భాష కూడా యుద్ధ క్షేత్రమే
వ్యాసకర్త : ఎ.కె. ప్రభాకర్
కాళోజీ జయంతి సందర్భంగా (తెలంగాణా భాషాదినోత్సవం సెప్టెంబర్ 9) జయధీర్ తిరుమలరావు రచించిన ‘యుద్ధకవచం – తెలంగాణా భాషా సాహిత్యాలపై కాళోజీ నా గొడవ’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో సెప్టెంబర్ 7 న జరిగింది. దానికి రాసిన ముందుమాట ‘భాష కూడా యుద్ధ క్షేత్రమే’ ఇది .
‘మహాకవులకు మేతకనువుగ కూత మారును
రోటికనువుగ కూత మారును
చోటుకనువుగ మాట మారును
నెలవుకు అనువుగ చెలిమి మారును’
–కాళోజి
భాష సామాజిక దృగ్విషయమే కాదు. దాని చుట్టూ అల్లుకొని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ యెన్నో రాజకీయాలుంటాయి. ప్రజా సమూహాల్లో వున్న అసమానతలే వారి వ్యవహారంలో వున్న భాషలపై సైతం ప్రసరిస్తాయి. హెచ్చు తగ్గులకు కారణమౌతాయి. న్యూనత్వం గౌరవం వంటి భావనలకి చోటిస్తాయి. ఘర్షణకి దారితీస్తాయి. అనేక రూపాల్లో భాషోద్యమాలు మొదలౌతాయి. ఆత్మగౌరవ స్వరాలు బిరుసెక్కుతాయి. మాటలు నిప్పురవ్వలౌతాయి. స్వీయ భాషా పరిరక్షణ – అభివృద్ధి ప్రజాస్వామిక ఆకాంక్షలుగా బహిర్గతమౌతాయి. ప్రత్యేక అస్తిత్వాన్ని ప్రకటిస్తాయి. అప్పుడు భాష పునాది విషయమా వుపరితలాంశమా అన్న చర్చలు అర్థరహితమౌతాయి. భాషల్లోని వివిధతని గుర్తించి గౌరవించడం ప్రజాస్వామిక విలువగా ముందుకు వస్తుంది. అంతేకాదు అది ఆ యా భాషలు మాట్లాడే భిన్న జాతుల వునికిని గుర్తించి గౌరవించడంగా పరిణమించి జాతుల సమస్యలో భాగామౌతుంది. భిన్న మానవ సమూహాల మాటల్లో ఆలోచనల్లో సంస్కృతుల్లో వున్న వైవిధ్యాన్ని అర్థం చేసుకొని గౌరవించినప్పుడే దాన్ని కాపాడుకోగలం. పరస్పరం గౌరవించుకోవడం ద్వారా మాత్రమే భిన్న భాషల మధ్య మాండలికాల మధ్య వున్న సంబంధ బాంధవ్యాల్ని నిలుపుకోగలం.
అయితే ఆధిపత్య రాజకీయాలు భాషా వైవిధ్యాన్ని సహించవు. జాతీయ వాదం ముసుగులోనో సమైక్యత పేరనో వొకే దేశం వొకే జాతి వొకే సంస్కృతి లాగే వొకే భాష నినాదాన్ని ముందుకు తెస్తాయి. భిన్న నాడుల భిన్న నుడుల సమాజాన్ని తమ నియంత్రణలో వుంచుకోడానికి చేసే ప్రయత్నంలో భాగమే అది. భిన్న కాలాల్లో పాలనావసరాల కోసం యేర్పడ్డ రాజభాష అధికార స్వరాన్ని సంతరించుకొంటుంది. ప్రజల నాలుకల్ని కత్తిరిస్తుంది. గొంతుల్ని నులుముతుంది. అందుకు వూతమిచ్చే తమవైన భాషా సాహిత్య వ్యవస్థల్ని రూపొందించుకొంటుంది. తమ వర్గానికి చెందిన వ్యక్తుల్ని వాటికి అధినాయకుల్ని చేస్తుంది. ఆ వ్యవస్థలు సహజంగానే పాలకుల పలుకులే పలుకుతాయి. వారికే భావదాస్యం చేస్తాయి. కానీ తమ పరిధిలో అధికార కేంద్రాలుగా రూపొందుతాయి. నచ్చని మాటల్ని అణచివేస్తాయి. భిన్న స్వరాలకి తావులేకుండా చేస్తాయి. భాషా వ్యవహర్తల సమూహాల మధ్య అంతర్గత వైరుధ్యాల్ని సృష్టిస్తాయి. వెరసి అంతిమంగా ప్రజా వ్యతిరేకతని యెదుర్కొంటాయి. అటువంటి సందర్భాల్లో వొక కాళోజీ పుట్టుకొస్తాడు. జనం గుండె చప్పుడుని భాష చేసి వినిపిస్తాడు. మహాయోద్ధగా నిబద్ధతతో నిలబడతాడు.
