ఈ తరం స్వరం – ‘మాటల మడుగు’
వ్యాసకర్త: కొల్లూరి సోమ శంకర్
ప్రపంచవ్యాప్తంగా మానవుల అభివ్యక్తి వాహకాలలో కవిత్వం ఒకటి. ప్రతీ కవితకీ ఓ నిర్దేశిత పాఠకులుంటారు, లక్ష్యిత సమూహం ఉంటుంది. పాఠకులలో భావుకత్వాన్నో, భావోద్వేగాలనో రేకెత్తించడానికో మాత్రమే కవిత్వం పరిమితం కావడం లేదీనాడు. వ్యక్తులుగా, సమూహాలుగా తమకు జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా వెల్లడించే, సాహసోపేతంగా ధిక్కరించే స్వరాలుగా మారుతున్నారు ఆధునిక కవులు. కథలు, నవలలు వంటి ఇతర సాహితీ ప్రక్రియల్లో చోటు చేసుకున్నట్టే కవిత్వంలోనూ – జెండర్, అస్తిత్వం, వాదాలు – తావు కల్పించుకున్నాయి. తమ తమ మతాలు/సమూహాలలోని ఆధిపత్య ధోరణులకు అడ్డుకట్ట వేస్తూ మహిళలు అద్భుతమైన కవితలతో సాహితీరంగంలో తమదైన ముద్ర వేసారు, వేస్తున్నారు కూడా. అలాంటి బలమైన గొంతు మెర్సీ మార్గరెట్‌ది.
మెర్సీ మార్గరెట్ గత కొద్ది కాలంగా ఇంటర్నెట్‌లో చక్కని కవితలు వెలువరిస్తున్నారు. తాను వ్రాసిన కవితలను “మాటల మడుగు” పేరిట పుస్తకంగా తెచ్చారు. “మెర్సీ మార్గరెట్ అత్యాధునిక తెలుగు కవిత్వంలో జిగేల్‌మని వెలిగిన నియాన్‌లైట్” అనీ, “బాధితుల పక్షం వహించిన కవయిత్రి” అనీ అంటారు ఎండ్లూరి సుధాకర్ తమ ముందుమాటలో.
“తనలోని వొక ఆవేశాన్ని తక్షణమే చెప్పాలన్న తపన నిలవనీయనప్పుడు కవి అసలు తన లోపల సాగుతున్న అంతర్యుద్ధాన్ని ఇంకా విడమరచి చెప్పాలని ఊపిరాడనివ్వని స్థితిలో రాసిన కవితలివి” అని అంటారు ప్రముఖ కవి అఫ్సర్ ఈ పుస్తకంలోని కవితల గురించి.
మనిషి మాట్లాడడం మానేస్తున్నాడా? అంటే అవుననే అనాలి. స్పందించాల్సిన చోట స్పందించకుండా మనిషితనం కోల్పోతున్న మానవుడిని పట్టుకోవాలంటే మాటలు కావాలి. ఈ విషయంలో ఒకప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి తేడా ఉందో “మాటల మడుగు” కవితలో చెబుతారు మెర్సీ. “ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి/మాటలకు మొలకల వేళ్ళుండేవి/పచ్చగా మొలకెత్తేందుకు అవి/సారవంతమైన నేలలు వెతికేవి” అని చెబుతూ, ఇప్పుడూ మాటలున్నాయి. కాని అవన్నీ గాలికి తేలిపోయే తాలులా వరిపొట్టులే, గడ్డకట్టి మంచుశిలలై పోయాయి అని అంటారు. ఆ మాటల్ని మళ్ళీ ప్రాణమూర్తులను చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటారు.
మనిషి జీవితంలో ప్రశ్న ఎంతో ముఖ్యమైనది. ఎందుకు ఏమిటి ఎలా లాంటి ప్రశ్నలు లేకపోతే మానవ పురోగతి లేదు. ప్రతీ మనిషిలోనూ ఒక “ప్రశ్నల గది” ఉంటుందనీ, ఆ గదిలోకి వెడితే “బ్రతుక్కి – బంధానికి/ఆకలికి – ఆశకి/భవిష్యత్తుకు – చావుకు మధ్య/అంతరం తెలుస్తుందేమో…” అని అంటారు.
