ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
*****************
సాహసము, దేశభక్తి ఉజ్జ్వలంగా వెలిగేలా చేసిన త్యాగధనుల గాధలు
విదేశీ చరిత్రకారుల అబద్ధపు గాథలను చరిత్రగా పరిగణించిన ఆధునికచరిత్రకారులు ‘భారతీయ రాజులు పెద్ద ప్రతిఘటన లేకుండా మహమ్మదీయ సేనలకు లొంగిపోయిన’ట్టు రాస్తారు. అడుగడుగునా ప్రతిఘటించి పలు అత్యద్భుత విజయాలు సాధించిన భారతీయుల విజయగాథలను ప్రకటించరు – రచయిత కస్తూరి మురళీకృష్ణ.
మనం చదువుకున్న చరిత్ర పుస్తకాల్లో ఇక్కడ చదువుతున్న గాథలన్నిటి గురించి ఎక్కడో ఒక వాక్యం లోనో, వాక్యాంశంగానో ఉంటుందంతే. రాజులు యుద్ధాలు, విలాసాల్లో మునిగితేలారనే విషయాన్ని పేజీలకు పేజీలు రాస్తూ పోతారు. భక్తి ఉద్యమాలతో సామాజిక చైతన్యాన్ని తెచ్చిన వారి దేశభక్తి కోణం గురించి ఏ మాత్రమూ బయటపడకుండా అదొక హిందూ మతానికి సంబంధించిన విషయంగా చిత్రీకరిస్తారు.
బయట ఈ విషయాలకు సంబంధించి పుస్తకాలు దొరుకుతాయని, వాటి గురించి తెలుసుకొనే లోపల జీవిత పోరాటంలో వ్యస్తులై పోవడమో, వాటిని అందుకోలేని దూరాలకెళ్ళిపోవడమో జరుగుతుంది.కాబట్టి ఎందరో నిజాయితీ గల చరిత్రకారులు, రచనాకారులు వ్రాసిన పుస్తకాలలో ఉన్న నిజమైన చరిత్ర మనకందుబాటులోకీ రావడం లేదు. మనకూ మన చరిత్రే తెలియడం లేదు.
ఈ నేపథ్యంలో కస్తూరి మురళీకృష్ణ గారి ఈ పుస్తకం “ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు” అనే చారిత్రక కథల సంపుటి ప్రశంసనీయమైన ప్రయత్నం.
ఇందులోని కథలూ, పాత్రలూ చాలా వరకూ మనకు కనీసం పేర్లయినా తెలిసినవే.
భారతదేశం లోని చాలా ప్రాంతాలలో జరిగిన ప్రతిఘటనలను చిత్రించడమే కాక, ప్రస్తుత భారతదేశపు పరిధిలో లేని ప్రాంతాల జరిగిన కథలూ ఉన్నాయి.
వీటన్నిటికి చారిత్రక ఆధారాలున్నాయి. చదువరులకు సందేహాలూ రావచ్చు. అభ్యంతరాలూ ఉండవచ్చు. కానీ విషయంతో పూర్తిగా విభేదించే అవకాశం లేదు. ఈ కథలు దేశభక్తి కలిగిన, దాడులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన వీరులు, వీరనారీమణులు, భక్తాగ్రేసరులవి. అంతేకాక ఒక్కుమ్మడిగా పోరాడిన అనామకులైన వేలాదిమంది ప్రజలది. ముస్లిం దాడులను గురించీ, వారి లోపలి ఉద్దేశాలను గురించి ప్రస్తావించబడింది కాబట్టి మేం లౌకికవాదులం, పుస్తకాన్ని ముట్టుకోం అనే వారిని ఎవరూ ఏం చేయలేరు. కానీ అది చరిత్ర. మన చరిత్రలో అదొక భాగం. దాన్ని తెలుసుకోవడానికి మనం కనీసం ప్రయత్నించాలి.
కథనం ప్రవాహరీతిలో ఆగకుండా సాగిపోతుంది. విసుగెత్తించకుండా చదివిస్తుంది. క్లుప్తత అన్న ముఖ్యమైన నియమపాలన ఈ కథనం యొక్క లక్షణం. చిన్నపిల్లలూ, పెద్దవారూ అన్న వయోభేదం లేకుండా అందరినీ చదివిస్తుంది. ఎగసి పడుతున్న అలలను ఉదాహరణగా పరస్పర సహకారపు ప్రయోజనాన్ని వివరించడం బాగుంది. కాశ్మీర రాజతరంగిణి రెండవభాగం రచనాకాలం నుంచీ కాకతీయ రాజ్యపు మూలమైన అతి సామాన్యురాలు విరియాల దేవసాని తంత్రం వరకూ, ఉత్కళ రాజ్యపు విదేశీ దాడుల ప్రతిఘటనా సామర్థ్యం నుంచీ మరాఠా వీరుల ఘన చరిత్ర వరకూ, చరకుని నుంచీ పేరంటాల కన్నమ్మ చరిత్ర వరకూ, తిరుమంగై ఆళ్వారు నుంచి సూరదాసు వరకూ అనేక దేశోద్ధారక ఉద్యమాల గురించి కథలున్నాయి. ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం.
నచ్చని విషయాలు-
పుస్తకానికి శీర్షిక ‘ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు’ లో ఉజ్జ్వల రెండు సార్లు రావడం ఆకర్షణీయంగా లేదు.
లక్ష్మీదేవి
మీ వ్యాఖ్య లేట్ గా ప్రచురించ బడినట్టుంది.
ఈ లింక్ నొక్కి వివరాలు చూడండి.
బయట కూడా దొరుకుతోంది.
http://www.anandbooks.com/Ujwala-Bharata-Mahojwala-Gadhalu-Telugu-Book-By-Kasturi-Murali-Krishna
anjaneyulu bvsr
ee pustakam publishers evaro, vela entho telipiuntey baagundedi, konukkodalachinavallaku upayuktamga vundedi.
sameeksha tookamga saagindi. abhinandanalu.