తొలితరం మహిళా పోరాట యోధులు – చిట్టగాంగ్ విప్లవ వనితలు

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
**************
దాస్య శృంఖలాలలో మగ్గుతున్న భరత భూమిని విముక్తం చేయడానికి ఎందరో దేశభక్తులు వివిధ పద్ధతులలో ప్రయత్నించారు. కొందరు వ్యక్తిగత ప్రయత్నాలు శాంతియుతంగా చేస్తే మరికొందరు సంఘటితమై సంస్థాగత రూపంలో హింసామార్గాన్ని అనుసరించారు. ఉద్యమాలు చేపట్టారు. అయితే, మిగిలిన ఉద్యమాలకీ, సంస్ధలకీ – ఐ.ఆర్‌.ఎ. (ఇండియన్‌ రిపబ్లిక్‌ ఆర్మీ) కొంత విభిన్నం! ఎందుకంటే స్త్రీలు వ్యక్తిగత విప్లవ పోరాటాల్లో కానీ, ఒక రహస్య విప్లవ సంస్థలో పూర్తి స్ధాయి సభ్యులుగా చేరి, మగవాళ్ళతో కలిసి గెరిల్లా తరహా పోరాటాలు చేయడమనేది ‘ఇండియన్‌ రిపబ్లిక్‌ ఆర్మీ’తోనే ప్రారంభమైంది. ఒక రహస్య సంస్థలో ఆడవాళ్ళు పూర్తి స్థాయి సభ్యులుగా చేరటం, మహిళలకుండే ప్రత్యేకమైన ఇబ్బందులని అధిగమించి రహస్య స్థావరాల్లో పురుషులతో కలిసి ఉండటం, ఆయుధాలు పట్టటం, బాంబులు తయారు చేయటం, సాయుధంగా ఎలా పోరాడాలో నేర్చుకోటం, మగవాళ్ళకి నేర్పటం.. ఐ.ఆర్‌.ఎతోనే మొదలు!

అలా ఐ.ఆర్‌.ఎలో ప్రవేశించిన ఆ అమ్మాయిలు, ఉత్త కొరియర్లుగా పనికొస్తారనుకున్న ఆ అమ్మాయిలు.. నేతల అభిప్రాయాన్ని సమూలంగా మార్చేశారు! అనుమానంగానే వాళ్ళని చేర్చుకున్న నాయకులు, క్యాడర్‌.. ఆ మహిళల శక్తి, సామర్థ్యాలకి ఆశ్చర్యపోయారు. జేజేలు పలికారు. తమ జీవితాలు, తమ సంస్థ – ఈ మహిళల వల్ల మరింత సారవంతమయ్యాయని గ్రహించి గర్వపడ్డారు! అటువంటి ధీర వనితల పోరాట గాథలే “చిట్టగాంగ్ విప్లవ వనితలు“.

పింగళి చైతన్య వ్రాసిన ఈ రచనకి 2016 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.

“ఈ పుస్తకం ఒక సంస్థలో పని చేసిన కొంత మంది స్త్రీల చరిత్ర కాదు. గుప్పెడు మంది అమ్మాయిలు బరిలోకి దిగి యావత్ప్రపంచంతో మన కోసం చేసిన యుద్ధం. వివేకానందుడు కోరుకున్న ‘ఇనుప కండలు, ఉక్కు నరాలు’ ఉన్న అలాంటి పది మంది ఐ.ఆర్‌.ఎలో పని చేసిన అమ్మాయిల జీవితాన్ని అద్దంలో చందమామను చూపించినట్టు చూపించే ప్రయత్నం ఇది” అని రచయిత్రి అంటారు. వీళ్ళే కాదు ఇంకా ఎందరో స్త్రీ పురుషులు తాము నమ్మిన ఆదర్శం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారనీ, ఆ వీరుల త్యాగాన్ని గౌరవించుకునే మార్గం ఒకే ఒకటుందని; అది – వాళ్ళు చూపిన ఆదర్శాన్ని – మనం ఆచరించటమేనని అంటారు రచయిత్రి.

