జాంబ పురాణం – సామాజికాంశాలు : పాఠ్య అధ్యయన పద్ధతులు
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
దళిత – ఆదివాసీ అధ్యయన – అనువాద కేంద్రం , హైదరాబాద్ విశ్వవిద్యాలయం; భారతీయ భాషల కేంద్ర సంస్థ (CIIL) – మైసూరు సంయుక్త నిర్వహణలో ‘జాంబ పురాణం – కథన శైలి – ప్రదర్శన , పాఠ్య అధ్యయనం’ పై జరిగిన జాతీయ సదస్సు (09 – 11 మే , 2016) లో సమర్పించిన పరిశోధన పత్రం. పత్ర సమర్పకుడు : డా. ఎ.కె. ప్రభాకర్
*****************
ఉండ ఇల్లు లేదు – పండ మంచం లేదు – శివారి మీద కూలి లేదు – వడుక రాట్నం లేదు – బ్రహ్మాండ దానం లేదు – కాలికి చెప్పు లేదు – పరాభిక్షం లేదు – మాదిగల్ని మాత్రమే త్యాగం అడుక్కోవాలి. ఊళ్ళో ఇళ్ళ ముందు సానుపు చల్లిన వాకిలి తొక్కకూడదు. వ్యవసాయం చేయరు. అగ్రకులాల సేవ చేయరు. ఆ కారణంగానే పుట్టు నేరస్తులుగా ముద్ర. బ్రాహ్మల్తో ముఖ చూపుల్లేవు( ‘బాపనోనికి ఇప్పటికీ కాళ్ళు మొక్కం’ – కన్నెగంటి గోపాల్ , డక్కలి కళాకారుడు, నష్కల్). సంచార జీవనం ; స్థిరనివాసం లేకపోవడం వల్ల పౌరసత్వం లేదు….
జాంబపురాణంలో సామాజికాంశాల గురించి వివేచన చేసేముందు యీ దేశంలో దళితుల్లో దళితులైన డక్కలి కళాకారుల యీ జీవన విధానాన్ని పరిస్థితిని మనసులో వుంచుకొని తొలి అడుగు వేయాలి ; అప్పుడు మాత్రమే దాని పాఠ్యం లోతుల్లోకి వెళ్ళాలి.
కుల పురాణాలన్నీ సాధారణంగా ప్రధాన స్రవంతిగా భావించే పురాణాలకి సమాంతర భావజాలాన్ని ప్రచారం చేయడానికే వుద్దేశించినవని నిర్ధారణ చేయాలంటే పాఠ్యాన్ని యెంతగా తరచి చూస్తామో ఆ యా పురాణాలు చెలామణిలో వున్న స్థల కాలాదుల్ని సైతం అంతగానే పట్టించుకోవాలి. ఒక విధంగా కుల పురాణాధ్యయనం అంటే సమాజ అధ్యయనమే. ఏ కులపురాణాన్నైనా అధ్యయనం చేయాలంటే మొత్తం సమాజంలో ఆ కులానికీ దాన్ని చెప్పేవాళ్లకీ వున్న సామాజిక స్థితి గతుల్ని – సాంస్కృతిక స్థాయినీ , ఆశ్రిత దాతృ కులాల మధ్య వున్న సంబంధాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. సమాజం మతం చరిత్ర సంస్కృతి భాష – వీటిని విడి విడిగా గాక , స్థిరమైన అంశాలుగా గాక పరస్పర సంబంధాలతో పరిశీలించాల్సి వుంటుంది. మిగతా కులపురాణాల మాటెలా వున్నా జాంబ పురాణంలో సామాజికాంశాల గురించి పరిశీలించడంలో యెన్నో సంక్లిష్టతలున్నాయి. జాంబ పురాణం కేవలం మాదిగ కుల పురాణం మాత్రమే కాదు ; మాల గొల్ల చాకలి కుమ్మరి గౌడ ముత్తరాసి విశ్వకర్మ పిచ్చుకకుంట్ల ఎరుకల మొదలైన కులాల చరిత్రని అది పుట్టు పూర్వోత్తరాలతో సహా వర్ణిస్తుంది. అందువల్ల జాంబపురాణం శ్రామిక కులాల సామాజిక సాంస్కృతిక చరిత్ర కూడా. ఆ యా కులాల మధ్య అనివార్యంగా చోటుచేసుకొనే ఉత్పత్తి సంబంధాలకు గతిశీలమైన వ్యాఖ్య.
భారతీయ సమాజంలో మూలవాసీ సంస్కృతిని వెలికి తీయడానికీ , జాతుల సమస్యలోని వివిధ కోణాల్ని అధ్యయనం చేసి లోతుపాతుల్ని గ్రహించడానికీ , తరతరాలుగా మరుగున పడివున్న ఉత్పత్తి కులాలకు చెందిన ప్రజాశ్రేణుల చరిత్ర అవగాహనకీ , వారి మధ్య నెలకొన్న సాంస్కృతిక అగాథాల్ని పూడ్చి ఐక్యత సాధించడానికీ మౌఖికంగా భిన్న రూపాల్లో లభ్యమౌతున్న జాంబ పురాణాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
జాంబ పురాణాన్ని చిందు భాగవతులు గోసంగి వేషం కట్టి సంవాద రూపంలో ప్రదర్శిస్తారు. చిందు కళాకారుల జాంబవ పురాణ ప్రదర్శన హాస్య వీర రసాలతో వ్యంగ్య అధిక్షేపాలతో మాదిగ సంస్కృతిని కొండ నెత్తం మీద నిలబెట్టి ప్రసిద్ధమైంది. నులక చందయ్యలు జాంబవ కథని పురాణరూపంలో ప్రవచిస్తారు. డక్కలి వాళ్ళు పటకథగా చెబుతారు. పటం కథనే ఇటీవల ఒక విలక్షణమైన వీథి నాటకంగా మలచుకొని వాళ్ళు ప్రజారంజకం చేశారు. డక్కలి కళాకారులే కొందరు కిన్నెర మీద పాడతారు , కొందరు గద్య కథనం చేస్తారు. బైండ్ల వాళ్ళు తాము చెప్పే ఎల్లమ్మ కథా చక్రంలో భాగంగా జాంబవుడి కథని కూడా జమిడికల మీద గానం చేస్తారు. మాదిగ మాష్టీడులు ఆసాదులు దీన్ని కథగా చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో డక్కలి స్త్రీలు వాద్య సహకారంతో బృంద గానం చేస్తారు. వీటిలో ఏ జాంబపురాణమైనా పాఠ్యంలోగానీ, ప్రదర్శనలో గానీ శిష్ట పురాణాల పాఠ్యానికీ, ప్రదర్శనకీ ఏమాత్రం తీసిపోదు. ఒకే కుల పురాణంలో యిన్ని రకాల వైవిధ్యం మరెక్కడా కనిపించదు. వాటిలో ప్రక్రియా వైవిధ్యం తో పాటు రూపానుగుణంగా మూలకథలో కథాంశాల్లో కూడా భిన్నత్వం కనిపిస్తుంది. ఏ ఉపకులానికి చెందిన పాఠ్యం వారిదే. వారికది పవిత్రం కూడా. వాటిలో ప్రతిపాదించిన అంశాలకు ఎవరికి వారు కట్టుబడి వుంటారు. అయితే అన్నిటిలోనూ సామాన్యంగా కనిపించే అంశాలు చాలా వుంటాయి. వాటిలో ముఖ్యమైనది ఆది జాంబవుని మహోన్నతుడిగా వర్ణించడం , తమ కులాన్ని తక్కిన కులాలన్నిటికంటే వున్నతమైనదిగా స్థాపించడం. పోషక కులాన్ని వున్నతీకరించడంతో పాటు తమ వుప కుల అస్తిత్వాన్నీ దాని హక్కుల్నీ స్థిరీకరించడం కనిపిస్తుంది. తమ ప్రదర్శనల్లో పాఠ్యంలో అందుకు అనుగుణమైన మార్పులు జోడిస్తారు. ఆ జోడింపులు ఆ యా ఉప కులాల అస్తిత్వ ప్రకటనలుగా గుర్తించాలి.
