కె.శివారెడ్డి-అతను చరిత్ర-ఓ విమర్శ

రాసిన వారు: కె.ఎస్.కిరణ్ కుమార్

[ఈ వ్యాసం మొదటిసారి 14 ఫిబ్రవరి 2006 న తెలుగుపీపుల్.కాం వెబ్సైటులో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం]
*****************************************
ఇదివరకోసారి సలీం భాయ్‌ నేను వ్రాసిన ‘రాజు’ అనే కవిత, శివారెడ్డిగారి ‘గేటు పక్కన కుర్రాడు’ గుర్తుచేసింది అన్నప్పుడు, ఈయనెవరో, ఎలా వ్రాస్తారో అని తెలుసుకోవాలని ప్రయత్నించి, ‘జైత్రయాత్ర’ అనే సంకలనం మొదటిసారి చదివాను.

atanucharitraఅప్పటిదాకా, తెలుగు పాఠకలోకానికి, అందునా కవిత్వమంటే చెవులు కోసుకునేవారికి శివారెడ్డిగారు చిరపరిచితులు అని నాకు తెలియదు. అక్టోబరు 2005 న ఆయన వెలువరించిన మరో కవితా సంకలనం ‘అతను చరిత్ర’ పై నా అభిప్రాయమే ఈ వ్యాసపు ప్రధానోద్దేశ్యము.

వ్యక్తిగతంగా అంటున్నానని పాఠకపండితులు అనుకోకపోతే ఓ చిన్న మాట. కవిత్వం సంగతి ఎలాగూ ఈ వ్యాసంలో వ్రాస్తున్నాను కాబట్టి ఆ విషయం కాసేపు పక్కనబెట్టి, కొత్తగా కవితాసంకలనాలు వెలువరించాలనుకునే వారు మార్కెటింగులోని మెళకువలను శివారెడ్డిగారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

అర్ధం కాని కవరుపేజీ బొమ్మ ఆర్ట్‌ఫిల్మ్‌ వాల్‌పోస్టర్‌ స్థాయిలో ముందుగా ఆకర్షిస్తుంది. ఆపైన, ఎన్టీఆర్‌ -శ్రీసీతారామకళ్యాణం టైపులో కె.శివారెడ్డి అతను చరిత్ర అనే టైటిల్‌, ఎరుపురంగులోని ‘అ’ అనే అక్షరం ఇత్యాదులు ఈ పుస్తకంలో ఏమున్నదో చూడాలనే జిజ్ఞాసను కలుగజేస్తాయి. Never mind. దాదాపు 14 సంకలనాల అనుభవం ఎక్కడికీపోదు. ఆ అనుభవం నుంచే అందరూ నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఇంకా అసలు విషయంలోకి వద్దాం. సంకలనం చదివిన తరువాత, పాఠకులను ఖచ్చితంగా స్పృశించేది ఆయనలోని భావావేశం, ఉద్వేగం. ఏదో చెప్పేయాలన్న తపన. కవికి కావల్సిన ప్రాధమిక లక్షణాలే పుష్కలంగా కనిపిస్తాయి. కానీ, మనసులో నాటుకుపోయే కవితలు మాత్రం చాలా తక్కువ. దీనికి ప్రాధానమైన కారణంగా కనిపించేవి భావ వ్యక్తీకరణలో క్లుప్తత, స్పష్టత లేకపోవటం. మరికొన్ని చోట్ల కవిత్వం పరిధి నుంచి వ్యాసంలోకి దూకేయటం.