మగవాడు పోరాటంలో మరణిస్తే వీరుడు, ధీరుడు అని శ్లాఘించి వారి కుటుంబాలను గొప్పగా చెప్పుకునే దశ నుంచి కుటుంబాలలోని స్త్రీలు కూడా దేశం కోసం ప్రాణాలీయగలరనీ ధీర, సబలలుగా మారి దేశానికి కీర్తిప్రతిష్టలు తేగలరని నిరూపించిన ఈ విప్లవ వనితల గురించి తెలుసుకుందాం.
***

పహర్తలీ క్లబ్‌పై దాడికి నాయకత్వం వహించిన ప్రీతిలత కేవలం విప్లవ సంఘంలో పనిచేయడమే కాదు, చదువుల్లోనూ మిన్నగా ఉండేది. చిట్టగాంగ్‌లోని ప్రతిష్ఠాత్మకమైన నందన్‌ కనన్‌ విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయురాలిగా ఎంపికైన మొదటి మహిళ! ‘స్త్రీలు ఏమాత్రం పురుషుల వెనకలేరు. వాళ్ళ పక్కన నిలబడి, భుజాలు కలిపి ఎంత కష్టమైనప్పటికీ పురుషులతో సమానంగా సాహసాన్ని చేయడానికైనా సన్నద్ధంగా ఉన్నారు’ అని రాసుకుంది ప్రీతి – మరణ వాంగ్మూలం లాంటి ఓ ఉత్తరంలో.

కల్పనాదత్ – బాంబులు తయారు చేసిన మొదటి భారతీయ మహిళ. “మల్లెపూలు చుట్టటం కూడా రాదు.. నువ్వేం ఆడపిల్లవి?” అని అమ్మ అడిగితే కల్పన ఎందుకు చిలిపిగా నవ్వేదో వాళ్ళకి తరువాత తెలిసింది. సుదీర్ఘ కాలం పాటు జైలు శిక్ష అనుభంచిన కల్పన సైన్సులో డిస్టింక్షన్‌ మార్కులతో పి.జి పట్టా పొందిన విద్యావంతురాలు!!

‘ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు’ అనే సామెత తప్పని నిరూపించిన ధీర సుహాసిని గంగూలి. ఐఆర్‌ఎకి సంబంధించిన ఎన్నో రహస్యాలను తనలోనే దాచుకుని, బ్రిటీషు వారి థర్డ్ డిగ్రీ ఇంటరాగేషన్‌లో సైతం ఒక్క రహస్యాన్ని కూడా వెల్లడించకుండా హింసని భరించి, తనని హింసించిన ఆంగ్లేయుడిని కోర్టుకు లాగిన ధీశాలి.

అడుగు తీసి అడుగు వేయాలంటే డబ్బు కావాల్సిన తరుణంలో సంస్థకు నిధులు సేకరించే బాధ్యత స్వీకరించింది ఇందుమతి. ఏడు నెలలు ఇంటి గడప తొక్కకుండా చిట్టగాంగ్‌ జిల్లా మొత్తం కార్యకర్తల నియామకం కోసం, చందాల కోసం తిరిగింది! ఆమె చేసిన సాహసం తెలుసుకున్న సోదరుడు అనంత్‌సింగ్ “నీలాంటి వ్యక్తికి అన్నయ్య అయినందుకు నేను గర్వపడుతున్నాను” అని ఉత్తరం రాశాడు.

వంట గది నుండి సరాసరి బాంబుల ఫ్యాక్టరీలోకి అడుగుపెట్టిన ప్రేమలత విప్లవకారుడు కాళీ కింకర్ దే భార్య. రెండు రోజుల్లో బాంబులు తయారు చేయడం నేర్చుకున్న ప్రేమలత తన ఇంటిని విప్లవకారులకి షెల్టర్‌గా ఇచ్చింది. తన శీలంపై సమాజం మోపిన ఎన్నో నిందలను చిరునవ్వుతో మోసింది. ఐ.ఆర్‌.ఎలో పని చేస్తున్నప్పుడు ఉజ్వలంగా వెలిగిపోయే వ్యక్తిత్వాలు ఉన్న మనుషులని చూసిన ప్రేమలత బయటకు వచ్చిన తర్వాత పీనుగుల్లా బతుకుతున్న వ్యక్తులతో ఇమడలేకపోయింది. చివరికి 1935లో ఆత్మహత్య చేసుకుంది.

