మహాభారత ప్రమదావలోకనం
వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు
(ఈ వ్యాసం డా.ప్రభల (నముడూరి) జానకిగారు ఇటీవల జూన్ నెలాఖరున ప్రకటించిన ‘మహాభారత ప్రమదావలోకనం’ గ్రంథానికి పరిచాయికగా ఏల్చూరి మురళీధరరావు గారు వ్రాసిన పీఠిక. దీన్ని పుస్తకం.నెట్ కు పంపినందుకు మురళీధరరావు గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*****************
శ్రీదములై, కవిత్వరసరీతులకున్ దొలిబీజమూర్తులై,
వేదపుఁ గ్రొంజివుళ్లు ప్రభవించిన దివ్యమహశ్శరీరమ
ర్యాదను స్వీకరించిన మహాత్ము, లాంధ్రకవిత్రయంబు వి
ద్యాదయితుల్, ప్రసన్నకవితాత్ములు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్.
శ్రీశ్రీశ్రీ అద్వయానందస్వామివరేణ్యులుగా తురీయాశ్రమస్వీకారం చేసిన మహాకవి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు కవిత్రయరూపశారదావతారమూర్తులైన నన్నయ తిక్కన ఎర్రాప్రగడలను ఉద్దేశించి చేసిన ప్రార్థనమిది. ఆ మహాత్ములు మహాభారతాంధ్రతాత్పర్యప్రవక్తలు. పారాశర్యమహర్షిప్రోక్తమైన పంచమవేదసారాన్ని ఆంధ్రజాతికి హస్తామలకంగా అనుగ్రహించిన పుణ్యధనులు. ఉపనిషత్తులు ప్రపంచించిన భారతీయధర్మాన్ని భారత కథావ్యక్తులైన వివిధపాత్రల మనోధర్మముఖంగా ఆవిష్కరించి, “ఎ, వ్వలనఁ గలుగు ధర్మం బ, వ్వలనికి జయమంగళము లవశ్యముఁ గలుగున్” అని ప్రబోధించిన వైయాసికీభావప్రదీపకులు. ఆ మహనీయుల రచన ధర్మసంహిత. ఇతిహాస సముదాయం. కర్మఫలసంబంధములైన ఆగమికార్థాలను ఆగామికార్థాలతో మేళవించి, ప్రత్యక్షపరిదృశ్యమానం చేయటమే ఆ ఇతిహాసలక్ష్యమని నాట్యశాస్త్రవ్యాఖ్యలో అభినవగుప్తపాదుల వారన్నారు. కవిత్రయం వారు ఆంధ్రీకరణకు స్వీకరించిన భారతచరిత్ర అటువంటిది. ఆగమోక్తాలైన ధర్మకర్మముల అనుష్ఠానం వల్ల, అననుష్ఠానం వల్ల కలిగే ఫలాలను ప్రత్యక్షంగా నిరూపించటానికే వ్యాసమహర్షి జ్ఞానమూలకమైన భారతకథను ఇతివృత్తంగా స్వీకరించాడు. ఆ వస్తుపరమార్థంగా ఆయన ఉద్దేశించినది ధర్మధ్వని అని పెద్దలంటున్నారు. ఉపదేశకావ్యంగా ఉద్గీతమైనది కాబట్టి ఆయన దీనిని మానవజీవితానికి దర్పణోపమంగా రూపొందించాడు. అది హృద్యము, అపూర్వము, ఎరుకను సమగ్రం చేసేది కావాలని ఆయన అనుకోవటమే అందుకు కారణం. లోకంలో ధర్మము – అధర్మము అనే రెండు మహాశక్తులకు ఎప్పటికప్పుడు కలుగుతుండే సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన