నీలాంబరి – నా అభిప్రాయం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
*******************

కథలు అనేకకోణాల్ని స్పృశించి ఆలోచించుకోడానికి అవకాశం ఇవ్వాలనీ, ఒక వాదాన్ని ఆశ్రయించి రాసే కథకీ, ఒక కోణాన్ని ఆవిష్కరించే కథకీ వ్యత్యాసం ఉంటుందనీ, ఎక్కడా అధికప్రసంగాలూ, అర్థరహితమైన ఉపన్యాసాలూ లేని కథలనీ, కథా వస్తువు ఎంచుకోడంలో తనకు గల అవగాహనను స్పష్టం చేయడంలొ రచయిత్రి కృతకృత్యులయ్యేరని మంచి రచయిత్రి నిడుదవోలు మాలతి గారు వ్రాసిన ముందుమాట ఆకర్షించగా ఈ ‘నీలాంబరి’ శారద కథలు అనే సంకలనం కొన్నాను. చదవడం పూర్తయ్యాక ఈ వ్యాఖ్యలు నిజమనిపించాయి కూడా. ఈ ముందుమాటలో సంకలనాల చరిత్ర గురించి కూడా కొన్ని వివరాలున్నాయి. ఏ రచన చదువుతున్నా ఆ రచన గురించిన ముందుమాటలు, రచయిత మాటలు చదవడం తప్పని సరి అలవాటు నాకు.

2013 లో రచయిత్రి శారదగారి 18 కథలతో కూర్చబడిన కథలతో వచ్చిన సంకలనమిది. వీటిలో కొన్ని గంభీరమైన అంశాలపైన, కొన్ని అమాయక వ్యక్తిత్వాలపైన, కొన్ని మారిన పరిస్థితులలోనూ మారని మనస్తత్వాలపైన, కొన్ని పరిపక్వత చెందిన అవగాహనలపైన కథలు ఉన్నాయి కాబట్టి వస్తు వైవిధ్యం కలిగి, సంకలనం విసుగు లేకుండా చదివిస్తుంది. ‘ఊయలలూగినదోయి మనసే’ అన్న మామిడికాయ పప్పు ఒక్కగానొక్క హాస్య కథ భలే నవ్వించింది. ఇది వారపత్రికలో వచ్చినపుడే చదివినదే ఐనా మళ్ళీ చదివించింది. సంకలనం శీర్షికే అయిన నీలాంబరి అమ్మ కథ. అమ్మ అందరికీ అమ్మే అయినట్టు అమ్మ కథ కూడా అందరికీ తన అమ్మ కథేనేమో , హృదయాన్ని తాకింది. ఓటమి, విషవలయం, అతిథి వంటి కథలకు శీర్షికలెంతగా నప్పాయో, ఆకాశానికి గుంజలు, నేనెవరిని వంటి శీర్షికలు కథతో సంబంధం లేకుండా ఉన్నాయనిపించేలా ఉన్నాయి. నేనెవరిని అన్న ప్రశ్న అర్థరహితం, నేను అన్నీ. అలాగే ప్రతీ వ్యక్తీ సందర్భానికి తగినట్టుగా జీవితదశల్లో ఆయా పాత్రలు పోషించవలసిందే. దీనికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అనే భేదం లేదు. నేను పోషించే పాత్రలే అవతలివారు పోషించడం లేదు కాబట్టి అన్ని బాధ్యతలూ నాకేనా అని వాపోవడంలో అర్థంలేదు. ఇక మొట్టమొదటి కథ రాగసుధారసపానము చేసి తరించినవారూ, మనకు ఆ దారి చూపినవారూ అయిన ఆ నారదమహర్షి, ఆ త్యాగరాజు గార్లకే రాగసుధారసపానము గురించి తెలియనట్టు చిత్రించిన కథ చాలా నొప్పించింది. రచయిత్రికి స్వయంగా సంగీతజ్ఞానం ఉంది కాబట్టి ఇది వ్యంగ్యరచన అనుకుందామన్నా ఆ పాత్రల చివరి మాటలను బట్టి చూస్తే అది వ్యంగ్యమనుకోటానికీ వీలులేకుండా పోయింది. నచ్చని వాటికన్నా నచ్చినవి ఎక్కువ ఉన్నాయి. రచయిత్రి గారికి అభినందనలు.

పుస్తకం వివరాలు:
నీలాంబరి
శారద కథలు
ప్రచురణ: 2013
వెల: 100 రూ.
ప్రతులకు: కినిగె.కాం

You Might Also Like

One Comment

  1. మాలతి

    విశ్లేషణ బాగుంది లక్ష్మీ దేవిగారూ. మీకూ మంచి కథలందించిన శారదగారికి మరొకమారూ అభినందనలు.

Leave a Reply