పెద్దల కోసం బాలశిక్ష – “చిల్డ్రన్ అండర్‌స్టాండింగ్”

వ్యాసకర్త: సోమశంకర్ కొల్లూరి
*******************

జీవితంలో ఏ కష్టాలూ లేని వ్యక్తులు ఉంటారా? ఉండరు. ఎంత కష్టమున్నా లేనట్లుగా నవ్వుతూ, సరదగా జీవించే వ్యక్తులు ఉంటారా? ఉన్నారని గుర్తిస్తే, వారిలో మరపురాని మాణిక్యం బ్నిం గారు.” అంటారు శ్రీ స్వామి పరిపూర్ణానానంద. బ్నిం గారితో ఏ కాస్త పరిచయమున్నా, ఈ వాక్యాలు ఏ మాత్రం అతిశయోక్తి కావని తెలుస్తుంది. కథా రచయిత, పద్యకారుడు, చిత్రకారుడు, టీవీ మాటల రచయిత, కూచిపూడి నృత్య రూపకాల రచయిత, నాలుగు నంది అవార్డులు గెలుచుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలిగా బ్నిం గారు అందరికీ తెలుసు. శ్రీ పీఠం పత్రికలో బ్నిం గారు వ్రాసిన చిన్న చిన్న వ్యాసాల సంకలనం చిల్డ్రన్ అండర్‌స్టాండింగ్“. పిల్లల్ని సరిగ్గా పెంచడమంటే, భావితరాన్ని సక్రమ మార్గంలో నడపడమేనని, అందుకు ముందుగా పెద్దలు పిల్లలని అర్థం చేసుకోవాలని ఈ పుస్తకం చెబుతుంది. నేటి తరంలోని పిల్లలు ఏం కోల్పోతున్నారో చెబుతుంది ఈ పుస్తకం. అలా కోల్పోవడానికి తల్లిదండ్రులు, పెద్దలు ఏ విధంగా కారణమవుతున్నారో చెబుతుంది. 25 వ్యాసాలున్న ఈ పుస్తకం హాయిగా చదివింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది.

చదువులమ్మ పండగ!అనే వ్యాసంలో నిజమైన చదువంటే ఏమిటో తెలుస్తుంది. “చదువంటే స్వతహాగా మనకి ఉన్న అభిరుచి పెంచుకోవడం పాత దారిలో నడుస్తూ కొత్త మార్గం కనుక్కోవడం ఇన్ని తరలుగా అందుతూ వస్తున్న తెలివితేటలని అనుసరించి మరింత విస్తరింపజేయడం అందుకోసం ముందుకు దూసుకెళ్ళడం అన్నమాట!!” అని అంటారు బ్నిం. “ప్రతీ కళకీ, ప్రతి విద్యకి ఓ ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణం పేరు చదువు‘. ఈ చదువుల్నే విద్యలుఅంటారు. ఎన్ని రకాల విద్యలు ఈ ప్రపంచంలో ఉన్నాయోమనం గమనిస్తే ఎంతమంది విద్యావంతులున్నారో తెలుస్తుంది. ఇన్ని విద్యల్లో ఏదీ ఎక్కువా కాదుఏదీ తక్కువా కాదు…” అంటారు రచయిత.

పిల్లలు అన్నం తినట్లేదు, ఏడిపించేస్తున్నారు…” అని వాపోయే అమ్మలకు అసలు పిల్లలు ఎందుకు తినట్లేదో ఆలోచించాలని సూచిస్తారు రచయిత. గడచిన తరం పిల్లలకి కథలు చెబ్తూ, ‘ఇది చిలక ముద్ద, ఇది పిచిక ముద్ద, నాన్న ముద్ద, బాబాయ్ ముద్ద అంటూ చుట్టాల్నీ, చుట్టూ ఉన్న పశు పక్ష్యాదుల్నీ చూపిస్తూ, పరిచయం చేస్తూ, మాటలు నేర్పిస్తూ చందమామ పాటలు పాడుతూ, ఫ్రెండ్లీగా, ప్రేమగా తినిపించేవాళ్ళుఅని ఒకప్పటి మనందరి బాల్యాన్ని గుర్తు చేస్తూ; పిల్లలకి అన్నం అమృతం అవ్వాలంటే.. ఏం చేయాలో కూడా చెబుతారు. రుచి, రంగు, వాసనఈ మూడు బావుంటేనే గాని పిల్లలు తినరని గుర్తు చేస్తారు. ‘అమ్మగార్లూ! డోంట్ థింక్ అదర్‌వైజ్అని అంటూనే వైజ్‌గా థింక్ చేయమనిచెబుతారు చిలక ముద్ద పిచిక ముద్దవ్యాసంలో.

