ప్సామవేదం – శ్రీశ్రీ – అనువాద కవిత

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు మరియు ఇందు కిరణ్ కొండూరు
****************

శ్రీరంగం శ్రీనివాసరావు ముద్దుగా అందరూ శ్రీశ్రీ అని పిలుస్తారు. ఈతని గురించి తెలియని తెలుగు వాడు ఉండడు. శ్రీశ్రీ మహాకవిగా, చలన చిత్ర కవిగా సుప్రసిద్ధుడు, ఈ నెల 30వ తేదేన శ్రీశ్రీ జన్మదినము పురస్కరించుకొని ఆయన వ్రాసిన కొన్ని కవితల గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన సాహితీ నివాళి ఇచ్చే ప్రయత్నమే నా యీ వ్యాసము.

శ్రీశ్రీ జననం ఏప్రిల్ 30, 1910న విశాఖపట్నంలో జరిగింది (కానీ కొందరు, జనవరి 2, 1910న అని అంటారు, తన ఆత్మా కధలో నేను ఎప్పుడు పుట్టానో నాకు ఖచ్చితంగా గుర్తు లేదు అంటూ కొన్ని సూచన ప్రాయంగా ఏప్రిల్ అని తెలియ చేసాడు). శ్రీశ్రీ జూన్ 15, 1983న తుదిశ్వాస విడచి, బహుశా బ్రహ్మ సభలో కవితలు చెప్పటానికి వెళ్లి పోయారేమో. తన సుదీర్ఘ జీవిత కాలంలో అనేక తెలుగు సాహితీ ప్రక్రియలలో అనగా కధలు, కధానికలు, నాటకాలు, నవలలు, కావ్యాలు, అనువాదాలు, పేరడీ రచనలు, బుర్ర కథలు, యక్షగానం ఇలా ఒకటి ఏమిటి ఎన్నో చేసారు. ఈయన వ్రాయని ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తికాదు.

ఆ వ్యాసములో శ్రీశ్రీ వ్రాసిన అనేక అనువాద కవితల్లో చాలా ప్రత్యేకతలు ఉన్న ఒక కవితను చూద్దాము. ఈ అనువాద కవితకు ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దీని మొదటి ప్రత్యేకత, ఈ కవిత యొక్క మూల రచన, 1908లో అనగా, భారత దేశ స్వాతంత్ర్యం రాక మునుపు వ్రాసినది, అలాగే శ్రీశ్రీ పుట్టాక మునుపు కొన్ని సంవత్సరాల క్రితం చేయబడినది. రేడవ ప్రత్యేకత, మూల రచనను మరి ఎవరో కాదు శ్రీ గురజాడ అప్పారావు గారు వ్రాసారు. మూడవ ప్రత్యేకత, ఈ మూల రచన గురజాడ వారు ఆంగ్ల భాషలో వ్యంగ్య ధోరణిలో (అంటే పేరడీ అన్న మాట) అప్పటి కాంగ్రెస్ వ్యవస్థ తీరు తెన్నులను ప్రశ్నిస్తూ వ్రాసారు. ఇంకో ప్రత్యేకత, శ్రీశ్రీ ఈ అనువాదమును గురజాడ వారు వ్రాసిన తరువాత షుమారు నాలుగు దశాబ్దాల తరువాత శ్రీశ్రీ 1943లో భారత దేశ స్వాతంత్ర్యం రాక పూర్వము అనువదించారు. ఇంకో ప్రత్యేకత, శ్రీశ్రీ గారు 1943లో వ్రాసినపటికీ ముద్రణ మాత్రం షుమారు 10-11 సంవత్సరముల తరువాత అంటే, నవంబరు 13, 1953న భారత దేశ స్వాతంత్ర్యం వొచ్చిన తరువాత, తెలుగు స్వతంత్రం అనే వార పత్రికలో ముద్రితమై వెలుగు చూసింది. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పటి రాజకీయ పరీస్తితులు ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేవు అని మీకు ఈ కవిత చదివితే అనిపించక మానదు.

