మంత్రజాలం, హాస్యం, మరింకా చాలా.. సర్ టెర్రీ ప్రాచెట్

వ్యాసకర్త: సాంత్వన చీమలమర్రి

(ఫాంటసీ ఫిక్షన్ రచయితగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్న టెర్రీ ప్రాచెట్ పోయిన వారమే స్వర్గస్థులయ్యారు. ఆయన అభిమానిగా తన అభిప్రాయాన్ని పంచుకోమని అడగ్గానే ఈ వ్యాసం రాసిపంపినందుకు సాంత్వనగారికి ప్రత్యేక ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

“ప్రముఖ రచయిత, డిస్క్ వరల్డ్ సృష్టికర్త టెర్రీ ప్రాచెట్ ఆత్మ కి శాంతి కలుగుగాక.” ఓ ముఖ్యమైన ప్రయాణానికి వెళ్తూ అబ్సెసివ్ గా ఫేస్బుక్ తెరిచిన వెంటనే కనిపించిన మొదటి పోస్ట్ ఇది. ఏమీ తోచలేదు కాసేపు. ఏం ? ఎందుకేడుస్తాం మనం? రచయితలో, చిత్రకారులో, నటులో, సంగీతకారులో ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయారు  అనగానే? మనం ఏడ్చేది మన కోసం ,  వాళ్ళు మనకోసం ఇంకేమీ చెయ్యరు కదా అన్న ఆలోచన రాగానే ఒక్కసారి ఆవరించే నిరాశ తో. తప్పకుండా వాళ్ళు మంచి ప్రదేశానికే వెళ్ళి ఉంటారు, మనని ఇలా రోజు రోజు కీ ఎక్కువ అవగతం అయ్యే శూన్యం లో వదిలేసి. అందరూ అంటూనే ఉన్నారు. ఇంకెంతో సమయం మిగిలి లేదు అని. అయినా చిన్న ఆశ. ఇంకొన్ని.. ఇంకొన్ని పుస్తకాలు, ఇంకొన్ని కథలు, ఇంకాసిన్ని నవ్వులు..

మరణానిదీ అల్జీమర్స్ దీ ఒకటే మాట. మోర్ట్ లో ప్రాచెట్ రాసినట్టు, “ప్రపంచం లో న్యాయం లేదు, నేను మాత్రమే ఉన్నాను.” అవును fate always win. దానిదే ఆఖరి నవ్వు. అయితేనేం? మనమంతా లేమా ఆయన పుస్తకాలని మళ్ళీ మళ్ళీ చదివి దాన్ని వెక్కిరించి నవ్వేందుకు?

సాటి ఫాంటసీ ప్రేమికులందరి కన్నా బాగా ఆలస్యం గా కనుగొన్నాను ఈయనని నేను కొన్నేళ్ళ క్రితం. పి. జి. వుడ్ హౌస్ పుస్తకాలు దాదాపు ఇండియా లో ప్రింట్ లొ ఉన్నవి  అన్నీ చదివేశాక అంత మంచి హాస్యం కోసం చాలా సంవత్సరాలు వెదికాను. నాలాంటి గ్రీడీ బుక్ లవర్ కి గొప్ప వరంలాగ దొరికారు ఈయన.. డెబ్భై కి పైన నవలలు, అందులో నలభై డిస్క్ వరల్డ్ గురించి రాసినవి. ఆరోగ్యకరమైన బ్రిటిష్ హాస్యం, మధ్యలో కాస్త అమెరికన్ క్విర్కీనెస్. డిస్క్ వరల్డ్ అంటే ఏమిటో ప్రతీ పుస్తకం లోనూ ఒక్కో రకం గా గమ్మత్తు గా పరిచయం చేస్తూ ఉంటారు. అనంత విశ్వం లో ఎక్కడికో తెలియని ప్రయాణం చేసే ఒక అతి పెద్ద తాబేలు “Great A’Tuin“.  దాని మీద నిలుచున్న నాలుగు దిగ్గజాలు వాటి వీపు మీద మోసే డిస్క్ ఆకారపు ప్రపంచం అది. మన భూగోళానికి అది ఒక అద్దం. కాదు కాదు భూతద్దం. అక్కడ అంతా మన భూమి మీద ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే టెక్నాలజీ స్థానం లో మ్యాజిక్. డిస్క్ వరల్డ్ ఇంద్రధనుస్సు లో ఎనిమిదో రంగు ఉంటుంది. దాని పేరు ఓక్టరీన్ (octarine). ఊదా లాగా అనిపించే ఆకుపచ్చ కలిసిన పసుపు రంగు అది. మ్యాజిక్ అంతా ఆ రంగు లోనే ఉంటుంది.  మన ప్రపంచం లోని లోపాలని ఒక కామికల్ లెవెల్ కి మాగ్నిఫై చేసి అక్కడి రోజూ వారీ జీవితాన్ని సృష్టించారు ప్రాచెట్.

