot cease speaking- and since it cannot, in order to become its echo I have, in a way, to silence it.
-Maurice Blanchot

‘చింతకింది మల్లయ్య ముచ్చట’గా వచ్చిన సంపుటిలోని పూడూరి రాజిరెడ్డి కథలన్నీ కూడా ఆపుకోలేని జీవనోద్వేగం వల్ల, దాని తాలూకు ప్రకంపనలను తగ్గించడానికి వచ్చిన కథలని వొక పాఠకుడిగా నాకనిపించింది. ఈ కథలు సేంద్రియ, వాస్తవిక, మార్మిక వాస్తవిక, అతి వాస్తవిక దిగువ మధ్యతరగతి జీవిక కథలు. ఈ కథలలో ఇమిడిన భాషలో ఒక warmth వుంది. మనస్సలికిడి వుంది. రాజిరెడ్డి ఈ కథలలో కథారచయితగా కాక కథాకవిత్వ రచయితగా అనిపిస్తాడు. తనకంటూ వొక తాంత్రికత, మాంత్రికత వున్న కథారచయితగా అగుపడతాడు. ఈ కథలు దేనికవే జీవితంలోంచి జారిపో వీలులేని పార్శ్వాలను బలంగా పాఠకుల గలమల ముందు నిలబెడతాయి. మనందరం కూడా నడిచే కథలమే. మనం చెప్పాలనుకున్న కథలు అనేకం వుంటాయి. మనం చెప్పకుండా దాచుకోవాలనుకున్న కథలు కూడా వుంటాయి. మనం రోజుకో కథను చూస్తుంటాం. రోజుకో పాత్రను గుర్తిస్తాం. కొన్నింటిని తప్పనిసరిగా చెప్పాలని ఎదురుచూస్తాం. అటువంటి ఎదురుచూడటాన్ని స్వాగతిస్తాయి ఈ కథలు.

మంచి కథలకు ఫార్ములా వుండదు. బతుకులోంచి సూటిగా వస్తాయి. నిజాయితీ మాత్రమే అటువంటి కథలకు measuring scale. నిజాయితీ వల్ల కథలకు చదివించే గుణం సోకుతుంది. ఈ ముచ్చటలోని కథలన్నింటికీ చదివించే లక్షణం వుంది. అందుకే పాఠకుడిగా నన్ను వివశుడ్ని చేసిన కొన్ని ముచ్చట్ల కథలను పంచుకోవాలనిపించింది. మొదటిగా, చింతకింది మల్లయ్య ముచ్చట. ఈ కథలో రచయిత వొక non-character గా కథ చెప్పుకొస్తాడు. అతడికి పెర్సనాలిటీ లేదు. తన, లేని వ్యక్తిత్వాన్ని మల్లయ్య ద్వారా పట్టుకొని కథలోకి ప్రవేశిస్తాడు. మల్లయ్య వొక సజీవ ధార కాబట్టి రచయిత frame లోకి ఇమడడు. రచయిత vessel లోకి, material లోకి వొదగని పెద్ద పాత్ర మల్లయ్య. రచనకంటే పెద్ద పాత్ర. ‘రచన’ కంటే పెద్దగా వున్న పాత్రలను మన తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిన కేశవరెడ్డి, పతంజలి, అల్లం రాజయ్య, నామిని, గోపిని కరుణాకర్‌ వంటి జానర్‌ రచయితల కథా విస్తృతి మనకు ఎట్లాగూ వుండనే వుంది. ఇటువంటి కథల్లో రచయిత, తన ప్రత్యేకమయిన అనుభవాన్ని సాధారణ అనుభవంగా చేసే క్రమంలో వున్నతమయిన అనుభవంగా తీర్చిదిద్దుతూ వుంటాడు. అటువంటి ప్రత్యేకమయిన స్థితిని అందించే కథ మల్లయ్య కథ.

