అవ్యయ – సౌభాగ్య కుమార్ మిశ్ర
వ్యాసకర్త: వాసు
**************
(1)
సౌభాగ్య కుమార్ మిశ్ర ప్రసిద్ధ ఒడియా (ఒరియా) కవి. వేలూరి వేంకటేశ్వర రావు గారు తమ మిత్రులు ఒకరిద్దరి సహాయ సహకారాలతో సౌభాగ్య కుమార్ మిశ్ర గారి ఒడియా మూలకవితల్ని(ఓ అరవై కవితల్ని) Diacritic Englishలో Transliterate చేస్తూ తెలుగు పద్యాల్ని అనుసృజించి ఒక కొత్త Bilingual Edition తెలుగు కవితాప్రియులకు కానుకగా అందించారు. ఈ సంపుటి పేరు “అవ్యయ”. దీనిని అనువాదం అనడం కన్నా అనుసృజన అనడమే సమంజసం. అయితే సౌభాగ్య కుమార్ మిశ్ర ఎటువంటి కవి? ఈ అనుసృజనలెలా ఉన్నాయి? ఇవే నేనిప్పుడు మాట్లాడదలుచుకున్న రెండు విషయాలూ.
తనకీ తనకు అనుభూతుల్నీ జ్ఞాపకాలనూ పంచిచ్చే సన్నిహిత లోకానికీ అభేదాన్ని ప్రతిఫలించే మేలిమి తరగతి కవి మిశ్ర గారు. ఈయన భావాలు ఎంత గాఢమైనవీ సున్నితమైనవో భాష అంత సరళమైనది. ఆత్మపరిశీలన మెండుగా కలిగి బాహ్యప్రపంచపు లోతుల్ని తరిచిచూసి ఆ సారాన్ని తనదిగా చేసుకుని కవిత్వపు కాంతుల్ని వెదజల్లిన నెలవంక మిశ్ర గారు. ఈ సంపుటిలో కవితలన్నీ ఆద్యంతం మనల్ని సున్నితంగా తాకి మన కళ్ళముందు కవి గుండెని విప్పి చూపెడతాయి. సన్నిహితంగా పలకరిస్తాయి. అద్దంలో కవి తన ప్రతిబింబాన్ని చూసుకున్న తొలి కవిత మొదలుకొని చివరి Hamlet వరకూ మనమూ మిశ్ర గారితోనే ప్రయాణిస్తాం. ఆ తూర్పు సముద్ర తీరం, కటకం భువనేశ్వర్ వీధులూ తిరుగుతాం. ఆయనకి తారసపడిన వ్యక్తులూ సంఘటనలూ మనకి కూడా పరిచితమైనవే అనిపిస్తూ నవ్యానుభూతిని కలిగిస్తాయి. అంతే కాదు. మిశ్ర గారి కవిత్వంలో పాఠకుడికి కవిత్వం అర్థం చేసుకోవడంలో తలెత్తే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవడంలోనే ఆలోచనా అనుభూతీ కలిగించే గుణం కూడా ఉంది. ఇది కవి నేర్పు అని కూడా నేను నమ్ముతాను.
కొన్ని మచ్చుతునకలు:
అద్దంలో తన ప్రతిబింబం అర్ధరాత్రి చూస్కుంటూ,
“ఒకవేళ నేను బీటలు వారి ముక్కలుముక్కలై పడిపోతే
ఈ అద్దం కూడా బీటలు వారి ముక్కలుముక్కలై
నలుపక్కలా చిందరవందరై పడిపోతుందా?” అని ఒక అభేదాన్ని చూస్కుంటాడు కవి.
మళ్ళీ అవ్యయలో
“నువ్వు తరువాత వంటరిగా వెళ్ళిపోయావు
తలుపు తాళం తీశావు స్విచ్ వేసి చూశావు
కుర్చీలో కూచొని ఉన్నది నా ప్రేతాత్మ..” అంటూ అమృతతుల్యమైన జన్మనెత్తుతాడు (కవిత పూర్తిగా చదవాలి మీరు).
మనందరికీ ఇష్టమైన చిరపరిచితమైన రైల్వేస్టేషన్‌లో వీడుకోలు పలికే సందర్భాన్ని కాస్త నిందాస్తుతి అనిపించేలా
“నీ ఆకాశం నీ మంచిపేరు నీకు ఇచ్చేశాను
తీసుకొని ఫో అరుంధతీ
రోజులు, నెలలు గడిచినకొద్దీ ఈ ప్లాట్‌ఫామ్ మాత్రం కుళ్ళిపోతుంది” అంటాడు.
