ఆడెనమ్మా! శివుఁడు!!! పాడెనమ్మా! భవుఁడు!!!

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు
******************
షుమారు 103 సంవత్సరాల క్రితం, అనగా మార్చి 23, 1914న తెలుగు సాహితీ సారస్వతంలో ఒక మహోజ్వలమైన శకం మొదలైందని చెప్పవచ్చు. దానికి ముఖ్యమైన కారణం ఆ రోజున ఒక శిశువు సాంప్రదాయ వైష్ణ కుటుంబంలో పరమ భాగవతులైన శ్రీ శ్రీనివాసాచార్యులు మరియు శ్రీమతి లక్ష్మీదేవి దంపతులకు జన్మించాడు. ఆ శిశువే “పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు” కాలగమనంలో పుట్టపర్తి నారాయణాచార్యులుగా సుప్రసిద్ధుడు. ఈయన్ని పుట్టపర్తి అనికూడా పిలుస్తారు. ఈయన పేరులో “పుట్టపర్తి” ఊరుపేరని “తిరుమల” వారి సొంత ఇంటి పేరని, రాయలసీమ ప్రాంతంలోని వారు ఇలా ఊరిపేరు ఇంటిపేరు రెండూ వాడకం పరిపాటి అని పుట్టపర్తి స్వయంగా చెప్పేవాడు.

పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది అన్నట్టు పుట్టపర్తి తమ బాల్యం నుంచి తెలుగు సాహిత్యంలో ఎనలేని ప్రతిభ కనబరచాడు. తమ ఎనిమిదొవ యేట మొట్ట మొదటిసారి ఒక కంద పద్యం వ్రాసి తండ్రి గారి మెప్పు పొందాడు. చిన్నతనం నుంచి చదువులలో, సాహిత్యంలో వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞాపాటవాలు ప్రావీణ్యం కనబరచేవాడు. పుట్టపర్తి తన విద్వాన్ పరీక్షకు వెళ్ళినప్పుడు తను పన్నోండవ యేట వ్రాసుకున్న “పెనుగొండ లక్ష్మి” అనే పద్య కావ్యాన్ని పాఠ్యంశంగా చదువు కున్నాడు. ఆరోజుల్లు “విద్వాన్” పరీక్షకి హాజరు ఐన ప్రతి విద్యార్థీ ఈ “పెనుగొండ లక్ష్మి” అనే పద్య కావ్యాన్ని ఒక పాఠ్యంశంగా చదువుకునే వారట.

ఈయన బహుభాషావేత్త. వీరికి తెలుగు, హిందీ, సంసృతము, ప్రాకృతము, బెంగాలీ, పాలీ, తుళు, ఫ్రెంచి, పర్షియన్ వంటి షుమారు 14 భాషలో మంచి ప్రావీణ్యం ఉందట. బహుభాషా పాండిత్యమే కాక, బహుశాస్త్ర కోవిదుడు. ఈయనకి సంగీతము, సాహిత్యము, నృత్యము, నాట్యము, అబినయ కళలో కూడా మంచి ప్రావీణ్యము ఉంది. అంతే కాక ఈయన తర్కము, వ్యాకరణము, ఛందస్సు, మీమాంశ, శిక్ష, నిరుక్తము, కల్పము, జ్యొతిష్యము వంటి రంగాల్లో కూడా ప్రావీణ్యము సంపాదించు కున్నాడు. నిరంతరం ఏదోఒక శాస్త్రమో, కావ్యమో చదువుకుంటూ, నిత్య విద్యార్థి ఈయన. ఈయన ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల తోపాటు బౌద్ధము, జైనము కూడా అధ్యయనము చేసాడని వాటిలో పాండిత్యం ఉందని ఈయన వ్రాసిన గ్రంధాలను చూస్తే అర్థం అవుతుంది.
ఈయన తమ జీవితకాలంలో 140కి పైగా గ్రంథాలు వ్రాసాడు. అందుకనే ఈయన్ని శతాధిక గ్రంథ కర్త అని కూడా వ్యవహరిస్తారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, పద్య కావ్యాలు, ద్విపద రచనలు, సంపాదకీయాలు, సాహిత్య విమర్శనము, కృతులు, చారిత్రక రచనలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈయన రచనల్లో కొన్నింటిని అనగా శివతాండము, వ్యాసవల్మీకం, జనప్రియ రామాయణం, మహాభారత విమర్శనము, ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం మొదలైనవి ప్రచురితమయ్యయి.