మానవజాతి మనుగడకు ముప్పువాటిల్లే సంఘటనలను సమీక్షించటమే మహాభారతతాత్పర్యం. సంఘర్షణకు దారితీసే పరిస్థితులు, సంఘర్షణ, దాని పరిణామం అన్నదే మహాభారతజీవితసారాంశం. అందుకు ఆయన తన మునుపు మూడు తరాల కాలంనాటి పరిణామాలను, తనకు తర్వాత అయిదు తరాల వారి జీవితాలను పరిశీలించాడు. జీవప్రజ్ఞలో పరమేశ్వరునియొక్క ప్రభావం వల్ల, కర్తృత్వమహిమ వల్ల రాగద్వేషాలు ప్రవర్తిల్లటాన్ని ఆయన ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క తీరున ఆవిష్కరించాడు. మానవప్రకృతిలోని అంతర్బహిస్తత్త్వాలను మూలమట్టంగా పరిశీలించి, సమస్తజనులకు తాదాత్మ్యయోగ్యాలైన సన్నివేశాలను సమర్థంగా ఉపకల్పించి, స్మరణీయమైన ఆ విశిష్టగాథను స్త్రీపురుషమనోవిజ్ఞానసర్వస్వంగా తీర్చిదిద్దాడు. అందువల్లనే భారతపాఠకులు తమతమ స్వభావాలను అనుసరించి అందులోని పాత్రలను అభిమానించటం, అపమానించటం జరుగుతున్నది. అటువంటి పాత్రస్వభావవైవిధ్యవిలసితమైన ప్రవృత్తియజ్ఞచిత్రణకు ప్రపంచసాహిత్యంలో ఇదే మొదలు. అందుకనే,
“శైలిని, వృత్తమున, నగా
ధాలోచనలన్, మహాద్భుతాఖిలవిధ పా
త్రాళి ప్రదర్శనంబున
భూలోకమునందు మొదటి పుస్తక మగుటన్”.
భారతం జగజ్జేగీయమానం అయిందని ‘భారతప్రశంస’లో కట్టమంచి రామలింగారెడ్డి గారు వ్రాశారు. అటువంటి “మహాద్భుతాఖిలవిధపాత్రాళి”లోని ప్రకృతిపాత్రల చైత్యచోదనకు సమీక్షితంగా డా. ప్రభల (నముడూరి) జానకి గారు అపూర్వమైన ఈ ‘మహాభారత ప్రమదావలోకనం’ గ్రంథాన్ని వినిర్మించారు. ద్వాపరయుగాంతంలో మహిళానుభవాలలో ఏర్పడిన ధార్మికపరిణామాలను పురస్కరించికొని వర్తమానకాలంలో మహాభారతముయొక్క అనువర్తనీయతను విశ్లేషించారు. “India in every generation has produced millions of women who never found fame but whose daily existence has helped to civilize the race and whose warmth of heart, self-sacrificing zeal, unassuming loyalty and strength in suffering when subjected to trials of extreme severity, are among the glories of this ancient race” అని రాధాకృష్ణ పండితులు Religion and Societyలో అన్నట్లుగా వెలసిన భారత కథలోని భారతీయ మహిళ వ్యక్తిత్వాన్ని, ఆత్మీయతను అపురూపమైన తర్కసంగతితో, చిక్కణమైన కథనకౌశలితో నిరర్గళస్రవంతీప్రవాహతుల్యమైన శైలిలో బహుముఖాల ఆవిష్కరించారు.
