వేకువ పాట

వ్యాసకర్త: మణి వడ్లమాని
*********
చిరుగాలి సవ్వడితో, పక్షుల కిలకిలరావాల సందడి వింటూ హేమంత తుషార బిందువులని అలవోకగా స్పృశిస్తూ, మంచు తెరలు పొరలు పొరలుగా విడిపోయి లేలేత భాను కిరణ కాంతుల మెరుపులతో సింధూర రంగు పులుముకున్న ఆకాశం చూస్తూ, సుతిమెత్తని పచ్చిక పై నడుస్తున్నప్పుడు మనసులోపలనుంచి వినిపించే ఒక అద్భుతమైన వేకువ పాట ఎంత హాయినిస్తుందో కదా! సృష్టిలోని అందాలన్నీమన కళ్ళముందు నిలిపిన ఆ చిత్రకారుడు ఎవరబ్బా అనే జిజ్ఞాస తో పాటు మాటలలో పొదగ లేని అనుభూతి కలుగుతుంది.

సరిగ్గా అలాంటి అనుభూతే రచయిత్రి వారణాసి నాగలక్ష్మి రాసిన “వేకువపాట” పుస్తకాన్ని చదివినప్పుడు కలిగింది. ఆమె రచయిత్రే కాకుండా, చిత్రకారిణి కూడా కావడం తో ఆమె రాసిన కథలు ఎన్నో వర్ణాలతో చక్కటి సొబగులతో అందమైన చిత్రమాలికలా ఆవిష్కృతమైయ్యాయి. పుస్తక ముఖచిత్రం తనే గీసి, అందమైన వేకువ పాట బొమ్మని చిత్రీకరించుకున్నారు. సరళంగా సాగి పోయే శైలితో అత్యద్భుతమైన కథలను రాసిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది.

ఆమె రాసిన “ఆలంబన”, “ఆసరా” అనే కథాసంపుటాలు, “వానచినుకులు” అనే లలితగీ తమాలిక “ఊర్వశి” అనే నృత్య నాటిక పుస్తకాలుగా ప్రచురించారు.
  
ప్రస్తుతం ఈ వేకువపాట సంకలనంలో ఉన్న చాలా కథలు వివిధ కథల పొటీలలో బహుమతులు గెలుచుకున్నవే. ఆమె కథలన్నీ కూడా కుటుంబం చుట్టూ అల్లుకుని ఉంటాయి. మానవ సంబంధాలలోని అనేక రకాల సంఘర్షణలను, సమస్యలను, ఆవేదనలను  చూపించడం తో పాటుగా వాటిని ఎదుర్కునే అవసరాన్ని కూడా రచయిత్రి చెప్పడానికి పూనుకున్నారు. Contemporary Subjectsని కథా వస్తువుగా తీసుకోవడంతో పాటు వాటిని కథలుగా మలచడం లోను చక్కటి నేర్పరితనం చూపించారు. ఇక ఈ కథాసంకలనం లో పందొమ్మిది కథలు ఉన్నాయి.  ప్రతి కథ కూడా మొదటి అక్షరం నుండి చివరి వరకు ఉత్కంఠతో ఆపకుండా చదివిస్తాయి.

ఈ పుస్తకానికి  ప్రఖ్యాత రచయితలు కాత్యాయనీ విద్మహే గారు, శ్రీధరు గారు చక్కటి విశ్లేషణ పూర్వకమైన ముందు మాటలు వ్రాసారు.