భారత ప్రభుత్వం వారు దేశంలోని వివిధ భాషలలో పుట్టపర్తి చేసిన సాహితీ సేవలను గుర్తించి ఈయనకి పద్మశ్రీ బిరుదును సమర్పించింది. అలాగే ఇతర సాహితీ సమస్థలు ఈయన్ని “మహాకవి” అని, “సరస్వతీ పుత్ర” అని, “కవి పండితుడు” అని, “శతాధిక గ్రంథ కర్త” అని వివిధ బిరుదులతో గౌరవించింది. ఐతే ఈయనకి భారత ప్రభుత్వం నుంచి “జ్ఞానపీఠ పురస్కారం” రాలేదని, ఆ పురస్కారం ప్రభుత్వం తరుఫున ప్రకటించి ఉండాల్సిందని ఈయన అభిమానులు అప్పుడూ ఇప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఈయన రచించిన గ్రంధాలలో కొన్నిటిని నేను చదివాను వాటిలో నాకు బాగా నచ్చినది “శివతాండవము”.

“శివతాండవము” అనే గ్రంథం మొదటి సారిగా 1961లో ముద్రించ బడినది. దాని తరువాత షుమారు 10-12 సార్లు పునః ముద్రణ కూడా పొందింది. ఈ ముద్రణలు గ్రంథ కర్తకి ఆర్థికంగా ఎక్కువ ఉపయోగ పడలేదు. ఐతే ఈయన ఏ సభకి వెళ్ళినా, ఎక్కడ ప్రసంగించినా, ఈ కావ్యం యొక్క ప్రస్థావన రాకుండా ఉండేదికాదు. అప్పట్లో సాహితీ ప్రియులు, ఈ శివతాండవ గ్రంధం లోని పద్యాలను వీరి గళంతో పాడమని అడిగి మరీ పాడించు కునేవారు. “శివతాండవము” అనే కావ్యం కేవలం ఒక పద్య కావ్యము కాదు, ఇందులో శివుని తత్వ ప్రతిపాదన, సంగీతము, సాహిత్యము, నాట్యము, నృత్య సంకేతాలు ముమ్మరంగా లభించే కావ్యము. ఈ గ్రంధంలో పుట్టపర్తి యొక్క కావ్య సౌరభం తోపాటు, బాపు గారి కుంచెతో గీసిన బొమ్మలు మరొక ప్రత్యెక ఆకర్షణగా నిలుస్థాయి. ఈ గ్రంధం, గుంటూరు రవి కళాశాల వ్యవస్థాపక అద్యక్షుడు శ్రీ CVN Dhan గారు, రవి ఎకడమిక్ సొసైటీ, గుంటూరు సంస్థ ద్వారా ప్రచురణకి ఆర్థిక సహాయం అందించారు.

కొసమెరుపు: శ్రీ CVN Dhan గారు, నాకు పదోవ తరగతి లోనూ, ఇంటర్మీడియట్ లోనూ ఇంగ్లీషు స్వయంగా నేర్పించారు; వారి పుణ్యమే ఈ రోజు నేను అమెరికాలో నాలుగు మాటలు ఇంగ్లీషులో మాట్లాడి చలామణి అవుతున్నాను. వారి మీద అభిమానం కొద్దీ చిన్నప్పుడు నాపేరు కూడా KRB Shan అని మార్చుకున్నాను. కాలక్రమంలో అది “Shan Konduru” గా రూపాంతరం చెందింది అనుకోండీ.

