అగ్గిపెట్టెలో ఆరుగజాలు
వ్యాసకర్త: మణి వడ్లమాని
************
అసలు చేనేత అదేనండి, హ్యాండ్ లూం చీరలు అంటే మొదటినుంచి ఇష్టం. అసలు ఆడవాళ్ళకి చీరలకు అవినాభావ సంబంధం ఎలాగూ ఉండనే ఉంది. బండారులంక, పుల్లేటికుర్రు, భూదాన్ పోచంపల్లి, బొబ్బిలి, ధర్మవరం,గద్వాల్, ఉప్పాడ ఇలా ఆయా ఊళ్ళు వెళ్లి డైరెక్ట్ గ మగ్గాల దగ్గరనుండి మరీ కొనుక్కునే వాళ్ళము. ఒకసారి బొబ్బిలి వెళ్ళినప్పుడు కొన్ని చీరలు కొందామని ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు దుకాణంకూడా ఒకటే.
ముందు ఇంటికి వెళ్ళగానే అక్కడ చూసింది .. రెండే గదులఉన్న ఆ చిన్న ఇంట్లోనే మూడు మగ్గాలు ఉన్నాయి.అప్పుడు ఎవరైనా వచ్చి ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు అన్ని కొనుక్కొని నేస్తారుట. కొంతమంది చీరలు నేసాకా డబ్బులు ఇస్తామని చెప్పి, చీరలు పట్టుకెళ్ళి పోతారు. డబ్బు మటుకు తిప్పించి తిప్పించి ఇస్తారు అని చెప్పాడు. ఇన్ని కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న అతనితో అన్నాను: “పోనీ వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా?”
“ఇది మా కుల వృత్తి,ఉన్న ఊరుని వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా? ఏదో నేనే తంటాలు పడుతునున్నాను” అని అన్నాడు.
దీనంగా ఉన్న అతని భార్య పిల్లలు.. ఆ చీరలు ఇప్పుడు ఎక్కువగా ఎవరు కొనటం లేదు అని నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్ళే స్థితి లో లేదని చెప్పుకొని బాధ పడ్డాడు. అక్కడ పరిస్థతి చూసి రెండు చీరలు కొందామని వెళ్లి అర డజన్ చీరలు కొన్నాను. అప్పటి నుంచి ఏదో ఒక చెప్పలేని ఫీలింగ్. అందుకే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలని చేనేత చీరలు తప్పకుండా కొంటాను. ఏదో ఉడతాసాయం.
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా!
మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది. వ్యవసాయం తర్వాత గ్రామీణ రంగంలో ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. అలాంటి చేనేత కార్మికుల కుటుంబాలు ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాయని అందరికీ తెలుసు. పొట్టకూటికోసం చేనేత కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధిమార్గాలు అన్వేషించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అటకెక్కుతున్న మగ్గాలే దీనికి నిదర్శనం.
ఇది మనదేశంలో ఉన్న ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక సమకాలీన సమస్యని తీసుకొని కధను అల్లుకుంటూ సజీవపాత్రలను సృష్టించి, డాక్టర్ మంధా భానుమతి గారు “అగ్గిపెట్టలో ఆరుగజాలు” రాసారు. ఇది చేనేత కారుల జీవన చిత్రం. ఈ నవలను రాయడం నిజంగా ఆమెకి సమాజం పట్ల ఉన్న భాద్యతని తెలియజేస్తోంది. ఈ నవల మొదట ఆంధ్రభూమిలో సీరియల్ గా వచ్చింది. నేతన్నల జీవితం ప్రతిబింబించేలా ఉండే ఈ నవల చదివిన తరువాత దాని తాలుకు అనుభూతిని అందరితో పంచుకోవాలనిపించింది.
ముందు మాట రాసిన అంబల్ల జనార్ధన్ గారు ఇలా అన్నారు “నేతన్నల సామజిక వర్గానికి చెందిన నాకు కూడా తెలియని విషయాలను సేకరించి ఈ నవలలో పొందుపరచారు. ఆ విధంగా ఆవిడ ఎంతో మేలు చేసారు ఆవిడకి హృదయపూర్వక కృతజ్ఞతలు.”