కాళోజీ భాషని కూడా యుద్ధ క్షేత్రం చేసుకొన్నాడు. అస్తిత్వ ప్రకటనకి ఆయుధం చేసుకొన్నాడు. ప్రజల ఆకాంక్షకి ప్రతీకగా స్వీకరించాడు. అందుకే అచ్చమైన ప్రజాకవి అయ్యాడు. ‘అక్షరాల జీవనది’ అయ్యాడు. తెలంగాణా లూయీ ఆరగాన్ అని ప్రశంసలు పొందాడు. ప్రజా భాషా మాధ్యమంగా తనకంటూ ప్రత్యేక కవితా రూపాన్ని నిర్మించుకొన్నాడు. ఉపన్యాస శైలిని రూపొందించుకొన్నాడు. ప్రామాణిక భాష పేరున వొక ప్రాంతంలోని వొక వొక వర్గానికి మాత్రమే పరిమితమైన రెండున్నర జిల్లాల భాషని తక్కిన ప్రజానీకంపై రుద్దడాన్ని తిరస్కరించాడు. బడి పలుకులు పలుకు బడులకి దూరమై పోయిననదుకు వగచాడు. అదే కొనసాగితే తెలంగాణా భాష అణగారిపోతుందని హెచ్చరించాడు. తెలుగంటే తెలంగాణా భాషేనని నిర్ధారించాడు. పాలకులు తమ ఆధిపత్య స్థాపనకి కొనసాగింపుకి భాషని వొక సాధనంగా యెలా వుపయోగించుకొంటారో బలంగా నిరూపించాడు. మన ప్రాంతం మన భాష నినాదంతో తెలంగాణా ప్రజల భాషకీ నుడికారానికీ పట్టం కట్టాలని ఆశించాడు. కవిత్వంలో భాషా రాజకీయాల్ని యింత నగ్నంగా బహిరంగం చేసిన తొలి కవి కాళోజీయే అన్న వాస్తవాన్ని జయధీర్ తిరుమల రావు తెలంగాణా భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ముందు ఆవిష్కరిస్తున్నారు.
పాలకులు పెంచి పోషించే సాహిత్య వ్యవస్థలు పై వర్గాల అభివృద్ధికి మాత్రమే తోడ్పడతాయని కాళోజీ కవితా పాఠ్యం ద్వారా రచయిత తెలియజేస్తున్నారు. కాళోజీ స్వీకరించిన కవిత్వ వస్తు రూపాలు రెండూ పాలకుల ఆధిపత్యాలపై భాషా ధిక్కార ప్రకటనలే అని ఆయన నిర్ధారించారు. ఆ రెండింటినీ ప్రజల పక్షం చేయడానికే కాళోజీ ఆజీవితం ప్రయత్నించాడని నూత్న ప్రజాస్వామిక దృక్పథంతో నిరూపించారు. తిరుమలరావు గారు చేస్తున్న యీ నిరూపణలు యివాల్టి తక్షణ అవసరాలు.
