అంతశ్చేతనని తట్టి కుదిపే “బుచ్చిబాబు కథలు”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
***********

లబ్దప్రతిష్ఠులైన అలనాటి రచయితల కథలను నేటి తరానికి పరిచయం చేస్తూ కథానికా ఉద్యమం చేపట్టి “ఈ తరం కోసం కథా స్రవంతి” పేరిట కథాసంపుటాలు వెలువరిస్తున్నారు అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా వారు. ఈ క్రమంలో భాగంగా “బుచ్చిబాబు కథలు” అనే పుస్తకాన్ని జూన్ 2015లో ప్రచురించారు.

తెలుగులోని గొప్ప కథకుల్లో ఒకరైన బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఇతివృత్తాన్ని చక్కని కథగా మలిచేందుకు యుక్తమైన రచనా విధానం ఎంచుకోవడంలో బుచ్చిబాబుగారిది ప్రత్యేకమార్గమని, ఆయన కథల్లో సూక్ష్మమైన ఇతివృత్తానికి స్పష్టమైన, క్లుప్తమైన రూపకల్పన జరుగుతుందని ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన విహారిగారు అభిప్రాయపడ్డారు. సౌందర్యాన్వేషిగా పేరుగాంచిన బుచ్చిబాబు – తెలుగు కథా రచనలో చైతన్యస్రవంతి ప్రక్రియని తొలిసారిగా ప్రవేశపెట్టారు. వీరి ఆలోచనా మార్గం పాఠకులకు ఉన్నతంగా ఉంటుంది. ఈ పుస్తకంలో పది కథలున్నాయి. వాటిని పరిచయం చేసుకుందాం.
***

నన్ను గురించి కథ వ్రాయవూ?” అనే కథలో తన గురించి కథ రాయమని రచయితని అడుగుతుంది కుముదం. “నీలో ఏముందని నిన్ను గురించి కథ వ్రాయనూ?” అంటాడతను. ఆమెకి చదువు లేదు, సంగీతం రాదు, ఆమెది ప్రేమ విహావం కూడా కాదు, ధనవంతురాలు కాదు, మరీ పేదది కాదు, పద్యాలు రాద్దామంటే అందగత్తె కాదు, అలా అని అనాకారీ కాదు. సాధారణమైన వాళ్ళ గురించి రాయడానికి ఏముంటుందని అనుకుంటాడు. కాని ఆమెతో సంభాషిస్తున్నకొద్దీ తాను అనుకున్నంత అమాయకురాలు కాదమె అని అర్థం చేసుకుంటాడు. ఆరు గంటల పరిచయంతో, ఆరు వందల మాటలతో తన ప్రపంచాన్నే తలక్రిందులు చేసిందని గ్రహిస్తాడు.

జీవితాన్ని సినిమాలతో పోల్చుకుని తరచూ అసంతృప్తికి లోనవుతుంటాడు రాజారావు. అతనో చిరుద్యోగి. ఏవో చిరాకులు. అందరి మీదా కోపం. ఓ రోజు ఒక ఆలయం సమీపంలోని వంతెనపై కూర్చుని వచ్చేపోయేవాళ్ళని చూస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఓ స్త్రీ నీడ గోచరిస్తుంది. ఆ నీడ ద్వారా ఆమె చాలా అందమైనదని గ్రహిస్తాడు. ఆమెని చూడాలని తపిస్తాడు. కనబడదు. ఆ ఆలయానికి మళ్ళీ మళ్ళీ వెడుతూ ఆమె నీడ కనిపిస్తుందేమోనని ఆశగా వెదుకుతాడు. ఉన్న ఉద్యోగం పోతుంది. నీడ కోసం, ఉద్యోగం కోసం అతని అన్వేషణ కొనసాగుతుంది. ఆ నీడ ఎవరిదో అతను తెలుసుకున్నాడా? అతనికి మరో ఉద్యోగం దొరికిందా? ఈ ప్రశ్నలకి జవాబులు “ఆమె నీడ” కథలో లభిస్తాయి.

జీవితంలో ప్రేమ లోపిస్తే, భాగస్వామిపై విశ్వాసం సన్నిగిల్లితే ఎటువంటి అపోహలు, అనుమానాలు తలెత్తుతాయో, ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తామో తెలియజెప్పే కథ “కాగితం ముక్కలు, గాజు పెంకులు“. ఒకనాటి ప్రేమని తిరిగి పొందేందుకు భార్య నుంచి ప్రేయసిగా మారాలనుకున్న ఆమె హృదయం మరోసారి బద్ధలవుతుంది. ప్రేమికుడు భర్తగా మారాకా అతనిలో సున్నితత్వం నశించి, పరాయివాడిగా మారిన వైనాన్ని కళ్ళకు కడుతుందీ కథ.