భావావేశం, ఉద్వేగాల వ్యక్తీకరణకు, తెగిపడిన శిరస్సులు, తగలబడ్డ ఊళ్ళు, నరకబడ్డ చేతులు, చీకటి దారులు, ఇనుపగోడలు, ఆకాశాలు కూలటాలు, సముద్రాలు విరిగిపడటాలు లాంటివే వాడటం ఆయనస్థాయి కవులకు సరిపడే వ్యక్తీకరణలు కావని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి ఇన్ని సంకలనాలు వ్రాసిన ఆయనకు, ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ ఈరకమైన కవితలు వ్రాసే టీపీ కవులకు తేడా ఏముంది? నిజం చెప్పాలంటే, శివారెడ్డిగారిని అభిమానించే ‘ఆంధ్రుడు’ (విజయ్‌) గారు వ్రాసిన కొన్ని కవితలు శివారెడ్డిగారికే పాఠాలు చెప్పేస్థాయిలో ఉంటాయి.

మరో ప్రధానమైన లోపం, భావంలోని ఇంటెన్సిటీ చెప్పటానికి ఒకే పదాన్ని పునరుక్తం చేయటం, మరోచోట ఇంగ్లీషులో చెప్పిన డైలాగు తెలుగులో అనువదించి మళ్ళీ చెప్పే మన హీరోలా, తెలుగులో ఖాళీ ఇళ్ళు అని చెప్పి, శూన్య గృహాలని పునరుక్తం చేయటం నలుగురు చెప్పుకునే శివారెడ్డిగారి స్థాయిలో మాత్రం ఈ కవితలు లేవు.

ముందుగా ఈ మొత్తం సంకలనంలో నాకు ఓ మాదిరిగా నచ్చిన కవితల్లో కొన్ని :

వెన్నెల
ఆమె కళ్ళ నిండా
నీళ్ళు పెట్టుకుని అడిగింది
‘నా సంగతేమిటని’

నేను గుండె నిండా
దుఃఖాన్ని నింపుకుని అడిగాను
‘నా సంగతేమిటని’
ఇద్దరం ఫక్కున నవ్వాం
ఇద్దరి కళ్ళ నుంచి
వెన్నెల్లా వర్షం కురిసింది.

*****
పిలవటం తప్ప

దారి పక్కన నుంచుని
ఒకడు చెయ్యూపుతాడు
నాకా, ఈ ప్రవాహానికా అర్ధం కాదు
నేలలోపలి నీటిని
ఒక వేరు తట్టిలేపినట్టు
ఒక రాతిగోడ పక్క
ఒకే ఒక మొక్క విరగబూస్తుంది.

….
….
దారిపక్కన నుంచుని
పిలుస్తుంటాడొక బాలుడు
పిలవటం తప్ప
అతనికింకేం పని లేనట్టు

*****
సొరంగం
నాకొక దోవ ఉంది
నేనందులో దూరిపోతా
కానీ, ఆమెకేముంది
దారుల్లేని చీకటి

….
….
తప్పదు
ప్రతి ఒక్కడూ
బతుకులో బయటపడే
ఒక సొరంగం వెతుక్కోవాలి

*****
ఇప్పుడు కవిత్వం అనబడిన ఓ వ్యాసం :

తల్లికో బహుమతి

ఇంతకు ముందు
అది నాకు తట్టలేదు
చెంపల దగ్గర తెల్లబడుతున్న
ముప్ఫయారేళ్ళ వయసులో

(పాఠకులకు కూడా రెండో ఖండిక చదివే దాకా పజ్లింగ్‌గా ఉంటుంది ఆ వయసుదాకా తట్టనిదేమిటా అని.)

నాకు రెండింతల వయసుండి
వృద్ధాశ్రమంలో వుంటున్న
మా అమ్మకో బహుమతి కొనివ్వాలని
ఇప్పుడు తట్టింది
జుట్టు తెల్లబడుతున్న ముప్ఫయారేళ్ళ వయసులో
మా అమ్మకో బహుమతి కొనివ్వాలని –

(హమ్మయ్యా పాఠకులకేమైనా సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారేమో అని అనవసరంగా భయపడితే శివారెడ్డిగారి తప్పు కాదు)