రామాయణాన్ని సీతాయనంగా అభివర్ణిస్తూ వాల్మీకి “సీతాయా శ్చరితం మహత్” అన్న ప్రతిజ్ఞావాక్యాన్ని ముందుంచుకొని జానకి గారు మహాభారతాన్నికూడా మహిళానుభవసంపుటిగానే పరిశీలించారు. ఆ మహిళలలో ముమ్మొదటిగా పేర్కొనవలసిన పాత్ర సత్యవతి. “కర్ణు నౌఁదలనె భారతసంహిత నిల్చు చాడ్పునన్” అని అంటారు గాని, మహాభారతమంతా నిజానికి సత్యవతి పాత్రను పురస్కరించుకొనే నడిచింది. ఆమె వృత్తాంతాన్ని జానకి గారు తొమ్మిది పుటలలో (32-40) వివరించారు. “అహల్యా ద్రౌపదీ కుంతీ తారా మండోదరీ తథా, పంచకన్యా స్స్మరేన్నిత్యం మహాపాతకనాశనమ్” అన్న పట్టికలో మండోదరి స్థానంలో ఉండవలసిన పాత్ర ఆమె. మత్స్యగంధిగా చేపకడుపులో అసాధారణమైన పుట్టుక అలోకసామాన్యమైన ఆమె జీవితానికి పరిచాయికగా అమరింది. మహాభారతకాలం నాటి మహిళ సర్వతంత్రస్వతంత్రతకు ప్రతీక ఆమె. జానకి గారు కథాపూర్వకాలం నాటి మత్స్యగంధి పాత్రను మొదట వివరించి, ఆ తర్వాత కథాస్థగితురాలైన సత్యవతిని రెండవ పాత్రగా నిరూపించారు. పరాశరుని నుంచి కన్యకావ్రతానికి విరోధం లేని సంగమాన్ని పొంది వ్యాసునికి తల్లి కావటం, ఆ తర్వాత దాశరాజపుత్రిగా కొత్తజీవితాన్ని ప్రారంభించటం ఆమె స్వతంత్ర నిర్భీకవ్యక్తిత్వానికి నిరూపణలు. శంతనునికి కలుగబోయే తన కుమార్తె సంతతి మాత్రమే రాచరికాన్ని చేపట్టాలన్న ఆమె తండ్రి కోరికే భీష్మప్రతిజ్ఞకు ప్రాతిపదికమై, తదనంతరం కౌరవపాండవుల దాయభాగసమస్యకు మూలం అయింది. చిత్రాంగద విచిత్రవీర్యుల మరణానంతరం మళ్ళీ భీష్ముని పిలిచి, పుత్రవధువులతో సంగమించమని ఆదేశించేందుకు ఆమె వెనుకాడలేదు. భీష్ముడందుకు నిరాకరించిన తర్వాత వంశక్షయం కారాదని తన తొలినాటి కొడుకును ఆహ్వానిస్తుంది. ధర్మవిరుద్ధమని వ్యాసుడు ఎంతచెప్పినా వినక నియోగపద్ధతిలో కోడళ్ళను పుత్త్రవతులను కావించి కురువంశాన్ని యథాతథంగా కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. “వ్యభిచారోద్భవులైన అటువంటి సంతానం వల్ల లోకానికి ఏమి ఒనగూడుతుం” దని వ్యాసుడు నిర్వేదం చెందుతాడు. సత్యవతి ఈ చర్యలన్నీ మహాభారతకథలోని అంతఃసంఘర్షణకు మూలం అయ్యాయి. ఆస్తికులు కావటం వల్ల జానకి గారు ఈమె జీవితచిత్రణను వ్యతిరేకలక్షణతో గాక సాంప్రదాయికదృష్టికోణం నుంచి పరిశీలించి, మొత్తానికి “కార్యసాధకురాలిగా” సూచించి విడిచివేశారు. ఇదే దృష్టితో గంగాదేవి, అంబ, అంబిక, అంబాలిక, గాంధారి, కుంతి, మాద్రి, ద్రౌపది, హిడింబ, చిత్రాంగద, ఉలూచి(పి), సుభద్ర, దుస్సల, సుధేష్ణ అన్న పధ్నాలుగు పాత్రల వ్యక్తిత్వాలను కూడా సాకల్యంగా ఆవిష్కరించారు. మహాభారతంలో స్త్రీల ఆత్మహత్యల కథనాలు లేవని సరిగానే చెప్పారు కాని, మాద్రి భర్తృమరణానంతరం సహగమనం చేసినట్లుగా 113-వ పుటలో చెప్పి, 455-వ పుటలో నన్నయ భారతాన్ని ఉదాహరించారు. మహాభారత కాలంలో సతీసహగమనాచారం లేదని, మాద్రి సహగమన వృత్తాంతశ్లోకం ప్రక్షిప్తమై ఉండవచ్చునని ఆధునిక పరిశోధకుల విశ్వాసం. వీరు ఆ వివాదాల జోలికి వెళ్ళలేదు. ద్రౌపది పాత్ర విషయంలోనూ అంతే. సాంప్రదాయికదృష్టితోనే సర్వాంగీణవిమర్శ చేశారు. 46 పుటలలో నలభై ఎనిమిది పద్యోదాహరణలతో ఆమె జీవితాన్ని తిక్కన గారు చెప్పిన “శ్రీయన గౌరి నాఁ బరఁగు” అన్న దేవీతత్త్వంగా, పాండవ విజయలక్ష్మిగా, మహాభారతయుద్ధానికి ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపములైన త్రివిధశక్తుల సమాహారంగా నిరూపించారు. మొత్తంమీద కురువంశ కులవధువులను గూర్చిన వీరి విమర్శనమంతా కథావివృతిపరంగా సాగిపోయింది.