ఆ యా ఉప కులాల్లో జాంబ పురాణం మౌఖిక లిఖిత రూపాల్లో కనిపించినా మౌలికంగా మౌఖికమే. స్థిర పాఠ్యాలుగా వేటినీ భావించలేం. అందువల్ల వైవిధ్య భరితమైన పాఠ్యాలు లభిస్తాయి. వాటిలో ఆవిష్కారమయ్యే సామాజికాంశాల్లో సైతం గణనీయమైన వైవిధ్యం చూస్తాం.
అయిదు పోగుల జంధ్యాన్ని ధరించే డక్కలి వాళ్ళు కయిగట్టగలరు (మౌఖిక సాహిత్య సంప్రదాయం) , కమ్మగట్టగలరు (లిఖిత గ్రంథ రచన సంప్రదాయం) . పంచాంగం చూసి మాదిగలకు పెళ్లి ముహూర్తాలు , చనిపోయాకా దినవారాలూ నిర్ధారిస్తారు. వైద్యం చేస్తారు. అయినా పోషకులైన మాదిగ వారికి అంటరానివాళ్ళే . అక్షరాస్యత వారికి అనూచానంగా లభించే విద్య. బడి చదువులు లేనప్పటికీ వారసత్వంగా రాతపూతలు నేర్చుకుంటారు (చదువులు బడిలో మాత్రమే నేర్చుకోవడం ఆధునికత తెచ్చిన మార్పు మాత్రమే). తాటాకు గ్రంథాలు తయారుచేసుకొనే నైపుణ్యం కూడా వీరికి సొంతం.
డక్కలి జాంబ పురాణం ఆదిమ రూపం పటకథ. జాంబ పురాణాన్ని డక్కలి కథకులు కేవల ‘పటకథ’ గా చెప్పేటప్పుడు చేత తాటాకుల గ్రంథాల్ని ధరించి అందులో చూసి చెబుతారు. మధ్యలో కథకుడి వ్యాఖ్యలూ వివరణలు వున్నప్పటికీ యీ మూల పటకథకి వొక మేరకు స్థిర పాఠ్యం వున్నట్టుగానే చెప్పుకోవాలి. కథలోని అంశాల్నీ కథాగమనాన్నీ పటం – పాఠ్యం పరస్పరం వొకదాన్ని మరొకటి నిర్దేశిస్తాయి కాబట్టి నూతన కల్పనలకూ ప్రక్షేపాలకూ అవకాశం తక్కువ. కానీ వారి దగ్గర లభించే లిఖిత ప్రతులకు సైతం మూలం మౌఖిక పురాణమేనన్న విషయాన్ని పరిశోధకులు గమనంలోకి తీసుకోవాలి. 30 నుంచీ 60 అడుగుల పొడవూ , 3 నుంచీ 5 అడుగుల వెడల్పూతో చుట్టుకోడానికి అనువుగా వుండే పటాల్ని( scroll paintings) నకాషీ కళాకారులు చిత్రిస్తారు. వాటిలోని కథా విశేషాలు కూడా డక్కలి వారు పుక్కిట పట్టి చెప్పేవే. మౌఖికంగా ప్రచారంలో వున్న వాటికే చిత్ర రూపం – లిఖిత రూపం ఏర్పడుతుంది. పట చిత్రం తయారయ్యాకా మూల కథలో మార్పులకు అవకాశం తక్కువ.
అయితే పటాన్ని చూపుతూ యక్షగాన రూపంలో ప్రదర్శించేటప్పుడు మాత్రం ప్రదర్శనకు అనుకూలంగా మూల కథకు ఎన్నో మార్పులూ చేర్పులూ జరుగుతాయి. ప్రదర్శనలో సైతం మధ్యలో పటం చూపించి కథని వివరిస్తారు. కథ గాడి తప్పినా నటులు కథాంశాలను మరిచి పోయినా సంభాషణల్లో తప్పులు దొర్లినా సరిదిద్దడానికి ఆ మేళంలోని పెద్ద తాళపత్ర గ్రంథంతో సిద్ధంగా ఉంటాడు. లిఖిత రూపంలో వున్న ఆ పురాణ గ్రంథం వారికి ప్రామాణికమైనప్పటికీ సందర్భాన్ని బట్టి , ప్రేక్షకుల స్థాయిని బట్టీ , నటుల గాయకుల కథకుల జీవిత నేపథ్యాల్ని బట్టీ మనస్తత్వాల్ని బట్టీ దృక్పథాల్ని బట్టీ ప్రదర్శించే పాఠ్యంలో ఏకరూపత కనిపించదు. ప్రేక్షకుల్నీ శ్రోతల్నీ ఆకట్టుకొని ప్రదర్శనని జనరంజకం చేయడానికే పట కథ యక్షగానంగా మారింది. మారిన క్రమంలో పాటలు పద్యాలు ద్విపదలు రగడలు దరువులు వంతలు తాళాలు – వీటితోపాటు మృదంగం డోలక్ హార్మోనియం వంటి సంగీత వాద్యాలు – కేవలం సంభాషణలే గాక పాటలకు నృత్యాలు – అన్నిరకాల అభినయాలు తోడయ్యాయి. అప్పటికప్పుడు సామెతలు పొడుపు కథలు జానపద గేయాలు సినిమా పాటలు హాస్యం కోసం పిట్టకథలు వంటి కొత్త కొత్త అంశాలు వచ్చి చేరాయి. ఒక్కోసారి ప్రేక్షకుల కోరిక మేరకు సందర్భానుసారంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. ప్రదర్శన జరిగే గ్రామానికి చెందిన భౌగోళిక అంశాలు సామాజికత వంటివి కూడా ప్రదర్శనలో భాగమవుతాయి. దళిత కళారంగ స్వరూపాన్ని అధ్యయనం చేయడానికి డక్కలి జాంబ పురాణం గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం యక్షగాన రూపంలోనే లభ్యమౌతున్న డక్కలి జాంబ పురాణంలో సూత్రధారిగా వ్యవహరించే విదూషక పాత్ర (బుడేన్ ఖాన్ , బఫూన్ , జోకర్ అని పిలుస్తారు) చాలా ప్రధానమైంది. హాస్య స్ఫోరకమైన అతని సంభాషణల్లో సమకాలీన సామాజిక – రాజకీయ – సాంస్కృతిక అంశాలెన్నో దొర్లుతూ వుంటాయి. అయితే అవన్నీ సందర్భానుసారంగా అవసరానుగుణంగా అప్పటికప్పుడు చోటు చేసుకోనేవే. అందువల్ల ఆ పాఠ్యంలోనూ అందులో ద్యోతకమయ్యే సామాజికాంశాల్లోనూ స్థిరత్వముండదు. కానీ అతని మాటల్లో చేతల్లో అంతటా బ్రాహ్మణ వాద నిరసన , మాదిగ కుల చైతన్యం, అణగారిన అట్టడుగు వర్గాల ఆవేశం , జీవితం పట్ల భౌతిక వాద దృక్పథం , సంచార జీవితంలో లోకం పోకడని పరిశీలించిన విశేష అనుభవం , తద్ద్వారా అలవర్చుకొన్న ఒక ప్రజాస్వామికమైన జీవన తాత్త్వికత అంతస్సూత్రంగా కనిపిస్తాయి.
