Phantoms in the brain

Phantoms in the brain
V.S.Ramachandran and Sandra Blakeslee

మొదటి రచయిత పేరు మోసిన న్యూరో సైంటిస్టు, ఆయనది జనబాహుళ్యానికి అర్థమయ్యే పాపులర్ సైన్సు తరహా వ్యాసాలు రాయడంలో అందేవేసిన చేయి. ఇక పుస్తకం – “It is one of the most original and accessible neurological books of our generation” అని ప్రముఖ న్యూరాలజిస్టు, అనేక బెస్ట్ సెల్లింగ్ పాపులర్ సైన్సు పుస్తకాల రచయితా అయిన Oliver Sacks మెచ్చుకున్న పుస్తకం. నాలుగైదేళ్ళ క్రితం మొదటి సారి ఇందులోని వ్యాసాలు చదివాను. ఈయన Reith Lectures చదివినపుడు. ఈమధ్యన Left Neglected అన్న నవల చదువుతూ ఉండగా, నవలలో రాసిన జబ్బు గురించి ఈ పుస్తకంలో ఇదివరలో ప్రస్తావించిన విషయం గుర్తు రావడంతో ఇలా మళ్ళీ ఈ పుస్తకం పట్టాను.

మెదడులోని రకరకాల భాగాలు ఏదో కారణాల వద్ద దెబ్బతింటే వచ్చే సమస్యలను విశ్లేషించడం ద్వారా మెదడు పనితీరు గురించి పది వ్యాసాల్లో వివరిస్తారు ఇందులో. ఉదాహరణకి ఆయన ప్రస్తావించిన కొన్ని న్యూరలాజికల్ సమస్యలు: Phantom Limbs, Capgras Syndrome, Left Neglect, Charles Bonnet Syndrome, Pseudocyesis వంటివి. వ్యాసానికి ఒకటో రెండో సమస్యలను, ఓ మూణ్ణాలుగు మంది పేషంట్లను తీసుకుని కేస్ స్టడీల పద్ధతిలో కథల్లాగ చెప్పుకుపోతారు మెదడు పనితీరు గురించి. Text book లాగానో, third person తరహాలో రాసిన వ్యాసాల్లోనో కాక, వ్యక్తిగత అనుభవాల గురించి, అభిప్రాయాల గురించి చర్చించినందువల్ల పుస్తకానికి ఒక విధమైన personal touch ఉంది. దానికితోడు వాడిన భాష చక్కటి ఉదాహరణలతో సరళంగా ఉంది, అక్కడక్కడా మంచి హాస్యం కూడా ఉంది. దానివల్ల అంశాలు క్లిష్టమైనవి అయినా ఒక సీరియస్ పుస్తకం చదువుతున్న భావన కలుగలేదు.

వ్యాసాల విషయానికొస్తే, ఒకదాన్ని మించిన వింత మరొకటి. Truth is stranger than fiction అన్న పద్ధతిలో ఉంటాయి ఇందులో ఈయన మన ముందుంచే కేస్ స్టడీలు. అలాగని ఊరికే కథలు చెప్తాడనుకునేరు. ఎవళ్ళకి కావాలసినవి వాళ్ళు వెదుక్కోవచ్చు. కథల్లాగ చదువుకునే వాళ్ళకి కావాల్సినంత వస్తువైవిధ్యం ఉంది – ఏ కథాసంకలనానికీ తక్కువ కానంత ధీటుగా. శాస్త్రీయమైన విషయాలని ఆసక్తికరంగా రాయడం ఎలాగో తెలుసుకోవాలనుకునే వారు అది నేర్చుకోవచ్చు. న్యూరోసైంసు గురించి అవగాహన కలగాలి అనుకునేవాళ్ళు ఆ అవగాహన కలిగించుకోవచ్చు. ఇవన్నీ కాదు, అసలు మూలాల్లోకి వెళ్ళీ శోధించి ఈయన చెబుతున్నవి ఎంతవరకూ నిజం? అని కనుక్కోవాలనుకుంటే దానికి కూడా చాలా విస్తారమైన రిఫరెన్సులు ఇచ్చారు. వెళ్ళి చదువుకోవచ్చు. అలా ఈ పుస్తకాన్ని చదవడం అనేక కోణాల నుండి మంచి అనుభవం అని నా అభిప్రాయం.