కథల క్రమంలోకి వెళితే మొదటిగ స్వాతి సపరివారపత్రికలో బహుమతి పొందిన కథ సరళీస్వరాలు ఒక్కరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సంగతుల సమాహారం. ఈ టెక్నాలజీ యుగంలో మనిషి మనిషికి మధ్య దూరం పెరగడం, అవసరాలు తీరిపోతున్నాయి కదా అనుకోవడము, మనసులు విప్పి మాట్లాడుకోకపోవడం, అదీ కాకుండా డబ్బుసంపాదన కోసం ఎండమావుల వెంట పరుగులు పెట్టడం ‘ఇవన్నీవద్దు! జీవితాన్ని సంక్లిష్టం చేసుకోకుండా సరళం చేసుకొని సంతోషంగా ఉండమని’ తల్లి పాత్ర ద్వారా తెలియజెప్పారు. ‘సంగీతం సప్తస్వరాల సమ్మేళనం, ఏ స్వరం సరిగ్గాలేకపోయినా ఆ మేళనం జరగదు. జీవితం కూడా అంతే! ఎవరి వంతు భాద్యత వాళ్ళు నిర్వర్తిస్తుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ మాత్రం అపశ్రుతి కలిగినా సమస్యలు తప్పవు’ అన్న సూత్రాన్ని చెబుతూ సున్నితంగా హెచ్చరించారు.

రెండవకథ “ఆ నాటి వానచినుకులు” : అపార్థాల వెల్లువలో కొట్టుకుపోయి విడిపోయిన శిశిర,వసంత్ లు, చిన్న ఇంట్లో గడిపిన మధురక్షణాలు గుర్తుకు తెచ్చుకొని, ‘ఇల్లు చిన్నదిగా ఉన్నప్పుడు, హృదయాలు విశాలంగా ఉండేవి ముచ్చట పడి ఇష్టంగా కొనుక్కున్న పెద్ద ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి, దూరాలు పెరిగి, మనసులు ఇరుకుగా అయ్యాయి. దాని ఫలితం విడాకులు. అహం విడనాడి, సద్దుబాటుతత్వం అలవాటు చేసుకొని ఉంటే ఈ ఎడబాటు ఉండేది కాదని’ ఉత్తరాలలాంటి ఈ-మెయిల్ ద్వారా మనసులు దగ్గర చేసుకుని మళ్ళీ వాళ్ళు కలవడం ఈ కథ లోని ముఖ్యాంశము.

మూడవకథ శుభరాత్రి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కథాసదస్సులో ఒక పరిష్కారదిశగా, పాజిటివ్ కోణంలో రాసిన ఉత్తమ కథ.

నాలుగోకథ విముక్తలో ఒక తల్లి తన రెక్కల కింద పిల్లలని పొదువుకొని తనకేమైనా పర్వాలేదు పిల్లలు మటుకు బావుండాలని కోరుకుంటుంది. కాని కడుపు చించుకుని పుట్టిన పిల్లలే రెక్కలొచ్చి కన్నతల్లి ఉనికిని సహించలేకపోతుంటే ఆ తల్లి తన ప్రేమపాశ బంధాలనుంచి విముక్తం అవాలని కోరుకుంటుంది. ఈ కథ చదువుతుంటే మనస్సు భారమయి కళ్ళుచెమ్మగిల్లుతాయి.

ఐదవ కథ నాన్నకో ఈ మెయిల్, ఈ కథ తండ్రికి ఓ కూతురు తన మనసులో ఉన్న ఆవేదన తెలుపుతూ, రాసిన ఈ-మెయిల్. తను భర్త రెండో సారి ఆడపిల్ల పుట్టడం పై అసంతృప్తి వెళ్ళగక్కిన సంగతి చెబుతూ ‘ఈ రోజున సగటు మగవాడు అతను, రేపు పిల్లలు ఎదిగి గొప్పవాళ్లు అయినప్పుడు ఆడపిల్లలు మా ఇంటి జ్యోతులు అని చెప్పుకుంటూ తిరిగే ఓ తండ్రి. కాని పిల్లలు ఆ స్థాయికి ఎదిగేంత వరకు మీ పాత్ర అస్సలు ఉండనే ఉండదు అని తెలిసింది. మేము పుట్టినప్పుడు “హు! ఇద్దరు ఆడముండలే” అని నువ్వన్నావని అమ్మమ్మ చెబితే నమ్మలేకపోయాను. తరువాత నువ్వు మారావు అది వేరే సంగతి కాని ఏదో ఆవేదన, ఇవన్నీ, నిన్ను బాధపెట్టలని కాదు నాన్నా, నీ వెనకాలే మా తరం లో కూడా అదే వివక్షత చూపించడం చాలా దుఃఖంగా ఉంది’ అని కూతురు పాత్ర ద్వారా చాలా హృద్యంగా రాసారు రచయిత్రి.