ఇంకో కవితా ఖండిక, ఒక జాలరి వలలో చిక్కిన “చేప ప్రార్థన” చూడండి.
“నా పెదవులు పగిలి నీళ్ళన్నీ ఎర్రబడిపోయాయి.
………………………………………..
నా చౌకబారు ఉడుపు నువ్వు తీసుకో. నాకు ఇంద్రధనుస్సు తొడుగు.
నేను నాట్యం చేస్తాను.
తెల్లటి పాలరాయిలా మెరిసిపోతున్న నీ అరచేతి ఆవరణలో”
అని తన ఆఖరి కొరిక వెలిబుచ్చుకుంటుంది.”
“ప్రథమ సంధ్యా సమయ స్వరం”లో వింతగా కవి Office లో వ్యక్తులే కాకుండా అహల్యా రాముడూ విశ్వామిత్రుడూ ప్రవేశిస్తారు. కొన్ని వాక్యాలు చూడండి. మీ భాష్యం మీరే చెప్పుకోండి.
“ఈ సంధ్య విశాల ఆకాశంలో మెరిసిపోతుంది
………………………………….
ఆహా! కఠిన కాంస్యభూమిపై తలబాదుకొని సముద్రం రోదిస్తుంది.
ఏమిటి? కాంస్యభూమి చనిపోయిందా? లేక చచ్చినట్టు నటిస్తున్నదా?
నువ్వు నేను రమానాథ్ మనందరం
పెద్ద గుమస్తా ఆఫీసులో శూలనెప్పి అని నటించినట్లు!
…………………………………..
రాయిగా మారిన అహల్య ఏ రాముడి కోసమో ఎదురుచూస్తున్నది.
రాతిలో ప్రాణం ఎక్కడ? ప్రాణం లేకుండా
ఎదురుచూడటం ఎలా సాధ్యం చెప్పు, ఓ వాల్మీకీ! ఓయీ విశ్వామిత్రా!
హే విజ్ఞానీ! ఇదేమిటో విశదంగా చెప్పు! నిరుడు నేను చూశాను,
స్టెనో అనుపమా దాస్ నా కోసం ఎంతో ఎదురు చూసింది.
ఎంత ప్రయత్నించినా తన ఉసురు నేను గుర్తించలేకపోయాను
టైప్ మెషీన్ టప్ టప్ టప్ టప్ అన్నట్టు, ఆమె గొంతులో నుంచి
మాట వెనుక మాట మాట వెనుక మాటా
ఇప్పటికీ నా చెవుల్లో రింగు మని మోగుతున్నయి
హే శ్రీరామా! హే నీలసాగరా!
బ్రతుకుబాటలో దుఃఖం తప్ప మరేమయినా మిగిలి ఉన్నదా?”
ఏమనిపిస్తోంది? పాతకొత్తల మేలుకలయికా? ఆధునికానంతర వాదాలా? Your mileage may vary!
ఇంకా Quote చెయ్యాలని ఉంది గానీ ఎక్కడో ఆగాలి కదా. మీలో ఉత్సుకతని పెంపొందించి మీచేత చదివింపజేయాలి కదా.
(2)
ఈ పుస్తకంలో ఒడియా మూల కవితల్ని Transliterate చేసి అచ్చువేశారు. దీని Purpose నాకు పూర్తిగా బోధపడలేదు. ఒడియా తెలిసిన తెలుగు పాఠకులని ఉద్దేశించారనుకుందామంటే వాళ్ళకి అది ఒడియా లిపిలోనే ఉంటే బాగుంటుంది కదా. పోనీ ఒడియా తెలియనివారికోసం అనుకుందామంటే ఈ Transliterated Originals ఎంత ఉపకరిస్తాయో ఎంతమంది చదువుతారో చెప్పడం కష్టం. నాకు తెలిసిన Bilingual కవితా సంపుటులన్నీ మూలభాషలోనూ Englishలోనూ ఉన్నవే. ఇదే తొలి ప్రయత్నమో కాదో నాకైతే తెలీదు. ఈ విషయంపై వేలూరిగారికి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కొద్దిపాటి శ్రమతో Originalsని చదివితే చాలా ప్రయోజనం ఉంటుందని వారి గట్టి నమ్మిక. నిజమేనేమో.