మహాభారత ప్రమదావలోకన కథితకథంతలో పాత్రోన్మీలనకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల జానకి గారు తత్త్వకథనంలోని సాంప్రదాయికార్థాల గవేషణకు పూనుకోలేదు. మహాభారతం సజాతీయ విజాతీయ శూన్యమైన బ్రహ్మపదార్థాన్ని అనుభవగోచరం చేయగల అద్వైతదర్శనమని; గంగాదేవి మనస్సును కైవల్యపదోన్ముఖం కావించే చిద్వృత్తి అని; సత్యవతి సాధకుని పరమాత్మాన్వేషణారూప సద్వృత్తి అని; గాంధారి జీవుని అంటిపెట్టుకొని ఉన్న తమోగుణ వాసనావృత్తి అని; కుంతి సాధకునిలోని భూవిషయక సుఖవాసనాప్రవృత్తి (కుం+ధీ) అని; మాద్రి అహంకార మమకార మనోవృత్తులను నశింపజేసే ముక్తివిషయక మనోవృత్తి అని; అంబ ప్రకృతిపురుషుల ఐక్యానుసంధానకారిణి అయిన అద్వైతస్థితి అని; అంబిక, అంబాలికలు వాసనాజననహేతువులైన ప్రకృతిశక్తులని; దుస్సల సర్వనాశాన్ని కలిగించే తామసిక వృత్తి అని; హిడింబ సాధనావిఘ్నరూపమై పరాశక్తిని భంజింపజేసే అపరాశక్తులలో ఒకటని; ద్రౌపది పరమశ్రేయోరూప నిర్వృతితత్త్వమని; ఉలూపి మనస్సుయొక్క నిశ్చయాత్మిక బుద్ధి, తైజసిక సూక్ష్మదేహ ప్రకృతి అని; జ్ఞానమార్గంలో ముక్తిని సాధించేందుకు కారణమైన సద్వృత్తి చిత్రాంగద అని; అదే విధంగా జ్ఞానమార్గంలో ముక్తిని సాధించేందుకు కారణమైన మనోవృత్తి సుభద్ర అని; కోరికలను నిగ్రహించి ధిషణను సమస్థితిలో ఉంచే మనోవృత్తి సుధేష్ణ అని ఉన్న ఆ అనుభూతివిశేషాలను ఈ గ్రంథాన్ని అధ్యయన చేసిన జిజ్ఞాసువులు మరికొంత కృషిచేసి, ఆధ్యాత్మిక ప్రకరణగ్రంథాలను చదివి, కాలక్రమేణ గ్రహింపగలుగుతారు.
మహాభారతంలో తత్తత్పర్వక్రమంలో కథాక్రమవశాన వచ్చిన పాత్రలను నన్నయ స్త్రీలు, ఎఱ్ఱన స్త్రీలు, తిక్కన స్త్రీలు అని పృథక్కరించటం తృతీయాధ్యాయంలో జానకి గారు చేసిన సరికొత్త ప్రయోగం. కథావ్యక్తులైన ఆ పాత్రల ప్రవృత్తులలోని గుణదోషాలు దేశకాలపాత్రతల వల్ల, వయోఽవస్థల మూలాన, వర్ణాశ్రమస్థితి చేత, నైమిత్తికత వల్ల, ఛద్మవర్తన చ్ఛలప్రవృత్తుల వల్ల, లాక్షణికులు చెప్పిన శక్తి – సంగమ – ఉపహాస – అభిగమాదుల వల్ల ఏయే పరిణామాలను పొందాయో ఇందులో నిరూపింపబడ్డాయి. పద్దెనిమిది పర్వాలలో ప్రసక్తలైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా వారివారి జీవితసందేశాలను వినిపించటం ఇందులోని విశేషాంశం.
