అతను – ఆమె – కాలం

~ కొల్లూరి సోమ శంకర్
పుష్కరకాలంగా కథలు వ్రాస్తూ, ఇప్పటికి డెబ్భయి కథలకి పైగా వ్రాసిన శ్రీమతి జి.ఎస్.లక్ష్మి గారి మొదటి కథా సంపుటి ఇది. ఇందులో 23 కథలున్నాయి. వాటిల్లో 16 వివిధ బహుమతులు పొందిన కథలు. మరికొన్ని వివిధ భాషలలోకి అనువాదమై ఇతర భాషీయులను కూడా అలరించినవి. ఈ పుస్తకంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

***

ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం తిరుపతి వెళ్ళడమే. ఆ తరువాత ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేదా ఆ కుటుంబం. ఏ గుడిలోను అన్నదానానికో మరేదే పుణ్యకార్యానికో విరాళాలు ఇవ్వలేదు. అయినా బోలెడు పుణ్యం సాధించామని చెబుతుందా ఇల్లాలు. ఇంటాయనకి తెలియకుండా ఆమె ఏ ఘనమైన దానం చేసి పుణ్యం సంపాదించింది? తెలుసుకోవాలంటే చదవాలి “ఏది పుణ్యం” కథని.

ఒక్కొక్కసారి మనకి తెలిసిన విషయాలయినా సరే ఎదుటిమనిషి నోటి వెంట వింటూంటే బాగుంటుంది. మరి అత్తగారికి తెలిసిన ఏ విషయాన్ని కోడలు ఆమెకి మళ్ళీ తెలిసేలా చేసిందో “దాంపత్యం” కథలో చదవచ్చు.

పిల్లలకి ఏం కావాలో తల్లికి ఎవరూ చెప్పక్కరలేకుండానే తెలిసిపోతుంది. పిల్లల భవిష్యత్తుకు బాల్యం నుంచే బంగారు బాట వేయాలనుకునే తల్లిదండ్రులు తమ అబ్బాయిని గొప్పవాడిని చెయ్యాలని అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఓ శిక్షకురాలిని సైతం ఏర్పాటు చేస్తారు. ఆ పిల్లాడు ఏం కోరితే అది కొనిస్తూంటారు అమ్మానాన్నలు. వాడో రోజూ మూన్ కావలాంటాడు. తండ్రేమో కొడుకు వ్యోమగామి అయిపోతాడని సంతోషపడితే… తల్లికి అనుమానం వస్తుంది – అసలు చందమామని ఎందుకడిగాడా అని. నిజం తెలుసుకున్నాకా ఆమెకి అర్థమవుతుంది – కొడుకుకి కావల్సింది చందమామ కాదని! ఆ కొడుకు కోరుకున్నదేదో తెలుసుకోవాలంటే చదవాలి “చందమామ రావె” కథని.

వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతూ ప్రశ్నించే కథ “ఇది ఇలా సాగవలసిందేనా?”. సామాజిక సేవ పేరిట స్వలాభం చూసుకునేవారితో పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ కథ సూచిస్తుంది.

ఈ పుస్తకానికి శీర్షికగా నిలిచిన “అతడు – ఆమె – కాలం” కథ ఈ సంపుటికే మకుటాయమానమైన కథ. భార్యాభర్తల మధ్య ఏర్పడిన అపోహలను కాలం తొలగించడం మంచిదే. అయినా ఈ కథలోని భార్యాభర్తలు తమని తాము మార్చుకోడానికి చాలా కాలం తీసుకున్నందుకు ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. ఇంట్లో భార్యని పట్టించుకోని భర్తలు, తాము అనుకున్నది జరగలేదని భర్తని నిర్లక్ష్యం చేసే భార్యలు ఎంతో మంది ఉన్నారు. భార్యాభర్తలు ఎలా మసలుకుంటే నిజమైన కాపురం అవుతోందో ఈ కథ చెబుతుంది.