(3)
నాకు తెలిసిన ఒడియా, మిశ్ర గారి మూల కవితల్ని చదివి Enjoy చెయ్యటానికి సరిపోదు. అక్కడక్కడా మాత్రమే చదవగలిగాను. ఈ అనుసృజన వేలూరి వేంకటేశ్వర రావు గారు మనకిచ్చిన గొప్ప కానుక. వేలూరి గారు గత పాతికేళ్ళుగా మిశ్ర గారి కవిత్వాన్ని చదువుతూ పలవరించడం నేనెరుగుదును. తెలుసా (తెలుగు సాహిత్యం కి సంక్షిప్త శబ్దమే తెలుసా) అనే Listserver based discussion group లో
నేను సభ్యుడిగా 1996లో ఉన్నప్పటినుంచీ నాకు వేలూరి గారికి సాహిత్యం పట్లా కవిత్వం పట్లా ఉన్న తపనా ఆసక్తీ అభినివేశం తెలుసు. వేలూరి గారు తను చేసిన అనుసృజనని Englishలో కి మళ్ళీ Paraphrase చేసి మిశ్ర గారికి పంపించారట ఆయనకి తెలుగు రాదు గనక. అనుసృజనకి అసలుసిసలైన యోగ్యతాపత్రం స్వయంగా సౌభాగ్య కుమార్ మిశ్ర గారే “I must confess. Some of the so-called paraphrases read like original poems in English” అంటూ ఇచ్చారు. ఇక నేననగా ఎంతవాణ్ణి? దీని భావమేమి తిరుమలేశ? వేలూరి గారి దగ్గర అవ్యయ ఇంగ్లీషు అనుసృజన ఉన్నదన్నమాట. వేలూరి గారు ఈ అనుసృజనకై ఎంత శ్రమించారో దీన్నిబట్టే మనకి తెలుస్తోంది.
(4)
అవ్యయం అంటే నాశనం లేనిది అని అర్థం. ఇది మనకందరికీ తెలిసినదే. మిశ్ర గారి కవిత్వమూ వేలూరి గారి అనుసృజనా అవ్యయాలే. మనకు ఇటువంటి “అవ్యయా”న్నందించిన వేలూరి గారికీ ఆయనకు సహాయ సహకారాలందించిన వెనిగళ్ళ బాలకృష్ణ రావు గారికీ కొలిచల సురేష్ గారికీ ధన్యవాదాలతో ఈ నాలుగు మాటలూ ముగిస్తున్నాను.
For Copies:
(a) Visalandhra Publishing House and its branches in AP
(b) Navachetana Publishing House in Hyderabad and its branches in Telangana.
(c) Navodaya Book House, Kacheguda, Hyd.
వేలూరి వేంకటేశ్వర రావు.
వాసుగారికి :
ଦର୍ପଣ
ନିରାପଦ ଦର୍ପଣରେ ରାତି ପ୍ରାୟ ସାଢ଼େବାର ବେଳେ
ପ୍ରତିବିମ୍ବ ଦେଖେ ମୁଁ ନିଜର ;
ମୁଁ ହଠାତ୍ ଯଦି ଭାଙ୍ଗିଯାଏ
ଏ ଦର୍ପଣ କ’ଣ ଭାଙ୍ଗି ଚାରିଆଡ଼େ ଛିଟିକିପଡିବ ?
రాసి నట్టుగా ఒరియా లో ఉచ్చరించరు. తుమ అని రాసి తుమొ అని ఉచ్చరిస్తారు. ఈ పై పద్యభాగం దర్పణ పద్యం నుంచి ఒరియా లిపిలో ఇస్తున్నాను. దర్పణ అని రాసి చదివేటప్పుడు దర్పణొ అని చదువుతారు. పద్యం మొదటిమాట నిరాపద. అయితే ఉచ్చరించేటప్పుడు నిరాపదొ, అని ఒరియా వాళ్ళు అంటారు. ఎందుకు ఈ విషయం చెపుతున్నానంటే, ఉచ్చారణకి, రాసేభాషకీ భేదాలు ఉంటాయని చెప్పటానికే!
సంస్కృతంలో కూడా అంతే! రోమను లిపిలో రాస్తే ఉచ్చారణ భేదాలు పట్టుకోవటం కష్టం. అయితే అర్థం మారదుగా! (వేద భాషతో ఈ ఇబ్బంది ఉన్నది సుమా!) ఏదయినా నేనన్నట్టు, మీరూఅమోదించినట్టూ రోమనులిపిలో రాసింది చదవటానికి కొద్దిశ్రమ అవసరం.