నిజానికి మహాభారతంలోని మహిళాజీవితాలను తత్తత్కాలీనసామాజికపరిణామాల వైమర్శికదృష్టితో వ్యాఖ్యానించటం క్రీస్తుయుగారంభం నాటికే మొదలైనట్లు కనుపిస్తుంది. సుబంధుని ‘వాసవదత్తా కథ’లో ప్రసక్తాలైన ఉషాపరిణయం, మదాలసా చరిత్ర, తపతీసంవరణోపాఖ్యానం, తారాశశాంకం, ధూమోర్ణా వృత్తాంతం, దమయంతీ కథ, మేనకాఖ్యానం, సుభద్రాపరిణయం, సౌపర్ణోపాఖ్యానం మొదలైన కావ్యాలన్నీ తత్పూర్వకాలం నాటి రచనలలోని ప్రమదాజీవితావలోకనలే అని చరిత్రవేత్తలు ఊహిస్తున్నారు. మహాకవి భాసుడు కొంత స్వతంత్రించి తనదైన లోచూపుతో భారతమహిళల జీవితానుభవాలను కాలానుగుణంగా చిత్రించటం మొదలుపెట్టాడు. మహాభారత ద్రోణపర్వంలో వ్యాసమహర్షి ధర్మరాజుతో “యతో ధర్మ స్తతో జయః” అన్న మాటను భాసుని దూతఘటోత్కచంలో గాంధారి తన మాటగా అంటుంది. భారతరచన జరిగిన మూడువేల సంవత్సరాలలో క్రమక్రమంగా ఈ పాత్రల వ్యక్తిత్వాష్కరణలు, మనోధర్మాలు మారుతూవచ్చాయని దీనివల్ల స్పష్టపడుతుంది. కురుపాండవయుద్ధంలో తన భర్త అభిమన్యుణ్ణి వధించాడని తెలియగానే దుస్సల ఉత్తర ఇంటికి వెళ్ళి పరామర్శించాలని అనుకొంటుంది. “ఏవం చ భణిష్యామి – అథ కాలికం చ తే వేషగ్రహణ మహ మ ప్యుపధారయిష్యామీతి” అంటుంది. “ఇక నేనుకూడా నీలాగే వైధవ్యవేషధారణకు తయారవుతున్నానని చెప్పివస్తాను” అని. ఇది మహాభారతంలో లేదు. మధ్యమవ్యాయోగంలో హిడింబ ఘటోత్కచునితో భీమసేనుడు “దైవతం ఖల్వస్మాకమ్, తవ చ మమ చ” అంటుంది. ఇది మహాభారతంలో లేదు. భాసుని కాలానికి ఆర్యసంస్కృతి ప్రభావం అనార్యసంస్కృతిలోనికి వచ్చి చేరుతున్నదన్నమాట. మహాభారత కాలానికి ఆ సమ్మిశ్రణలు లేవు. హిడింబ పేరు కమలపాలిక అని జానకి గారు 158-వ పుటలో చెప్పారు. తెలుగు భారతంలో ఉన్నది కాబోలు. సంస్కృతంలో లేదు. భాసుడు ఆమె కేశవదాస పుత్రిక అని చెప్పాడు. నియోగవిధిని గురించి మహాభారతంలో సత్యవతి చెప్పిన భావాలన్నీ ఆ తర్వాత మారిపోయాయని ధర్మశాస్త్రచరిత్ర చెబుతున్నది. దూతవాక్యంలో దుర్యోధనుని ప్రశ్నలన్నీ సత్యవతి నియోగ నిర్ణయసామంజస్యాన్ని ప్రశ్నించేవే. భారతకాలం నాడు లేని సందేహాలనేకం తదనంతరవేళలలో ఉప్పతిల్లాయన్నమాట. భారత కాలం నాడు స్త్రీలకుండిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, నిర్భీకత, నైతికత పట్ల గల వివిధభావాలు కాలక్రమేణ సంకుచితమౌతూ వచ్చాయి. పదిమంది ఉపాధ్యాయులకంటె ఒక ఆచార్యుడు, నూరుమంది ఆచార్యులకంటె తండ్రి, తండ్రికంటె వేయిరెట్లు తల్లి – అని మహాభారతమూ, మనుస్మృతీ (2-145) చెప్పిన స్త్రీ యొక్క మాతృత్వగౌరవం భాసుని కాలానికి