చక్కని ఉన్ని పరుపు పరిచిన
ఉయ్యాలెందుకు కాగూడదు

(ఏమివ్వాలో అని ఇలానే సాగే ఐడియాలు మిగతా లైనులు – దిండా, హోటల్లో భోజనమా, ఓ నవల వ్రాసి ఇవ్వటమా, ఫొటోనా…)
….
….
….
సతతం నా గురించి ఆలోచించే
ఆరాటపడే గొప్ప హృదయముంది ఆమెకి
శాస్వతంగా ఆమె నాకిచ్చే
గొప్ప బహుమతి ముందు
నేనిద్దామనుకున్న బహుమతులన్నీ
ముక్కచెక్కలయిపోయాయి

ఒక్కో వాక్యాన్ని రెండు మూడు ముక్కలుగా ఖండించటమే కానీ, ఎక్కడైనా కవిత్వం కనిపిస్తున్నదా?

శివారెడ్డిగారి సందేహం, సందేశం కలగలసిన ఈ కవిత చదివితే పోలమారకపోతే ఒట్టే!!

సదా ప్రేమికులు

ఎప్పుడూ మేం కూచునేచోట హోటల్లో
ఇవ్వాళ యిద్దరు ప్రేమికులు కూచున్నారు

(కాకతాళీయమేనేమో!! మా రెండో అమ్మాయి అడిగింది, మనం చెప్పులు పెట్టుకునే చోట పక్కింటివాళ్ళు పెట్టుకున్నారు అని – కొంపదీసి కవయిత్రైపోతుందేమో!!)

ఇన్నాళ్ళు మేం అక్కడ కూచోబట్టి పవిత్రమయిందా
ఇవ్వాళ వాళ్ళు కూచోబట్టి పవిత్రమయిందా?

(అసలది పవిత్రమయ్యిందని ఎవరు చెప్పారో అని తలపట్టుకు కూర్చోవద్దు)

సదా ప్రేమికులు కవులు
కవులు కూచున్నా
ప్రేమికులు కూచున్నా
అక్కడ ప్రేమ పరిమళిస్తుంది.

మనసులో మాటు వేసుకు కూర్చుంటారు కవులు, ప్రేమికులు అని కవిగారి భావననుకుంటా.

*****

చిన్నప్పుడు మనం చూసొచ్చిన సినిమా స్నేహితుడికి చెప్పే స్థాయిలో ఉంది ఈక్రింది కవిత. చూడండి.

యిప్పటికీ

బయటికి తోసేశారు
యిద్దరు పిల్లల తల్లిని
ఏడుస్తున్న చిన్నపిల్లాణ్ణి
బలవంతాన లాగేసి,
మొగుడూ, అత్తా, మామా
ఆమెను బయటికి తోసేశారు
చూస్తూ ఉండటం తప్ప
ఎవరూ ఏమీ అనలేని
మొగుడూ పెళ్ళాల వ్యవస్థ

చెట్టు కింద గోడకానుకుని
ఇంటివైపు చూస్తూ ఆమె అలానే
శ్రీరాముడి కాలం నుంచి
ఇప్పటిదాకా ఆమె అలానే

ఇక టైటిల్‌లోని కవిత చూద్దాం.

అతను చరిత్ర

శాశ్వతంగా గాయపడ్డవాడు ఏం చేస్తాడు?
చరిత్రని చక్కగా అర్ధం చేసుకుంటాడు.

(పాఠకులకో ప్రశ్న, ఆవెంటనే ఓ జవాబు. కవిత్వం ప్రాధమిక స్థాయి దాటకపోవటం అంటే ఇదే)

రెండు మూడు తులాల బంగారం తెచ్చి
దాన్నింత బూడిద చేసి (వీలయితే)
మట్టిలో కలుపుతాడు.

విమర్శకులు ‘అతను’కి బంగారం ఎక్కడిదని అడుగుతారనే అనుమానంతో గామోసు బ్రాకెట్లో ‘వీలయితే’ అని తప్పించేసుకున్నారు.

అతనికి తెలుసు మట్టి కన్నా
బంగారం విలువయిందేమీ కాదని

(‘అతను’ డౌన్‌ టు ఎర్త్‌ అని చెప్పకుండానే చెప్పుకోవటం).