రచయిత కి ఉండాల్సిన మొదటి లక్షణం ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉండలేకపోవటం. లోకం లో ఉన్న బాధ అంతా తనదే అన్నంత ఎంపథీ. మంచి ఏదో చెడు ఏదో మనో నేత్రాలకి ముందే తెలిసిపోవటం. జనాలకి నచ్చ చెప్పటానికి చేసె ప్రయత్నం. “అయ్యో వినరేం వీళ్ళు” అని బాధ, కోపం. ఆ తర్వాత దయా, క్షమా.. మరో పక్క వారిని ఏమీ చెయ్యలేక, వారి అర్థంలేనితనాన్ని చూసి వచ్చే నవ్వు. దాన్నుంచి పుట్టింది ప్రాచెట్ హాస్య వ్యంగ్య రచనా వ్యాసంగం అంతా. ఫిలిప్ పుల్మన్ అన్నట్లు ఆయన హాస్యం లో ఎక్కడా చేదు ఉండదు. మానవాళి పైన ప్రేమే కానీ ద్వేషం కనిపించదు. మనుషులు ఇంతే అని అంగీకరించి నవ్వుకోవటం ఉంటుందే తప్ప  ఇలా ఎందుకు ఉన్నారు అని నిలదీయటం ఉండదు. ఆయన వెక్కిరించని విషయాలు ఉండవు భూమ్మీద. సాంప్రదాయికమైన ఫాంటసీ సాహిత్యం లో ఉండే క్లిషే లనీ, క్లిఫ్ హాంగర్లని సైతం ఆయన పేరడీల్లో వదల్లేదు. ప్రతీ పుస్తకం లోనూ గంపల కొద్దీ విషయాలు కుమ్మరిస్తారు. ఖగోళ శాస్త్రపు విశేషాలు, తత్త్వశాస్త్రపు తర్కాలు, యుధ్ధాలూ, చరిత్రా, మానవ నైజం, ఆంథ్రొపాలజీ, పరిణామ సిధ్ధాంతం ఇంకా చాలా చాలా. ప్రపంచపు పనితీరు మీద పేరడీ లు వదులుతూనే ఉంటారు. “తిరుగుబాట్లంటే తిరిగి తిరిగి ఒకే చోటికి వచ్చేవి. వాటిని నమ్ముకుని ప్రయోజనమేమీ లేదు.” అని విశ్వజనీనమైన సత్యాన్ని మంచి నీళ్ళు తాగినంత అలవోకగా చెప్పేస్తారు నైట్ వాచ్ నవల లో. మొదటి కంప్యూటర్ ని పోలిన అద్భుత యంత్రం “హెక్స్” ని గురించి రాస్తుంటారు.  ( హెక్స్ అంటే కంప్యూటర్ కోడ్ అయిన హెక్సాడెసిమల్ తో పాటు “మంత్రం” అనే అర్థం కూడ ఉంది).  చిన్న చిన్న చీమలు తిప్పే చక్రాల తో పని చేస్తుంది అది. తొలి కంప్యూటర్ల జాడ్యాలన్నీ ఆ ఆల్టెర్నేట్ రియాలిటీ లో చెప్పి నవ్విస్తారు. భద్రతా వ్యవస్థ మరీ లోకువ ఆయనకు. రాజ్యం లో దొంగ తనాలని అరికట్టలేక రాజు ఆలోచించే ఉపాయం ఏమిటో తెలుసా? అధికారికంగా దొంగలను గుర్తించి, వారికి లైసెన్సులు ఇచ్చి, ఒక వార్షిక బడ్జెట్ కేటాయించటం. అంటే ఆ బడ్జెట్ లోపు వారు ఎంతైనా దోచుకోవచ్చు. తద్వారా రాజ్యం సుభిక్షం గా ఉంటుందని అంచనా. ప్రభుత్వాల పనితీరు మీద ఇంత ఘాటు గా ఎవరు రాస్తారు? అందరూ దొంగలే అని ఇంత తెలివి గా ఎవరు చెప్తారు? .