ఈ కావ్యం వ్రాసే సమయానికి పుట్టపర్తి, రోజుకి శివ పంచాక్షరీ మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపం చేసేవారుట. ప్రొద్దుటూరులోనున్న శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలాయానికి, మండలం రోజులకు పైగా (45 రోజుల పాటు), ప్రతి రోజూ క్రమం తప్పకుండా 108 ప్రదక్షిణలు చేసేవారట. ఈ ప్రదక్షిణలు చేసే ఈ 45 రోజుల్లోనే ఈ కావ్యాన్ని పూర్తి చేసాడు. అంత నిష్ఠతో, భక్తిలో, సమర్పణ భావంతో చేసాడు కాబట్టే ఇంత అత్భుత మైన కావ్యం వెలుగు చూసింది. తరువాత దినాల్లో, ఈ కావ్య పరిమాణం చిన్నదిగా ఉందని మరింత పెంచుదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదుట. ఆ సర్వేశ్వరుడు నాకు ఇంత వరకే అనుజ్ఞ ఇచ్చారు అని సంతృప్తి పడ్డాను అని తను స్వయంగా చుప్పుకునే వాడు.

ఆభగవంతుని అనుగ్రహం, కటాక్షం లేకపొతే, ఇలాంటి కావ్యం వ్రాయటం ఎటువంటి పండితులకైనా, ఎటువంటి కవిలకైనా సాధ్యం కాదు, ఇలాంటి కావ్యం ఇతః పూర్వం ఎవరూ వ్రాయలేదు, ఈ కావ్యం వెలుగులోకి వొచ్చి ఐదు దశాబ్దాలు దాటినా నాకు తెలిసినంతలో మరెవరూ ఇలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.
ఈ “శివ తాండవము” అనే గ్రంథము ప్రధానముగా పది విభాగాలుగా విభజించ బడినది. అవి తొలిపలుకు, కావ్యగుణములు, ముందుమాటలు, అభిప్రాయము, శివతాండవము, నందినాంది, శివతాండవము, విజయాప్రార్థన, శివలాస్యము మరియు తాండవ ప్రశస్తి. వీటిలో ప్రధానమైనవి పద్య కావ్యములు కల విభాగములు కేవలము ఐదు మాత్రమే అవి శివతాండవము, నందినాంది, శివతాండవము, విజయాప్రార్థన, శివలాస్యము. మిగిలిన విభాగంలో ఏమున్నది అన్న విషయం విహంగ వీక్షణంగా ఇక్కడ చూద్దాము.

తొలిపలుకులో – గ్రంథకర్త ఈ కావ్యం వ్రాయటానికి గల నేపథ్యం గురించి, ఈ కావ్యానికి దొరికిన ప్రజాదరణ గురించి, ఈ గ్రంథం ముద్రణకి, ప్రచురణకి శ్రీ CVN Dhan గారు చేసిన ఆర్థిక సహాయం గురించి సవివరంగా సవినయంగా వివరించారు. ఇది గ్రంథకర్త 1985లో వ్రాసాడు.
శివతాండవ కావ్యగుణములు, ఈ విభాగంలో శ్రీపాద గోపాల కృష్ణ మూర్తి అనే ప్రముఖులు 19/7/1961లో ఈ కావ్య గుణగణాలను కవి యొక్క ప్రతిభను విస్తృతంగా కొనియాడుతూ, ఈ కావ్యం తరువాత “పుట్టపర్తి” వారు శ్రీకృష్ణ లీలలు గురించి కూడా వ్రాయాలని వారి గొంతుతోనే అది వినాలని ఆకాక్షించారు.
ముందుమాట, ఈ విభాగంలో, గ్రంథకర్త ఈ కావ్యమునకు ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది?, ఈ కావ్యము ఇతర భాషలలో అనువాదము ఐన విషయము విపులంగా వివరించారు. ఇది 1/6/1961 నాడు గ్రంథకర్త వ్రాసాడు.

అభిప్రాయము: ఈ విభాగములో, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి అనే ప్రముఖుడు వ్రాస్తూ ఈ కావ్యం చదివి, విని, తాను ఆనందపార్వశ్యుడు అయినట్టు ఇలాంటి కావ్యం ఆధునిక సారస్వతములో మరొకటి లేదు అని నొక్కి వక్కాణించారు.