శాశ్వతంగా గాయపడ్డవాడు ఏం చేస్తాడు?
ఒక చెరువొడ్డున కూర్చుని ప్రార్ధిస్తాడు.

(పక్షి కళ్ళల్లో పద్యాలు వెతుక్కోవటం, ఇంటికొచ్చి అందరూ తిన్నదీ లేనిదీ చూడటం, మంచి నీళ్ళు తాగి పడుకోవటం ఇలాంటి జవాబులతో ఓ పదిలైనులు లాగించి ఇచ్చే ముక్తాయింపు)

చరిత్ర నిండా అల్లుకుపోయిన
తన్ను చూసి నవ్వుకుంటాడు.

కొద్దిగా కవిత్వం కనిపించినా కవి అతిశయాన్ని సంపూర్తిగా వ్యక్తీకరించే ఇలాంటి కవితలు ఈ సంకలనంలో ఇంకా ఉన్నాయి. ‘మణిదీపం’ మరో ఉదాహరణ.

మంచి మినీకవిత కాదగ్గ మరో కవిత.

అప్పుడప్పుడు

అప్పుడప్పుడు
వెనక్కి తిరగటం మంచిదే
వెనక్కి తిరిగినవాడు
మళ్ళా ఎదురుదాడి చేయడనే
గ్యారంటీ ఏమీ లేదు.

(ఇంతవరకు ఫర్వాలేదనుకోవచ్చు. కానీ, ఎన్ని రకాలుగా వెనక్కి తిరగొచ్చో చెప్పే తరువాతి విషయాలతోటే ఈ కవితలో అందం అన్యాయమైపోతుంది.)

శక్తి కూడగట్టుకుంటానికి
వంగి చేతిలోకి రాయి తీసుకుంటానికి

….
….

అలొచ్చినప్పుడు
తలొగ్గటంలో తప్పు లేదు
తలొంచినట్టు వంచి
మళ్ళా తలెత్తేవాడు తుంగమొక్క
కూడగట్టుకోవటం
కాళ్ళల్లో కళ్ళు పెట్టుకోవటం
ఎండిందనుకున్న చెట్టు
వేళ్ళలోంచి మనుషులు పుట్టుకురావటం

రావటమే, తిరిగి తిరిగి
యుద్ధరంగానికి రావటమే
రణస్థలి జన్మస్థలి.

చివరి వాక్యాలు ఎంత చక్కగా ఉన్నాయో!!

ఏదేమైనా 100 కిలోల బియ్యం బస్తాలో, గోతాం బరువెంత ఉంటుందో ఈ సంకలనంలో కవిత్వం అంతే ఉంది.

సముద్రంలా గంభీరంగా ఉండాలి భావం. గలగలా పారే నదిలా ఉండాలి వ్యక్తీకరణ. అప్పుడే కవిత్వం వినిపిస్తుంది. అమ్మ పిలుపుకి, కుక్క అరుపుకు తేడా స్పష్టంగా చూపగలిగినప్పుడే కవిత్వం పదికాలాలు నిలుస్తుంది.

సంవత్సరానికో సంకలనం తీసుకురావాలనే తపనతో ‘నేను క్షేమం, మీరు క్షేమమేనని తలుస్తాను’ అన్న తీరులోనే ఈ సంకలనం కనిపిస్తుంది కానీ, గుండె నుంచి వచ్చి, గుండెను తాకే శివారెడ్డి కవితలు ఇందులో లేవు.

కవిత్వానికి కొత్తరోజులు తీసుకు వద్దామనుకునే కొత్తకవులు ఈ సంకలనం కొని తీరాలి. కవిత్వం ఎలా వ్రాయకూడదో తెలుసుకోటానికి.