image01

మతం మీద, గ్రీక్ బహుదేవతారాధన పైన గొప్ప వ్యంగ్యం రాస్తారు స్మాల్ గాడ్స్ నవల లో. మూడు వేలకి పైన దేవతలుంటారు ఆ ప్రపంచం లో. ప్రతి చిన్న అంశానికీ ఒక దేవుడో దేవతో ఉంటారు. మద్యానికో దేవుడు. హాంగ్ ఓవర్ కి మరో దేవుడు. అపార్థాలకీ తప్పులకీ కలిపి ఒక దేవత. మూసుకు పోయి ఎప్పటికీ తెరుచుకోని సొరుగులకి ఒక దేవత — ఇలా వేల మంది. వారిలో ఎవ్వరూ రాగ ద్వేషాలకి అతీతులు కారు. ఆకాశం లో బోర్డ్ గేం ఆడుతూ కింద ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారు.

ఆ కింది రాజ్యాలు మన ప్రపంచాన్ని పోలి ఉంటాయి. అగేటియన్ ఎంపైర్ అని చైనా కి ఒక నకలు సృష్టించారు, ఇంటెరెస్టింగ్ టైంస్ నవల లో. చైనా దేశపు చరిత్ర, అక్కడి రాజవంశాలు, భాష, సంస్కృతి అన్నిటినీ పేరడీ చేసేస్తారు ( గుడ్ నేచర్డ్ గానే ). ఆయన వర్ణించిన క్లాచియన్ దేశాలు ప్రాచ్య, మధ్య ప్రాచ్య దేశాలని గుర్తు తెస్తాయి. ప్రపంచమంతా వారిని అనాగరికులుగా, వెనకబడ్డవారిగా తీసిపారేసినా వారి జాతి మిగిలిన ప్రపంచం కన్నా చాలా ముందు గానే వికసించిందని చెప్తారు. వారి భాష, గొప్ప సంస్కృతి తో పాటు రాజ్యకాంక్ష, అంతఃకలహాలని గురించి ఒకే మాట లో చెప్పేస్తారు. “అస్సాసినేషన్ (assassination) అనే పదానికి వారి భాష లో పదిహేను సమానార్ధకాలు ఉన్నాయి. అప్పటికి మిగిలిన ప్రపంచం కనీసం రాళ్ళ తో కొట్టి చంపటం కూడా నేర్చుకోలేదు” అని. ప్రాచ్య దేశాల కవిత్వాభిలాష ని ప్రతీ పాత్ర లోనూ నవ్వొచ్చేలా ఇరికిస్తారు. చాలా తక్కువ స్థాయి పనివాడు కూడా తన భార్యని “ఓ నా ఎడారి పుష్పమా!” అని రకరకాలు గా సంబోధిస్తూ ఉంటాడు. జాతి ని బట్టి మారే మనుషుల స్వభావాలని ఆయన పట్టుకున్నంత తేలిక గా ఇంకెవ్వరూ పట్టుకోలేరేమో.

డిస్క్ వరల్డ్ పైన అతి ముఖ్య పట్టణం, విపణి రాజధాని, “ఆంఖ్-మోర్పొక్” , అచ్చం గా మన చెన్నై నో కలకత్తా నో చూసి రాసినట్టు ఉంటుంది. నేను చెన్నై లో ఉన్నన్ని రోజులూ పోల్చుకుంటూ ఉండేదాన్ని.  ఆ జీవం తొణికిసలాడే నగరం, ఆ ఇరుకు వీధుల్లో ఛప్పన్న వస్తువులూ దొరికే చిన్న చిన్న దుకాణాలూ,  ఆ దుర్గంధం వెదజల్లే నదీ, ఎక్కడ పడితే అక్కడ ఉండే ఆలయాలు, వాటిల్లో రకరకాల భక్తులు… అడుగుదాం అనుకుంటూ ఉండేదాన్ని ఆయన్ను ఎప్పటికైనా కలిసినప్పుడు, నిజంగా మీరు చెన్నైని ప్రేరణగా తీసుకునే రాశారా అని. ఇవి కాక ఎన్ని సృష్టించారని! తనంతట తాను పాక్ చేసుకునే వెయ్యి కాళ్ళున్న మంత్రపు పెట్టె “ద లగేజ్.” కళ్ళు లేకుండానే మనుషులని చూసినంత పని చెయ్యగలదు. ఎంత గందరగోళం లోనూ తన యజమాని ని వెదుక్కుంటూ వచ్చి రక్షిస్తుంది అది. ‘అన్ సీన్ యూనివర్సిటీ’ లో లైబ్రరీ లోని పుస్తకాల మాజిక్ ధాటి కి కోతి గా మారిపోయిన లైబ్రేరియన్,  చెంగీజ్ ఖాన్ కీ , కోనన్ ద బార్బేరియన్ కీ యావెరేజ్ తీసినట్టు ఉండే వృద్ధ వీరుడు జెంగీజ్ కోహెన్, పిరికి మాంత్రికుడు రిన్స్ విండ్ , అమాయకపు టూరిస్ట్ టూ ఫ్లవర్… ఎన్ని రంగు రంగుల పాత్రలు. ఇన్ని రంగుల తో పాటు ఒక నలుపు రంగు పాత్ర కూడా. డెత్. మరణానికి రూపం ఇచ్చి ఒక పాత్ర ని తయారు చేశారు. మనని దొలిచేసే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కాపిటల్ లెటర్స్ లో  దానితో చెప్పిస్తారు,  దాని మాటకి మరి తిరుగు లేదు అన్నట్లు.