వెనుక చూపు – ముందు నడక” కథలో ఓ రైలు ప్రయాణాన్ని వివరిస్తూ, రకరకాల ప్రయాణీకుల మనస్తత్వాల్నీ, ప్రవర్తననీ, సాటి మనుషుల హోదాని బట్టి స్పందించే విధానాన్ని రచయిత చక్కగా వర్ణిస్తారు. “మనసు చిత్రమైనది. మన ప్రవర్తన, నమ్మకాలను సమర్థించుకునేందుకు ఎన్నో కారణాలను వెదికి పెడుతుంది” అంటారు.

తనకి వయసొచ్చేస్తోందనీ, ముసలివాడినవుతున్నాననీ భయపడుతూంటాడు రామ్మూర్తి. ఇప్పటికే ముగ్గురు మగపిల్లలు! పైగా భార్య మళ్ళీ కడుపుతో ఉంది! జీవితం అంధకారమయంగా గోచరిస్తున్న వేళ అతడిపై ఆపేక్ష కనబరుస్తూ, ప్రేమా కురిపిస్తూ ఓ ఉత్తరం వస్తుంది. అలాంటివే ఒకదాని తర్వాత మరొకటి ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. ‘ప్రియభారతి’ పేరిట వస్తున్న ఆ ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు? ఆ ప్రియభారతి ఎవరో అతని భార్య కనిపెట్టగలిగిందా? జీవితంలోని నిరుత్సాహాన్నీ, నిరాసక్తతని పారద్రోలేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి కథ “తనను గురించిన నిజం“.

రైలు ప్రయాణం చేస్తున్న కథకుడు ప్లాట్‌ఫారం మీద నిల్చుని వచ్చేపోయే జనాలను, అక్కడి ముష్టివాళ్ళను చూస్తూంటాడు. సమాజంలో ముష్టివాళ్ళు కొందరైనా ఉండాలని అనుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ వల్ల ఏ ఉపకారమూ జరగకపోయినా – ఇతరులు తమ ఆధిక్యతని ప్రదర్శించేందుకు ముష్టివాళ్ళు తోడ్పడుతారని భావిస్తాడు. ముష్టివాడు నమస్కారం పెడితే మనం ప్రతి నమస్కారం చేయనక్కర్లేదనీ; దైవం గురించి పట్టించుకోని జనాల్లో కాస్తో కూస్తో ఆధ్యాత్మిక చింతనని అలవర్చేది బిచ్చగాళ్ళేనని అనుకుంటాడు “ముష్టినిజం” కథలోని ప్రధాన పాత్ర.

బయటకి కనపడడం ఇష్టం లేని ఓ యువకవిని విపరీతంగా అభిమానించిన ఓ ఇల్లాలు భర్త అనుమానానికి గురైన వైనం “అగోచరుడు” కథ తెలుపుతుంది. అవాంతరం అనే కలం పేరున్న కవి తన కవితలతో సుప్రసిద్ధుడైనప్పటికీ, జీవించడం చేతకాక భరించలేని అంతర్వేదనతో ఆత్మహత్య చేసుకుంటాడు. తమ జీవనవిధానంపై స్పష్టత లేని ఎందరో వ్యక్తులకు ప్రతిబింబం “అవాంతరం” పాత్ర.

ఓ దట్టమైన అడవిలో పనిచేసే రవికుమార్ అనే ఉద్యోగి ఉత్తరాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. చంద్రశేఖరం అనే తోటి ఉద్యోగికి బోలెడు ఉత్తరాలు వస్తూంటాయి. తనకి ఉత్తరాలు రానందుకు బాధపడుతుంటాడు రవికుమార్. అతను సరదాగా చంద్రశేఖరంతో కాసిన పందానికి ఎటువంటి పర్యవసానం ఎదురైంది? ఈ కథని సోమర్‌సెట్ మామ్ రాస్తే ఎలా ఉంటుందో అనుకుంటాడు కథకుడు. “మామ్ వ్రాయని కథ” ఆసక్తిగా చదివిస్తుంది.

ఉదాత్త ఆశయాల కోసం పనిచేసేవారు కర్తవ్య నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో ప్రేమ కారణంగా ఆదమరిస్తే – దాని పరిణామం దుఃఖదాయకమని చెబుతుంది “ఇక్కడ దీపం ఆరితే లోకం అంతా చీకటే” కథ. ఏకాంతంగా ఓ మూల కూర్చుని తాను సాగించే ఆలోచనకీ, అనే మాటలకీ, చేసే చేష్టకీ ప్రపంచాన్ని కలవరపరిచేంత ప్రభావం ఉందంటే – తను తన వ్యక్తిత్వం పట్లా, ప్రవర్తన పట్లా ఎంత జాగ్రత్తగా ఉండాలో గ్రహిస్తాడు కథకుడు.