లిపి అందచందాలగురించి మీరు అనలేదు. నాతో కొద్దిమంది పేరుమోసిన “రచయితలు” అన్నారు. వారు స్పందిస్తారన్న ఆశతో ఇక్కడ రాసాను. పొరపాటు నాది.
అభివాదాలతో.
వేలూరి వేంకటేశ్వర రావు
Vasu (Srinivasa Nyayapati)
Lovely, guruvu gaaroo.
Despite all, reading a fine poem, even if a part of it, in your own language in your own script, – learned in childhood – is sweet, nostalgic and constitutes giving a tribute to the creator, the poet.
-Vasu-
వేలూరి వేంకటేశ్వర రావు.
వాసు గారూ! ఆలస్యం గా మీకు సమాధానం రాయటానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ముఖ్య కారణం బద్ధకం!
“తనకీ తనకు అనుభూతుల్నీ జ్ఞాపకాలనూ పంచిచ్చే సన్నిహిత లోకానికీ అభేదాన్ని ప్రతిఫలించే మేలిమి తరగతి కవి మిశ్ర గారు. ఈయన భావాలు ఎంత గాఢమైనవీ సున్నితమైనవో భాష అంత సరళమైనది. ఆత్మపరిశీలన మెండుగా కలిగి బాహ్యప్రపంచపు లోతుల్ని తరిచిచూసి ఆ సారాన్ని తనదిగా చేసుకుని కవిత్వపు కాంతుల్ని వెదజల్లిన నెలవంక మిశ్ర గారు.” అని మీరు రాసారు.
ఈ పై వాక్యాలతో నేను ఏకీభవించక తప్పదు. కవిత్వంతో వచ్చిన ప్రమాదం అదే! కవి బాధ్యత సగమే! అంటే పద్యం రాయటం వరకే! ఆ తరువాత పాఠకులు మిగిలినభాగాన్ని పూర్తిచేస్తారు. Rolland Barthes అభిప్రాయం మీకుతెలుసు.
“— మిశ్ర గారి కవిత్వంలో పాఠకుడికి కవిత్వం అర్థం చేసుకోవడంలో తలెత్తే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవడంలోనే ఆలోచనా అనుభూతీ కలిగించే గుణం కూడా ఉంది. ఇది కవి నేర్పు అని కూడా నేను నమ్ముతాను. “ కాదని వాదించడం కష్టం.
ఈ సంకలనానికి పెట్టిన టైటిల్ గురించి, మిశ్ర తప్ప మిగిలిన కొద్దిమంది స్నేహితులతో వాదప్రతివాదాలు జరిగినై. నేను అవ్యయ అంటే కొందరు ఆత్మలిపి అని, స్మృతీ!నీవు అని సలహాలిచ్చారు. నాపుస్తకంకదా! నా ఇష్టం. అచ్చు అయినతరువాత సౌభాగ్యకి చెప్పాను. అతనికీ నచ్చింది నా టైటిల్.
మీకు ఏవాదం ఇష్టమో ఆవాదాన్ని ‘సమర్థించే పద్యాలు’ సౌభాగ్యకవిత్వంలో దొరుకుతాయి. అది ముఖ్యం అని నేను అనుకోను. అందుకే చూచాయగా ఆప్రస్తావన తెచ్చాను, పుస్తకం మొదట్లోనే! నా ఉద్దేశలో, మంచికవులు ఏ వాదానికీ లొంగరు; అక్కడక్కడ ఛాయలు మాత్రం కనిపిస్తాయి. ఆఛాయల్ని పట్టుకొని ‘ఊరేగటం’ కవికి అన్యాయం చెయ్యటం అని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పయితే చెప్పండి.
ఈ పుస్తకం తయారుచేస్తున్నప్పుడు సౌభాగ్య, నేనూ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. కొన్ని కవితలపై ఇద్దరికీ కొత్త అభిప్రాయాలు వచ్చినాయి; పాత అభిప్రాయాలు చాలా బలపడినై.
“ఈ పుస్తకంలో ఒడియా మూల కవితల్ని Transliterate చేసి అచ్చువేశారు. దీని Purpose నాకు పూర్తిగా బోధపడలేదు. ఒడియా తెలిసిన తెలుగు పాఠకులని ఉద్దేశించారనుకుందామంటే వాళ్ళకి అది ఒడియా లిపిలోనే ఉంటే బాగుంటుంది కదా. పోనీ ఒడియా తెలియనివారికోసం అనుకుందామంటే ఈ Transliterated Originals ఎంత ఉపకరిస్తాయో ఎంతమంది చదువుతారో చెప్పడం కష్టం. నాకు తెలిసిన Bilingual కవితా సంపుటులన్నీ మూలభాషలోనూ Englishలోనూ ఉన్నవే. ఇదే తొలి ప్రయత్నమో కాదో నాకైతే తెలీదు. ఈ విషయంపై వేలూరిగారికి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కొద్దిపాటి శ్రమతో Originalsని చదివితే చాలా ప్రయోజనం ఉంటుందని వారి గట్టి నమ్మిక. నిజమేనేమో.” అని మీరు అన్నారు.