సహనావవతు సహనౌభునక్తు సహ వీర్యం కరవావహై…’ అనే శాంతిమంత్రానికి కొత్త అర్థం చెబుతారు రచయిత మనము ప్రాణికోటివ్యాసంలో. మనం మరిన్ని తరాలు, తరతరాలు కొనసాగాలంటే ప్రకృతితోనూ, ఇతర ప్రాణికోటితోనూ సహజీవనం కొనసాగించాలి. ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడాలని సూచిస్తారు.

పాటకన్నా పద్యం వీజీ!అంటారు బ్నిం. పద్యాలు పెద్ద కష్టం కాదనీ, సినిమా పాటలకన్నా తేలికగా పట్టుబడతాయని అంటారు. “వేమన శతకం, భర్తృహరి సుభాషితాలు వంటివి నేర్పకుండా తల్లిదండ్రులనీ, గురువులనీ గౌరవించడం, మంచీ చెడ్డా తెల్సుకోవడం మనకెలా తెలుస్తాయి?” అని అడుగుతారు.

అమ్మాయన కొడతావేం?

మమ్మీఅని పిలవమనుచు మము తిడతావేం?

మమ్మీ అంటే తెలియద?

ఇమ్మహిలో పాతినట్టి ఎప్పటి శవమో!

అంటూ ఉదాహరణకి ఓ కంద పద్యం వ్రాసి చూపారు.

ఈ వ్యాసానికి, తరువాతి వ్యాసానికి కనబడని లంకె ఉంది. పై వ్యాసంలో పద్యం ఎంత ముఖ్యమో చెబితే, “మధురాల తెలుగుఅనే తరువాతి వ్యాసంలో అసలు తెలుగు ఎంత అవసరమో చెబుతారు.

పద్యాలు, శతకాలు వినడం వల్ల ఎలాంటి మేలు కలుగుతుందో చెబుతారు వినడం వివేకంఅనే వ్యాసంలో. “వినడం వివేకానికి దారి. వింటేనే మాట్లాడడం వస్తుందిఅంటారు. మాట్లాడడం అంటే నోటికి ఏదొస్తే అది కాదు, సంస్కారవంతంగా మాట్లాడడం. సంస్కారం అలవర్చుకోడానికి నీతి శతకాలు ఎంతో దోహదం చేస్తాయి.

మనుషులంటే పిల్లలు కూడానోయ్అంటారు రచయిత. “మనకేం కావాలి? ఏది వద్దు? ఎవరు కావాలి? ఎవరు వద్దు? ఇది తెలుసుకోవడం ఆ రూట్లో ఆలోచించి, ఆ వే లో ప్రయాణించి, కావల్సిన గోల్ చేరుకోవడమే తెలివైన మార్గం.” అని చెబుతారు.

సెలవుల్లో మమ్మీ డాడీ మనల్ని ఏం చెయ్యమంటారో? ట్యూషన్ టీచర్‌తో ఇంకో రెండు గంటలు ఎక్కువ ఉండి, కొత్త క్లాసుల కోసం సిలబస్ నూరిపోయమని చెప్తారేమో! లేదా.. ‘ఆడు బేబీ ఆడు!’ టీవీ ప్రోగ్రాం కోసం గెంతులెయ్యమంటారేమో!” అని వాపోయే పిల్లల భయాలని దూరం చేస్తూ, ఏం చేస్తే సెలవలు పిల్లలకి ఉపయోగపడతాయో చెబుతారు రచయిత సెలవలొచ్చేశాయ్..!వ్యాసంలో.

భయం మంచిదా? ధైర్యం మంచిదా? అని ప్రశ్నిస్తారు రచయిత. ధైర్యం గొప్పదే కావచ్చు, కొన్నింటిలో భయాలు ఉండాలి. మన నడవడిక గుర్రం లాంటిది అయితే దాన్ని లెఫ్ట్ రైట్ తిప్పి నడిపించే కళ్ళేలు ఈ భయాలు, ప్రేరేపణలని చెబుతారు. మనల్ని వినయవంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దే భయభక్తులు ఉండాలని చెబుతారు ధైర్యం భయంఅనే వ్యాసంలో.