తాండవప్రశస్తి: ఈ విభాగము ఈ గ్రంధములో చివరిది, దీనిలో నే.శ్రీకృష్ణమూర్తి గారు శివ తాండవ మహత్త్వము గురించి శివ తాండవ తత్వము గురించి సవివరముగా వివరించి కావ్య పాఠకులకు శివ తత్వబోధ చేసి జ్ఞాన సముద్రములో ఓలలాడించారు. ఇది 24/6/1961 న వ్రాయటం జరిగింది.

శివ తాండవము – శివ తాండవమట, శివ లాస్యంబట

ముందుగా “తాండవము” మరియు “లాస్యము” అంటే సంగీత రత్నాకరములో ఎలా నిర్వచించారో తెలుసు కుందాము. నృత్యములో అంగహారములను, కరణములను ప్రధానముగా కలిగి ఉద్ధత ప్రయోగించటమైతే దాన్ని తాండవము అంటారు. అలాగే నృత్యములో సుకుమారాభినయ లయమై శృంగారపోషకమైనచో దాన్ని లాస్యము అంటారు.

శివ తాండవము: ఈ విభాగంలో, కవి గ్రంథ కర్త శివపార్వతులు తాండవ ఘట్టానికి ఎటువంటి సన్నాహాలు, ప్రయత్నాలు చేస్తున్నారు? వారి యొక్క అలంకరణలు ఎలా ఉన్నాయి? వారికి ఈ అలంకరణలకు ఎవరు సహాయం చేస్తున్నారు? ఈ సుభ ఘడియల్లో ప్రకృతి ఎలా పులకరించింది? ఈ సమయంలో భూమి మీద కనబడుతున్న పరీస్థితులు ఎలా ఉన్నాయి? అన్న విషయం వివరించారు.

ఈ కావ్యం చదివిన తరువాత, ఇలాంటి కావ్యం వ్రాయటం అన్నది, కేవలం ఒక కవి యొక్క ఉహ శక్తీకి, అతని కల్పనిక శక్తికి సాధ్యపడని విషయం. ఇలాంటి కావ్యం వ్రాయాలి అంటే కేవలం ఆ శివపార్వతుల తాండవ దృశ్యాన్ని దివ్వ దృష్టితో దర్శించిన వ్యక్తికి మాత్రమే సాధ్యపడుతుంది. లక్షల సార్లు శివ పంచాక్షరీ మంత్ర జపము ఫలమో, 45 రోజులు ప్రతిరోజూ 108 సార్లు స్వామివారి ప్రదక్షణల పుణ్యమో గానీ ఈ గ్రంథ కర్తకు ఈ కావ్యం వ్రాసే అదృష్టం కలిగింది. ఈ కావ్యములో కవి శివ తాండవములో త్రిగుణములను అనగా సత్వ గుణము, రజో గుణము మరియు తమో గుణము వీక్షించారు.

“ఏమానందము భూమీతలమున!! శివ తాండవమట! శివ లాస్యంబట!!”

శివ పార్వతుల తాండవము వారి లాస్యము, చూసే అవకాశము మాకు లభించిందని, అది ఒక మహాభాగ్యమని, ఈ భూమండలమంతా ఆనంద పారవశ్యముతో తేలియడుతున్నదట. ఈ సమయంలో ఈ భూమండలము పై ఉన్న నదీనాదాలు, సెలయేర్లు, జలపాతాలు, చెట్లు, చేమలు, తీగలు అన్నీ ఈ ఆనంద హేలని ఇలా వ్యక్త పరుస్తున్నాయిట. భూమండలము అలా ఉంటే, దానికి దీటుగా, మరి ఆకాశము, అలల వలె, బంగారు కలల వలె, పగడము రంగు పులుము కున్నదట.