డక్కలి జాంబపురాణ యక్షగాన ప్రదర్శనలో బహుదైవ విశ్వాసం కనిపిస్తుంది. జాంబవం శాక్తేయం శైవం ఇస్లాం క్రైస్తవం – వీటన్నిటి సమ్మిళిత సంస్కృతి ఒకటి కాలానుగుణంగా రూపొందింది అనిపిస్తుంది. ‘శివుడు శంకర సాంబమూర్తిని/ ఏసుదేవుడ – అల్లా నేనే / అయిదు నామములు గల / పరమాత్మ రూపుడ … నామములు వేరైనా దేవుడంతా ఒకటే. పశువులు వేరైనా పాలంతా ఒకటే ’ వంటి భావజాలం మత సంస్కరణల కాలంలో చోటు చేసుకొన్నది అనడంలో సందేహం లేదు (డక్కలి జాంబపురాణం , జయధీర్ తిరుమలరావు మొ. 2011 , పే.263). అయినప్పటికీ పురాణం పొడవునా మూలపురుషుడైన ఆది జాంబవుడిదే అగ్రస్థానం.
సాధారణంగా జానపద సంస్కృతిలో కనిపించే నమ్మకాలు ఆచారాలు విధి నిషేధాలు డక్కలి జాంబ పురాణంలో సైతం కనిపిస్తాయి. అయితే వాటికి ప్రామాణికతను సాధించడానికి డక్కలి వారు నిర్మించే తర్కం విభ్రమం కలిగిస్తుంది. కొండొకచో అది వితండంలాగానూ ఛలవాదంలాగానూ పరిణమించడం చూస్తాం.
నులక చందయ్యల జాంబ పురాణంలో చాలా చోట్ల బ్రాహ్మణీయ భావజాలం స్పష్టంగా కనపడుతుంది. తమని తాము మాదిగ జంగాలుగా పిలుచుకొనే నులక చందయ్యలు లింగ ధారులు. శైవ మతావలంబకులు. కొలనుపాకలో వున్న మాదిగ మఠాధిపతులు. వారసత్వంగా మాదిగలకు గురు స్థానంలో వుంటూ సంచారం చేస్తూ జాంబ పురాణాన్ని ప్రవచిస్తూ మాదిగల వంశ చరిత్ర చెబుతూ పూజలు అందుకుంటారు. అస్పృశ్యత పాటిస్తారు. మాదిగల యింట వంట తినరు. వారినుంచి స్వయంపాకం స్వీకరిస్తారు. సాధారణంగా శాకాహారులు. వీరి వేషం భాషా జీవన విధానం బ్రాహ్మణుల్లానే వుంటుంది. రుద్రాక్షలు విబూది ధరించి బ్రాహ్మణ పీఠాధిపతుల్లాగానే వ్యవహరిస్తారు. తమ గురుత్వాన్ని ప్రామాణీకరించే రాగిరేకుల హక్కు పత్రాలు వీరి వద్ద వున్నాయి. మాదిగ మఠం లో వున్న రాగి శాసనం శాలివాహన శకం 1143 ప్రభవ నామ సం. బహుళ త్రయోదశి (క్రీ.శ. 1222) నాటిదిగా పేర్కొంటూ దాని మీద రాసి వుంది. ఈ మఠం కూడా అప్పటిదే అని చెబుతారు.
కొలను పాక ప్రసిద్ధమైన జైన క్షత్రం. శివ క్షేత్రం కూడా. శైవ మత ప్రవర్తకుల్లో ఒకరైన రేణుకాచార్య జన్మస్థానం. అక్కడ వున్న ప్రాచీన శివాలయానికి (సోమేశ్వరాలయం) అనుబంధంగా 18 కులాలకు 18 మఠాలు వున్నాయి. ఈ శివాలయం పూజారులు జంగములు. అక్కడ వున్న వేర్వేరు కుల మఠాధిపతులు కూడా జంగములే. ‘శాస్య ముని’ సంతతిగా , వీరభద్ర గోత్రీకులుగా చెప్పుకొనే ( రెండు తరాల నులక చందయ్యలతో ముఖాముఖి సంభాషణలు , మార్చి 1- 6 1996, నష్కల్ గ్రా. వరంగల్ జిల్లా & కొలనుపాక గ్రా., నల్గొండ జిల్లా , సెప్టెంబర్ 11 – 12 ,1997) వీరు తమను మాదిగల వంశానుచరిత్రకు ప్రామాణిక రక్షకులుగా భావిస్తారు. అయితే యుగ మునిలా చిందు జింహ్మ మహామునిలా మాతంగ మునిలా నులక చందయ్యల మూలపురుషుడైన ‘శాస్య ముని’ జాంబవ వంశీయుడు కాదు. శివాంశ సంభూతుడు (కొలనుపాక నులక చందయ్యల ఆది జాంబవ మహా పురాణం , పులికొండ సుబ్బాచారి , 2008 , పు.49). అందువల్ల బ్రాహ్మణ పురోహితుల్లోలా వీరిలో కూడా ఆధిక్య భావన కనిపిస్తుంది. కానీ మాదిగలకు గురువులుగా వుండడం వల్ల తక్కిన జంగాల చిన్నచూపుకి గురయ్యారు. ఇతర జంగాలతో కంచం మంచం పొత్తు లేవు. నులక చందయ్య కూడా జాంబవ సంతతేనని మచ్చయదాసు చిందు జాంబవ పురాణం చెబుతుంది ; కానీ అందుకు సంబంధించిన వివరాలు తక్కువ (గడ్డం మచ్చయ దాసు విరచిత చిందు జాంబవ పురాణం – తంగెడ కిషన్ రావు & గడ్డం మోహన్ రావు, 2015, పు. 140).