“వర్ణాల బేధం లేకుండా పూలన్నిటినీ హత్తుకునే/చీకటి/ఎంతటి సహృదయ/నిశ్శబ్దాన్ని గుండెల నిండా నింపుకోడానికొచ్చే వారిని/దరిచేర్చుకునే వైద్యురాలు” అంటూ చీకటికి అద్భుతమైన నిర్వచనాలిచ్చారు మెర్సీ “చీకటి దీపం” కవితలో.
“హృదయపు మెతుకు” ఈ పుస్తకంలోని చక్కటి కవితల్లో ఒకటి. భార్యల్ని నిరంతరం ఎత్తిపొడుస్తూ, వాళ్ళ స్థూలకాయాన్ని అవహేళన చేసే భర్తలు ఏం గ్రహించాలో సూచిస్తుంది ఈ కవిత. “ఈ మధ్య నీ ధ్యాసెటుంటుది?/అన్నం పలుకు పలుకుంది/పాత బియ్యమే కదా ఇంత లావెందుకున్నయని?” /అతడు చిదిమిన అన్నం మెతుకులో/ఆమె హృదయం కూడా ఉందని/అతడు చూసుకోనే లేదు”. వేదనామయమైన స్త్రీ అంతరంగాన్ని శక్తిమంతంగా వ్యక్తీకరించిన కవిత ఇది.
కవుల గురించి చెబుతూ, “అవును/కవులు కాగితాలకు ప్రాణం పోసి/ప్రతిసృష్టి చేసి/అక్షరాలై మిగులుతారు” అంటారు మెర్సీ. అద్భుతమైన భావన కదూ!
తన కల ఎప్పుడైనా ఎగిరి వస్తే దాన్ని వెళ్ళగొట్టద్దని, మీరు రాసుంచుకున్న కొన్ని అక్షరాలు దానికి తింటానికి వేయండి అని అంటారు, అలా చేస్తే, తన తోటలో కవితలు పూస్తాయని అంటారు “కాదంబరి” అనే కవితలో.
జీవించడం ఎంత కష్టమవుతోందో అవ్యక్తంగా చెప్పిన కవిత “తలాష్“. “అవసరాల అంగట్లో మనుషులు చేసే/ప్రతి మారకానికి సాక్షిగా/సంతృప్తిని మొహానకొట్టి/బ్రతుకుదెరువు సంకెళ్ళు బిగిస్తూ…” అనే ఈ పదాలలో ఎంత విస్తృతార్థం ఉందో?
“చెట్లు కూడా మనలాగే నడవగలిగితే/ ఎంత బాగుండేది?” అంటూ ఒకప్పుడు “మనిషి మనిషికో చెట్టు నేస్తం ఉండేది/ఒంటరితనానికి చిరునామాయే లేకుండేది” అంటారు “చిప్కో” కవితలో. చెట్లు కావాలి, చక్కని పర్యావరణమూ కావాలి.
అత్యంత ఆత్మీయమైన తోడుని కోల్పోయినప్పుడు “తనతోనే – నేను” అనే కవితలో “నేను లేని ప్రయాణం చేసి/ప్రమాదంలో ఒంటరిగా తను అదేదో/లోకాలకు వెళ్లి/నన్ను – “ఆనందంగా ఉండమంటే”/ఎలా ఒప్పుకోనని/ప్రాధేయపడుతున్నాను” అంటారు.
మన జీవితాలలో కృత్రిమత్వం ఎంత సాధారణమైపోతోందో “ఎక్స్‌క్లూసివ్ నవ్వులు” అనే కవితలో చెబుతారు మెర్సీ. “జేబులో కొన్ని నవ్వుల్ని వేసుకుని/ఉదయమే ఇంటి నుండి బయలుదేరుతాం” అంటారు. కాదనగలమా?
జీవితంలోని వివిధ దశలలో మనిషికి కలిగే సంవేదనలు జ్ఞాపకాలుగా మారిపోతే, వాటిని “చీకటి దండెం” మీద ఆరేసి, ఎగిరిపోకుండా హుక్కుల్ని పెడుతున్నాడట. ఎంత లోతైన అర్థముందీ కవితలో?
