Asura: Tale of the Vanquished
“The story of Ravana and his people” అన్నది ఈ టైటిల్ కి క్యాప్షన్. రచన: ఆనంద్ నీలకంఠన్. 2012 చివర్లో, రచయిత ఇంటర్వ్యూ ఒకటి చదువుతూ ఉండగా ఈ పుస్తకం గురించి తెలిసింది.
ఈ పుస్తకంలో ప్రధానంగా కథ అసురుల దృక్కోణం నుండి చెప్పుకుంటూ వస్తారు. రావణుడు, అతని అనుచరుడు కాని అనుచరుడు అయిన భద్రుడు – వీళ్ళిద్దరి గొంతుకల్లో కథ వింటాము. అసురులు కాని జాతుల పాత్రలు మధ్య మధ్యలో కథానుగుణంగా అక్కడక్కడా కనిపించి పోతూంటాయి (రాముడితో సహా). మొదట పుస్తకం తాలూకా ప్రధాన కథావస్తువు గురించి తెలిసినపుడు నాకు ఆసక్తికరంగా అనిపించింది. అదే ప్రధాన కారణం పుస్తకం చదవడానికి. అయితే, పుస్తకం మాములుగా చదవడానికి పర్వాలేదనిపించినా, నన్ను కొన్ని విధాలుగా నిరాశ పరచిందని చెప్పాలి.
(పుస్తకం నచ్చి దాన్ని గురించి మరో అభిప్రాయం భరించలేనివాళ్ళు, “ఏదైనా పుస్తకం నచ్చకపోతే ఊరుకోవాలి కానీ, ఇలా రోడ్డుకెక్కకూడదు” అనుకునేవాళ్ళూ ఇక్కడితో ఆపేసి ఇంకో వ్యాసం చదువుకోమని మనవి)
రావణుడి చిన్నతనం, అతని కుటుంబ పరిస్థితులు, అతను అసుర జాతికి రాజైన వైనం, ఆ తరువాత కుబేరుడి నుండి రాజ్యాన్ని హస్తగతం చేసుకోడం, మండోదరితో వివాహం, ఆ తరువాత క్రమంగా రాజ్య విస్తరణ చేయడం, పిల్లా-జెల్లా, పుట్టుకలూ చావులూ.. యుద్ధాలు… రాముడు సీత… రావణుడి మరణం తరువాత భద్రుడి జీవన గమనం – ఇదీ నవలలో ఇతివృత్తం.
ముందు అసలు రావణుడు నాయకుడు అయిన పార్టే చాలా తేలిగ్గా ముగిసిపోయిందనిపిస్తే, వేదవతి పాత్రని ప్రవేశపెట్టి, ఆ పాత్రని అంతం చేసిన పాయింటు నుండి నాకు రచయితకి అసలు కథా గమనం గురించి స్పష్టత లేదేమో అనిపించడం మొదలైంది. కాసేపు ఆ పాత్రలు అడ్డం పెట్టుకుని సమకాలీన రాజకీయాలపై ఉన్న ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేయడం, కాసేపు ముందు జరిగిన కథకు విరుద్ధంగా ఉన్నట్టు సాగిన కథనం … ఇలా సాగింది నా పఠనానుభవం.వరుణుడి పాత్రని ఆసక్తికరంగా చిత్రీకరించినా, కథలోకి ఎందుకొస్తున్నాడో ఎక్కడికి పోతున్నాడో అర్థం కాలేదు నాకు. అయోధ్య ని అతి బీద దేశంగా చిత్రీకరించడం వల్ల కథకి ఏం ఒరిగిందో ఏమిటో… అంత బీద దేశం నుండి ఈ రాముడు ఎలా స్వయంవరానికి రాగలిగాడో – అదీ అర్థం కాలేదు. అనవసరంగా – అసంబద్ధంగా శూర్పణఖ పాత్రని అలా మార్చేయడం కథాగమనానికి అంత తోడ్పడలేదు అనిపించింది. నాకున్న బౌద్ధిక పరిమితుల వల్ల ఇలా నవల కథనం క్రమంగా చాలా అయోమయంగా తయారైనట్లు అనిపించింది.