బాల్యంలో కలసి మెలసి తిరిగిన మిత్రుడు, పెళ్ళయి పిల్లల్ని కన్నాక తారసపడితే, ఓ ఇల్లాలి స్పందన ఎలా ఉంటుంది? పద్మరాజు అనే బాల్యమిత్రుడ్ని వెతుకుతూ, అతని గురించి ఏ చిన్న వార్త తెలిసినా సంతోషపడుతూ, అతను ఎప్పటికైనా తనని కలుస్తాడని అనుకుంటూ ఉంటుంది సుందరం. ఒకరోజు ‘మీ చిన్ననాటి స్నేహితుడు దొరికాడు’ అంటూ ఓ వ్యక్తిని ఇంటికి తీసుకువస్తాడామె భర్త. అతన్ని చూడగానే ఆమెకి నవ్వాగదు. ఆమె ప్రవర్తనకి భర్త ఎలా స్పందించాడో తెలుసుకోవాలంటే “4711 టాస్కా” కథ చదవాలి. పరిమళభరితమైన అత్తరు లాంటి కథ ఇది.
***
ఈ కథలలోని అన్ని పాత్రలూ, అత్యంత సహజంగా ప్రవర్తిస్తాయి. సమాజంలోని మనుషులనూ, వారి సహజ లక్షణాలను ప్రతిబింబిస్తాయి ఈ కథలు. పాఠకుల మనసులలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించి, ఆలోచనలను కలిగిస్తాయి.

కొన్ని కొన్ని కథలలో రచయిత ఆయా పాత్రల ద్వారా వెల్లడిచేసిన అభిప్రాయాలను చదివాకా, ఇప్పటికీ సమాజంలో పెద్దగా మార్పురాలేదు, అవి ఇప్పటికీ వర్తిస్తాయని అనిపిస్తుంది. ఉదాహరణకి ఈ వాక్యాలు చదవండి:

“నిజంగా రెండో తరగతి పెట్టెలో ప్రజాస్వామ్యం తన స్వరూపాన్ని అద్దంలో మాదిరి చూసుకోవడమే కాకుండా, తన తత్వానికి వ్యాఖ్యానాలు కూడా సమకూరుస్తుంది.” (వెనక చూపు – ముందు నడక)

“మనిషికీ మనిషికీ మధ్యలోనే కాదు గోడలుండడం. ప్రతి మనిషిలోనూ ఒక పల్చటి తెర ఉంటుంది. ఆ తెర ఊడిపోకుండా సంఘం కాపలా కాస్తుంటుంది. కాని రాత్రి ఎప్పుడో – మండు వేసంగి రాత్రి మైమరిచి నిద్ర పోతుంటేనో, వాన చినుకులు పడి భూమి పొంగినప్పుడో – ఎప్పుడో ఎందుకో తెర విడిపోతుంది నిజస్వరూపం భయంకరంగా కనబడుతుంది. విసుక్కుంటుంది, తిడుతుంది; కొడుతుంది కూడా.” (తనను గురించిన నిజం)

“ప్రజాస్వామ్యంలో ప్రబలేవి గుంపులు. ఆ గుంపులో కలిసిపోవాలి.” (ముష్టినిజం)

“విశాల భారత దేశంలో వున్న పేచీయే అది. దూరం…. ఎవరి గొడవ వారిది… రాబడి పెరిగి, చదువులు ప్రబలి, కుటుంబాలు విచ్ఛిన్నం అవడం ప్రారంభించాక, ఎవరికి వారే యమునాతీరే అయిపోత్తూంది సామాజిక జీవనం.” (మామ్ వ్రాయని కథ)

“అంతా డబ్బూ, హోదాలో వుంది జగత్తు. మానసిక సౌందర్యం, బాహ్య సౌందర్యం, సౌకుమార్యం, మానవత్వపు భవనానికి పునాదైన వ్యక్తిగత ప్రేమా, ఆప్యాయతా, నిజాయితీ, వాటి జోలి ఎవరిక్కావాలి?” (మామ్ వ్రాయని కథ)
***
“ఒక చిన్న సంఘటనో, సన్నివేశమో ఆధారం చేసుకుని – జీవితమంత విశాలమైన మనిషి అంతరంగంలోని ఒక పార్శ్వాన్ని – ఎంత శక్తిమంతమైన కథగా మలచవచ్చునో నిరూపిస్తాయి బుచ్చిబాబు కథలు” అన్న విహారి గారి మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి ఈ కథలు చదివాకా.

120 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 50/- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ వారి అన్ని కేంద్రాలలోనూ ఈ పుస్తకం లభిస్తుంది. http://www.anandbooks.com నుంచి ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు.

You Might Also Like

One Comment

  1. varaprasaad.k

    శంకర్ గార్కి ధన్యవాదాలు,బుచ్చిబాబు గార్ని మరలా గుర్తు చేసినందుకు.అయన శైలి ,కథను నడిపించే తీరు అమోఘం.ఎవరికి అందని విధంగా సున్నితంగా,సులభంగా మొదటినుండి చివరి వరకు ఒకే బిగితో రాయటం ఆయనకే సాధ్యం.వారి భార్య శివరాజు సుబ్బలష్మి గారు,బోయ హైమావతి గారు ఇప్పటికి వారి భర్తల కధలను గుర్తు చేస్తూ అపుడపుడు సాహితి సమ్మేళనాలలో కనిపించి వారిని గుర్తు చేస్తున్నారు.

Leave a Reply