నులక చందయ్యల దగ్గర జాంబ పురాణం లిఖిత రూపంలో కాగితం చుట్టలుగా లభిస్తోంది. మౌఖికంగా చెప్పే పురాణమే రాతలోకి తర్జుమా చేసినప్పటికీ అసలు సిసలు జాంబ పురాణం తమదేననీ అదే అంతిమ సత్యం అని నిర్ధారించే తత్త్వం తోనూ ప్రవర్తిస్తారు. ఆశ్రిత కులాలలో ఉపకులాలలో ప్రచారంలో వున్న జాంబ పురాణాలన్నిటికీ తాము ప్రవచించే పురాణమే మూలమని వారి నమ్మకం. నులక చందయ్యల జీవిత విధానంలో ఆభిజాత్యం , ఆధిక్య భావన ఒకవైపు – ప్రవచించే జాంబ పురాణంలో సమత్వ భావన మరొక వైపు – ఇది స్పష్టంగా కనిపించే వైరుధ్యమే గానీ కొత్త తరంలో సంస్కరణ భావాలు మొగ్గ తొడుగుతున్నాయి. షెడ్యూల్ కులాల్లో మాదిగల సరసన తమ కులాన్ని నమోదు చేయాలని వీరు కోరుతున్నారు.
నులక చందయ్యల పురాణ ప్రవచన పధ్ధతి కూడా బ్రాహ్మణ పౌరాణికుల పద్ధతిని పోలి వుంటుంది. రాతలో వున్న జాంబ పురాణాన్నిరాగయుక్తంగా (అధిక భాగం గద్యం) చదువుతారు. ఆ గద్య పాఠ్యం గ్రాంథికంలో వున్న కారణంగా కథని మౌఖికంగా చెబుతూ సొంత వ్యాఖ్యానాలు జోడిస్తారు. రాతలో లేని కథలూ పాటలూ పద్యాలూ ఈ వ్యాఖ్యానంలో చోటుచేసుకుంటాయి. అందువల్ల వీరి జాంబ పురాణ ప్రవచనం మిశ్ర మౌఖిక సంప్రదాయ ధోరణికి చెందినదిగా పరిగణించాలి. లిఖిత జాంబ పురాణ అంశాలన్నీ , సుదీర్ఘమైన సూర్య చంద్ర వంశ యాదవ రాజుల వంశచరిత్ర లతో సహా, వారికి కంఠగతమే.
నులక చందయ్యలు శివారాధకులు కావడం వల్ల జాంబవుడితోబాటు పురాణంలో శివుడు కూడా ప్రధాన దైవ స్థానం ఆక్రమించాడు. శైవ సంప్రదాయాన్ని అడ్డుబెట్టుకొని బ్రాహ్మణమతవాదులు తమ భావజాలాన్ని శూద్ర అతి శూద్ర దళిత కులాల్లో ప్రచారం చేయడానికే కులపురాణాల్ని వుపయోగించుకున్నారా అని అనుమానించేంతగా ఈ ఆక్రమణ జరిగింది. నులక చందయ్యల జాంబ పురాణ ప్రవచనంలోకి చొచ్చుకొచ్చిన బ్రాహ్మణీయ భావ జాలం గురించి , అందుకు కారణమైన వారి కుల మత సామాజిక నేపథ్యం గురించి ప్రత్యేకంగా పరిశీలించాల్సి వుంది.
అందుకు భిన్నంగా బ్రాహ్మణ భావజాలాన్నీ ఆధిపత్యాలనీ ఖండ ఖండాలుగా చీల్చిన చిందు జాంబవ పురాణం విశిష్టమైన కళారూపం. పరాజితుల విస్మృత చరిత్రగా , ఆర్య పురాణాలకు ప్రత్యామ్నాయంగా ఈ నేల మూలవాసులు స్వయంగా నిర్మించుకొన్న పురాణం యిది. శిష్ట బ్రాహ్మణ వర్గాలు పుక్కిటి పురాణాలని చేసిన తిరస్కారానికి అవమానాలకీ అవహేళనలకీ దీటైన జవాబుగా నిలువెత్తు ఆత్మ గౌరవ ప్రకటనగా కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు కాంతితో వెలువడ్డ పురచేతి పురాణం – Left hand mythology –యిది .
ఈ పురాణంలో జాంబవంతుడు మొత్తం జంబూ ద్వీపానికే కాక ఇక్కడున్న మొత్తం ప్రాణి కోటికీ సమస్త ప్రకృతికీ సకల జాతులకూ వారి పంటలకూ పశువులకూ పనిముట్లకూ ఆహార వ్యవస్థకూ నాగరికతకూ ప్రతిరూపంగానే కాదు పరిరక్షకుడిగా కూడా కనిపిస్తాడు. సంపద సృష్టి కర్తలైన శ్రామిక కులాల వారి ఉత్పత్తి ఫలాల్ని కష్టార్జితాన్ని దోచుకొని సంస్కృతీ నాగరికతలనూ ధ్వంసం చేసి రాజ్యాధికారాన్నీ గుంజుకొని దస్యులుగా అసురులుగా రాక్షసులుగా అస్పృశ్యులుగా ముద్రవేసిన మనువాద ఆర్య బ్రాహ్మణ ప్రతినిధితో సంకుల సమరం చేసే వీర యోధుడిగా జాంబవుడు ఈ పురాణంలో సాక్షాత్కరిస్తాడు. ఆ జాంబవుడే ఇవ్వాళ ఆధునిక ప్రగతిశీల కళా సాహిత్యాలకు దిక్సూచి.