హార్వర్డ్ నుంచి వచ్చిన సంస్కృత లాక్షణినిక గ్రంధాలు, ప్రేమకవితల సంకలనాలు, ఇంకా చాలా సంస్కృత గ్రంధాలు, అవ్యయ అచ్చువేసిన పద్ధతిలోనే అచ్చయినాయి. నాకు దేవనాగరిలిపి చదవట బాగా రాదు. ఒడియా, బెంగాలీ, హిందీ బాగా అర్థం అవుతాయి. కానీ లిపి చదవటం బాగా రాదు. లిపి నేర్చుకోవటం కోసం పడే శ్రమ అవసరమా? ఆలోచించండి. ప్రపంచభాషలన్నీ diacritic script లో ఉండటం నామటుకు నాకు సులువు అనిపిస్తుంది. మీకు ఒడియా బాగా రానక్కరలేదు. మీకువచ్చిన సంస్కృతం చాలు, ఒడియా మూలం చదవటానికి. కొద్దిశ్రమ అవసరమే మరి!
పోతే ఒడియా బాగా వచ్చిన వాళ్ళు మూలంలోనే చదుకోగలరు కదా! కవితలకి, నేను ముక్కస్య ముక్క అనువాదం చెయ్యలేదు; చెయ్యలేనుకూడా! అందుకనే అనుసృజన అని చెప్పుకున్నాను. ఎక్కడ నేను ‘సరి గా’ అనువాదం చెయ్యలేకపోయానో మీరుకూడా పట్టుకో గలరు. నాకన్నా బాగా అనువదించడానికి Transliterated Script ఉపయోగిస్తుందేమో ఆలోచించండి.
అన్ని లిపులూ అందంగానే ఉంటాయి. లిపికున్న అందాన్ని గురించి ఇక్కడ వాదన మంచిదికాదేమో!
చివరిగా, నాగురించి మీరు ప్రస్తావించిన పాతకాలపు కబుర్లకి నా ధన్యవాదాలు.
వేలూరి వేంకటేశ్వర రావు.
Vasu (Srinivasa Nyayapati)
వేలూరి గారూ,
మీరు (కాస్త ఆలస్యంగానైనా) రాసిన వ్యాఖ్య చదివాను. All is fine. ఒకేఒక్క మాట ఏంటంటే మీ Transliterated Text ఎంతమంది చదివి ఉంటారంటారు? ఒడియా కాస్తోకూస్తో తెలిసిన నేనే ఎక్కువ చదవలేకపోయాను. కారణం ఒడియా ఉచ్చారణ Transliterated spellingకి కొంచం counter-intuitive గా ఉంటుంది. ఉదాహరణకి “baDa didi” అని రాస్తారు గానీ “బొడొ దిద్ది” అంటారు, కాస్త అటూఇటూగా. ఈ విషయం కూడా మీకూ తెలుసనే తలుస్తాను. ఇది ఒక కారణం మాత్రమే. సంస్కృతం ఎన్నో లిపుల్లో ఉంది, Diacritic Englishను కలుపుకొని. నిజానికి Diacritic English లిపిలో సంస్కృతం చదవడానికీ అనుభవమూ శ్రమా కావాలి.
అయితే మీరు చెప్పినట్టు చదివే అనుభవం ఉన్నవాళ్ళు కాస్త శ్రమిస్తే మంచే జరుగుతుంది. ఎంత శాతం అర్థమౌతుందనేది వేరే ప్రశ్న, ఎదో నయం అనిపించుకుంటారు. లిపి అందచందాల మాట నేనెక్కడా ఎత్తనేలేదు. ఆ విషయంలో మీరు చెప్పింది సబబే అని నమ్ముతాను.
Thanking you for many things….
-వాసు-
Vasu (Srinivasa Nyayapati)
I would first like to thank Veluri Venkateswara Rao garu for kindly sending me the book and Purnima garu for her critical review of my article and for making suggestions and also Sowmya garu.
-Vasu-