Still Alice
Still Alice అన్నది Lisa Genova రాసిన నవల. గత ఏడాది సినిమాగా వచ్చింది. ఆలిస్ గా నటించిన Julianne Moore కి ఆస్కార్ అవార్డూ వచ్చింది. ఇది కాక సినిమా అనేక ప్రశంసలు కూడా అందుకోవడంతో, సినిమా చూసాను. వెంటనే నవలా చదివాను. ఈ వ్యాసం నవల గురించి నా అభిప్రాయం.
నవల ప్రధానంగా ఆలిస్ అన్న ప్రొఫెసర్ గురించి. యాభై ఏళ్ళ వయసులో, కెరీర్ పరంగా ఉచ్ఛ దశలో ఉన్నరోజుల్లో ఆవిడ తనకి మతిమరుపు ఎక్కువవుతోందని గమనిస్తుంది. దానితో డాక్టర్ దగ్గర పరీక్షలూ అవీ చేయించుకున్నాక ఆవిడకి అల్జైమర్స్ వ్యాధి ఉందనీ, అది చాలామందికి మల్లే వృద్ధాప్యంలో కాక, యాభైఏళ్ళకే వచ్చేసిందనీ తెలుస్తుంది. అక్కడి నుండి ఆమె వ్యక్తిగత, వృత్తిగత జీవితం ఎలా మారిపోయింది? అన్నది కథ. ఆల్జైమర్స్ అనగానే సాధారణంగా మెదిలేది వృద్ధాప్యంలో వచ్చే సమస్య అని. అయితే, బహు కొద్ది మందిలో ఇది 50-65 ఏళ్ళ వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి కొద్ది మందిలో ఒక వ్యక్తి ఈ కథలోని ఆలిస్. ఆలిస్ జీవితంలో క్రమంగా వ్యాధి కారణంగా వస్తున్న మార్పులని నవలలో చాలా బాగా చూపించారు అనిపించింది నాకు. ముఖ్యంగా ఆలిస్ జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గడాన్ని చాలా బాగా వివరించారు.
నన్ను బాగా కదిలించిన మూడు దృశ్యాలు:
* గొప్ప అధ్యాపకురాలిగా, వక్తగా పేరున్న ఆలిస్ కి విద్యార్థుల నుండి ఒక కోర్సు కు సంబంధించి వచ్చిన ఫీడ్బ్యాక్, తరువాత క్రమంగా ఇక ఆవిడ తనకెంతో ఇష్టమైన వృత్తిని వదులుకోవాల్సి రావడం.
* తనకి గుర్తుంచుకోడం కష్టంగా ఉందని ప్రతీదీ ఫోనులోకి ఎంటర్ చేసుకుంటూంటే చూసిన ఆమె పిల్లలు ఒక సందర్భంలో దాన్ని గుర్తుపెట్టుకోడానికి బద్దకించడం గానూ, అలా ఎంటర్ చేసుకోడం అనవసరంగానూ భావించడం – వాళ్ళు మామూలు ఆరోగ్యవంతమైన మనుషులలా ఆలోచిస్తున్నారు కానీ, అవతలి వాళ్ళ సమస్యని అర్థం చేసుకోలేకపోతున్నారు కదా అనిపించింది.
* ఆలిస్ ఒక drug trial లో పాల్గొంటుంది. ఆలిస్ భర్త దాని గురించి చాలా ఆశలు పెట్టుకున్నా, చివరికి ఆ డ్రగ్ వల్ల ఉపయోగం లేదని పరిశోధకులు తేలుస్తారు. రచయిత్రి ఆట్టే వర్ణనలూ అవీ చేసి నాటకీయత జొప్పించలేదు కానీ, ఆ ఒక్క వాక్యం తరువాత మన ఊహకి వదిలేశారు కనుక, నన్ను బాగా కదిలించింది ఆ భాగం.
ఆలిస్ ఆ పరిస్థితులలో కూడా తనలాగే చిన్న వయసులో ఈ వ్యాధి వచ్చిన మిగితా వారితో కలిసి ఒక సపోర్ట్ గ్రూపు తయారు చేసుకోవడం నాకు ఈ నవలలో చాలా స్పూర్తిదాయకంగా అనిపించిన అంశం.
నవలా రచయిత్రి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న న్యూరోసైంటిస్టు. కథలోని ప్రధాన పాత్రధారులిద్దరూ ప్రొఫెసర్లు. అందువల్ల అల్జైమర్స్ గురించిన సాంకేతిక పదజాలం కూడా ఉంటుంది ఈ నవలలో. అయితే, ఇది పుస్తకానికి ఉపకరించిందే కానీ, ఎక్కడా నవలగా చదవడానికి ఇబ్బంది కలిగించలేదు నాకు. ఇక పోతే, నవల కొంతవరకూ సుఖాంతం అనే చెప్పాలి. ఇందులో ఆలిస్ జీవితం ఊహించనంతగా మారిపోయినా, ఆమెకి కుటుంబ సభ్యులు వీలైనంత తోడ్పాటును అందించారు, తగినంత వైద్య సహాయం దొరికింది అనిపించింది. మరి ఇతరుల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తే ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే, ఈ పుస్తకం పేరు “ఆల్జైమర్స్ -దాని పర్యవసానాలు” కాదు కనుకా, పైపెచ్చు ఇది నవల కనుకా, నేను ఈ అంశాన్ని అంతగా పట్టించుకోలేదు.
దీని పరిమితుల్లో ఈ నవల అల్జైమర్స్ వ్యాధి వల్ల ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోగలదో బాగా చూపించిందని నేను అనుకుంటున్నాను. అదే సమయంలో ఇది ఒక కథ, ఒక్కో అల్జైమర్స్ కేసూ ఒక్కోలా ఉంటుందనీ, ఒకరి అనుభవం ఇంకోళ్ళకి జరిగి తీరాలనేం లేదనీ కూడా అర్థం అయేలా చెప్పిందీ నవల. శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనకి మానవ మెదడు గురించి తెలిసింది ఎంత తక్కువో కదా అనిపించింది నవల ముగుస్తూండగా. గొప్ప రచన, గొప్ప భాషా పటిమ అనలేను కానీ, మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఏ కాస్త ఆసక్తి ఉన్నా తప్పకుండా చదవాల్సిన నవల.
రచయిత్రి కి ఇది తొలి నవల. ఈ నవల చదివాక ఇంకా ఈ రచయిత్రి వి ఏవైనా రచనలు చదవాలనే తాపత్రేయంలో Left Neglected అన్న నవల మొదలుపెట్టాను కానీ, ఇప్పటికింకా అంత ఆకట్టుకోలేదు 🙁
ఈ నవల గురించి రచయిత్రి తో Alzforum వారు జరిపిన ఇంటర్వ్యూ ఇక్కడ.
Left Neglected – Lisa Genova | పుస్తకం
[…] Still Alice సినిమా/నవల అనుభవం తరువాత ఆ రచయిత్రి రాసిన మరొక రచన ఏదన్నా చదవాలి అన్న కోరికతో ఈ నవల మొదలుపెట్టాను. ఎంతకీ కథ మొదలవకపోవడంతో పక్కన పెట్టేసి ఇతర విషయాల వైపుకి మరలాను. కొన్ని వారాలకు అనుకోకుండా మళ్ళీ ఈ పుస్తకం వైపుకి వచ్చి, ఈసారి పూర్తి చేశాను. ఈ నవల గురించి నా అభిప్రాయం: […]