అరుణోదయం, నేను అమ్మనవుతా, వెన్నెలకిటికీ, అయినవాళ్ళు, పుష్య విలాసం, సహజీవనం, పరిమళించే పూలు లాంటి కథలు విభిన్న కథాంశాలతో పాఠకులని చదివింపజేస్తాయి.

అమ్మ ఒక రూపం కాదు ఈ కథ చదవడానికి చాల సింపుల్ గా అనిపిస్తుంది, ఎవరైనా పిల్లలతో ప్రేమ గా ఉంటే సరి వాళ్ళే దగ్గరకు వస్తారులే అనుకోవడం వద్దు. కాని ఇక్కడే రచయిత్రి ఒక చక్కటి సందేశం పిల్లవాడి ద్వారా చెప్పించారు. పైకి కనిపించే ఫిజికల్ అప్పియరెన్స్ కన్నా మనసుతో మాట్లాడే ఒక కంఫర్ట్నెస్ ని తన టీచర్ లో చూడగలుగుతాడు నాలుగేళ్ల పిల్లవాడు. అందుకే ఈ కథ మనసు లోపలకి చొచ్చుకొని పోతుంది.
కొమ్మకొమ్మకో సన్నాయి కథ లో సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా ఒక గృహిణి తనని తాను ఉత్సాహపరచుకోవడం, అదీ ప్రకృతి ద్వారా తెలుసుకోవడం ఈ కథలోని ప్రత్యేకత. ఈ కథ లో రచయిత్రి లోని కవయిత్రి కూడా మనకి కనిపిస్తుంది.

IMG-20151015-WA0004అమ్మ, నాన్న ఓ కాలేజీ అబ్బాయి ఈ కథ లో పిల్లల చదువులు గురించిన సమస్యని ఒక విభిన్న కోణంలో స్పృశిస్తూ నాణానికి రెండో పక్కన చూపించారు రచయిత్రి. ఈ కథ ప్రథమ బహుమతి పొందిన కథ. మరో విశేషం- ప్రముఖ రచయత యండమూరి వీరేంద్రనాథ్, “‘పిల్లల పెంపకం’ ఒక కళ అనే పుస్తకం లో ఈ కథలోని మరో కోణం యొక్క వాస్తవం అర్థమయిందని” రాసుకున్నారు.

వారధి కథ లో అమ్మ పాత్రధారి రాజేశ్వరి రిషికేశ్ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు ఆమె ఆలోచన విధానంలో మార్పుని తెస్తాయి. రాజేశ్వరి జీవితాన్ని, ప్రవహించుకుంటూ ఒడి దుడుకులను దాటుకుంటూ సాగి పోయే గంగానదితో పోల్చడం రచయిత్రి యొక్క ప్రతిభను తెలియపరుస్తుంది.

చక్కటి వైవిధ్యమైన కథలని ఒక చోట గుదిగుచ్చి సహజపరిమళాలు వెదజల్లే అందమైన “గుల్ దస్తా” ని అందించారు. ఆ కథల గుబాళింపుని పాఠకులు అందరూ కూడా ఆస్వాదించాలని ఆకాంక్షిస్తూ…

మణి వడ్లమాని

Books available at:
Navodaya, 040-24652387
Telugu book House,9247446497
And all leading Book stores

You Might Also Like

Leave a Reply