తళతళా మెరిసే పదునైన వాక్యాలు ఆయనవి. రెండు ఫుల్ స్టాపుల మధ్య దట్టం గా కూరుస్తారు రంగు రుచి వాసన అన్నీ కలిగిన పదాలని.  మచ్చుకైనా చప్పదనం అనేది కనపడదు. ప్రతి వాక్యానికి ఒక ప్రయోజనం, లక్ష్యం ఉంటాయి. నవ్వు తెప్పించటం, కొంత కోపం రప్పించటం, కాస్త అల్లరి గా గిల్లి వదిలి పెట్టడం, మొత్తానికి ఆలోచింపచెయ్యటం ఆయనకు ఇష్టం, కేవలం కథ ని సమాచారం చెప్పినట్టు చెప్పి మనల్ని గబగబా వదిలించుకోవటం కన్నా. షేక్ స్పియర్, ఆస్కార్ వైల్డ్ తర్వాత అత్యధికం గా కోట్ చెయ్యబడ్డ రచయిత అయ్యారు అందుకే.

కామిక్ ఫాంటసీ ప్రక్రియ ని తన భుజం మీద మోసిన గ్రేట్ అటుయిన్ ఆయన.  సోకాల్డ్ సీరియస్ సాహిత్య ప్రపంచంలో  హాస్యమూ , ఫాంటసీ రెండిటి పైనా చాలా అన్యాయమైన చిన్న చూపు ఉంది.  దానిని ఖండిస్తూ ఫాంటసీ అతి పురాతనమైన రచనా ప్రక్రియ అంటారు ప్రాచెట్. బ్రిటన్ ప్రభుత్వం 2008 లో ఆయనకు నైట్ హుడ్ ప్రదానం చేసినప్పుడు చాలా సంబరపడ్డారు. జాన్రా ఫిక్షన్ రచయిత కి అంత గౌరవం దక్కటం ఆయనను మరింత సంతోషపెట్టింది. ఆయన ఇకపై నైట్ ( ‘knight’) కనుక తన సొంత ఖడ్గాన్ని తయారు చేసుకున్నారు తన ఇంటి దగ్గర దొరికే ఇనుము ధాతువు తో!

సృష్టి ఎలా మొదలయ్యిందో తెలుసుకునేందుకు, తనకు తాను ఒక సంతృప్తికరమైన జవాబు ఇచ్చుకునేందుకు మనిషి ఎంచుకున్న మొట్టమొదటి మార్గం ఫాంటసీ. ఫాంటసీ అంటే వాస్తవానికి దూరంగా పారిపోవటం కాదు. ఫాంటసీ అంటే నిజాన్ని మరో కోణం లో చూడటం. మరింత నిశితం గా చూడటం. ఆ నిశితమైన పరిశీలన ని ఆనొటేషన్ల రూపం లో  భద్రపరిచారు ఆయన అభిమానులు “ఎల్ స్పేస్” అనే సైట్ లో. ఆయన వాక్యాల ప్రతిధ్వని ఎంత దూరం, ఎన్ని పొరల్లోకి వెళ్తుందో తెలుస్తుంది అక్కడ. పరిధుల్లేని ఊహా శక్తి విశ్వరూపం కనిపిస్తుంది.

