రేగడి నీడల్లా – సామలు చెప్పిన కొంగునాడు కతలు

జులై రెండోవారంలో ఒక రోజున అరుణ చాలా ఉత్సాహంతో, ఈ కథ పన్నెండేళ్ళ పిల్ల రాసిందట, అంటూ కొన్ని కాగితాలు చూపించింది. నాకు కొత్తగా ఉన్న తెలుగులో, ఒక చిన్నపిల్ల తన అమ్మమ్మతో చెప్పించుకున్నట్లుగా ఉన్న కథ అది. అప్పుడు మా ఇంట ఉన్న స.వెం.రమేశ్ ఆ కథను అరుణకు చూపించారట. అప్పుడప్పుడే తెలుగు చదవటమూ, రాయటమూ నేర్చుకుంటుందట ఆ కథ రాసిన పాప. అప్పటికప్పుడు ఆ పాపతో మాట్లాడి మెచ్చుకుంటే కాని అరుణకు వేరే పని తోచలేదు. ఆ కథ రాసిన పాప పేరు మార్టూరి సంజనా పద్మం.

తను కతలు రాయడం గురించి సంజనా పద్మం ఏమంటుందంటే ”ఏడవది చదివే పన్నెండు ఏండాదిల పిల్ల. ఎట్ట ఈ కతల్ను రాసింది అంటా మీరు తలవచ్చు… ఏలనో తెలవదు, నాకు కతలు అనితేనే అంత ఇష్టం… నేను కూడా ఒగ కతను రాయాల అంటా యోచన వచ్చింది… అప్పుడు నాకు తెలుంగు రాతలు తెలవదు, దాన్నించి తమిళ్ళా రాసేదానికి ఆరంబించితి. అయితే నన్నించి రాయను కాలేదు. ఏలంటే, మాఇంటిలా మాటాడేది తెలుంగు, మా సామలు మాకు తెలుంగులానే కతల్ను చెప్పుతురు. ఆ తెలుంగు కతల్ను తమిళ్ళాకి మారిచి రాసేదానికి నిండా కష్టంగా ఉండింది… ఆ సమయంలానే ‘తెలుగువాణి’ అనే ట్రస్టువాండ్లు మాఊరికి వచ్చిరి. తమిళనాడులా ఉండే తెలుంగువాండ్లకి తెలుంగు రాతల్ను చెప్పించే ట్రస్టు అది. మా ఉడుములపేటలా ఒగ ట్రయల్‌క్లాసు పెట్టినప్పుడు, నేనునూ పొయి తెలుంగు రాతల్ను నేరిచికొనితి…. ఆనిక సీరియసుగా తలిచి, తెలుంగు రాతల్ను చదివేది రాసేది బాగా నేరిచితి.”

ఈ పద్మం కొంగునాడు (దక్షిణ పశ్చిమ తమిళనాడు)లోని ఉడుమలపేటలో వికసిస్తున్న తెలుగు బాల. ఆ తాలూకాలో 49% తెలుగువారు. 1940 వరకు ఇక్కడ తెలుగు బడులు ఉండేవి. వ్యవహారాలన్నీ తెలుగులోనే నడిచేవి. తమిళులు ఇంట తమిళం మాట్లాడినా బయట తెలుగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో తెలుగు బడులే లేవు. వ్యవహార భాష తమిళం. ఇంట మాట్లాడేది తెలుగే ఐనా తెలుగు చదవటం, వ్రాయటం వచ్చిన వాళ్ళు దాదాపు లేనట్లే. ఈ పరిస్థితులలో ఇక్కడ తెలుగువారికి తమ ఇంటిభాషను చదవడం వ్రాయడం నేర్పడానికి తెలుగువాణి సంస్థ కంకణం కట్టుకున్నది. స.వెం.రమేశ్, మార్టూరి వసంతనాయుడు (సంజనా పద్మం తండ్రి) వంటి కార్యకర్తలు నడుం కట్టుకుని పట్టుదలగా పని చేస్తున్నారు. వారి కృషి ఎలాంటి ఫలితాలను ఇవ్వగలదో చెప్పటానికి ఈ పాప రాసిన కతల పుస్తకమే మంచి ఉదాహరణ.

సంజనా పద్మం అప్పుడే 15 కతలను రాసింది. ఈ కతలన్నిటినీ కలిపి, “రేగడినీడల్లా” అనే సంకలనంగా ప్రచురించి, నవంబరు 11 న ఉడుమలపేటలో ఆవిష్కరించబోతున్నారు. కతలంటే చెవికోసుకునే సంజనా పద్మం ఈ కతల్ను తన సామల (అమ్మమ్మ, నాయనమ్మల) వద్ద విని రాసింది. నాకు బొత్తిగా పరిచయంలేని ఒక ప్రాంతపు సంస్కృతినీ, చరిత్రనీ, జనపదాలనీ, జీవితాన్నీ ఈ కతలు పరిచయం చేశాయి. మనలో చాలామందికి ఈ పాప రాసిన తెలుగు కొత్తగా ఉండవచ్చు గానీ ఇది తెలుగేనని, ఈ మాటలు తెలుగు రాష్ట్రలలోనూ ఒకప్పుడు వాడుకలో ఉండేవనీ మనకు తేలిగ్గానే తెలిసిపోతుంది. తెలుగు కాని మాటలు చాలా తక్కువ కనిపిస్తాయి. ఈ కతల్లో ఉన్న తెలుగుపై తమిళం, సంస్కృతం, ఇంగ్లీషుల ప్రభావం తక్కువ. కొన్ని ఇంగ్లీషు మాటలను వారు తెలుగులోకి మార్చుకున్న వైనం అబ్బురం కలిగిస్తుంది (ఉదా: రిఫ్రిజిరేటర్‌కు తెలుగు చలికుదురు). బోలెడు కతలు విన్న, చదివిన సంజనకు కతలు రాసే విద్య పట్టుబడింది. ఈ కతలు చదివిస్తాయి. అక్కడక్కడ గుండెల్ని కదిలిస్తాయి. మెచ్చుకోదగ్గ ప్రయత్నం. చదవదగ్గ పుస్తకం.