“అలలై, బంగరు కలలై, పగడపు పులుగులవలె మబ్బులు విరిసినయవి”

మరి భూమీ ఆకాశములు ఇలా ఉంటె, మరి వీచే గాలులు మలయ మారుతముల వలె అన్ని వైపులా ప్రసరిస్తూ మధురమైన వేణు నాదమును వినిపిస్తూ ఆ మహా శివునికి నాద కైంకర్యం చేస్తున్నాయట. మరి దేవ కన్యలు యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుష, దేవ కాంతలు జల కన్యలుగా అవతరించారుట, శివ పార్వతుల తాండవము వారి లాస్యము చూడటానికి.

“వచ్చిరో యేమొ వియచ్చర కాంతలు జలదాంగనలై విలోకించుటకు,
శివ తాండవమట! శివ లాస్యంబట!!”

వివిధ రకాలైన పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయిట, ఆ పక్షులు వేద మంత్రాలు వల్లే వేయు చున్నాయా? లేక హైమావతీ కాలి మువ్వల సవ్వడులను అనుకరణ చేస్తూన్నాయా? అన్నట్టు ఉన్నదట. మరి భూమి మీద ఉన్న చెట్లు చేమలు తీగలు ఇలా స్పందిస్తున్నాయి అంటే?, ఆనందంతో ఉత్సాహముతో ఊగుతూ, కొమ్మలను ఊపుతూ వివిధ రకాలైన పూల వృష్టిలా కురిపిస్తున్నాయట. క్రింద రాలి పడుతున్న ప్రతి పువ్వు హైమవతీ పూల అలంకరణలో తాము కూడా ఉండబోతున్నామని ఆనందముగా ఉన్నాయట.

“కొమ్మల కానందో త్సాహమ్ములు ముమ్మ రముగ మనమున గదలించెనో!
తలనూచుచు గుత్తులు గుత్తులుగా ఇల రాల్చును పూవుల నికరమ్ములు!!
రాలెడు ప్రతి సుమ మేలా నవ్వును?
హైమవతీ కుసుమాలంకారము లందున తానొకటౌదు నటంచునో!”

భూమీ తలము ఇంత ఉత్సాహము కోలాహలముగా ఉంటే, మరి శివ పార్వతులకి అలంకరణలు ఎవరు చేస్తున్నారుట? సాక్షాత్తు చదువుల తల్లి అయిన ఆ సరస్వతీ దేవి తన చేతులతో పార్వతి మృదువైన శరీరాన్ని లేత పూలతో రెమ్మలతో అలంకారము చేస్తున్నదట. మరి శివునికి? సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ వొచ్చి ఉత్తమమైన సర్పరాజములను తెప్పించి స్వామికి అలంకరణ చేస్తున్నారుట. మరి స్వామివారి వాహనం నందీశ్వరుడు, భ్రుంగీశ్వరుడు మరియు ప్రమాద గణములు శివ తాండవమునకు అనుగుణముగా శృతి తప్పకుండా ఉండాలని ముందుగా వారి గొంతులు సరి చేసుకున్తున్నారుట.

“తకఝం తకఝం! కధం!
తకఝం తకఝం!! తధం!!!
తక దిరి కిట! తక దిరి కిట!!
నాదమ్ములతో లోకమ్ముల ….
గొంతులు సవదరించు నుత్కట బృంగమ్ములు!”

మరి జలపాతాలు సెలయేళ్ళు కన్యలుగా భూమిపై వొచ్చి శివుని నృత్యానికి, నాట్యానికి, అభినయానికి అనుగుణంగా ఆకాశము నుండి జాలువారుతున్నాయట. వీటికి ఇలా జాలువారాలని ఎవరు చెప్పారో?

ఓహో ఉహా తీతముగా నున్నది ఈ దృశ్యము, ఈ పరమానంద హెల ఈ భూమీతలమున నలు దిశల ప్రసరించినది. ఓ సంధ్యా సుందరీ! నీ సంబర మేమిటే? ఈ సువర్ణ మయమగు నీ దుస్తులు? ఆ అలంకరణలు మేమిటే? నీ ఆ క్రీకంటి నుంచి ప్రసార మవుతున్న ఆ మధుర కటాక్ష పాతము ఏమిటే? నీ నుంచి వేద జల్ల బడుతున్న ఆ ఇంద్ర ధనుస్సులెవరి కోసమే? నీ లాగే, ఏమీ పలుకక మౌనముగా ఉన్న ఆ మేఖలముల వాలకం ఏమిటే? ఎవరికోసం ఈ వయ్యారాలు, ఈ శృంగార చేష్టలు? ఇదంతా శివుని పూజ కోసరమేనా? ఇలా చేయమని మీకు ఎవరు చెప్పారు? భూమీతలమే చెప్పిందా? సంధ్యా సుందరీ త్వరత్వరగా ఆస్థమించి పడమటి దేశాలకు శివ తాండవ విశేషములు చెప్పుటకు పోవు చుంటివా? కొంత నిలువుము, తొందర పడకుము.