ఇక నవలలో రావణుడి జీవితం గురించి అంతసేపు చెప్పినపుడు, అతనిలో ఉన్న ఇతర కళలు, సుగుణాలు ఇత్యాదుల గురించి కూడా ఇంకాసేపు ఫోకస్ చేసుండొచ్చు అనిపించింది. రావణుడు ఒక పాత్రగా ఉన్న కొన్ని తెలుగు-తమిళ సినిమాలలో అతని గుణగణాల చిత్రీకరణ ఈ నవలలో కంటే బాగా చేశారు అనిపించింది. ఉదా: ఎన్.టీ.ఆర్ రావణుడిగా వేసిన తెలుగు సినిమాలు, అగతియార్ అన్న తమిళ సినిమాలో అగస్త్యుడికి-రావణుడికి మధ్య జరిగిన సంభాషణ ని చిత్రీకరించిన విధానం, అక్కడ వీణావాద్యంలో వాళ్ళిద్దరికి వచ్చే పోటీ పాట వంటివి. కొన్నేళ్ళ క్రితం “బాల రావణాయణం” అన్న చార్వాకాశ్రమం పుస్తకం చదివినపుడు – వీళ్ళ ఉద్దేశ్యం రావణుడిని హీరో చేయడం అయితే వీళ్ళు సఫలీకృతులు కాలేదు అనిపించింది. ఈ నవల గురించి కూడా నా అభిప్రాయం అదే.
కథలో నాకు అన్నింటికంటే నచ్చినవి రెండే అంశాలు – భద్రుడి పాత్రని మొదట్నుంచి చివరి దాకా ప్రధాన కథకి లింక్ చేసిన తీరు, విభీషణుడి పాత్ర చిత్రీకరణ. భద్రుడి పాత్ర అసురుల రాజ్యంలోని సామాన్యుడి గొంతుక అని చెప్పవచ్చు. ఈ రచయిత ఈ నవలలో బాగా ఆకట్టుకునేలా రాసినది ఇదొక్కటే అని నా అభిప్రాయం. విభీషణుడి పాత్రని కూడా రచయిత ఆసక్తికరంగా చిత్రీకరించినట్లు అనిపించింది. ఈ నవలలో పాత్రల స్వభావం గురించి రచయితకే స్పష్టత లేదని చాలా చోట్ల అనిపిస్తూ వచ్చింది నాకు…ఈ ఒక్క పాత్ర విషయంలో మట్టుకు ఆ అభిప్రాయం కలుగలేదు.
మొత్తానికి అయితే, నా అభిప్రాయంలో నవల ఒకసారి చదవడానికి పర్వాలేదు. దాచిపెట్టుకుని మళ్ళీ మళ్ళీ చదువుకుని తరించే టైపు కాదు కానీ, కొన్ని కొన్ని చోట్ల చాలా ఆసక్తికరంగా కథని నడిపించారు. 500 పేజీలు మట్టుకు చాలా ఎక్కువ ఈ కథనానికి.
రచయితకి ఇదే తొలి నవల అనుకుంటాను… బహుశా తరువాతి రచనల్లో కథనంలో పట్టు పెరిగిందేమో చదివిన వాళ్ళు చెప్పాలి.
చివ్వరగా నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక్క విషయం చెప్పి ఆపేస్తాను. అంతర్జాల వేదికల్లో ఈ పుస్తకంలోని నిజానిజాల గురించి మాట్లాడుకోడం మహా ఆశ్చర్యంగా తోచింది నాకు. Mythological Fiction అని అనుకున్నాక మళ్ళీ నిజానిజాలేమిటి? పైగా, రచయిత చరిత్రకారుడు కూడా కాదు. అదనమాట.
Kathaaprapancham
ఇలాంటివి తెలుగు లో కూడా వున్నాయి.మరో పాత్ర కథ చెప్పే పద్దతి వున్న నవల ఆ మధ్య కాలం లోనేను ఒకటి చదివాను దాని పేరు ” ఒక యుద్దం తరువాత ” రచయిత శ్రీ మునిసుందరం గారు .ఈ మధ్యే వారు గతించారు కూడా. ఆ నవల చతుర లో వెలువడింది.జంపాలా చౌదరి గారు చెప్పినట్లు ముఖచిత్రం ఆకర్షనీయంగా వుంటుంది…కాని లోపలకి వెళ్ళేసరికి పాఠకుడ్ని రంజింపచేయలేక పొయింది .ఆ నవల కి అనుబంధంగా మరొ రెండు భాగాలు కూడా వెలువడాయి.ఆ రచయితకి ఇదే తోలి రచన !
Jampala Chowdary
ఈ పుస్తకం ఆసక్తికరంగా మొదలైనా, పోనుపోనూ చాలా విసుగ్గా అనిపించింది. రచయిత ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాలేదు. పుస్తకం పూర్తి చేయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అట్ట మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది.
pavan santhosh surampudi
//చివ్వరగా నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక్క విషయం చెప్పి ఆపేస్తాను. అంతర్జాల వేదికల్లో ఈ పుస్తకంలోని నిజానిజాల గురించి మాట్లాడుకోడం మహా ఆశ్చర్యంగా తోచింది నాకు. Mythological Fiction అని అనుకున్నాక మళ్ళీ నిజానిజాలేమిటి? పైగా, రచయిత చరిత్రకారుడు కూడా కాదు. అదనమాట.//
బాగా చెప్పారు.