మార్పులో ‘పాత’బడిన మైలురాయి, గతంలో భాగమవుతుంది. ఒంటరి ప్రయాణాల్లో అడుగు కలపకపోయినా లక్ష్యం చేరమని నవ్వుతూ సాగనంపుతుందని చెబుతారు “మైలురాయి” కవితలో.
“నాది కాని ఇంకేదో లోకంలో/నన్ను నేను వెతుక్కుంటాను….. /ఉద్యోగపు జంతర్ మంతర్లో/ఏ రోజు కారోజు/బ్రతుకుపోరు గెలిచేందుకు” అంటారు “జంతర్ మంతర్” కవితలో. మనవి ఎంతగా పరాయి బ్రతుకులైపోయాయో చెబుతారు.
ఏది అవసరం? ఏది కాదు అనేది తేల్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నామని అంటారు మెర్సీ “అవసరం” కవితలో. “అవసరానికి మనిషా?/లేక మనిషి కోసం అవసరమా?” అని ప్రశ్నిస్తారు.
జీవితం కొత్త చిగుర్లు తొడగాలంటే కొన్ని సార్లు తీసివేతలు చాలా అవసరం అని చెబుతారు “మైనస్లతో మైత్రి” కవితలో. “హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచే ఊటబావులు కన్నీళ్ళు” అని అంటారు “బయోస్కోప్” కవితలో.
ఒక్కొక్కరినిగా తన కాళ్ళతో గద్దలా ‘నా‘ అనే బంధాలను తన్నుకుపోతున్న మృత్యువు చెంప పగలగొట్టాలనుకుంటారు “మరణం కనిపిస్తే” కవితలో.
“ఒక మహా నగర నిర్మాణం జరుగుతోంది… కొన్ని మెలకువల వెనుక నిద్రను త్యాగం చేసిన కళ్ళు…” లాంటి వాక్యాలు పాఠకుల్ని కదలనీయవు. లోతైన అర్థం ఉన్న కవిత “ఒక నిర్మాణం“.
తాగుబోతు భర్తలున్న మహిళల మానసిక వేదనకు అద్దం పట్టిన కవిత “సముద్రాంబర“. చదివి తీరవలసిన కవిత ఇది.
ఇది సెల్ఫీల కాలం. అయితే ఏది పడితే దానితో సెల్ఫీలు దిగకుండా, దేంతో సెల్ఫీలు తీసుకోవాలో అద్భుతంగా చెప్పారు మెర్సీ “సెల్ఫీ” కవితలో.
ఇవే కాదు, ఇంకా ఎన్నో మంచి కవితలున్నాయి ఈ పుస్తకంలో. “ఇంటికిరాని వెన్నెల”, “గాజుమనసు”, “ఉలిక్కిపడుతున్న ఊరి తలుపులు”, “అణిచివేయబడ్డానికి జయించబడ్డానికి మధ్య” వంటివి చదువరులను వెంటాడుతాయి. కవయిత్రి ఆర్తిని, ఆర్ద్రతని, వేదనని, వ్యథని వ్యక్తం చేస్తాయి.
సుప్రసిద్ధ కవి, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడి కితాబు పొందిన ఈ కవితా సంకలనం నిరాశపరచదు. ఆధునిక కవిత్వం అస్పష్టంగా ఉంటుందనే అపవాదుని ఈ పుస్తకం కొంతైనా తొలగిస్తుంది.
(“మాటల మడుగు” కవితల సంకలనం. రచన మెర్సీ మార్గరెట్. వెల రూ.100. ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలు, ఇంకా ప్రచురణకర్త వద్ద. ఇంటి. నం. 1-4-61, రంగానగర్, ముషీరాబాద్, హైదరాబాద్-500090. ఫోన్: 040-64643525)
బూర్ల వెంకటేశ్వర్లు
సోమ శంకర్ గారు మెర్సీ గారి కవిత్వాన్ని చక్కగా క్లుప్తంగా చక్కగా విశ్లేషించారు అభినందనలు…