అంత స్పష్టంగా, అందరికీ అందుబాటులో ఉండే భాషలో రాసిన పుస్తకంలోనూ నాకు నచ్చని అంశం ఒకటి ఉంది. అదే ఆ స్పెక్యులేషన్. ఒక్కోచోట సైన్సు పరిశోధనలు, పేషంటు కేస్ స్టడీలు దాటి చాలా ఊహాగానాలు చేస్తాడాయన – ఇలా అయితే అలా ఔతుంది, అప్పుడు ఇంకోటౌతుంది అని. అది మరీ ఊహాగానంలా తోచింది నాకు (ఈయన గురించి ఆయన తోటి శాస్త్రజ్ఞులు కూడా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు కొన్ని సందర్భాల్లో). ఆయన కూడా ఒప్పుకుంటాడు కొన్ని మరీ speculative అని. దాని గురించే ముందుమాటలో రాస్తూ – “… Indeed I will take you at times to the very limits of scientific inquiry. I strongly believe, however, that it is always the writer’s responsibility to spell out clearly when he is speculating and when his conclusions are clearly warranted by his observations. I’ve made every effort to preserve this distinction throughout the book … … In striking this balance between fact and fancy, I hope to stimulate your intellectual curiosity and to widen your horizons, rather than to provide you hard and fast answers to the questions raised.” అని కూడా రాశారు. అయినా నేనంత సమాధానపడలేదు. ఐదారేళ్ళ క్రితం చదివినప్పుడు ఇంత speculative అనిపించినట్లు గుర్తు లేదు!

అయినా, పుస్తకం మట్టుకు తప్పక చదవాల్సిన పుస్తకం అని నా అభిప్రాయం. బొత్తిగా సైన్సు మీద నమ్మకం లేనివాళ్ళకి, గౌరవం లేని వాళ్ళకీ కూడా ఆసక్తికరంగా అనిపించే విషయాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇక సాధారణంగా మన గురించి, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఏ కాస్తైనా కుతూహలం ఉండేవారికి మట్టుకు తప్పకుండా చదవవలసిన పుస్తకం.

పుస్తకం వివరాలు:
Phantoms in the brain: Human nature and the architecture of the mind
Sandra Blakeslee and V.S.Ramachandran
Harper Collins publishers
Amazon.in link

You Might Also Like

One Comment

  1. kalojiravi

    కృతజ్ఞతలు అక్క.. _/\_ మీ పరిచయం చాలా బాగుంది. అక్క నేను మిమ్మల్ని కాలవలనుకుంటున్న? అది మీరు ఆవకాశం ఇస్తే.. ఎందుకంటే మీ పుస్తక పరిచయాలు కు నేను చాలా రునపడివున్న. అయితే ఇప్పుడు ఈ పుస్తకం గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ. Oliver సాక్స్ పుస్తకం గురించి కుడా. నాకు ఆంగ్లం అంతగా తెలియదు. నేను ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా { సహాయ దర్శకుడిగా } వర్క్ చేస్తున్న. నేను ప్రస్తుతం చదవడం, చూడడం, రాయడం, నేర్చుకోవడం లో ఉన్న. నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నదాని పై వర్క్ లో ఉన్న.. నాకు మీ సహాయం కావలి. నేను ” ఐ’అమ్ ఏ స్టుపిడ్ ఫిలిం మేకర్” స్టొరీ పనిలో ఉన్న నాకు కావాల్సింది కుడా మెదడు గురించే.. కొత్త రోగాన్ని చెప్పడానికి.. నా ఫోన్ నోమ్బార్.. 7673918922. కాలోజిరవి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ.. fb లో ఆవుల కాలోజిరవి అని వుంది.

Leave a Reply