ఈ కథల్లో పాఠకుడిగా comfortable గా, కొత్తటి రుచిగా అన్పించింది, తన భాష. కథను చెప్పడంలో అనుసరించిన భాష మనలో ఇంకిపోగల భాష. తన తెలంగాణాతనంలో కొంచెం కొంచెం ముంచి తీస్తూ, మెట్రో ఎగొనీని అద్దుతూ, కొత్త నగరాభివ్యక్తిని ఎన్నుకొని మాట్లాడిన భాష ఇది. ఇదంతా రాజిరెడ్డి ప్రయత్న పూర్వకంగా చేసాడని నేను అనుకోవడం లేదు. కొన్ని కథల్లో అయితే – మరణ లేఖలు, నాలో(కి) నేను, మంట లాంటి కథల్లో– వొక గొప్ప ఫామ్‌లోని ఆనందం దొరుకుతుంది నవ్య పాఠకుడికి. ఈ కథల్లో రచయిత తాలూకు టెంపర్‌మెంటూ, హేతుభీతీ ప్రతిఫలించిందేమోనని తోచింది. అక్కడే తను మాట్లాడే శైలీ, తన చెప్పే కథలోని శైలీ ఒకటేనని కూడా మళ్లీ తోచింది.

చాలా సందర్భాల్లో మన లోపల పెనుగులాడే వొక మధ్య తరగతి సంభాషణ వుంటుంది. ఆ సంభాషణకు మొదలూ తుదీ వుండదు. మనల్ని వొదిలిపోని internal dialogueని చాలా sensualగా పట్టించే ప్రయత్నమూ వుంటుందీ కథల్లో. అందుకే కథల్లోని contentని చాలా వరకు సంభాషణల్లో ఇమిడ్చే ప్రయత్నం చేస్తాడు. అదంతా పాత్రల అంతరంగ బహిరంగ సంభాషణగానో, వుత్త అంతరంగ సంభాషణగానో వుండిపోవడం కూడా చూస్తాం. కానీ ఆ సంభాషణలు మనల్ని చేరగలుగుతాయి. వినిపిస్తాయి కూడా విసిగించకుండా. వాటిలో వొక తీవ్రత, అణుచుకోని ఏవగింపూ, కోపం కూడా తెలిసివస్తుంది. ఇదంతా సోషల్‌ సెటైర్‌లోని అంశంగా కనిపిస్తుంది. గ్రామీణ అభివ్యక్తిలోని ఇడియమ్స్‌ని పుష్కలంగా వాడుకుంటాడు అందుకే. చినుకు రాలినది కథ చలంగారి సెటైర్‌లాగా, పతంజలి సెటైర్‌లాగా సర్రున కాలుస్తూ నవ్వించి బాధిస్తుంది. ఈ కథలోని మనుషుల్ని విసుగుచెందుతూ చూస్తూనే ప్రేమించడం మొదలుపెడతాం. ఈ సంకలనంలోని ఈ గుణం వల్ల కథలు మనలోని బాధాతప్త పరిసరాల్లోకి వెళ్లి కూర్చుంటాయి. రచయితలకుగానీ కవులకుగానీ ఇంతకంటే కావాల్సిన సామాజిక, రాజకీయ ఎజెండాలు ఏం వుంటాయి! రచనల్లో, సిద్ధాంతాలు ఉడిగిపోయి వల్లె వేస్తూ చెప్పే బరువు కాకుండా, జీవితంలోని సత్యమయిన స్థితి ప్రతిఫలించగలగాలి. రచనలలోని భూమీ, వేర్లూ, జీవరాశులూ మాట్లాడుతూ జీవితంలోని లోతునూ, వైశాల్యాన్నీ పెంచుతూపోవాలి. ఈ తీరులో వొక్కోసారి కోపమూ వుంటుంది గానీ ఆ కోపంలో బాధా, సత్యమూ కలగలిసి తీవ్రం చేస్తాయి రచనను. ఒక్కోసారి మన ఫామ్‌ మనకు ఇబ్బందిగా వున్నప్పుడు, రచయిత రెక్కల పెళ్లాం లాంటి గ్రామీణ జానపద విన్యాసంలోకి వెళ్లి magicalగా తలదాచుకునే ప్రయత్నమూ చేస్తాడు. రెండడుగుల నేల కథలో కూడా.