జాంబవ సంతతి క్షేత్రీయులనీ , ఆర్య బ్రాహ్మణ సంతతి వారి వద్ద యాచన చేసేవారనీ , జాంబవులని మోసం చేసి వారి విద్యలనీ శాస్త్రాలనీ వైద్యాన్నీ కళలనీ అపహరించారనీ , జాంబవ పురాణాన్ని నాశనం చేసి అబద్ధాలతో కూడిన అష్టాదశ పురాణాలని ప్రచారం చేసారని కూడా చిందు జాంబవ పురాణం తెలియజేస్తుంది (గడ్డం మచ్చయ దాసు విరచిత చిందు జాంబవ పురాణం – తంగెడ కిషన్ రావు & గడ్డం మోహన్ రావు, 2015, పు.122 , 123)
జాంబవుడి వంశ చరిత్రనీ జంబూ ద్వీపాన్ని ఏలిన జాంబవ రాజుల చరిత్రనీ చిందు జాంబవ పురాణం సగర్వంగా ప్రకటిస్తుంది. హిరణ్యాక్ష హిరణ్య కశిపులనూ బలి చక్రవర్తినీ ఆర్య బ్రాహ్మణులు మోసంచేసి జయించిన ద్రోహాన్ని ఎండగడుతుంది. దురాక్రమణ వాదులైన ఆర్య బ్రాహ్మణుల ప్రతినిధులుగా త్రిమూర్తులు రావణ నరక బాణాది మూలవాసుల రాజుల్ని, త్రిపురాధిపతుల్నీ సంహరించి జాంబవుల నాగరికతను ధ్వంసం చేసిన దుర్మార్గాన్ని ఛీకొడుతుంది. పరశురాముని ఎదిరించిన కార్తవీర్యాది క్షేత్రియ రాజుల పరాక్రమాన్ని కీర్తిస్తుంది. ఆర్య బ్రాహ్మణులతో జరిగిన యుద్ధసమయాల్లో ఆది జాంబవుడు అతని కుమారుడు చిందు జింహ్మ మహాముని కట్టిన గోసంగి వేషాన్ని గొప్ప ఆరాధనతో వర్ణిస్తుంది (వారు ఆ నాడు కట్టిన గోసంగి వేషాన్నే ప్రదర్శనలో బ్రాహ్మణ ప్రతినిధితో తలపడడానికి చిందు కళాకారులు ఎన్నుకొన్నారు).
కృత త్రేతా ద్వాపర కలి యుగాలు నాలుగు అని బ్రాహ్మణ వాంగ్మయం పేర్కొంటూ వుండగా జాంబ పురాణాలన్నీ అనంత అద్భుత తామంద తారజాది … యుగాలు 18 అని చెబుతున్నాయి. కానీ అందుకు కారణాన్ని చిందు జాంబవ పురాణం మాత్రమే స్పష్టంగా తెలుపుతోంది. బయటనుంచీ వచ్చిన ఆర్య బ్రాహ్మణుల ఆధిపత్యం కృత యుగం నుంచీ మొదలైంది కాబట్టి అనంత మొదలుకొని అలంకృత వరకు 14 యుగాల పాటు జాంబవ వంశీయులు రాజ్యాలేలిన చరిత్రని తుడిచివేసే కుట్రలో భాగంగా సమస్త మానవ వికాస కాలాన్నీ నాలుగు యుగాలకు కుదించి వేయడం జరిగిందన్న ప్రతిపాదన చిందు జాంబ పురాణంలో కనిపిస్తుంది. అందుకే మూలవాసుల ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణానికి జాంబ పురాణం గొప్పగా దోహదం చేసుందని అనడం.
జాంబవులకు ఇతర శ్రామిక కులాలతో ఉత్పత్తి పరంగా సంస్కృతి పరంగా వున్న సంబంధాలను చిందు జాంబవ పురాణం ప్రత్యేకంగా పేర్కొంటుంది.
గొల్లలతో గౌడలతో సాంస్కృతికంగా సంబంధ బాంధవ్యాలున్నాయని ఆచార వ్యవహారాల్లో ఏకరూపత వుందనీ చిందు డక్కలి జాంబ పురాణాలు పేర్కొంటున్నాయి. గొల్లలు మాదిగలకు పాలివాళ్ళనీ , పెళ్ళి తంతులు చావు క్రతువులు ఒకరు లేకుండా మరొకరికి జరగవనీ నొక్కి చెబుతున్నాయి (తంగెడ కిషన్ రావు & గడ్డం మోహన్ రావు, 2015, పైనే పు. 133).
ఈ నేల మీద సామాజిక విప్లవాన్ని సమానత్వ భావజాలాన్ని ప్రచారం చేసిన వేమన వీరబ్రహ్మంల తాత్త్వికతని కూడా చిందు జాంబవ పురాణం తనలో ఇముడ్చుకుంది. ఇవ్వాళ దళిత బహుజనుల ఐక్యతకు అవసరమైన బీజాల్ని ఈ పురాణంలో వెతుక్కోవచ్చు.
దళితులు పోశమ్మ మైసమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ వంటి గ్రామదేవతల్ని పూజించడానికి కారణాల్ని కూడా జాంబ పురాణాలు పేర్కొంటున్నాయి. బైండ్ల కళాకారులు చెప్పే జాంబవుడి కథలో ఎల్లమ్మతో మాదిగలకీ వారి ఉపకులాలవారికీ వున్నఅనుబంధం విస్తృతంగా వర్ణించడం చూస్తాం.
బైండ్ల వారు మాదిగలకు పూజారులుగా వ్యవహరిస్తారు. పురోహితులుగా పెళ్ళిళ్ళు చేస్తారు. కొలుపులు , జాతర్లకి పట్నాలేస్తారు. క్రతుకాండలు జరుపుతారు. గావు పడతారు. జమిడికలమీద కథాగానం చేస్తారు. బైండ్ల వారు చెప్పే ఎల్లమ్మ కథలో తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లి రేణుకాదేవిని చంపడానికి ప్రయత్నించినపుడు రక్షణ కోసం ఆమె లోకాలన్నీ తిరిగింది. ఆమెను కాపాడటానికి ఎవరూ సాహసించనపుడు జాంబవుడే తన లందలో దాచి రక్షించాడు. ఆ విధంగా ఎల్లమ్మ మాదిగల ఇలవేల్పు అయ్యిందన్న కథని అన్ని జాంబ పురాణాలూ ప్రముఖంగా చెబుతాయి. అందుకే చిందు కళాకారుల్లో స్త్రీలు ఎల్లమ్మ వేషం కట్టడం పరిపాటి అయ్యింది. డక్కలి స్త్రీలు ప్రదర్శనలోగానీ పటకథ చెప్పడంలో గానీ పాలుపంచుకోరు. కొలనుపాక మాదిగ మఠంలో అరుదుగా స్త్రీలు సైతం పురాణం చెబుతారని పరిశోధకులు పేర్కొన్నారు గానీ ( పులికొండ సుబ్బాచారి , పైన , 2008) బహిరంగ ప్రదర్శనలు ఇచ్చిన దాఖలాలు లేవు.