ప్రాచెట్ ని చదవటం మేధస్సు కు పంచ భక్ష్య పరమాన్నం లాంటిది. ఊరికే కూర్చున్నప్పుడు కూడా మెదడుని వినోదింపజేసే బోలెడన్ని అలోచనలు వదులుతారు తన పుస్తకాల్లోంచి మనకి. ఒక లాప్ టాప్ రిపెయిర్ షాప్ లో ఈగలు తోలుకుంటూ గడపాల్సిన ఒక గంట సమయాన్ని ఆయన పుణ్యమా అని నన్ను నేనే నవ్వించుకుంటూ గడిపాను, “హెక్స్” ని తలుచుకుంటూ, మన లాప్ టాపులు నిజం గా లక్షలాది చీమలు నడిపే అద్భుత యంత్రాలైతే ఎలా ఉంటుంది అనే ఊహలతో. అలాంటి ఎన్నో గంటలు యాతన లేకుండా గడియారం లోనుంచి చల్ల గా జార్చేసినందుకు ఆయనకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.

“Give a man a fire and he’s warm for a day, but set fire to him and he’s warm for the rest of his life.” Terry Pratchett

You Might Also Like

7 Comments

  1. bhanukemburi@gmail.com

    ఇందుకే ఈ బ్లాగ్ అంటె నాకు ఇష్టం చాలా చాలా బాగుంది ఈ వ్యాసం

  2. gouri lakshmi alluri

    రచయిత లక్షణం జనాలకి నచ్చ చెప్పటానికి చేసె ప్రయత్నం. కంగ్రాట్స్ సాంత్వనా ! చాలా బావుంది.

    1. Santwana

      థాంక్యూ మేడం..

  3. Suresh

    చాలా రోజుల కింద టెర్రీ ప్రాచెట్ డిస్క్ వరల్డ్ సిరీస్ ఆడియో వెర్షన్ వినేవాడిని. అప్పుడు ఎందుకో ఆయన రచనలని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఈ రివ్యూ చదివాక, వెంటనే డిస్క్ వరల్డ్ సిరీస్ చదవాలి అని బలంగా అనిపించింది. ఇంత గొప్ప రివ్యూ ని, తనదైన అందమైన శైలితో అందించిన సాంత్వన గారికి నా అభినందనలు.

    1. Santwana

      ధన్యవాదాలు సురేష్ గారూ.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మొదలుపెట్టండి 🙂

  4. pavan santhosh surampudi

    చాలా చాలా బాగారాశారు. వ్యాసం చదివాకా ఈ రచయితను చదవాలనిపిస్తోంది.
    హాస్యాన్ని, ఫాంటసీని చదివి ఆనందించి దానికి తగ్గ గౌరవం ఇవ్వని సాహిత్య విమర్శకులంటే నాకూ చిరాకే. అప్పుడెప్పుడో జ్ఞానపీఠ్ పురస్కారానికి అర్హులెవరు అని బ్లాగుల్లో చర్చ జరిగినప్పుడు పొరబాట్న నేనూ, ఇంకొందరమూ ముళ్లపూడి వెంకటరమణకి రాకూడదా అని అడిగినప్పుడు ఆ చులకనభావాలు బయటకొచ్చాయి. ముళ్ళపూడి, యండమూరి ఇలాంటి పేర్లెందుకు అన్నట్టు మాట్లాడారు. నిజానికి 50 ఏళ్ళనాటి మధ్యతరగతి జీవితాన్ని కాచివడబోసి హాస్యంగా మలిచి రకరకాల ప్రక్రియల్లో రచనలు చేసినవారు ముళ్ళపూడి. అత్యుత్తమ సాహిత్య పురస్కారాలు రాకపోతే పోయే, కనీసం ప్రస్తావనకైనా నోచుకోలేదా ఆయన అనిపించింది. పతంజలి సీరియస్ సాహిత్యాన్ని చమత్కారంతో మిళాయించారు కాబట్టే ఆ మాత్రం గౌరవమైనా దక్కింది. పైగా వామపక్షానికి సానుభూతిపరుడు కూడాను.
    ఈ రచయిత కూడా అలాంటి స్థితినే ఎదుర్కొన్నారంటే ఇక ఈ వెర్రితనం ఎక్కడైనా అలాగేవుంటుంది అన్నమాట.

    1. Santwana

      ధన్యవాదాలు పవన్ గారూ! మీకు ఈయన పుస్తకాలు దొరికితే చదవండి. తప్పకుండా నచ్చుతాయి మీకు. ఈ వెర్రితనం అక్కడి నుంచే ఇక్కడికి వచ్చినట్టు ఉందండీ. మనలాంటి వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా అరిచి గీపెట్టి చెప్తూ ఉండాల్సిందే.. హ్యూమర్ జిందాబాద్ ! ఫాంటసీ వర్ధిల్లాలి!!

Leave a Reply