“సంధ్యాసతి! యీ సంభ్రమ మేమిటే?
నవ కుసుంభరాగ వసన మేమిటే?
ఆకుంచిత తిర్యక్ ప్రసారలజ్జా మధుర కటాక్ష పాత మేమిటే!”

మరి ఆ జింకలు, లేళ్ళు ఎందుకు ఆనంద భాష్పములు రాల్చు చున్నాయి? శివుని పాదాలు కడుగుటకు నీటిని వదలు చున్నవి. గుస గుస మని ఆ పల్లవము, చిగురులు ఏమి మాటలాడు చున్నవి? ఏమున్నది, శివ తాండవము శివ లాస్యము గురించి మాటలాడు చున్నవి.

“అల మృగములు కన్నుల బాష్పమ్ములు
విడిచెడు నెందుకు? విశ్వేశ్వరునకు అడుగులు
కడుగుటకై పాద్యంబో!!!”

ఓహో ఉహా తీతముగా నున్నది ఈ దృశ్యము, ఈ పరమానంద హేల ఈ భూమీతలమున నలు దిశల ప్రసరించినది. ఈ శివ తాండవము శివ లాస్యము చూచి ధన్యులమైతిమి.

“ఓ హో హో హో! ఊహా తీతం
బీయానందము ఇలాతలంబున!
శివ తాండవమట! శివ లాస్యంబట!!”

శివ తాండవము గ్రంథంలో బాపు గారు గీసిన బొమ్మలలో ఒకటి.

ఒకే బొమ్మలో ఒక వైపు నాట్యమాడే నటరాజూ, మరో వైపు, వేణు ఊదే శ్రీ కృష్ణుడు, మరోవైపు, కోదండము ధరించిన శ్రీ రాముడు, త్రిశూలం, నగాభారణము ధరించిన శివుడు, శంఖచక్రములు, వనమాల, తీరునామముతో శ్రీ వేంకటేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తారు. ఈ బొమ్మలో శివ విష్ణు అభేధమును ఎంత గొప్పగా “బాపు” గారు చిత్రించారో మీరే చూడండి. ఇలాంటి కళా ఖండాలు కళా రూపాలు మరేన్నో ఈ గ్రంథములో దర్శనమిస్తాయి.

చివరి మాట
షుమారుగా 27 సంవత్సరాల క్రితం అనగా 1st September 1990న తెలుగు సాహిత్యంలో, తెలుగు సారస్వతంలో ఒక మహోజ్వలమైన శకం “పుట్టపర్తి” వారి తుదిశ్వాసతో అస్థమించింది.  ఈ దినాన్ని పురస్కరించుకుని వారికి అశ్రు నివాళి ఈ విధముగా సమర్పణ చేసుకుంటున్నాము.

You Might Also Like

2 Comments

  1. లక్ష్మీదేవి

    మళయాళంలోకి అనువదించారు.
    వ్యాసం బాగుంది.

  2. C.Chandrasekhar

    పుట్టపర్తి నారాయణాచార్యులు ఏక వీర ను తమిళం లోకి అనువదించారు. శ్రీ వైష్ణవులు శివతాండవం రచించడం కూడా విశిష్టమైన విషయమే. వీరికిన్నీ జ్ఞానపీఠ బహుమతి వచ్చియుంటే సంతోషించేవారము. (జ్ఞానపీఠ పురస్కారము ప్రభుత్వము వారి చే చే ది కాదు.)

Leave a Reply