తియ్యగా, ప్రేమగా మాట్లాడడం బాలలకి ఎలా నేర్పాలో చెబుతారు మహత్తరమైనది మాట!అనే వ్యాసంలో. “రుచులు కనిపెట్టే నాలుక, దాన్ని లోపల ఉంచుకున్న నోరూ కలసి చేస్తున్న మరో పని మాటలని ప్రొడ్యూస్ చేయడం. తినడం అప్‌లోడింగ్ అయితే, మాట్లాడడం డౌన్‍లోడింగ్ అనుకుందాం. అప్‌లోడింగ్‍లో మన టేస్ట్ మనకే తెలుస్తుంది. డౌన్‌లోడింగ్‌లోని టేస్టు వినేవాళ్ళకు మాత్రమే తెలుస్తుందిఅని అంటారు బ్నిం.

అర్థం పర్థం లేని హోమ్ వర్క్స్‌తో పిల్లలనీ, తల్లిదండ్రులనీ ఇబ్బంది పెట్టే టీచర్లనీ, స్కూళ్ళనీ ఆలోచించమని చెబుతారు – “బాబోయ్.. ప్రాజెక్టు వర్ఖులు!అనే వ్యాసంలో.

హాయి లేని హాలీడేస్!వ్యాసం మనపై చురకలు వేస్తుంది. అసలు సెలవల్లోనే పిల్లల్ని నిజంగా ఎడ్యుకేట్ చేయగలం అంటారు రచయిత. ఎలాగో వివరించారు కూడా.

అన్ని రుచులను హితంగా, మితంగా తింటే చేదైనా జీవితాన్ని తియ్యగా మారుస్తుందంటారు తీపి మా చెడ్డ చేదువ్యాసంలో.

అయ్యోఅమ్మ మమ్మీ అయిపోయిందివ్యాసం పిల్లలకు తొలి గురువైన అమ్మఒకప్పుడు పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దేదో చెబుతూఇప్పటి పిల్లలు వాటినెలా కోల్పోతున్నారో చెబుతారు రచయిత.

Author Bnimఎవరైనా ఏదైనా కృషి చేస్తూఫలితం తగినంతగా పొందలేకపోతున్నప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగిపొమ్మని ఊతమివ్వలి గాని నిరుత్సాహపరచకూడదని అమావాస్యని దీపావళిగా మార్చేద్దామని అంటారు.

కొత్త కాలంలో కొత్త తరాన్ని తయారు చేయడానికి మనని మనం కొంత సంస్కరించుకోవాలి! మనం పిల్లల పట్ల చేస్తున్న మిస్టేక్ ఏంటో గమనిస్తే వాళ్ళని కంఫర్ట్‌బుల్‌గా ఉంచుతాం, పెంచుతాంఅని రచయిత అభిప్రాయపడ్డారు. ఈ దిశగా తల్లిదండ్రులని ప్రేరేపించే పుస్తకం ఇది.

శ్రీ పీఠంవారి 64 పేజీలున్న ఈ పుస్తకం శ్రీ పీఠం కేంద్రాలలోనూ, రచయిత వద్ద లభిస్తుంది. వెల రూ. 65/-. బ్నిం ఇతర రచనలు ఆన్‌లైన్‌లో కినిగె.కాం లో లభిస్తాయి.

రచయిత చిరునామా:

బ్నిం, 12-11-448, వారాసిగూడ, సికింద్రాబాద్ 500061, 8341450673.

You Might Also Like

2 Comments

  1. Sashank

    గత కాలమే మేలు అన్న విషయమే ఈ పుస్తకానికి ప్రధానమయిన విషయంలా ఉంది. శ్రీ స్వామి పరిపూర్ణానానంద మెప్పుకోలుకి అదే కారణం కావచ్చు. గతానికి వర్తమానానికి సమన్వయం చేయకుండా ఉపన్యాసాలతో సరిపెడితే , ఎవరికీ ఉపయోగం లేదు – శశాంక

  2. G.S.Lakshmi

    ఈ పుస్తకం నిజంగానే ఇప్పటి తల్లులకు బాలశిక్షలాంటిదే. ఇది చదివిన తల్లులకు పిల్లలని ఆరోగ్యంగానే కాదు ఆనందంగా కూడా పెంచడం యెలాగో తెలుస్తుంది. వారి భవిష్యత్తుకి అటువంటి పెంపకం చాలా దోహదకారి అవుతుంది. మీ పరిచయం బాగుందండీ సోమశంకర్ గారూ.

Leave a Reply