తన ఊర్లో గయ్యాళిగా గుర్తింపు పొందిన ఒక పేద, నిరక్షరాస్య, వితంతువు సావిత్రి. కానీ, ఉద్యమాల్లో పని చేసే కార్యకర్తలకి కూడా ఉండనంతటి నిబద్ధత, మనోధైర్యం ఉన్నాయామెకి. ఎందరో విప్లవకారులకి షెల్టర్ ఇచ్చి, తన కన్నకొడుకు జైల్లో చావుకి దగ్గరవతున్నా కూడా చలించని ధీశాలి. అరెస్టయినప్పుడు, పోలీసుల చిత్రహింసల్ని తట్టుకుందే తప్ప ఐ.ఆర్‌.ఎ నాయకుల గురించి ఒక్క ముక్క కూడ బైటపెట్టలేదు. కడుపు కోత భరించిందే కానీ పరాయి ప్రభుత్వం ముందు తల వంచలేదు!

కళ్ళ ముందు భర్తను చంపేసినా ‘అతను ద్రోహి’ అని గ్రహించి కోర్టులో సాక్ష్యం చెప్పక మౌనంగా నిలబడింది నేత్రసేన్‌ భార్య. భర్త ఎటువంటి వాడయినా సరే పడుండాలి, ప్రేమించాలనే ఆంక్షలున్న సంఘం నడుమ నిర్భయంగా నిలబడి.. ఏ భావోద్వేగానికీ, ఏ బలహీనతకీ లొంగకుండా నీతికీ, స్వేచ్ఛకి విలువ ఇచ్చిన అపురూపుమైన వ్యక్తి ‘ఆమె‘! ‘అసలు పేరు’ తెలియకపోతేనేం.. నిఖార్సయిన ‘వ్యక్తిత్వం’ అంటే ఏమిటో, ఎలా ఉండలో తెలియజేసింది ఆ మహిమాన్విత!

పరాయి ప్రభుత్వపాలనలో నిత్యం మూలుగుతూ, బాధలకి గురవుతున్నప్పుడు ఎలాగోలా బతికి ఉండటం ముఖ్యం కాదని, దాని కన్నా తమ జీవితాన్ని అర్పించే పోరాటం చేయటమే ఉత్తమమని భావించిన ధీర బీనాదాస్. ఆనాటి బెంగాల్ గవర్నర్ జాక్సన్‌పై కాల్పులు జరిపింది. జాక్సన్ తప్పించుకుంటాడు, బీనా దొరికిపోయింది. ఒక నిస్సహాయమైన 20 ఏళ్ళ ఆడపిల్ల.. ఒంటరిగా.. పోలీసుల చెరలో.. పైగా థర్డ్‌ డిగ్రీ ఇంటరాగేషన్‌. అయినా ఆమె నోటి నుండి ఒక్క ముక్క కక్కించటం వాళ్ళ తరం కాలేదు!! ఏడేళ్ళపాటు సుదీర్ఘంగా జైలు శిక్ష తర్వాత బైటకి అడుగుపెట్టింది.

బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడింది బీనాదాస్ ఒక్కర్తే కాదు, ఆమె స్వంత అక్క కళ్యాణిదాస్ కూడా. కళ్యాణి కాలేజిలో ఉండగానే విద్యార్ధినుల కోసం ‘ఛత్రీసంఘ్’ అనే సంస్థని స్థాపించింది. అది అల్లాటప్పా సంస్థ కాదు. అక్కడ అమ్మాయిలకి కత్తి తిప్పటం, కర్ర తిప్పటం కూడా నేర్పించేవారు. 1928 నుండి 1934 వరకు బెంగాల్లో ఆడపిల్లలు కూడా విప్లవ జ్వాలలు రేపగలిగారంటే దానికి ప్రధాన కారణం కల్యాణి దాస్‌! అటువంటి కల్యాణి దాస్‌ 1932 జనవరిలో ఐ.ఆర్‌.ఎకి సంబంధించిన కరపత్రాలతో పోలీసులకి పట్టుబడింది. చిత్రహింసలు పెట్టినా ఒక్క రహస్యం చెప్పించలేకపోయారామె చేత. ఐదేళ్ళు జైలు శిక్ష అనుభవించింది.