ఈ కథలలో చాలావరకు ప్రశ్నలు ఆక్రమిస్తాయి. జవాబుల కోసం వ్యవధి ఇవ్వని ప్రశ్నలు. అసలు జవాబుల కోసం ఎదురుచూడని ప్రశ్నలు ఉంటాయి దాదాపు అన్ని కథల్లో. మనలోంచి మనల్ని ప్రశ్నల రూపంలో కత్తిరించి పారేసే కథలన్నమాట. ఈ ప్రశ్నలు మనలోని అనవసర భాగాలను కత్తిరించి పారేయాలని కూడా suggest చేస్తుంటాయి. అయితే కథకుడికి ఈ ప్రశ్నలు వేయడంలో ఎవరితో తగువులాట? ఎవరితో కొట్లాట? అంటే, తనతో తన కొట్లాట అని అనుకోగలమేమో. ఈ కొట్లాట అంతా, గొడవ అంతా తనలోని duality వల్ల వచ్చిందని నాకనిపించింది. ఈ కథలన్నీ కూడా తన duality తోనే తనకు తాను ఎరుక పరుస్తూ, క్రమంగా పాఠకునిలోని duality దాకా నడక సాగిస్తాయి. తనకు తన ద్వంద్వంతోనే పేచీ. తనకు తాను బాగా అర్థం కావాలి. తన ప్రమేయం లేకుండా తన జీవితం ముందుకు సాగకూడదు. తనకు ఇష్టం లేని విషయాలు తన చుట్టూ వుండకూడదు. తనకు మంచీ చెడుల మధ్య బ్లాక్‌ అండ్‌ వైట్ గా చాలా స్పష్టమయిన విభజన రేఖ కావాలి అని తన ద్వంద్వంతో పేచీ పడుతుంటాడు రచయిత. నాలో(కి) నేను, మరణ లేఖలు, చింతకింది మల్లయ్య ముచ్చట, చినుకు రాలినది, తమ్ముడి మరణం, మంట కథలన్నింటిలోనూ ద్వంద్వాన్ని ప్రతిఫలించే dramatic సంవాదం వుంటుంది. అయితే తమ్ముడి మరణంలోగానీ, మరణ లేఖలులోగానీ వొక గాఢమైన, తప్పించుకోలేని దుఃఖముంటుంది. తన దుఃఖంలోని ఆనవాళ్లు మనలోని ద్వైదీతత్వంలోని చేతగానితనమేనని రచయిత చెబ్తాడు. మరణం వైపు, ఆత్మన్యూనత వైపు, పలాయనం వైపు మొగ్గు చూపే మానవ విహ్వలతను, నిస్సహాయతను తమ్ముడి మరణం కథలో రాజిరెడ్డి తెరమీదికి తీసుకువస్తాడు.

చివరిగా, ఇప్పుడు కథలు పాఠకుణ్ణి స్వీయానుభవంలోకి తీసుకుపోవాలంటే visual ఎంతో సాయపడుతుంది. సంపుటిలో వున్న చివరి కథ ‘శ్రీమతి సర్టిఫికెట్‌’ గురించి కొత్తగా చెప్పుకోవాలి. ఈ కథ ఒక సినిమాలోని montage bitsని sequenceగా చూపించిన కథ. కథ లోపలి కాన్‌ఫ్లిక్ట్‌ని ఎంతో వేగంగా, దృశ్యాలతో నేపథ్య సంగీతంలోంచి మునిగి పోతూ చెప్పుకొచ్చిన కథ.

చింతకింది మల్లయ్య ముచ్చట్లు అక్కడక్కడా కవిత్వంలో కూడా తానమాడుతున్నాయి. కొన్ని కథల్లో ఏ లోకం నుంచి ఎవరో విసిరే చినుకు కుడిచేతి మణికట్టుపై వాలినట్టు వుండే మెత్తని కవిత్వ వాక్యాలు పాఠకుణ్ణి సేదతీరుస్తాయి, నన్ను సేద తీర్చినట్లే.

చింతకింది మల్లయ్య ముచ్చట- ఇతర కథలు
రచన: పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 154
వెల: 144
ప్రచురణ: ఛాయా రిసౌర్సెస్ సెంటర్, హైదరాబాద్
ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్్: 9000413413
eBook: kinige.com

You Might Also Like

One Comment

  1. Desu Chandra Naga Srinivasa Rao

    ఈ విశ్లేషణ చాలా బాగుంది

Leave a Reply