స్త్రీలు బృంద గానంగా జాంబ పురాణం చెప్పడం అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది. నల్లచెరువు మండలం కె. పూలుకుంట కి చెందిన పూలుకుంట ఆదెమ్మ బృందం , మగవాళ్ళు డప్పు వాద్య సహకారం అందించగా పాడే జాంబ పురాణం పాట పదిహేను ‘రాగి తామ్రా’ ల్లో (రాగిరేకులు) లభిస్తుంది. మౌఖిక ప్రదర్శనగా సాగే ఈ గేయ కథలో జాంబవుడు తన బిడ్డ యుగముని గొంతుకోసి అతని చర్మాన్ని విశ్వకర్మకు తిత్తిగా ఇవ్వడం స్త్రీల గొంతులో హృదయ విదారకంగా పలుకుతుంది. డక్కలి వాళ్ళకూ మాదిగలకూ మధ్య వున్న అర్థి పోషక సంబంధం విషయికంగా అటు రాయలసీమలోనూ ఇటు తెలంగాణాలోనూ ఒకే విధమైన కథ ప్రచారంలో వుండడం గమనించాలి(APGOML &RI , హైదరాబాదు , ఏప్రిల్ 18, 2006 ప్రదర్శన సందర్భంగా చేసిన సంభాషణ).
అన్ని జాంబ పురాణాలు కొద్దోగొప్పో తేడాలతో సృష్టి మూలం గురించి వర్ణిస్తాయి. జాంబవుడు కేవలం మాదిగ కులపురుషుడని మాత్రమే గాక చరాచర జగత్తుకి మూలపురుషుడని పేర్కొంటాయి. ఉత్పత్తి కులాల శ్రమ శక్తిని గౌరవిస్తాయి. ఆ క్రమంలోనే చతుర్ముఖ బ్రహ్మకు దీటుగా పంచముఖుడైన విశ్వకర్మని సృష్టికర్తగా నిలిపాయి. లోకంలో సమస్త వస్తు సంపద సృష్టికీ తామే మూలకారణమనీ విశ్వకర్మకు ఉత్పత్తి పరికరాలు ఇవ్వడానికి జాంబవుడు తన కుమారుడు యుగమునిని సంహరించిన వృత్తాంతాన్నీ , ఆ తర్వాత మృత శరీరపు డొక్కలోనుంచీ డక్కలి బాలకుడు పుట్టిన వైనాన్నీ అన్ని జాంబ పురాణాలూ ఏకీ భావంతో ముక్త కంఠంతో గొప్ప గర్వంతో వెల్లడిస్తున్నాయి. అదే విధంగా మాలచెన్నయ్య కామధేనువుకు కావలిగా వుండి దాని మరణానికి కారకుడు కావడం , సూదిమాన పర్వతం మీద వున్న జంబవంతుడిని ‘మహా దిగిరా ‘ అని ప్రార్థించి తీసుకువచ్చి దాని మాంసాన్ని అతనితో తో కలిసి అనుభవించడం వంటి అంశాల్లో ఎక్కడా విభేదించడం లేదు. మాలమాదిగలమధ్య చోటుచేసుకొనే ఐక్యత సంఘర్షణలకు ఈ భాగం చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. పంచుకొని పెంచుకోవాల్సిన బాంధవ్యాన్ని నొక్కి చెబుతుంది. వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం కోరుతున్న మాదిగల ఆకాంక్షకు తరతరాల సాంస్కృతిక సాక్ష్యంగా దీన్ని భావించవచ్చు. ఇవాళ మాలమాదిగల మధ్య వైరుధ్యాలను పరిష్కరించుకోడానికి అవసరమైన పరికరాలు జాంబ పురాణాంతర్గతమైన మాల చెన్నయ్య పురాణంలో వున్నాయేమో పరిశీలించాల్సిన అవసరం వుంది. ఈ ఘట్టంలో పాలు పెరుగు చల్ల వెన్న అనే నాలుగు పంటలతో పాటు కామధేనువు తన మాంసాన్ని అయిదో పంటగా అందించినట్లు పేర్కొనడం మాంస భక్షణం తప్పుకాదని చెప్పడంగా భావించవచ్చు( ‘గోవును తింటే సాయిబులంటిరి / గోదను తింటే మాదిగ లంటిరి / రక్తం చుక్కలే పాలుగా మారెను’ : జయధీర్ తిరుమల రావు మొ. , 2011 , పు. 339).
తోలు , వారు పదాలకు జానపద నిరుక్తి ద్వారా అర్థాలు చెప్పడం , చెప్పు డప్పుల గొప్పదనాన్ని కీర్తించడం అన్ని జాంబ పురాణాల్లోనూ సామాన్యంగా వుంటుంది. మాదిగ కుల వృత్తిని , వృత్తి కౌశాలాన్నీ , అందులోని కళా నైపుణ్యాలనీ , తోలును శుభ్ర పరచడం , దాన్ని అనేక విధాల పనిముట్టుల తయారీకి అనుకూలంగా మలచుకోవడం వంటి సాంకేతిక పరిజ్ఞానాన్నీ , సామాజికోపయోగిత వున్న సమస్త ఉత్పత్తి సంబంధాల్లో అనివార్యమైన మాదిగ అస్తిత్వాన్ని వున్నతీకరించడంలో భాగంగా పురాణంలో వీటికి ప్రముఖ స్థానం లభించింది అని చెప్పవచ్చు.
ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కని , షెడ్యూల్ కులాలుగా చట్టంలో గుర్తింపు పొందని , ఆశ్రిత కుల పరిశోధకుల దృష్టికి రాని ఎన్నో కులాల ప్రస్తావన అన్ని జాంబ పురాణాల్లోనూ వుంది. వారంతా ఇప్పుడు గుర్తింపును కోరుకొంటున్నారు. జాంబ పురాణమే వారికి ప్రాథమిక గుర్తింపు పత్రం. మచ్చయ దాసు చిందు జాంబవ పురాణంలో 34 పోషక కులాలు , వారి కుల గాథలను గానం చేసే ఉపకులాల జాబితా లభిస్తుంది.
ఆశ్రిత పోషక కుల వ్యవస్థలో ప్రధానాంశనమైన అర్థి హక్కుల గురించి ప్రతి కులపురాణం నిర్ధారించినట్లే జాంబ పురాణం నిర్దేశిస్తుంది. అర్థి హక్కుల్ని మిరాశీ పత్రం స్థాయిలో స్థిరీకరించి నిర్ధారించడం , అందుకు అవసరమైన పాఠ్యాన్ని నిర్మించడం , పౌరాణికాంశాలను సామాజిక జీవితానికి అన్వయించడం , సామాజికాంశాలను సాంస్కృతిక వారసత్వంతో ముడివేయడం , వాటిని కులకశ్పి గా అనతిక్రమణీయ శాసనాలుగా నిర్వచించడం అన్నిరకాల జాంబ పురాణాల్లోనూ అనివార్యంగా కనిపించే విషయాలు.