ఐఆర్‌ఎలో చేరి విప్లవ వీరుడిగా కన్నకొడుకు మరణించినా, ఆ సంస్ధ పట్ల ఎటువంటి ఆక్షేపణ లేకుండా వాళ్ళకి సాయం చేసిన ‘వీరమాత’ బినోదిని సేన్‌. కొడుకు రజత్‌సేన్‌కి మరణశిక్ష పడినా కూడా తమ ఇంట్లో విప్లవవీరులకి షెల్టర్ ఇచ్చి, బాంబులను తయారుచేయించి, దేశభక్తి నిరూపించిన గొప్ప మహిళ.
***

ఈ పుస్తకం ఎందుకు చదవాలంటే – మన దేశ చరిత్రలో కొంత భాగాన్ని మళ్ళీ తెలుసుకోడం కోసం చదవాలి. స్వాతంత్ర్యోద్యమమం ఒక ఏకీకృత రూపం సంతరించుకోకమునుపు జరిగిన పోరాటాల గురించి తెలుసుకోడానికి చదవాలి. చరిత్రలో రాజ్యం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన రాజులు రాణులు ఉన్నారు, కాని దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన మహిళల గురించి తెలుసుకోడం కోసం చదవాలి. సాయుధ పోరాటంలో ఆంగ్లేయులకి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టి పోరాడిన తొలి తరం మహిళల గురించి తెలుసుకోడానికి, అప్పటి అవిభాజ్య భారతంలో భాగమైన తూర్పు బెంగాల్ జాగ్రఫీని రేఖామాత్రంగా పరిచయం చేసుకోడానికి చదవాలి.

శత్రువు చేతిలో చిక్కినప్పుడు మాన ప్రాణాలు పోతాయని తెలిసినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసిన నారీమణుల కర్తవ్య పరాయణత గురించి తెలుసుకునేందుకు చదవాలి. స్త్రీలు బలహీనులు – వాళ్ళు పిల్లల్ని కనడానికి, సాకడానికి తప్ప మరెందుకు పనికిరారనే అపవాదుని సమూలంగా తుడిచివేయాలని కంకణం కట్టుకుని తమ ధీరత్వంతో పురుషాధిక్యతని సవాలు చేసిన పదిమంది వీరవనితలను అర్థం చేసుకోడానికి చదవాలి. అలనాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోయినా, శత్రువు వేర్వేరు రూపాలలో కబళించడానికి పొంచి ఉన్న సందర్భంగా ఆ పోరాటాల నుంచి స్ఫూర్తి పొంది మనల్ని మనం కాపాడుకోడానికి చదవాలి.

చిట్టగాంగ్ ఇప్పుడు మన దేశంలో లేదు. ఆనాడు పోరాటాలు జరిపిన వీరుల స్మారక చిహ్నాలని ఇప్పుడు అక్కడ తొలగించేస్తున్నారని రచయిత్రి వాపోతారు. భౌతికంగా నిలుపుకోలేకపోయినా, ఆ వీరుల స్మృతులను కనీసం మనసులలో అయినా నిలుపుకునేందుకు ఈ పుస్తకం చదవాలి.

ఉద్వేగాన్ని కలిగించే రచనే అయినా, భాష సరళంగా ఉంది. ఏకబిగిన పుస్తకాన్ని చదివించగల శైలి!

ఈ పుస్తకం మొదటిసారి జనహర్ష ప్రచురణలవారు ప్రచురించగా, ప్రస్తుత ప్రచురణ ఎమెస్కో బుక్స్. ప్రింట్ పుస్తకం అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలలో లభ్యం. ఈ-బుక్‌ కినిగెలో లభ్యం. వెల వంద రూపాయలు.

You Might Also Like

One Comment

  1. varaprasaad.k

    మంచి ప్రయత్నం,మరింత విపులంగా ఉంటె బావుండేది.

Leave a Reply