You Might Also Like

11 Comments

  1. essemCHELLURU

    meeru sivareddy gari NETHRADHANUSU,BHARAMITHI,MOHANA O MOHANA koodaa chadavandi

  2. కెక్యూబ్ వర్మ

    కొత్తపాళీ గారి వ్య్ఖానంతో ఏకీభవిస్తున్నా. మహాప్రస్థానం గేయాలనే అన్నారందరు. వచనానికి గేయానికి తేడా వుంది. అయినా కవితా గానం చేసేటప్పుడు కూడా హత్తుకునే వాక్యాలను నొక్కి చెప్పాల్సిన పాదాన్ని రెండు మార్లు చదువుతారు.
    శివారెడ్డి గారి ఒక్క స౦కలనాన్నే తీసుకొని అ౦దులో కవిత్వం లేదని, దానిని యువరచయితలకు ఉదా.చూపెడుతూ రాయడం ద్వారా విమర్శా కాదు. అవి కొన్నేళ్లుగా ఆయన ప్రచురిచకు౦డా వదిలినవాటిని నవీన్ మిత్ర బృందం ప్రచురించారు. అయినా కవిత మొత్తం పాదాలన్నీ పద చిత్రాలతో ని౦పనక్కర్లేదు. ఆయన శైలి ము౦దు ను౦డే అలానే వు౦డడ౦ గమని౦చొచ్చు. ఆయన వాక్య నిర్మాణం సహజంగా, సరళంగా వు౦టు౦ది. అది ఏమి నేరం కాదు.

  3. కొత్తపాళీ

    మహాప్రస్థానంలో ఉన్నదీ శివారెడ్డి కవితల్లో ఉన్నదీ ఒకటి కాదు అని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను.

  4. bondalapati

    నేను ఈ వ్యాస రచయిత చెప్పిందానినే మళ్ళీ కోట్ చెశాను. నేను అడిగేదేమంటే “నేను చెప్పినవి పునరుక్తి దోషం కిందికి రానీయండి రాకపోనివ్వండి, అది వేరే విషయం. మహాప్రస్థానం లో ఉన్నాయి. వాటిని మనం మెచ్చాము.ఒకరకం గా అవి మనని తట్టి లేపాయి. అవే విషయాలను శివారెడ్డి వాడితే ఎందుకు తప్పు పడుతున్నాము?” అని. శ్రీ శ్రీ వాడిన దానికీ శివారెడ్డి వాడిన దానికీ తేడా ఏమన్నా ఉందా? లేక పోతే శ్రీ శ్రీ అప్పట్లో కొత్తగా వాడారు కాబట్టీ దానికి ఒక ఆమోదం లభించిందా? తరువాతి కవులు అదే విషయాన్ని పదే పదే వాడటం వలన ఈ టెక్నిక్లు తమ ఆమోదాన్ని కోల్పోయాయా? రాం గోపాల్ వర్మ శివ సినిమా తీసినప్పుడు అది ఒక వెరైటీ, కానీ గాంగ్ స్టర్ సినిమాలు చూసీ చూసీ ఇప్పుడు జనాలు శివ లాంటి సినిమాలను అదే ఉత్సాహం తో ఆమోదించే స్థితి లో లేరు. ఇది నాకు తెలియదు..నేను ఇంకా కవిత్వం చదవటం లో నెలల బాలుడినే.