కొంగునాడు రచయితల సంగం వారు కొంగు బంగారం పేరుతో ఈ పుస్తకానికి ముందు రాసిన పరిచయ వ్యాసంలో (ఈ వ్యాసంపై స.వెం.రమేశ్ వేలిముద్రలు బలంగా కనిపిస్తున్నాయి నాకు) కొంగునాడు సాంఘిక స్థితిగతులగురించి, అక్కడ ఉన్న పలురకాల తెలుగు యాసలు, వాడుకల గురించి చక్కగా వివరించారు. ఉదాహరణకు, తెలుగురాష్ట్రాల్లో మాయమైపోయిన అరసున్నాలు కొంగునాడు నుడిలో నిండుసున్నాలుగా కనబడతాయి (తెలుంగు, ఏండాది, కూంతురు వగైరా). అలాగే క్రియారూపాల వాడుకలో కూడా. అచ్చ తెలుగులో చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు గుర్తొస్తాయి ఈ వాడుక చూస్తుంటే. భాషాప్రయుక్తరాష్ట్రాల పేర తెలుగుభాషకూ, తెలుగువారికీ జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని తలుచుకుంటే బాధ కలుగక తప్పదు. తెలుగు రాష్ట్రాల బయట తెలుగును నిలపటానికి నిస్వార్ధంగా పనిచేస్తున్న వారందరినీ అభినందించాలి.

ఈ పుస్తకావిష్కరణ సందర్భంలో సంజనా పద్మానికి నా మెప్పుదలలు. కతలపై మక్కువను పెంచుకుంటూ, తెలుగు ఇంకా నేర్చుకుని, మరింత బాగా రాస్తుందని, ఉజ్వలమైన భవిష్యత్తు ఆమెకు ఉంటుందని నా ఆశ, నమ్మకం, ఆశీర్వాదం. ఆమె అమ్మ, అబ్బలకు, సామలకు, తెలుగువాణికి, రమేశ్‌గారికి మప్పిదాలు.

ఉడుమలపేట తావులో తెలుగువాణి చేస్తున్న ఈ తెలుగు ఎసపుకి (ఉద్యమానికి) బాసటగా, నూరు పల్లెల్లో తెలుగు నేర్పటానికి, తానా సంస్థ ‘ఎల్లలు లేని తెలుగు’ పథకం ద్వారా సాయం చేస్తున్నందుకు తానా అధ్యక్షుడిగా ఆనందిస్తున్నాను. మీరందరూ కూడా మీ వంతు సాయం అందిస్తారని ఆశపడుతున్నాను.


రేగడి నీడల్లా
కొంగునాడు కతలు
మార్టూరి సంజనాపద్మం
కొంగునాడు రచయితల సంగం
132 పెజీలు; రూ.70

for copies:
M.V.Vasanth Naidu
No.7, Sairam Layout,
Dhali Road,
Udumalapeta – 642 126
Tiruppur District.
TamilNadu.
Mobile:+91 9442627001
E-mail: vasanthpadvel@gmail.com

You Might Also Like

4 Comments

  1. 2015 నా పుస్తకపఠనం | పుస్తకం

    […] 15 రేగడినీడల్లా – మార్టూరి సంజనాపద్మం 16 కతలగంప – […]

  2. Ravi A.S.

    Wow. This is really interesting. Chowdary garu – it always pays to browse and follow what you wrote or reviewed. Thank you for the details of this book. I am so getting this book ASAP 🙂 I heard about it but did not have details so far.

  3. Jayadev Mettupalli

    ఈ పుస్తకం ఆవవిష్కరణ గురించి జంపాల చౌదరి గారు రాయకపోయి వున్నింటే నేను ఇంత మంచి శుభవార్త వినే అవకాశం కోల్పోయేవాన్ని. మార్టూరి సంజనా పద్మం రాసిన “టెంకాయల దొంగ ” కత జులైలో చదవినపుడే అనుకున్నా స వెం రమేష్ గారి ఉద్యమం అప్పుడే కాయాలు కాసి ఫలితాలను ఇస్తుందని. చికాగో నుంచి పోన్ చేసి ఆవిష్కరణ సభకెళ్ళిన నవీన్ గారితో మాట్లాడి అక్కడే వున్న రచయిత్రి సంజనా పద్మం గారితో స వెం రమేష్ గారితో నా ఆనందాన్ని పంచుకున్నా. వారందరికీ మరొక్కసారి జే కొడుతున్నా.

  4. A K PRABHAKAR

    Sa.Vem.Ramesh krushi valla Tamilnadu loni Telugu vaallu tama AMMA NUDI lo raayadam modalettaaru. Ippudu ee Paapa katalu vstunnaay. Deshadeshaala ELLALU LENI TELUGUKU jejelu.
    PRABHAKAR A K

Leave a Reply