వట్టి నోటిమాటగా మిగిలి, పాంచరాత్రంలో భీష్ముడు “రూపం వల్ల స్త్రీ, పరాక్రమం వల్ల మగవాడు ముఖ్యులనిపించుకొంటారు” అనేంతగా మారిపోయింది. “న గృహం గృహ మి త్యుచ్యతే, గృహిణీ గృహ ముచ్యతే” అని విరాటపర్వంలో ధర్మరాజు. భారతకాలం నాటి ధర్మం అది. మహిళపై ఆమె ప్రమేయం లేకుండా అత్యాచారం జరిగినట్లయితే ఆమెను అపరాధభావనతో చూడటం కాని, ఆమెను శిక్షించటం కాని అకార్యములని శాంతిపర్వం అంటున్నది. ఆధునికకాలంలో స్త్రీవాదులు ఎంతో ప్రబలంగా సమాజంలో హక్కుల పోరాటం జరిపిన తర్వాత గాని ఈ భావానికి దేశంలో వ్యాప్తి కలుగలేదు. ఈ యుగధర్మపరిణామాల దృష్ట్యా జానకి గారు మళ్ళీ ఒకసారి మహాభారతప్రమదావలోకనం కావించటం అవశ్యకర్తవ్యమూ, అభినందనీయమున్నూ. వర్తమాన రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతుల నైపథ్యానుసంజనతో దీని పునర్విలోకనం, పునర్వ్యాఖ్యానం అన్నవి సాహిత్యచరిత్రలో నిరంతరం సాగుతుండే ప్రక్రియలు.
ఈ గ్రంథంలోని చతుర్థాధ్యాయం జానకి గారి పరిశోధన ప్రతిభకు, బహుగ్రంథాలోకానికి, విశాలదృష్టికి, సూక్ష్మేక్షికకు, తాత్పర్యగ్రథననైపుణికి, ప్రత్నకథనానికి కరదీపికగా విలసిల్లింది. నిజానికి ఈ గ్రంథానికి సారనవనీతం ఇదే. మహాభారతంలోని మహిళా పాత్రల అనుశీలనముఖంగా ఆనాటి సామాజికాంశాల విశ్లేషణ. ఈ ప్రయత్నంలో జానకిగారు ఆంధ్ర మహాభారతంలోని 380 మంది మహిళల వ్యక్తిత్వాలను అకారాదిగా మనకు పరిచయం చేశారు. ఇన్ని విశేషాంశాలను ఒక్కచోటికి సమీకరించి, స్వకీయవ్యాఖ్యతో గుదిగుచ్చటం సామాన్యమైన విషయం కాదు. ఇందులోని పరిశోధితాంశాల చారిత్రికపరిణామక్రమాన్ని విశ్లేషింపవలసివస్తే ఇది మరొక మహాభారతం అయ్యేది. ఈ పాత్రపరిశీలనలో భారతవ్యాఖ్యాతలు, కవులు, నాటకకర్తల చిత్రీకరణలను అనుశీలించటం కూడా ఈ పరిశోధన పరిధిలోకి రాలేదు. ఆంధ్రమహాభారతాన్ని ప్రధానీకరించటం వల్ల అక్కడక్కడ మూలశ్లోకాలను ప్రమాణీకరించినా, వీరి క్రియాకల్పమంతా మహిళాజీవితసందేశాల సంపుటీకరణ పైనే కేంద్రీకృతమై తదితరాంశాలను ప్రసక్తించటం జరగలేదు. మహాభారతపాత్రల విషయమై కె.యఫ్. గెల్డ్నర్, సియెచ్.ఆర్. లేన్మెన్, స్టెన్ కొనోవ్, జి.ఎ. గ్రియర్సన్, ఎస్. సొరెన్సెన్, రామకృష్ణ గోపాల భండార్కర్, శ్రీపద కృష్ణ బేల్వాల్కర్ వంటి పరిశోధకుల అభిప్రాయభేదాలు చర్చనీయాలు కాకపోవటానికి సైతం కారణం ఇదే. సాంప్రదాయికవైమర్శికతను పాటించినందువల్ల ఆధునికకాలంలోని స్త్రీవాదుల భావజాలం వీరిని ప్రభావితం చేయలేదు. అట్లాగని వీరు ఎన్.