ఇక సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు తన ముందుమాటలో “ఈ చేనేత పరిశ్రమ విషయసేకరణకి ఆవిడ చాల శ్రమపడి ఉంటారు. ఎందుకంటె ప్రతి చిన్న విషయం కూడా, వాళ్ళు వాడే పరికరాల పేర్లు గాని, వాడే విధానం గాని, వారు మాట్లాడే మాటలు గాని రిసెర్చ్ చేసి రాసారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నంచని ఓ కొత్త కథావస్తువుతో పాఠకులకి పరిచయం చేసారు.” అని వ్రాసారు.
అసిస్టెంట్ డైరెక్టర్, హ్యాండ్లూం&టెక్స్టైల్స్, శ్రీమతి విజయపల్లవి బోయి ఈ నవలకు ముందుమాట రాయడం చాలా ఆప్ట్ గా ఉంది. ఆవిడ కొంతమంది ప్రసిద్ధ చేనేత కారులను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ వాళ్ళు మనతెలుగువారు అవడం మనకెంతో గర్వకారణం అని రాసారు.
ఇక రచయిత్రి మాటలలో ఏ రచయత అయినా తను సృజించిన రచనలలో కొన్నిటిని పదేపదే ప్రస్తావించడం చూస్తాము. కారణం ఎంచుకున్న కథావస్తువు, దాన్ని అక్షరబద్ధం చేసేటప్పుడు పడిన తపన, కృషి ఇత్యాది అంశాలు ఉంటాయి. “వారి జీవనవిధానం తెలుసుకోవడానికి పోచంపల్లి, బనారస్, మంగళగిరి మరియు బండారులంక వెళ్లి అక్కడున్న మాస్టర్ వేవేర్స్ తో మాట్లాడి, నేత కార్మికులని కలసి మగ్గాల మీద ఎలా నేస్తారో గమనించాను. అదిగాక ఇందులోని పాత్రలు చాలామంది నే కలసి మాట్లాడిన వారే. ఈ నవలని నేను ఆశావహదృక్పథంతో రాసాను” అని రాసుకున్నారు.
ఇక కథలో కి వెళితే అసలు వలువలు సృష్టి ఎలా జరిగింది, అనే సంగతిని చరిత్రనుండి మొదలుపెట్టి, మొగలుల కాలానికి షాజహాన్ చక్రవర్తి, కూతురు జహానార పెళ్ళికి ధరించిన దుస్తులు చూస్తూ ఆ చేనేత పనితనానికి అబ్బురపడతాడు. ఇక 18,19 శతాబ్దాలు భారత చేనేత కారులకు చీకటి యుగం. బ్రిటిష్, ఫ్రెంచ్ వారు జరిపే ఆధిపత్యపోరులో దేశంలో అల్లకల్లోల పరిస్థితిల మధ్య మామూలు వస్త్రాలు కూడా కొనుక్కోలేని దుస్థితి. బెంగాల్లో అనిశ్చిత పరిస్థతి,రాబర్ట్ క్లైవ్ దురహంకారం, అర్థరాత్రి చేనేత కార్మికుల నివసించే పేటల్లో క్లైవ్ సైన్యం వీరవిహారం. ఎగుమతుల మీద మోయలేని సుంకం విధించడం, ఆంక్షలు పెట్టడం జరిగినప్పుడు ఢాకా నుంచి ఒక చేనేత కార్మికుడు అతి సన్నని మస్లిన్ బట్టతో ఎంతో శ్రమకు ఓర్చి, ఆరుగజాల చీరను అగ్గిపెట్టెలో అమర్చి విక్టోరియా మహా రాణికి కనుక పంపితే, మెప్పు లభించి, చరిత్రపుటలలోకి ఎక్కింది. కాని ప్రతిభను మాత్రం గుర్తించలేదు.