మాతృభాషల్ని వదిలేసి ప్రాథమిక స్థాయి నుంచే పసి పిల్లలపై యింగ్లీషు మాధ్యమాన్ని రుద్ది తెలుగుతో పాటు విద్యార్థుల అవగాహనా సామార్థ్యానికి సైతం సమాధి కట్టే పాలకుల భాషా దుర్విధాన వైదగ్ధ్యాన్ని యెండగట్టటానికి అవి యెంతగానో తోడ్పడతాయి. భాషావమానాల్ని యెదుర్కోడానికి పోరాడిన త్యాగులు ప్రజల పక్షం వదిలేసి పాలకులు గొడుగు కింద చేరి భోగులై కులుకుతున్నారని ఆనాడే కాళోజీ విస్తుపోయాడు. ‘పోషించువాడవని పూజించు జనుల , పీఠమెక్కినదాది పీడించుటేనా’ అని ఆ రోజు కాళోజీ వేసిన సూటి ప్రశ్నకి మళ్ళీ మళ్ళీ పదునుపెట్టాల్సిన అవసరం ప్రజలకి యెదురవుతూనే వుంది. మాటమ్మ గుడులు రాజభక్తుల స్తోత్ర పాఠాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. ‘అగాధమీ’లకు అమ్ముడుపోయిన ‘మేతావుల’ బట్టలూడదీసిన దిగంబరులు కూడా అవార్డులకోసం గుడ్డలెగేసుకొని పరుగులు పెడుతున్నారు. ప్రజా పక్షం వహించాల్సిన కవుల రచయితల యీ లొంగుబాటు వైఖరిని జయధీర్ కాళోజీ కవిత్వ పంక్తులకి అన్వయించారు. కాళోజీ స్ఫూర్తితో ప్రపంచ తెలుగు సభల్ని తెలంగాణా తెలుగు మహాసభలుగా నిర్వహించాలని డిమాండు చేస్తున్నారు. రాజాస్థానాలు జో హుకుం గాళ్ళతో దేబె గాళ్ళతో నిండిపోతున్న వైనాన్ని నిరసించడానికి కాళోజీ దగ్గర్నుంచీ జయధీర్ వరకూ యెప్పుడూ సన్నద్ధంగానే వున్నారు.
ప్ర్రామాణిక భాష దాడిలోనో మోజులోనో లో తల్లిబాసకి దూరమైన తెలంగాణా కవులు మహాంధ్ర కవుల తోకలై ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొన్నందుకు కాళోజీ యెంతో బాధపడ్డాడు. పాఠ్య పుస్తకాల్లో సమస్త వర్గాల సబ్బండ వర్ణాల భాషకి చోటు కల్పించాల్సిన అవసరం గుర్తించాడు. ఇంటి భాష బడి భాషల మధ్య దూరం పెరగడం మంచిది కాదని చుక్కా రామయ్య వంటి విద్యావేత్తలు, అమ్మ నుడి ఔన్నత్యాన్ని కవిత్వంలో శ్వాసించిన వుత్తరాంధ్రకి చెందిన ఛాయారాజ్ వంటి కవులు, మాతృ భాష లో బోధనావశ్యకత గురించి తపించే భాషోద్యమ కార్యకర్తలు , సమస్త సంపదలు సృష్టించే ప్రజల శ్రమతో ముడివడి వున్న జీవద్భాశాలోనే రచనలు చేస్తామని ఘంటాపథంగా చెప్పిన అల్లం రాజయ్య వంటి ప్రజాసాహితీ సృజనకారులు, ప్రజా దృక్పథంతో భాషని సామాజిక శాస్త్రాల వెలుగులో అధ్యయనం చేస్తున్న జయధీర్ వంటి ‘భాషావరణవేత్త’లు కాళోజీ ఆకాంక్షకీ ఆలోచనలకీ ఆశయానికీ ఆచరణకీ కొనసాగింపే. భాషా క్షేత్రంలో పోరాటం ఆగలేదు. యుద్ధం కొనసాగుతూనే వుంది.
అయితే భాషా క్షేత్రంలో రాజకీయ పోరాటం చేయాలంటే శస్త్ర ధారులం శాస్త్ర ధారులం కావాలి . అక్షర సైనికులం కావాలి. అందుకు సన్నద్ధం చేయడానికి ప్రజల భాషపై కాళోజీ ఆలోచనల్ని సరైన నూత్న దృక్కోణం నుంచి ఆవిష్కరించిన యీ పొత్తం ‘యుద్ధకవచం’ లా దోహదపడుతుందని ఆశతో …
కాళోజీ అంటే గుర్తుకు రావాసింది అతని పేరున యిచ్చే అవార్డు కాదు; వొక ఆగ్రహగీతం , వొక ప్రతిఘటన స్వరం , వొక సంధించిన అక్షరాస్త్రం కళ్ళముందు సాక్షాత్కారించాలని నమ్ముతూ….
సెప్టెంబర్ 2, 2017 – ఎ కె ప్రభాకర్
హైదరాబాద్
Leave a Reply