వి. తడని గారి వంటివారి ఛాందసధోరణికీ లోనుకాలేదు. స్వతంత్రంగా తెలుగు భారతాన్ని పూర్తిగా చదివి, అందులోని మహిళల సంస్కారాన్ని, చైతన్యాన్ని చైత్యచోదనతో వివరించాలని సంకల్పించినందువల్ల ఆ దృగ్విషయాన్ని సమర్థంగా విశదీకరించి చెప్పారు. ఇంత విశాలమైన పరిధిలో ఇన్నిన్ని పాత్రల జీవితోదంతాలను వర్ణించే బృహత్ప్రయత్నం భారతీయభాషలలో ఇంతవరకు జరుగలేదనుకొంటాను. తెలుగులో మాత్రం ఇదే ఓంప్రథమం. అచిరకాలంలో ఇది విశ్వవిద్యాలయాలలో పఠనపాఠనాలకు నోచుకొని ఈ అంశాన్ని అధికరించిన విస్తృతపరిశోధన జరగటమే ఈ కృషికి సత్ఫలాన్ని ప్రసాదింపగలుగుతుంది.
డా. ప్రభల (నముడూరి) జానకి గారు అత్యున్నతవిద్యావతిగా డి.లిట్ పట్టాన్ని సాధించిన సుప్రతిష్ఠితవిదుషీమణులలో ఒకరు. భూయోగ్రంథశీలితకు తోడు నిరంతరాయితమైన పరిశోధనవ్యాసంగంతో వ్యాసకర్త్రిగా, బహుళకృతినిర్మాత్రిగా మంచి పేరెన్నిక గన్నారు. “జానకి” అంటే జనకరాజపుత్రి అనే గాక మరొక అర్థంకూడా ఉన్నది. తుపాకిలోనికి మందుగుండును ధట్టించిన తర్వాత దాని చెవిదగ్గర అగ్నిస్ఫోటనకు వాడే సాధకరజ్జువును తెలుగులో “జానకి” అంటారు. అది పరమాణువులోని విస్ఫోటకశక్తికి కీలకం అన్నమాట. ఆ విధంగానే జానకి గారు ఇతోధికగ్రంథరచనతో భాషయొక్క అర్థద్యోతకత్వాన్ని, అఖండమైన శబ్దవిశేషాన్ని స్ఫోటసిద్ధిపూర్వకంగా వ్యాపింపజేసి ఇహపరతారకమైన ఈశ్వరానుగ్రహాన్ని, శాశ్వతమైన యశస్సును పొందగలరని ఆశిస్తూ సఫలమైన ఈ ఉద్గ్రంథనిర్మితికి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
********
డా. ప్రభల (నముడూరి) జానకి వనపర్తి ఆస్థాన విద్వాంసులు నెమలూరి వేంకటశాస్త్రిగారి మనుమరాలు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్., ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి ని, బరంపురం విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్ పట్టాన్ని; నటన – నాటక దర్శకత్వాలలోనూ, జర్నలిజంలోనూ డిప్లొమాలను; కర్ణాటక సంగీతంలో సంగీతశిరోమణి, బి.ఇడి లను; వైదిక జ్యోతిషంలో ఎం.ఎ ను సాధించారు. ‘జానపద ప్రదర్శన కళలపై ఆంధ్ర మహాభాగవతప్రభావం’ అన్న అంశంపై భారత ప్రభుత్వ సంస్కృతివిభాగ సీనియర్ ఫెలోగా పరిశోధన చేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలను సమర్పించారు. పత్రికలలో పెక్కు వ్యాసాలను, ‘భక్తిపథంలో ప్రస్థానత్రయం: పోతన-రామదాసు-త్యాగరాజు’, విశ్వనాథ విషాదాంత నాటకాలు, ‘సరస్వతి నమస్తుభ్యం’ వంటి గ్రంథాలను ప్రకటించారు. ‘మహాభారత ప్రమదావలోకనం’ గ్రంథం పుటలు XXIV+441, వెల రూ.250లు.
Leave a Reply