  5. కొత్తపాళీ

    బొందలపాటి గారు, మీరు మహాప్రస్థానంలో పునరుక్తి అన్నప్పుడు ఇలాంటి ఉదాహరణలే ఇస్తారని ఊహించాను. అందుకే అడిగాను.
    మీరు చెప్పిన ఉదాహరణలు (ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం, నీవన్నది – ఇత్యాది) పునరుక్తులు కావు. ఒక భావం కానీ, పోలిక కానీ, ఆలోచనకానీ మళ్ళీ మళ్ళీ చెప్పడం పునరుక్తి అవుతుంది. మహాప్రస్థానంలోని రచనలు వచన కవిత్వం కాదు – అవి శైలిలో గేయకవిత్వానికి దగ్గరగా ఉంటాయి – వీటిని గీతాలు అని శ్రీశ్రీయే చెప్పుకున్నాడు. వాటిలో మేధను తట్టి లేపే భావాలతోపాటు మనసును కదం తొక్కించే లక్షణం, ఒక లయ, ఒక దూకుడు ఉంది. ఈ లక్షణాలన్నీ కవి ఉద్దేశ పూర్వకంగా అవి కలిగించే ఎఫెక్ట్ తెలిసి తీర్చి దిద్దినవే. మహాప్రస్థానం రచనలు పైకి చదవాల్సినవి, చాతనైతే గట్టిగా ఎలుగెత్తి పాడాల్సినవి, మనసులో చదువుకోవలసినవి కావు.
    బైదవే, పునరుక్తి కూడా తెలిసి వాడితే దోషం కాదు. అది అక్కడ కవిత్వ సందర్భంలో అతకనప్పుడే అది దోషమవుతుంది.

    మీ రెండో అభియోగం .. శ్రీశ్రీ వాడిన ప్రతీకలు పోలికల గురించి – అన్నీ ఇట్లాంటివే వ్డాడు అని .. అందులో మీ ఆక్షేపణ ఏమిటో నాకు అర్ధం కాలేదు. అవును, అట్లాంటివే వాడాడు. అయితే? వాటితో పాటుగా .. సంధ్యా సమస్యలు, ఒకరాత్రి ఇలాంటి పూర్తిగా మనకి అర్ధమయ్యే ప్రతీకల్ని మనకి అర్ధమయ్యే భాషలోనే రాశాడు.

  6. bondalapati

    మహా ప్రస్థానం లో ఆకాశాలు కూలటాలు, సముద్రాలు విరిగిపడటాలు లాంటివే వాడటం లాంటివిషయాలు:

    యముని మహిషపు లోహ గంటలు
    మబ్బు చాటున ఖణెల్మన్నాయి..
    ..
    పుడమి తల్లికి పురిటి నెప్పులు….
    పయోధర ప్రచండ ఘోషం
    ఖడ్గ మృగోదగ్ర విరావం
    ఝంఝానిల షడ్జధ్వానం
    కవాలోయ్ నవ కవనానికి..
    ..
    జగన్నాథ రథ చక్రాలలో…
    ..
    ..
    సిమ్హాచలం కదిలింది
    హిమాలయం కరిగింది
    వింధ్యాచలం పగిలింది —
    సిమ్హాచలం
    హిమాచలం
    వింధ్యాచలం ,సంధ్యాచలం …
    మహ నగాలెగురుతున్నాయి

    దీర్ణ మాన గిరిశిఖరరాల్
    గిర గిర గిర తిరుగుతున్నాయి!


    నట ధూర్జటి
    నిటాలాక్షి పగిలిందట
    నిటాలాగ్ని రగిలిందట
    నిటాలాగ్ని!
    నిటాలార్చి!
    నిటాలాఖి పటాలుమని
    ప్రపంచాన్ని భయపెట్టింది.
    ..ఇక పోతే..
    ధ్వంస రచన
    ధ్వంసనచణ
    హింస రచన..
    ..
    అది విలయం
    అది సమరం
    ..

  7. bondalapati

    మహాప్రస్థానం లోని పునరుక్తులు:

    మహా ప్రస్థానం గీతం
    —————————–
    హరోం హరోం హర
    హర హర హర హర
    హరోం హరా అని కదలండి

    పదండి
    పదండి,
    పదండి ముందుకు

    ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
    ఎనభై లక్షలమేరువులు
    తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
    జలప్రళయ నాట్యం చేస్తున్నవి.

    నయాగరా వలె
    ఉరకండీ! ఉరకండీ ముందుకు..

    మరోప్రపంచం
    మరో ప్రపంచం
    మరో ప్రపంచం పిలిచింది..