అస్పృశ్య భావాన్ని ఖండిస్తూ జాలా రంగస్వామి వంటి ఆధునిక కవులు రచించిన పాటల్ని( నర జాతిలోఅంటు లేదన్నా!) ఆ యా సందర్భాల్లో ఉపయోగించడం నులక చందయ్యల పురాణ ప్రవచనంతో సహా ( లిఖిత ప్రతిలో లేనప్పటికీ పురాణ ప్రవక్త వివరణల్లో తప్పకుండా వుంటుంది) అన్ని జాంబ పురాణాల్లోనూ కనిపిస్తుంది. అయినప్పటికీ గురుస్థానంలో వున్న నులక చందయ్యలకు మాదిగలు అస్పృశ్యులు. మాదిగలకు అర్థి స్థానంలో వున్న డక్కలి వారు అస్పృశ్యులు. ఈ అంటరానితనం పట్ల వెనకటి తరం వారికి పెద్ద పట్టింపు లేదు . పనిముట్లు తయారుచేయడానికి యుగమునిని చంపినందువల్ల అతనిచ్చిన శాపమే మాదిగల యీ దురవస్థలన్నిటికీ కారణమని వారి నమ్మిక. ఆ శాపం తీరే కాలం దగ్గరలోనే వుందని విశ్వాసం. కొత్త తరం యువతలో మాత్రం మాదిగ సామూహిక చైతన్యం కారణంగా దాన్ని అధిగమించి ‘మంచం పొత్తు కంచం పొత్తు లేని ‘ ఉపకులాల ఐక్యతను కోరుకోవడం మొదలైంది ( మూడు తరాల మాదిగ ఉపకుల కళాకారులతో ముఖాముఖి సంభాషణలు , మార్చి 1- 6 1996, నష్కల్ గ్రా. వరంగల్ జిల్లా). ఈ తరం దళితుల ఆత్మ గౌరవం గురించి రాజ్యాధికారం గురించి మాట్లాడుతోంది.
మాదిగ సంస్కృతిలోని ఔన్నత్యాన్ని కొనియాడుతూ బ్రాహ్మణాధిపత్యాన్ని అన్ని జాంబ పురాణాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాయి. కులాల మధ్య సాంఘిక అంతరాల్ని ప్రశ్నిస్తాయి. అరుంధతీ వశిష్టుల వివాహ ఘట్టాన్ని అందుకు ప్రధాన వాహికగా ఎన్నుకోవటం అన్నిచోట్లా కనిపిస్తుంది.
చిందు భాగవతుల జాంబ పురాణంలో ఆది జాంబవ – బ్రాహ్మణుల సంవాదంలో బ్రాహ్మణ ఆధిపత్యం మీద నిరసన , వ్యతిరేకత , అవహేళన ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అక్కడ అధిక్షేపం ఎంతో తీవ్రంగా ఉంటుంది. వ్యంగ్యం చాలా బలంగా ఉంటుంది. సంవాదంలో తర్కబద్ధత వుంటుంది గానీ దాన్ని మించిన ఆవేశం కూడా వుంటుంది. ఒక్కోసారి అది నిందా రూపం తీసుకొంటుంది. మాటలతోనే సమాజంలో బలంగా వేళ్ళూనుకొన్న మనువాద భావజాల ఆధిపత్యం కోరలు పీకి పైచేయి సాధించాలనే తపన , వాగ్యుద్ధంలో గెలవాలనే పట్టుదల కోరిక జాంబవ పాత్రలో కనిపిస్తాయి. డక్కలి జాంబ పురాణంలో కూడా అగ్ర కులాల ఆధిక్యంపై అహంకారం పై వ్యతిరేకత వ్యక్తమౌతుంది. కానీ అది సున్నితంగా ప్రకటితమౌతుంది. తర్కం కంటే హాస్యం మోతాదు ఎక్కువ. అధిక్షేపం కంటే అపహాస్యం పాలు ఎక్కువ. నులక చందయ్యల పురాణ ప్రవచనం ‘ ఇదీ పురాణంలో అసలు విషయం ’ అని నిర్ధారించి చెబుతున్నట్టు గంభీరంగా వుంటుంది.
విజేతల అష్టాదశ పురాణ పాఠ్యాలతో , వాటిద్వారా ప్రచారం చేసిన ఆధిభౌతిక భావజాలం తో తలపడి ప్రత్యామ్నాయ భౌతిక లౌకిక భావాలను ప్రచారం చేసిన పరాజిత క్షేత్రీయుల కుల మహా పురాణం జాంబ పురాణం. క్షత గాత్రమైనప్పటికీ తరాలుగా తలఎత్తుకొని నిలబడి మాతంగ వాడలో ఎగిరిన ఆత్మగౌరవ పతాకం జాంబ పురాణం. మను బ్రాహ్మణ వాదం స్థాపించిన అమానవీయ వర్ణ ధర్మ నిర్మూలన కోసం ఎక్కుపెట్టిన అస్త్రం జాంబ పురాణం. మూలవాసుల రాజ్యాధికార సాధనం జాంబ పురాణ పాఠ్యం. దాన్ని అధ్యయనం చేయడం దళిత సామాజిక సాంస్కృతిక పోరాటాల్లో పాల్గొనే వాళ్ళందరి కర్తవ్యం.
ఆధారాలు:
1. గ్రంథాలు :
* డక్కలి జాంబ పురాణం (సంపా. జయధీర్ తిరుమలరావు , కె పి అశోక్ కుమార్ , ఎ కె ప్రభాకర్ , ఆర్ భాస్కర్ రావు) , జానపద ప్రచురణ , హైదరాబాదు తొలి (1998) , మలి (2011) ప్రతులు
* జాంబ పురాణం – మాదిగ కుల సాంస్కృతిక చరితం , చిందు భాగోతం (సంపా. బిట్టు వెంకటేశ్వర్లు), జానపద కళా పరిశోధన వేదిక , హైదరాబాద్ , 1997
* కొలనుపాక నులక చందయ్యల ఆది జాంబవ మహా పురాణం (సంపా. పులికొండ సుబ్బాచారి) , ద్రావిడ విశ్వవిద్యాలయం , కుప్పం , 2008
* గడ్డం మచ్చయదాసు విరచిత చిందు జాంబవ పురాణం ( సంపా. ప్రొ. తంగెడ కిషన్ రావు ,గడ్డం మోహన్ రావు ) , చిందు పబ్లికేషన్స్ , హాజీపూర్ 2015
* కొలనుపాక మాదిగ మఠం నులకచందయ్యల నుంచి సేకరించిన జాంబ పురాణం కాగితం చుట్టల రాత ప్రతికి నకలు ప్రతి.