తను ఊహించుకున్నదే నిజమని, ఎదుటివారేదో కష్టాల్లో ఉన్నారని భావించి వారినేదో ఉద్ధరించాలనుకున్న ఓ యువతికి “నాణానికి మరోవైపు” చూడమని సలహా నిస్తారు వృద్ధ దంపతులు. వాస్తవాలు తెలుసుకోకుండా హడావుడి చేయకూడదని ఈ కథ చెబుతుంది.

ధైర్యం చేసి సముద్రాలు దాటి వెళ్ళిన పార్వతమ్మకి లభించిన పెన్నిధి ఏది? దేశం కాని దేశంలో ఆమెకి నిశ్చింత ఎలా కలిగింది? చదవండి “పెన్నిధి దొరికింది” కథ.

తండ్రి మీద అలిగి ఇల్లు వదిలి పోయిన కుర్రాడు తన తప్పు ఎలా తెలుసుకున్నాడో, తండ్రి తన లోపమెలా గ్రహించాడో చెప్పే కథ “కాస్త ఆలోచిస్తే…”. ఒకరినొకరు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే కుటుంబ సభ్యుల మధ్య అపోహలు తొలగి అందరూ ఆనందంగా ఉండగలరని ఈ కథ చెబుతుంది.

ఓ గొప్ప సంస్థకి సి.ఇ.ఓ.గా ఎంపికయిన వ్యక్తి తన ఘనతకి కారణం తల్లని చెబుతాడు. తన తల్లి ఉమ్మడి కుటుంబంలో బంధువులందరితోనూ నెగ్గుకొచ్చిన తీరు మోడరన్ మేనేజ్‌మెంట్ పాఠాలకు ఏమాత్రం తీసిపోదని చెబుతాడో ఇంటర్వ్యూలో. ఆసక్తిగా చదివించే కథ “ఇప్పుడైనా చెప్పనీయమ్మా…”.

విలువల సంఘర్షణ ఇతివృత్తంగా సాగిన కథ “మరో కోణం”. తమ సంస్కృతికి వ్యతిరేకంగా రాసి పాపులర్ అయిన ఓ రచయిత పైరవీ చేసి అవార్డు తెచ్చుకుంటాడు. అతడిని అభినందిస్తూ, ఓ సభ ఏర్పాటవుతుంది. ఇన్నాళ్ళు ప్రజలు దేనిని పట్టించుకోరని భావిస్తూంటాడా రచయిత. కాని జనాలు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళన చేస్తారు. సన్మానకర్తలు/సభ నిర్వాహకులు ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కాని, ఒక్కరు కూడా రచయితని హెచ్చరించరు. ఇది ఎదురు డబ్బిచ్చి సభలు నిర్వహింపజేసుకుని, వాటిల్లో తమని పొగిడింపజేసేలా చూసుకునే వ్యక్తుల స్వభావాన్ని పట్టి చూపిన కథ. అటువంటివారితో జనాల ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని చెప్పడం బాగుంది.

వృద్ధులూ, పసిపిల్లలూ ఒకటేనని.. వారికి కొన్ని కోరికలుంటాయని చెబుతుంది “ఒఖ్ఖ రెండు రూపాయలు”. ఆర్ద్రంగా పాఠకుల మనస్సుని కదిలిస్తుందీ కథ.

తన గత జీవితం తలచుకోడానికి ఇష్టపడని ఓ వ్యక్తి అల్లిన ఆ కథ ఏమిటి? లేని వ్యక్తులను ఉన్నట్లుగా ఎందుకు భ్రమింపజేశాడు? లోకం పోకడలకీ, మనుషుల మనస్తత్వాలకీ అద్దం పట్టిన కథ “మూర్తిగారొచ్చారు”.
పెరిగి పెద్దయి సంపాదనలో పడ్డ పిల్లల తల్లితండ్రులను కరిపేపాకుతో పోలుస్తారు తులసమ్మ. కరివేపాకు కేవలం పరిమళం కోసమని భావించి వంటల్లో వేస్తారు, కాని తినేముందు కంచంలోంచి తీసి పారేస్తారు. కరివేపాకు తింటే కలిగే మేలు వాళ్ళకి తెలియదు. సంఘంలో గౌరవం కోసం తల్లిదండ్రుల పట్ల ప్రేమ కనపరిచినా, ఇంట్లో మాత్రం వాళ్ళని తీసిపారేస్తుంటారు పిల్లలు. అటువంటి పిల్లల కథే “మేడిపండ్లు…”.

