చాసో సప్తతి – (1985 నాటి వ్యాసం)
(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెలుగు రచయిత చాగంటి సోమయాజులు సప్తతి సందర్భంగా వచ్చిన వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్. ఈ పుస్తకం నుండి స్వీకరించిన ఇతర సాహిత్య సంబంధిత వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు)
******
చాసో అనగానే తోడిరాగం లాంటి ‘వాయులీనం’ కథ జ్ఞాపకం వస్తుంది. “ఇదిగో, ఈ దృశ్యం ఎన్నడైనా చూశారా?” అని రాచకురుపు లాంటి జీవితాన్ని చూపించే ‘ఎంపు’ కథ జ్ఞాపకం వస్తుంది. కుక్కల కంటే హీనంగా బతికే మనుషుల గురించి వ్రాసిన ‘కుక్కుటేశ్వరం’ కథ జ్ఞాపకం వస్తుంది. ఇంకా ఎన్నెన్నో అచ్చమైన ఆణిముత్యాల వంటి నిత్యసత్యాలను కళ్ళకు కట్టే గొప్ప కథలు జ్ఞాపకం వస్తాయి.
చాసో అనగానే కొందరికి ఫ్రెంచి వారిని భావ విప్లవోన్ముఖులను చేసిన రూసో జ్ఞాపకం వస్తాడు. మాకు మాత్రం చెఖోవ్ జ్ఞాపకం వస్తాడు. ఎన్నో గొప్ప కథలు వ్రాసిన చెఖోవే కాదు. త్రీ సిస్టర్స్, షెర్రీ ఆర్చర్డ్ లాంటి గొప్ప నాటకాలు వ్రాసిన చెఖోవ్ కూడా జ్ఞాపకం వస్తాడు. ఇంకా ప్రపంచ సాహిత్యంలో సూర్యాస్తమయాల గురించి, సూర్యోదయాల గురించి, చీకటి లోకంలో మినుకుమినుకుమనే మానవత్వపు మహత్వం గురించి కథలు వ్రాసిన గొప్ప రచయితలెందరో జ్ఞాపకం వస్తారు.
చాసో అనగానే నోట్లో గిరీశం చుట్టతో, కళ్ళు చిట్లించి చూస్తూ, కొంటెతనంతోనూ, గురజాడ అప్పారావు గారి లాంటి లోకపుటెరుకతోను కూడిన మందహాసంతో విజయనగరం వీథులలో తిరిగే మేధావిత్వం, 1940ల నుంచి అభ్యుదయ రచయితల సంఘానికి, ఎందరో వర్ధమాన రచయితలకు ఆయన ఇచ్చిన ప్రేరణ, ఉత్తేజం కూడా జ్ఞాపకం వస్తాయి.
చాసో కథలు చదువుతూ ఉంటే చాసో ఎక్కడా కనబడదు. పచ్చి జీవితం -రా లైఫ్- ముందుకొచ్చి కనబడుతుంది. “ఆకులందున అణగిమణగీ కవిత కోయిల పలుకవలెనోయ్” అన్న గురజాడ సూక్తి మనస్సులో మెరుస్తుంది. ఆయన వాక్యాలు “మమ్మల్ని చూడండి. ఎంత అందంగా ముస్తాబై వచ్చామో” అని మన కళ్ళను మిరుమిట్లు గొలపవు. “ఇయమదిక మనోజ్ఞా వల్కలే నాపితన్వీ” అని కాళిదాసు వర్ణించిన శకుంతల సౌందర్యంలా నిరలంకారంగా వుంటూనే మనల్ని లోబరుచుకుంటాయి.
ఏమీ ఎరుగనట్టుండే అమాయక నగ్న వాక్యాలతో భగ్న హృదయాలను, భుగ్న జీవితాలను ఆయన వర్ణిస్తారు. ఆయన వచన శైలిలో అలంకార ప్రకర్ష కనబడనట్టే, ఆయన కథలలో “నేను బోలెడు మార్క్సిజం చదువుకున్నాను సుమా” అన్న సిద్ధాంత ప్రకర్ష సైతం తొంగి చూడదు. జీవిత వాస్తవత్వం మాత్రమే కనిపిస్తుంది.
శ్రీశ్రీకి ఎందుకోగాని “మరో ప్రపంచం” గీతంతో గొప్ప పేరొచ్చింది. “పొలాలనన్నీ హలాలదున్నీ …” అని హడావిడి చేసే గీతాలు కీర్తి కెక్కాయి. నిజానికి ఆయన మహాగీతాలలో ఒకటి “భిక్షు వర్షీయసి”. చాసో కథలు కొన్ని చదువుతుంటే “దారి పక్క చెట్టు కింద – ఆరిన కుంపటి విధాన” ఈగలను తోలుకుంటూ కూర్చున్న వృద్ధురాలి జీవితాన్ని, మరణాన్ని శ్రీశ్రీ వర్ణించిన ఆ అద్భుత కవిత జ్ఞాపకం వస్తుంది.
తెలుగు కథను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన గొప్ప రచయితలను పదిమందిని పేర్కొన వలసి వస్తే ఏదో ఒక వేలితో చాసోను లెక్కించవలసిందే. ఆయనకు ఎందువల్లనో రావలసిన ప్రశస్తి రాలేదేమో ననిపిస్తుంది. ఎక్కువ వ్రాయకపోవడం వల్లనో, ఆట్టే చప్పుడు చేయకపోవడం వల్లనో, తెలుగువాడై పుట్టడం వల్లనో, ఏమో తెలియదు. నలభై ఏళ్ళకు పైబడి కథా వ్యవసాయం చేస్తున్నా నలభై కథలైనా వ్రాశారో లేదో అనుమానమే. అయినా అవి వేమనగారి గంగిగోవు పాలతో పోల్చదగినవి.
చాసోగారిని తలచుకుంటే ఇవాళ ఆయనకు విశాఖపట్టణంలో అభిమానులు చేస్తున్న సప్తతి జన్మదినోత్సవ సన్మానం జ్ఞాపకం వస్తున్నది. కనీసం ఇంకో 30 కథలైనా వ్రాసి కథా సప్తతి పూర్తి చేయాలని కోరుతూ ఈ శుభసందర్భంలో ఆయనకు మా శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
(మార్చి 10, 1985)
మంజరి లక్ష్మి
శ్రీశ్రీకి ఎందుకోగాని “మరో ప్రపంచం” గీతంతో గొప్ప పేరొచ్చింది. “పొలాలనన్నీ హలాలదున్నీ …” అని హడావిడి చేసే గీతాలు కీర్తి కెక్కాయి. – శ్రీ శ్రీ గారి గురించి ఇలాంటి విమర్శ చదవటం నేనిదే మొదటి సారి. నాకు ఈ వాక్యాలు నచ్చాయి.