    ఘంటలు గీతం
    ————————–
    గంటలు! గంటలు! గంటలు! గంటలు!
    గంటలు! గంటలు!
    గణ గణ గణ గంటలు
    గణ గణ గణ
    గంటలు! గంటలు!
    ……

    గంటలు! గంటలు!
    గంటలు! గంటలు!

    …..
    గొణ గొణ గణ గణ
    గంటలు! గంటలు!
    గంటలు! గంటలు!

    కళా రవి కవిత
    ———————–
    పోనీ.,పోనీ
    పోతే పోనీ..
    రానీ, రానీ..
    కానీ,కానీ
    .
    .
    అభ్యుదయం కవిత
    ———————
    ఏవో
    ఏవేవో,ఏవేవో
    ఘోషలు వినపడుతున్నాయ్
    .
    .
    ఎవరో
    ఎవరెవరో, ఎవరెవరో
    .
    అవిగో,అవిగవిగో, అవిగవిగో!
    .
    నేడె, ఈ నడే,ఈ నాడే,

    మిధ్యావది కవిత:
    ——————————
    మాయ! మాయ! మాయ! మాయ!
    మాయ! మాయ!
    మాయంటావూ అంతా మిధ్యంటావూ…

    చేదు పాట కవిత
    ——————————–
    ఔను నిజం, ఔను నిజం,
    ఔను నిజం, నీవన్నది
    .
    .
    లేదు సుఖం,లేదు సుఖం,
    లేదు సుఖం జగత్తులో..

    నిజం సుమీ, నిజం సుమీ,
    నీవన్నది నిజం సుమీ…

    దేనికొరకు కవిత
    ——————–
    నీలోనే నీవేదో ఆలకించుతావ్!
    శ్రీనివాస రావ్,
    శ్రీనివాస రావ్,

    కేక కవిత
    —————–
    భగ భగ భుగ భుగ
    భగ భగ మండే..
    .
    .
    గర్జించు రష్యా కవిత
    ——————————–
    రా, రా రష్యా,
    రష్యా, రష్యా, రష్యా, ఓ రష్యా!
    .
    .
    రా, రా రా రష్యా,
    రష్యా, రష్యా, రష్యా, ఓ రష్యా!
    .
    .
    రష్యా, రష్యా, రష్యా, నా రష్యా..
    లే లే లే రష్యా..
    రష్యా, రష్యా, రష్యా, ఓ రష్యా!
    .
    .
    జగన్నాథ రథ చక్రాలు కవిత
    ——————–

    జగన్నాథ
    జగన్నాథ
    జగన్నథ రథ చక్రాల్
    రథ చక్రాల్,
    రథ చక్రాల్,
    రథ చక్రాల్, రథచక్రాలొస్తున్నాయి

  8. మాగంటి వంశీ

    ఈ పోష్టులో కొన్ని మంచిమాటలు చెప్పారు. ఆ మాటలు వినగానే/చదవగానే ఎందుకో చప్పున చిన్నప్పుడు మా మావయ్య నేర్పిన రెండు పద్యాలు గుర్తుకొచ్చాయి. భావం “తిరగామరగా”గా ఒకటే అని తర్వాత తెలిసింది.

    ఆ పద్యాలు ఏమిటా ?

    మొదటిది –

    నాల్గు కాళ్ళు తోక నల్లని చర్మంబు
    గాదెవంటి మేను గేదెకుండు
    గడ్డిమేసి కుడితి కడుపునిండగద్రావి
    పేడవేసి గేదె పిడుకలిచ్చు
    అటుపైన పొట్టనింపగ
    కమ్మని పాలుపెరుగునిచ్చు

    రెండోది

    కుడితి తాగెడున్ గేదె గడ్డి మేశెడున్
    మేశిమేశి తాగితాగి పేడవేశెడున్
    పేడపిసికి పిడకలెన్నొ చరుతు రందరున్
    అవ్విగాక పాలుపెరుగు గేదెలిచ్చెడున్