పిల్లల పెంపకం ఎలా ఉండాలో, పిల్లలకి అసలేం నేర్పించాలో చెప్పే కథ “మీరే నేర్పాలి..”. భవిష్యత్ తరాల వారు ఆనందంగా జీవించాలంటే నేడేం నేర్చుకోవాలో చెప్పే కథ ఇది.

దేశంలో ఎక్కడ చూసినా వెర్రితలలు వేస్తున్న ఓ ముఖ్యమైన సమస్యని “ప్రత్యక్ష సాక్షి” కథలో చెబుతారు రచయిత్రి. సమస్యకి పరిష్కారమేమీ సూచించరు కాని, ఆలోచించేలా చేస్తారు.

తండ్రి షష్టిపూర్తి వేడుకకి పుట్టింటికి వెళ్ళాలనుకున్న కాత్యాయనికి ఎన్ని ఆటంకాలు? ఎంతమందిని అడగాల్సి వచ్చింది? వాళ్ళందరూ ఎందుకు వద్దన్నారు? చివరికి భర్త ఏమన్నాడు? “కలవారి కోడలు కలికి కామాక్షి” అనే పాటని అన్వయిస్తూ… ఉమ్మడి కుటుంబంలో ఉండే ఒక్కో బంధువును తలచుకుంటూ… ఆహ్లాదంగా సాగిన కథ “కలికి కాత్యాయిని”.
కడుపారా తినాలని ఓ ఇంటికి భోజనానికి వెడితే, అక్కడ మనం కడుపుబ్బా నవ్వుకునే ప్రహసనం ఎదురవుతుంది. ఎక్కడా? ఏమిటి? ఎందుకు? చదువుతూ నవ్వేసుకునే కథ “డిజైనర్ ఫుడ్”. తెలుగువాళ్ళ అసలైన డిజెనర్ ఫుడ్ ఏమిటో ఈ కథ చెబుతుంది.

వివాహ ప్రక్రియ ఓ ‘ఈవెంట్ షో’గా మారిన వైనం తెలుసుకోవాలంటే చదవాలి “కొత్త సీసాలో పాత సారా”. హాస్యకథలో పోటీలో బహుమతి గెల్చుకున్న కథ. నవ్విస్తునే చురకలు వేస్తుంది.
మునిమనవడి సంబరం, ఇస్తినమ్మ వాయనం… పుచ్చుకుంటినమ్మ వాయనం, వెర్రిబాగుల వదిన వ్రత కథ, జయహో వదిన.. వంటి కథలు హాయిగా చదివిస్తాయి.

***

మన జీవితాల్లో క్రమంగా పలచబడుతున్న ఆప్యాయతలనూ, సమాజంలో మృగ్యమవుతున్న మానవతని, మనుషులు సమిష్టివాదం నుంచి వ్యష్టివాదం వైపు మొగ్గు చూపడాన్నీ ఈ కథలు కళ్ళకు కట్టినట్టు చూపుతాయి. చక్కని ఇతివృత్తాలతో, ఆకర్షణీయమైన శైలితో, సులభంగా చదివిస్తాయి అన్ని కథలు. 200 పేజీలున్న ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రలలోనూ లభిస్తుంది. వెల రూ.150/- ప్రతులకు రచయిత్రినీ సంప్రదించవచ్చు. ఈబుక్ కినిగెలోనూ లభిస్తుంది.
రచయిత్రి చిరునామా:
Smt. G. S. Lakshmi
2-2-23/7/1, Bagh Amberpet,
Hyderabad 500013
Ph: 040-27425306
Email: slalita199@gmail.com

You Might Also Like

One Comment

  1. G.S.Lakshmi

    ధన్యవాదాలు సోమశంకర్ గారూ…

Leave a Reply