కథా కబుర్లూ కాలక్షేపమూ
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
*************
పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప్రసిద్ధి పొందినవారు, కానీ వారు ఇతర కథలను కూడా చక్కగా వ్రాయగలరని ‘పూర్వి’ కథల సంకలనం చదివినవారు తప్పకుండా ఒప్పుకుంటారు. ఈ పదహారు కథల సంకలనంలో కథా వస్తువు ఐన కుటుంబనేపథ్యంలో మనిషి మనసులోని ఒక సున్నితకోణాన్ని సుస్థాపన చేసి చెప్పగలగడంలోనూ, కథ అల్లిక లోనూ రచయిత్రి మంచి నైపుణ్యము ప్రదర్శించారు. ఇందులో ఒకటి రెండు హాస్యకథలు కూడా ఉన్నాయి. ఇక్కడి కుటుంబాలలో నిన్నమొన్నటి దాకా చెక్కుచెదరకుండా కనిపించిన ఆప్యాయతలూ, అనుబంధాలూ, కల్లాకపటం ఎఱుగని మాటతీరూ వీటన్నిటినీ యథాతథంగా విందుభోజనంగా అందించగలిగారు. ఈ కథలు చదువుతున్నప్పుడు ఇందులో ఉన్న అమ్మలూ, బామ్మలూ, పక్కింటి అత్తలూ, మేనత్త మేనమామల పిల్లలూ అంతా మన బంధువుల్లోని వారేగా అనిపించకమానదు.
ఇక కథల్లో వచ్చే వంటల సంగతా! చదువుతుంటే నోట్లో నీళ్ళూరడం ఖాయం. అంతేకాదు, వంట చేయడంలోనో, చేసినవారిని గమనించడం లోనో ఈ రచయిత్రి ఎంత శ్రద్ధగా ఉంటారో అనే విషయంలో ఏ సందేహమూ లేదు. అంత చక్కగా ఎదురుగా చూస్తూ వ్రాసినట్టే వ్రాస్తారు. ఆమాటకొస్తే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా వాళ్ళ ప్రవర్తనలోని లోపాల్నీ సహజంగా చెప్తూ కథనంలోనే ఆ యా పాత్రల పరిచయం కలగజేయడంలో సిద్ధహస్తులు.
ఇంటి నుంచి పారిపోయిన ఒక అబ్బాయి భార్యగా పూర్వి- లోకంలో లేని భర్త పట్ల, తన ప్రాంతమూ, భాషా రాని అత్తమామల పట్ల ఎటువంటి అలసత్వమూ లేని కర్తవ్యపాలన ఎలా చేసిందో చెప్పే ‘పూర్వి’ కథలో కూడా ఏ అతిశయాలకూ పోకుండా, పాత్రల వ్యక్తిత్వాలను, సాధారణ జీవనస్థితిగతులను చిత్రించి చూపించారు. బాలరాజు కథలో మనిషికి మనిషి అవసరమైనప్పుడు ఎలా తోడుగా ఉండాలో, అలా ఉన్నప్పుడు ఆ తోడునూ,ఆదరణనూ అవతలివారు ఎంత తలకెత్తుకుంటారో చెప్పడం చేస్తే, చిన్న మాటపట్టింపులతో అయినవారికి దూరం అయి, ఆ దూరాలు చేరని తీరాలుగా ఉన్నవేళ ఒక చిన్న ముందడుగు వాటిని కలిపే వంతెన ఎలా అవుతుందో చక్కటి కథనంతో సాగిన కథ ‘సుఖాంతం’ అయింది. నాకన్నిటికన్నా నచ్చిన కథ ‘పుణ్యాత్మురాలు.’ అయినవాళ్ళో దూరంవాళ్ళో వాళ్ళ ఆలోచనలనూ, అవస్థనూ అర్థం చేసుకుంటూ; ముందుకెళ్ళాలో వెనక్కి తగ్గాలో తెలియని అసందిగ్ధంలోనూ మానవసహజస్వభావం అయిన కరుణను మాత్రం పోగొట్టుకోలేని రుక్మిణీ, ఆమెను అన్నివిధాలా అర్థం చేసుకొని సహకరించే భర్త గోపాలం, మనవరాలి పెళ్ళి కోసం అగచాట్లు పడే ఆత్మాభిమానం కల నరసింహం మొదలైన పాత్రలు అన్నీ ఆకట్టుకుంటాయి.
