ఇమ్మడి పులకేశి – చారిత్రక నాటకం
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
********
“పండురంగడు అనే చాళుక్యసేనాని పండ్రెండు బోయకొట్టముల మీద దాడి చేసి స్వాధీనం చేసుకొని, బోయరాజ్యపు ప్రధాన కొట్టము – కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడవలె ప్రధాన పట్టణముగా బలిష్టము గావించెను. ఆదిత్య బటరునికి కొంత భూమి దానమిచ్చెను. నెల్లూరును పరశురామప్రీతి గావించెను.”
అన్నది అద్దంకిలో కనుగొనబడిన తెలుగు తొలిశాసనానికి సరళమైన నేటి తెలుగులో అనువాదం.
“మును మార్గకవిత లోకంబున వెలయగ దేశికవిత పుట్టించి తెనుంగు నిలిపిరంద్రవిషయమున జన సత్యాశ్రయుని దొట్టి చాళుక్య నృపుల్” అని నన్నెచోడుడు చాళుక్య ప్రభువులను మెచ్చుకున్నట్టుగా చెప్తారు.
ప్రసిద్ధుడైన హర్ష చక్రవర్తి దక్షిణభారతాన్ని జయించ పూనుకొని వచ్చి నర్మదానదీతీరంలో చాళ్యుక్యరాజైన ఇమ్మడి పులకేశి చేతిలో పరాజయం పొంది వెనుతిరిగినాడు. ఇంతటి హర్షుడిని జయించిన పులకేశి చరిత్ర గురించి మనలో ఎందరికో వివరంగా తెలియదు. ఎంతో పరాక్రమవంతులైన, సంక్షేమకారులైన, కళాపోషకులైన, ప్రజారంజకులైన మన పూర్వపాలకులెందరి గురించో మనకు వివరంగా తెలియదు.
ఎ సి పి శాస్త్రి గారు ఈ విషయమై కొంత పరిశోధించి సరైన వివరాలు నిర్ధారించుకొని చారిత్రక నాటకంగా వ్రాసినారు. శాసన పరిశోధకులు, చరిత్ర పరిశోధకులూ అయిన బి ఎన్ శాస్త్రి గారు, తిరుమల రామచంద్ర గారు వంటి వారి మెప్పు పొందిన ఈ నాటకం 1995 లో ఆకాశవాణిలో ప్రసారమైంది. 2013లో పుస్తకంగా వెలువడింది. ఈ నాటకాన్ని గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి గారు కన్నడలోకి “ఇమ్మడిపులకేశి” పేరుతో అనువదించారు. నాటకరంగంలో బహు ప్రసిద్ధులైన రాఘవ గారికి అంకితం ఇచ్చారు.
నాటకాలు ఎక్కువ చదవని నేను చరిత్ర మీదున్న ఆసక్తితో ఈ కన్నడ నాటకం చదివాను. ఆ ఆసక్తి ఆసాంతమూ తగ్గనివ్వని ఈ నాటక రూపకల్పన నాలుగు అంకాలు, ఇరవై ఒక్క రంగాలు(దృశ్య) గా చక్కగా అమరింది. నాటకం చదువుతుండగా చూస్తున్న అనుభూతి కలిగింది.
రెండవ పులకేశి బాల్యం నుంచి కావేరి దక్షిణప్రాంతాలను, కొంకణరాజ్యాన్ని కైవసం చేసుకొని ఉత్తరం నుంచి వచ్చిన హర్షునిపై విజయం సాధించి కూడా స్నేహహస్తం చాచినంత వరకూ కథను రమ్యంగా చిత్రించారు.
వివిధ స్థాయిల్లోని వ్యక్తుల మధ్య గంభీరమైనవి కొన్ని, స్నేహపూర్వకమైనవి కొన్ని సంభాషణలు, దృశ్య పరికల్పన, వరుస అన్నీ ఆకట్టుకొంటాయి.
తండ్రి మరణించిన పిదప బాలుడైన పులకేశికి బదులుగా సహృదయుడైన పినతండ్రి మంగళేశుడు రాజ్యభారాన్ని స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించినా, కాలక్రమంలో అతని ఆలోచనల్లొ మార్పు రావడం, ఇరుపక్షాలూ తమ తమ స్వాభిమానాన్ని వదులుకోకుండా తలపడడం, ఘర్షణ, శాంతుల మధ్య వారు ఒకరియెడ మరొకరు ప్రవర్తించిన తీరు సరైన సంభాషణల మూలంగా పాఠకుడిని ఇష్టంగా చదివిస్తుంది.
కుబ్జ విష్ణువర్ధనుడు తన పేరును అలా మార్చుకొన్న నిర్ణయము, పులకేశితో అతని సంభాషణలు, హర్షునితో పులకేశి సంభాషణలు బాగున్నాయి.
ఆనంద ప్రింటర్స్, కాచిగూడవారు ప్రచురించిన ఈ పుస్తకం అచ్చుతప్పులు లేవు గానీ 18,19 పేజీలు అటువి ఇటు అయినాయి.
చదవవలసిన నాటకం. ఎసిపి శాస్త్రిగారికీ, చంద్రశేఖరరెడ్డి గారికీ మనఃపూర్వక అభినందనలు.
ప్రతులకు –
ఎ సి పి శాస్త్రి
8-3-1105, కేశవనగర్,
హైదరాబాద్- 73
Ph. 9440308760
ను గానీ
జి సి రెడ్డి
మియాపూర్, హైదరాబాద్
Ph. 9177945559
ను గానీ సంప్రదించవచ్చు.
Leave a Reply