1920 ప్రాంతంలో గాంధీగారు ఖాదీ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ విధంగా గ్రామాలలో రాట్నాలు తిరగడం మొదలుపెట్టాయి. మగ్గాల శబ్దాలు వినిపించసాగాయి. స్వతంత్రభారతంలో చేనేత పరిశ్రమలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. ఆ పరిణామక్రమంలో నేతన్న తన ఉనికినే కోల్పోవడం, మొదలు పెట్టాడు ప్రభుత్వ ఆర్థిక విధానల వల్ల చాలామంది నేత కార్మికుల జీవితాలు చీకటిగా మారాయి. అప్పటి నుంచే దేశం మొత్తం మీద నేతన్నలకు బ్రతుకే భారం అయి ఆత్మహత్యలు చేసుకోవడం మొదలయింది. కొంత మంది నేతన్నలు బ్రతుకు తెరవు కోసం వలస కూలీలుగా మారిపోయారు.
ఇలాంటి పరిస్థితి నుంచి మార్పు కోరుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమప్రాంతం లో అతి పెద్ద బిజినెస్ సెంటర్ అయిన అంబాజీపేటలో కథా నాయకుడు భద్రంతో మొదలయిన కథ ఎన్నో మలుపులు తిరిగింది. మరెందరో పాత్రలు తమతమ వంతుగా వచ్చి కథను నడిపిస్తూ మనలని కూడా వాళ్ళతో పాటే తీసుకెళతారు. వీర్రాజు, లక్ష్మి, ఉమా రావమ్మ, సోమశేఖర రాజు, దేవ్, గోపి, మీనా, ఇంకా యెంత మందో గుంటూరు, మంగళగిరి, అమలాపురం, బండారులంక, బొంబాయి, మద్రాసు, బెనారస్ ఆఖరిన దేశ రాజధానిలో ఇద్దరు నేత కార్మికుల (ఆ ఇద్దరు భార్యాభర్తలు) పద్మభూషణ్ అందుకోవడంతో నవల ముగుస్తుంది.
నేత కార్మికుల తమ జీవితాలని తామే మెరుగు పరచుకుంటూ అంచెలంచెలుగా ఎదగడం, అందుకు కొత్త తరంలో వచ్చిన మార్పులు, ప్రోఫెషనల్ కోర్సులు, కంప్యూటర్స్, ఫాషన్ టెక్నాలజీ సాయం తీసుకోవడం, మంగళగిరి లక్ష్మికి, బండారులంక భద్రానికి జోడి కలవడం, ఆ ప్రేమ పెళ్ళిగా మారడం, కింద స్థాయి నుంచి ఉన్నత చదువులు చదివి పైకి ఎదగడం, ఇవన్ని కూడా చేయి తిరిగిన రచయిత్రి కావడంతో చాల చక్కగా, పట్టుగా నడిపించారు. కుటుంబ వ్యవస్టలో వచ్చిన మార్పులు నేతన్న కుటుంబాల కథలు, వ్యధలు మన కళ్ళముందు పరచారు. నవల ఆద్యంతం చదివాకా ఓ ప్రయోజనాత్మక నవలను చదివిన అనుభూతి మనకు మిగులుతుంది.
చివరగా ఈ నవలను చదివిన బి.రాములుగారి అభిప్రాయాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. “చేనేత కార్మిక కుటుంబంలో పుట్టి, చేనేత కార్మికుల జీవితాలను ఒక నవలగా రాయలేకపోయాను. ఈ నవలను చేనేత కులాలలో పుట్టిన ప్రతి ఒక్కరూ చదివి తమ ప్రాచీన, ఆధునిక జీవితాల పరిణామాలను తెలుసుకోవాలి. విస్తారంగా పర్యటించి, పరిశోధించి వాటన్నిలో చాలామేరకు నవలా రూపంలో ఇమడ్చడానికి విశేష కృషి చేసిన రచయిత్రి మంథా భానుమతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
LakshmiRaghava
చక్కటి విశ్లేషణ!
Bharati Prakash
బావుంది, మణీ!
cbrao
సమీక్ష ఆసక్తికరంగా ఉండి, పుస్తకం చదివించేదిలా ఉంది. డిసంబర్ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం కూడా కొన్నాను. వీలువెంబడి ఈ పుస్తకం చదువుతాను.
మంథా భానుమతి
ధన్యవాదాలు మణీ. చాలా చక్కగా విశ్లేషించావు.