కొడవటిగంటి – 1980 నాటి వ్యాసం
(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు మరణించినపుడు వచ్చిన వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్. ఈ పుస్తకం నుండి స్వీకరించిన ఇతర సాహిత్య సంబంధిత వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు)
******
తెలుగు కథా సాహిత్యంలో కొడవంటిగంటి కుటుంబరావు స్థానం అద్వితీయమైనది. ఒక తరం రచయితలపై, ఒక తరం యువకుల ఆలోచనాధోరణిపై ఆయన ప్రభావం అమేయమైనది. ఆయన అస్తమయం అసంఖ్యాకులైన అభిమానులకు అమిత విచారం కలిగిస్తుంది.
తెలుగులో మనకింతవరకు సర్వాంగ పరిపుష్టమైన గొప్ప నాటకం, గొప్ప నవల రాలేదేమోనన్న సంశయానికి తావు లేకపోలేదు. కాని, ఆధునిక కవితలో, ఆధునిక కథలో మాత్రం తెలుగు సాహిత్యం ఏ ఇతర భారతీయ వాఙ్మయానికి తీసిపోదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇందుకు దోహదం చేసిన కథా రచయితలలో కొడవటిగంటి ఒకరు. గురజాడ తర్వాత – చలం, చింతా దీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మొక్కపాటి, మల్లాది మొదలైన వారిది ఒకతరం. ఆ తర్వాత తరానికి కుటుంబరావుగారే నాయకుడు.
చలం తన ప్రపంచానికి కేంద్రస్థానంలో స్త్రీని నిలబెట్టాడు. స్త్రీ స్వాతంత్ర్యం, ముఖ్యంగా సెక్స్ స్వాతంత్ర్యం దృష్టి నుంచి సకల సామాజిక సమస్యలను పరిశీలించాడు. కథా రచనలో ఒక విధంగా ఆయన వారసుడు కొడవటిగంటి. కాని చలం ప్రారంభించిన భావవిప్లవాన్ని ఆయన విశ్వతోముఖంగా విస్తరింప జేశారు. మార్క్సిస్టు సామాజిక దృక్పథాన్ని సంపూర్ణంగా స్వీకరించారు. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణలోని సంకుచితత్వాన్ని నిరాకరించి, ఆ ప్రక్రియను మానవుడి సామాజిక వ్యక్తిత్వావగాహనకు వర్తింపజేశారు. మానవుడి ఆర్థిక, రాజకీయ, లైంగిక తదితర సమస్యా సామస్త్యాన్ని తన సాహిత్య వస్తువుగా తీసుకుని తన హేతువాద దృక్పథం నుంచి నిశితంగా, నిర్దాక్షిణ్యంగా, విశ్లేషిస్తూ రచనలు సాగించారు.
ఆయన దృష్టి కథా శిల్పంపై కాదు, భాషా సౌందర్యంపై కాదు. ఆయనను ప్రభావితం చేసిన రచయితలలో బెర్నార్డ్ షా ఒకడు. షా నాటకాలలో వలె కుటుంబరావు గారి కథలలో కూడా భావాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. షా శైలీ విన్యాసంలోని వ్యంగ్య వైభవం, హాస్యం, అపహాస్యం, నైశిత్యం – ఇవన్నీ కుటుంబరావు గారి తెలుగుశైలిని పరిపుష్టం చేశాయి. గొప్ప తెలుగు వచనం వ్రాస్తున్నట్టు పైకి కనిపించకుండా తెలుగు వచన శైలిని తీర్చిదిద్దిన మన అగ్ర రచయితలలో కుటుంబరావు గారు ఒకరు.
కొడవటిగంటిలో ఒక ముఖ్య విశేషం – ఆయన వలె కరుడుగట్టిన హేతువాదులుగానో, తీవ్రవాదులుగానో జీవితాన్ని ప్రారంభించిన అనేకులు జీవిత ద్వితీయార్థంలో ప్రవేశిస్తూనే కాలం తాకిడికి ఆధ్యాత్మిక వాదులుగా, చాందస మతవాదులుగా తిరోగమించారు. కుటుంబరావుగారు మాత్రం చివరివరకు హేతువాదిగా, వైజ్ఞానికవాదిగా, మార్క్సిస్టుగా కొనసాగారు. జీవిత చరమదశకంలో “విప్లవ రచయితల సంఘం”లో ప్రముఖ పాత్ర వహించడం వరకు ఆయన విశ్వాస నైశ్చల్యం కొనసాగింది. తుడిదశలో ఆయన దృష్టి అతీంద్రియ ప్రపంచం వైపుకు మళ్ళకపోలేదు. కానీ, దాన్ని సయితం కుటుంబరావు గారు ఒక హేతువాదిగా, తార్కికుడుగా, మార్క్సిస్టుగా పరిశీలించడానికి, అతీంద్రియానుభవ జ్ఞానానికి పూర్తిగా ఆధునిక వైజ్ఞానికాధారాలను కనుగొనడానికి ప్రయత్నించారు.
తెలుగు పత్రికారంగానికి, ముఖ్యంగా “పీరియాడికల్ జర్నలిజానికి” కుటుంబరావుగారి సేవ సర్వదా స్మరణీయమైనది. ఏ పత్రికలో సంపాదకత్వ బాధ్యత వహించినా, ఒక “మిషనరీ” ఉత్సాహంతో పనిచేశారు. తుదివరకు ఆయన దైనందిన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక సమస్యలకు ప్రతిస్పందిస్తూ, పత్రికలకు శరపరంపరగా వ్రాస్తూ తన ఆలోచనలను ఇతరులతో పంచుకుంటూనే వెళ్ళిపోయారు. ఆయన మరణంతో తెలుగువాడు ఒక మేధావిని, గొప్ప రచయితను, మంచితనం మూర్తీభవించిన మనీషిని కోల్పోయింది.
(ఆగస్టు 19,1980)
C.A.Prasad .,
> > > తెలుగు వచన శైలిని తీర్చి దిద్దిన కొందరు రచయితల్లో – కొడవటిగంటి కుటుంబరావు గారొకరు ., జీవితాంతం తాను నమ్మిన హేతువాదం / మానవవాదం ., శాస్త్రీయ విధానం ., విశ్లేషించే మనస్తత్వం వదులుకోలేని మేధావి .,