2. వ్యాసాలూ సమీక్షలు :
* డక్కలి – తదితర దళిత కులాల జానపద సంస్కృతీ అధ్యయన సదస్సు , నష్కల్, వరంగల్ (1 -6 , మార్చి-1996) – నివేదిక
* నేను – జయధీర్ – డక్కలి గోపాల్ , జయధీర్ తిరుమల రావు ( నిజామాబాద్ టైమ్స్ , 8 మే 2014)
* దళిత తాత్త్విక చింతనకు పునాది జాంబ పురాణం – ఎ . కె. ప్రభాకర్ ( ఆంధ్రజ్యోతి ఆదివారం నవంబర్ 1997)
* సమాంతర సాంస్కృతిక దర్పణం:డక్కలి జాంబపురాణం-కె.పి.అశోక్‌కుమార్(ఆంద్ర భూమి, 19 జూన్ ,2011)
* డక్కలి జాంబ పురాణం – Halley (మే 9, 2014 , http://pustakam.net/?p=16792)
* గోసంగివేషం-మందకృష్ణమాదిగ (డిసెంబర్28,2008,https://mandakrishnamadiga.wordpress.com/2008/12/28/the-gosangi-vesham/)
* ‘మార్పు’ తాత్విక కోణమే జాంబ పురాణం , భూపతి వెంకటేశ్వర్లు (నవ తెలంగాణా ,5 జూలై 2015)
3 . ప్రదర్శనలు :
* డక్కలి జాంబ పురాణం యక్షగానం (కన్నెగంటి గోపాల్ – నష్కల్ , మేళం ) వరంగల్ జిల్లా , నష్కల్ గ్రామం , IFLU , హైదరాబాదు ప్రదర్శనలు
* డక్కలి జాంబ పురాణం – పటకథ (బాణాల పెద్ద ఎల్లయ్య – రామ్మడుగు , కరీంనగర్ జిల్లా , కర్నెగంటి రాజయ్య, కర్నెగంటి చినరాజయ్య – నష్కల్ , వరంగల్ జిల్లా) నష్కల్ లో మార్చి 5, 96
* గోసంగి వేషం (గజవెల్లి వెంకట నర్సు – ఇప్పగూడెం , స్టే . ఘనపూర్ ) నష్కల్ లో మార్చి 3 , 96 నాటి ప్రదర్శన
* నులక చందయ్యల (నందాదీపం నాగలింగం , నందాదీపం సోమలింగం , మిర్యాల మల్లయ్య – నల్గొండ జిల్లా కొలనుపాక గ్రామం , మాదిగ మఠం ) జాంబ పురాణ ప్రవచనం , మార్చి 4 , 1996
* డక్కలి జాంబ పురాణం , మాల చెన్నయ్య పురాణం , రెండురోజుల సదస్సు డాక్యుమెంటేషన్ , కొలనుపాక, నల్గొండ జిల్లా , సెప్టెంబర్ 11 – 12 ,1997
* ఎల్లమ్మ కథ , బైండ్ల కళారూపం , జిలకర సోమనాగయ్య , వలిమిడి గ్రామం , పాలకుర్తి మండలం – బృందం , నష్కల్ మార్చి 2 , 1996 & కొలనుపాక, నల్గొండ జిల్లా , సెప్టెంబర్ 12 ,1997 ప్రదర్శనలు
* చిందు జాంబ పురాణం ( గడ్డం స్వామి – బోగారం దళం) అక్టోబర్ 3 , 99 న హైదరాబాదు ప్రదర్శన
* డక్కలి స్త్రీలపాటల్లో జాంబ పురాణం (పూలుకుంట ఆదెమ్మ బృందం ,అనంతపురం జిల్లా , నల్లచెరువు మండలం , కె. పూలుకుంట గ్రామం ) APGOML &RI , హైదరాబాదు , ఏప్రిల్ 18, 2006
* డక్కలి , చిందు కళాకారులతో , నులక చందయ్యలతో భిన్న సందర్భాల్లో చేసిన ముఖాముఖి సంభాషణలు
* కిన్నెర కళాకారుల జాంబ పురాణ గానం , UoH , హైదారాబాద్, మే 9 , 2016 ప్రదర్శన
Boini Praveen Maharaj
Sir miku E katha ela thelisindhi emina adharalu unnaya proofs kavali anna andhariki elanti goppa cherithrala gurinchi cheppalante proofs kavalantunnru anna nanalu evaina chiritraka kattadalu ancient history proof kavalantunnaru
రాజేష్
చాలా విలువ అయిన సమాచారాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు .సార్ నాకొక చిన్న సందేహం గోసంగి కులం గురిం చెప్పండి ప్లీజ్ దీని పైన చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. అసలు ఈ కుల చరిత్ర ఏంటి దయచేసి తెలియజేయగలరు.
Dr.A.Venkat Narsaiah
Very good review. But, my point is better to emphasize the importance of Jambhavantha role from Astadasha puranas and please avoid the critic on Brahmins.
In many cases, critic will lead to incomplete reading of article. In such situation, no use of article.
Sharath kumar
Ee book ekkada దొరుకుతుంది sir
Ambedkar Maharaj
చాలా గొప్ప చరిత్ర మనది. ఇంకా చాలా తెలుసుకోవాలి.
M.Vinidkumar
నాకు మీ పత్రిక నచ్చింది, రెగ్యులర్ గా చదవలనుకొంటున్నాను.
గుఱ్ఱం సీతారాములు
చానా విలువయిన పేపర్. చాలా సమగ్రంగా రాసారు ఇందులో కొంత బాగం మీరు గతం లో దక్కలి జామ్బపురానానికి రాసిన ముందు మాటలో బాగం అయినప్పటికీ విడిగా చదవితే ఈ పేపర్ విలువ ఏంటో అర్ధం అవుతోంది. నేను ఆరోజు సెమినార్ లో పేపర్ చదివినా ఇంత గొప్పగా చేసేవాణ్ని కాను . మీరు ఆ లోటునుపూర్తి చేసారు.
మొదటి నుండీ దానిమీద మీరుచేస్తున్న కృషికి మూలంగానే అంత సాధికారత వచ్చింది. ఇక పోతే నా పరిశోదన మూల పాటం లో ఏముంది అనే దాని కంటే ఒకటో శతాబ్దం నుండి పదమూడో శతాబ్దం దాకా జాతక కథల నుండి, త్రిపీటకాలు, ఇంకా అనేక మౌఖిక గాధలు, అష్టాదశ పురాణాలు వివిధ స్థల కాలాల్లో చెందిన మార్పులు, భౌతిక రాజరికాల మార్పులు, వాటి పర్యావసానాలు పురాణ, ప్రభంద సాహిత్యం మీద ఎలా పనిచేశాయి అనే దిశగా రాసాను. శైవం లో వచ్చిన వివిధ శాఖలు వాటి ప్రభావం తో పురాణాలకు వచ్చిన వ్యాక్యానాలు దాని మూలంగా ఇప్పుడు మనం మాట్లాడు కుంటున్న అన్ని ఆశ్రిత జనుల కళా రూపాలు అందులో జమ్బపురానం వివిధ స్థల కాలాల్లో పొందిన మార్పులు వాటి సాహిత్య సాంస్కృతిక వైవిధ్యాలు వైరుధ్యాలు పరిశీలించాను . ఏది ఏమయినా విలువయిన పరిశోదనా పత్రం .