ఈ కవిత గురించి చాలా మందికి తెలియదు. ఈ కవిత పేరు “ప్సామవేదం” పేరు చాలా వింతగా ఉంది కదూ. దీనికి ఈ పేరు పెట్టటం వెనకాల కూడా ఒక పెద్ద కారణం ఉంది అని అప్పట్లో అనుకునే వారుట. అటు సామ్యవాదము ఇటు ప్రజాస్వామ్యము కలిపి కొత్త పేరు సృష్టించారు అని కొందరు అంటే, కాదు కాదు నాలుగు వేదాలకి సమానగా కొత్త వేదమును రాజకీయాల కోసం ప్రతిపాదన చేసారు అని కొందరు అంటే, కాదు కాదు దానికి ఏరకమైన ప్రాముఖ్యత లేదు అని, ఎదో పేరు వింతగా ఉంటుంది అని అలా పెట్టారు అని కొందరు అనేవారుట. ఇలా పలు రకాలుగా చర్చల మీద చర్చలు జరిగాయిట కూడా. ఏది ఏదైనా ఈ కవిత పేరు మాత్రం “ప్సామవేదం”, అది మాత్రం ఖాయం అందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు.

ప్సామవేదం

కవిత 1:
పాడకోయ్ కవీ! కాంగ్రెస్ ఒక
భజన సమాజం మాత్రమే అనీ!
ప్రతినిధులంతా నిద్రపోయినా
భవనం కిక్కిరిసిన సత్రమే సుమీ!

కవిత 2:
కాంగ్రెస్ నిత్యం, కాంగ్రెస్ సత్యం!
స్వపరిపాలనం కాంగ్రెస్ గమ్యం!
ఆత్మ అనే దీపం వెలిగేందుకు
ఆదర్శమనే తైలం ముఖ్యం!

కవిత 3:
కాంగ్రెస్ యుద్ధం-రూల్స్ ప్రకారం
కాగిలాలతో! నామకార్థకం!
అడపా దడపా అంతః కలహం!
అయితే బిల్ కుల్ అహింసాత్మకం!

కవిత 4:
మితవాదులు నేర్పే గుణపాఠం
ఏయే యెండల కా యా గొడుగులు!
కాదని బరిదిగి తిరగ బడేవో
ద్వీపాంతరమే! లేదిక తిరుగుడు!

కవిత 5:
కావున జోరుగ కంఠశోషగా
ఉపన్యసిస్తూ నుంచుందాం!
అస్తమానమూ లాభం చూడక
రాజ భక్తితో పొంచుందాం!

ఈ కవితకు ప్రతిపదార్థం, తాత్పర్యం అవసరం లేదు అను కుంటాను. ఐతే లఘు వ్యాఖ్య తప్పనిసరిగా అవసరము. ఈ కవితల్లో ముఖ్యంగా కవి అలనాటి కాంగ్రెస్ శాఖ యొక్క పనితీరును ఎండగట్టే ప్రయత్నం చేసారు.

మొదటి కవితలో, ఓ కవీ అనవసరంగా గొంతు చించుకోకు, కాంగ్రెస్ అంటేనే ఒక భజన సంఘం అది అందులో భజన పరులకే స్థానమని ఆ సభలు అట్టి వారితో కిక్కిరిసి ఉన్నాయి అని వాపోయారు.

రెండవ కవితలో, ఉన్నత భావాలు నామమాత్రమేనని, ఆచరణ శూన్యమని, ఆత్మా అనే దీపాన్ని వెలిగించాలి అంటే మంచి ఆదర్శాలతో కూడిన తైలం ఉండాలి అని ఉద్భోధ చేసారు.

మూడవ కవితలో, కాంగ్రెస్ సభలలో అడపాదడపా అహింసాత్మక కలహాలని జెప్పు కొచ్చారు. ఈ కాలంలో చట్ట సభలలో అహింసాత్మక ధోరణి కొంచెం కష్టమే అని వేరే చప్పలా?

నాల్గవ కవితలో, మితవాదులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారని, వారికి ఒక అభిప్రాయం ఏమీ ఉండదని, గోడ మీద పిల్లి వాటం అని వ్యగ్యంగా చురకలు వేసారు. ఇక అతివాదులు మితిమీరి తిరగ బడితే, వారికి ద్వీపాంతర వాసము (అండమాన్ నికోబార్ జైలు) ఖాయం అని చెప్పారు. వాస్తవానికి ఇప్పటి పరీస్థితి దీనికే ఏమాత్రం భిన్నంగా లేదు అని మనకు తేట తెల్లం అవుతింది.

ఇక చివరగా, ఐదవ కవితలో, గొంతు అలసి సొలసి పోయేవరకు ఎంచక్కా ఉపన్యాసాలు దంచి కోడదాము, స్వలాభం కొంత విడచి, ఉన్నతమైన దేశభక్తితో మన రాజ్యాని దేశాన్ని కనిపెట్టుకొని ఉందాము. అని ముగించారు.

You Might Also Like

Leave a Reply