చదువులు, ఉద్యోగాలు, సౌకర్యాలు ఈ మాయలో పడి స్త్రీపురుషులు పెళ్ళి అర్థాన్ని, పరమార్థాన్ని విడిచి యాంత్రికమైన మనస్తత్వాలతో ఉన్న నేటి తరం పెళ్ళిళ్ళను గమనిస్తున్న ఒక పెళ్ళికూతురు ‘అపర్ణ కు చల్లని దీవెన’ ఇస్తూ, నేటి వ్యవస్థ మీద వ్యాఖ్యానించి, దేనికోసం ఏది విడువడం నేర్పరితనమో చూపించారు. మనచుట్టూ ఉన్న నలుగురిలోనే మననాదుకునే దైవమూ ఉంటుందనీ, మనక్కావలసింది అవతలివాళ్ళూ, వాళ్ళకు కావలసింది మనమూ ఇచ్చిపుచ్చుకోగలగడమే సామాజిక జీవనమనీ చెప్పే ‘ఈశ్వరానుగ్రహం’ మనసుకు హత్తుకునే కథల్లో ఒకటి.
కథల్లోని మాటలూ, కథకుని మాటలూ కూడా అలవాటైన మన సమాజపు జీవనశైలికి దగ్గరగా ఉంటూ నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, కొండొకచో చురకలూ వేస్తాయి. ‘శ్రీరామచంద్రా ఈయన ఈ జన్మకి మారరు’ అనే భార్యల ఊతపదములూ, ‘చెప్పేది వినిపించుకోదు’ అనే భర్తల ఊతపదాలూ; ‘లెక్కల్లో శేషం లాగా నరసింహం మిగిలిపోయాడు’; ‘పాపం ఆవిడ కష్టాలు ఆవిడవి. ఎదుటివాళ్ళకు ఓస్ ఇంతేనా అనిపించుగాక. ఆవిడ ప్రాణానికి అది గంభీరమైన సమస్యే.’ వంటివి భలే పొందిగ్గా కథల్లో చేరిపోతుంటాయి.
ఒక నాలుగైదు కథలు సామాన్యంగా ఉన్నాయి. పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు అనే సంకలనం కూడా బాగుంటుంది. ఒక స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళినవాళ్ళకి కానుకగా ఇచ్చిన ఈ కథల సంకలనం నిజానికి ఒక తరం నాటి జ్ఞాపకాల సంకలనం. కొన్ని పనిగట్టుకొని కథ కట్టినట్టున్నా కూడా హాయిగా నవ్వుకొనే సందర్భాల కూర్పుకు ఏ మాత్రం కొదువలేదు.
‘స్మార్ట్ ఫోన్ మీద వేలువేస్తే బురదలో కాలు జారినట్టు జర్రున జారిపోతుంది’
‘మనిషి సాయం లేని చోట దాని కెలాగూ తప్పదు పాపం, మనుషులున్న చోటైనా విశ్రాంతి తీసుకోనివ్వండి’ (కారు గురించి)
‘ …….ఇవన్నీ దేవుడు మనకోసం సృష్టించిన పిండి వంటలు- అవి ఎలాగూ తినాలి’ అన్న పిల్ల మాటలకు ముందు జరిగిన కథా,
‘ఏమోమరి, మేం మాత్రం యుద్ధానికి వెళ్తున్నాం;’
‘లేదు వుత్తి తాఫీలే’
ఈమాటలన్నీ చదువుతున్నప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోకుండా పగలబడి నవ్వాల్సిందే.
ఈ కథల సంకలనాలు చదివినవారికి పొత్తూరి విజయలక్ష్మి గారు చక్కటి కథారచయిత్రి చెప్పడానికే సందేహమూ ఉండదు.
Leave a Reply