మహాశ్వేతాదేవి మరణానికి జనసాహితి సంతాపం
రాసినవారు: దివికుమార్, నిర్మలానంద, రవిబాబు (జనసాహితి)
(ఇది జనసాహితి వారు 28 న పంపిన సంతాప సందేశం)
**********
భారతదేశం గర్వించదగిన మహారచయిత్రి మహాశ్వేతాదేవి 28 జులై 2016 మధ్యాహ్నం 3 గం. 15 నిముషాలకు కోల్కతా లోని ఆసుపత్రిలో తన 91వ ఏట కన్నుమూశారు.
బెంగాలీ నుండి ఇతర భాషల్లోకి అనువాదమైన ఆమె నవలలు, కథలు, ఇతర రచనలు భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి.
ఆమె “పీడిత జనావళి అంతరాత్మ”. ఆమె సమాజపు అట్టడుగు పొరలలో జీవించే ఆదివాసీల గురించీ, దళిత – మహిళా – సంచార జాతులు, తెగల గురించీ, కఠిన జీవిత వాస్తవాలనూ, సంఘర్షణనూ తన రచనల్లో పొందుపరిచారు.
1926 జనవరి 14న ఢాకా మహానగరంలో జన్మించిన మహాశ్వేత దేశవిభజన తరువాత శాంతినికేతన్ లో బి.ఎ., కోల్కతా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశారు. ఆమె తల్లి, తండ్రి, బాబాయి, మేనమామ, భర్త, కొడుకు అందరూ సాహిత్య సాంస్కృతిక రంగాలలో నిష్ణాతులే.
1950లో కమ్యూనిస్టు అన్న అభియోగంతో పోస్టల్ శాఖ ఉద్యోగం నుండి తొలగింపబడిన మహాశ్వేత తర్వాత కాలంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేస్తూ రచనలు సాగించారు. 1970లలో తిరిగి ఆమెను నక్సలైటుగా అనుమానిస్తూ పోలీసులు వెంటాడారు.
1956లో ఆమె రచించిన తొలి నవల “ఝాన్సీరాణి”. నక్సలైట్ ఉద్యమంపై “ఒక తల్లి”, బిర్సా ముండా పోరాటంపై “ఎవరిదీ అడవి” రాశారు. “శ్రీ శ్రీ గణేశ్ మహిమ” (‘రాకాసికోర’), “బషాయిటుడు”, “రుడాలి” మొదలైన ఆమె నవలలు, “ద్రౌపది”, “శనీచరి” వంటి అనేక కథలు తెలుగులోకి అనువాదమయ్యాయి.
ఆమె నవలలూ, కథలూ ఆధారంగా “హజార్ చౌరాసీ కీ మా” (‘ఒక తల్లి’), “రుడాలి” మొదలైన సినిమాలు విడుదలయ్యాయి.
అనేక విశిష్ట పురస్కారాలు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. సాహిత్య అకాడమీ (బెంగాలి -1979), పద్మశ్రీ (1986), జ్ఞానపీఠ్ (1996), రామన్ మెగసెసె (1997), పద్మ విభూషణ్ (2006) ఆమె పొందిన కొన్ని పురస్కారాలు. 2006లో ఆమె జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన ప్రపంచ పుస్తక మహోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
1997 మార్చి నెల “ప్రజాసాహితి” మహాశ్వేతాదేవి పై ప్రత్యేక సంచికగా వెలువరించాము. 1997 మే నెలలో జనసాహితి ప్రత్యేక ఆహ్వానంపై ముఖ్య అతిథిగా విశాఖపట్నం విచ్చేశారు. మే 7వ తేదీన విశాఖపట్నంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 73వ వర్ధంతి (ఆ సంవత్సరం ఆయన శతజయంతి కూడా) సందర్భంగా వేలాది ఆదివాసీల ఊరేగింపు, తదనంతర బహిరంగసభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మరుసటి రోజు (మే 8) విశాఖలో జనసాహితి సాహిత్య సదస్సులో సందేశమిచ్చారు. మే 9న విజయనగరం జిల్లా దుగ్గేరు ఏజన్సీలో ఆదివాసీల నడుమ అల్లూరిపై జనసాహితి ప్రచురణ “మన్యంవీరుని పోరుదారిలో”ను మహాశ్వేతాదేవి ఆవిష్కరించారు.
ఆమె చివరిక్షణాల దాకా పీడిత ప్రజల పక్షాన నిలిచి తన రచనలను, సామాజిక కార్యకలాపాలను నిర్వహించారు. ఆదివాసీ ప్రాంతాలన్నీ బహుళజాతి కంపెనీల ముట్టడిలో ఉన్న నేటి సంక్షుబిత కాలంలో మహాశ్వేతాదేవి మరణం అటు ఆదివాసీ ప్రజానీకానికీ, ఇటు ప్రగతిశీల, విప్లవ సాహిత్య శిబిరానికీ తీరని నష్టం. “సాధారణ ప్రజలే చరిత్ర సృష్టిస్తారని నేనెప్పుడూ నమ్మాను. దోపిడీ, అణిచివేతలకు గురవుతూ కూడా ఓటమిని అంగీకరించని వారే నా రచనలకు ప్రేరణ. అలాంటివారి జీవన సంఘర్షణతో నిండినవే నా రచనలన్నీ” అన్న ఒక మహారచయిత్రినీ, ఒక గొప్ప ఆత్మీయురాలిని కోల్పోయామని జనసాహితి భావిస్తూ – మహాశ్వేతాదేవి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నాము.
28-7-2016
విజయవాడ
Leave a Reply