    అని…

    ఐతే ఏది హాస్యస్ఫోరకమో, ఏది రసస్ఫోరకమో ఇప్పటిదాకా నాకైతే తెలియలేదు. అసలు హాస్యమూ, రసమూ, భావమూ అటుపైన కవిత్వమూ అన్నవే లేవు ఇందులో అని మీలో ఎవరైనా కితాబిస్తే అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు…

    మరి కవితలు కూడా అదేదో రకమైన స్ఫోరకాల్లో “పడి”పోతూంటే ఆశ్చర్యమెందుకు స్వామీ? ఎవరి రాతలెవరి పైత్యానికీ, క్షోభకి ప్రాప్తమో/కారణమో ఆ పైవాడికిన్నీ, క్షోభ పడ్డవాడికిన్నీ మాత్రమే ఎఱుక. ఏదేమైనా మంచి వ్యాసం.

  9. కొత్తపాళీ

    పాండ్యరాజు సభలో నా కవిత్వాన్నే తప్పు పడతావా నేనెవరో తెలుసా అని శివుడూ మూడోకన్ను ప్రదర్శించినప్పుడు, నత్కీరుడు ఏ మాత్రం జంకకుండా తలచుట్టువార కన్నులున్న గానీ కవిత్వంలో తప్పు తప్పే అంటాడు.
    శివారెడ్డిగారు సీనియర్ కవి అయినా, ఎన్నో ఎవార్డుల గ్రహీత అయినా, కవిత్వం విషయంలో రాజీలేకుండా నిర్మొహమాటంగా విమర్శించినందుకు (మెచ్చుకోవలసిన చోట మెచ్చుకుంటూనే) మీకు అభినందనలు.
    బైదవే, ఆయనకి పుస్తకం డిజైను, మార్కెటింగ్ మీద కూడా పెద్ద అవగాహన ఉందనుకోను. ఈ పుస్తకానిక్కూడా ఆ పనులన్నీ చూసుకున్నది వాసిరెడ్డి నవీన్ గారు అయుండేందుకు 99% అవకాశం ఉన్నది.
    బొందలపాటి గారు, ఆలోచించాల్సిన ప్రశ్నే. ఈ సభలో కవులూ, కవిత్వవిమర్శకులూ ఏమంటారో చూద్దాం. మహాప్రస్థానం నించి పునరుక్తికి ఉదాహరణలు ఏమన్నా ఇస్తారా ఈలోపల?
    I hope, by repetitions, you don’t mean lines like ఏడవకండేడవకండేడవకండి, etc.

  10. bollojubaba

    అలంకార సహితమైనదే కవిత్వమా?

    కవిత్వానికి సౌందర్యదృ్ష్టి తప్ప మరేమీ ఉండకూడదా?

    ఒక ఆలోచనను, సూటైన మాటలలో కవిత్వ “ఫార్మెట్” లో చెప్పకూడదా? (చూడుడు: మహాప్రస్థానగీతాలు)

    బొల్లోజు బాబా

  11. bondalapati

    నేను కవిత్వానికి కొత్త. ఓ ఐదు రోజుల కిందట శ్రీ శ్రీ మహా ప్రస్థానం చదివాను. దాన్లో కూడా మీరు చెప్పిన ఈ కింది లక్షణాలు ఉన్నాయనుకొంటాను.

    “భావంలోని ఇంటెన్సిటీ చెప్పటానికి ఒకే పదాన్ని పునరుక్తం చేయటం,
    ఆకాశాలు కూలటాలు, సముద్రాలు విరిగిపడటాలు లాంటివే వాడటం ఆయనస్థాయి కవులకు సరిపడే వ్యక్తీకరణలు కావని నిస్సందేహంగా చెప్పవచ్చు.”

    నా సందేహం ఏమిటంటే అప్పట్లో అది కొత్త కాబట్టీ దానిని ఆమోదించి, అదే విషయాన్ని పదే పదే వాడటం వలన ఇప్పుడు అది వాడకూడనిది అయ్యిందా?

Leave a Reply