ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ 2014 – నా అనుభవం
కొన్నాళ్ళ క్రితం నేను ఫ్రాంక్పర్ట్ బుక్ ఫెయిర్ కు వెళ్ళాను (అక్టోబర్ 2014లో). 2012 లో ఒకసారి వెళ్ళాను కానీ, అప్పటితో పోలిస్తే ఈ సారి కొన్ని అంశాలు నాకు ఆసక్తికరంగా అనిపించాయి. అప్పట్నుంచి నేను గమనించిన విషయాల గురించి రాద్దాం అనుకుంటూన్నా కుదర్లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి హిందూ పత్రిక లో చదివిన ఒక వార్త మళ్ళీ దీని వైపుకి లాగింది నన్ను. దాని సారాంశం ఏమిటంటే, “అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన్” అన్న ఎనిమిది దశాబ్దాల వయసుగల వార్షిక ఉత్సవాన్ని ఈఏడు పంజాబులో జరపాలని నిర్ణయిస్తే, మరాఠీ పబ్లిషర్లు దాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారట. కారణం – వాళ్ళు దాన్ని ““a quixotic venture” commercially detrimental to their trade” అని భావించడమే!
సరిగ్గా ఇలా తమ మార్కెట్ కాని చోటకి వెళ్ళి నెట్వర్కింగ్ చేస్కోడమే కదా ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్లో వాళ్ళు చేసుకునేది – ట్రేడ్ ఫెయిర్ లాగ. వీళ్ళేంటి ఇలా అన్నారు? అనుకుని, అక్టోబర్ లో నేను చూసిన అంశాలు కొన్నింటి గురించి వివరాలు (నాకు గుర్తున్నంతలో) పంచుకుందామని రాస్తున్న వ్యాసం ఇది. నా పరిమితానుభవంలో, పరిమిత జ్ఞానంతో మాత్రమే రాసిందన్న విషయం గుర్తుంచుకుని… ముందుకు వెళ్ళండి.
ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ కి 2012 లో మొదటి సారి వెళ్ళినపుడు పిల్లల సెక్షన్ లో ఎక్కువసేపు తిరిగినందువల్ల అంతర్జాతీయ పబ్లిషర్ల సెక్షన్ ని ఎక్కువ గమనించలేదు. పెద్దా, చిన్నా తేడా లేకుండా బోలెడు దేశాల ప్రచురణకర్తలు ఏటేటా అక్కడికి వస్తూంటారు. అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ భాషల్లోనే పుస్తకాలని డిస్ప్లే లో పెట్టడం కూడా మామూలే. మొదట నేను స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్ వంటి భాషల స్టాల్స్ మీదుగా వెళ్తూ, వీళ్ళకి మార్కెట్ ఉంది, వచ్చేపోయే వాళ్ళకి వీళ్ళ భాషల గురించి తెలిసి ఉంటుంది – కనుక పెట్టుకుంటారు లే అనుకున్నాను. గతంలో ఓసారి భారతీయుల స్టాల్ ఒకదానిలో ఆంగ్ల పుస్తకాలు మాత్రమే చూసి కొంచెం ఆశ్చర్యపడి, కనీసం భారతీయ భాషల పుస్తకాల ఆంగ్లానువాదాలైనా పెట్టుకోవచ్చు కదా అనుకోవడం గుర్తు వచ్చింది.
అయితే, కాసేపటికే అజర్బైజాన్, కజకిస్తాన్, జార్జియా దేశం, బెలారస్ వంటి చిన్న చిన్న దేశాల స్టాల్స్, దానిలో వాళ్ళ వాళ్ళ భాషల్లో రాయబడ్డ పుస్తకాలు కనబడ్డాయి (రష్యన్ పుస్తకాలు కావు. అడిగి కనుక్కున్నాను. వాళ్ళ వాళ్ళ భాషల్లో రాయబడ్డ పుస్తకాలు చూపించారు). అనువాదాలు కావు. మరెందుకు పెట్టుకున్నారో, ఎవరొచ్చి చూస్తారో నాకు అర్థం కాలేదు. ఇలా ఉండగా కజఖ్ స్టాల్ వద్దనో, ఆ ప్రాంతంలోనిదే మరొక దేశం స్టాల్ వద్దనో ఒకతను ఆపాడు నన్ను. “మీది ఇండియానా?” అన్నాడు. అవును అన్నాను. ఏదో బహు భాషా నిఘంటువు తీసుకుని “సీ దిస్” అన్నాడు. ఏం చూడాలో నాకేం అర్థం కాలేదు. రష్యన్, అరబిచ్ వంటి లిపులు ఉన్న కొన్ని భాషలలో ఉంది. “ఏమిటిది?” అంటే, చెప్పాడు – వైద్య పదజాలానికి సంబంధించిన నిఘంటువు అని. అక్కడ ఉన్న భాషల్లో ఉర్దూ ఒకటి. నాకు ఉర్దూ చదవడం రాదంటే కూడా, అతనికి ఇంగ్లీషు రాకపోయినా కూడా, చెబుతూనే ఉన్నాడు ఉత్సాహంగా ఏదో. “ఇంగ్లీషులో ఏం లేవా?” అని అడిగాను. లేవు అన్నాడు. నాకు ఆశ్చర్యమేసినా ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయాను. కాసేపటికి “translation needed” అని అరలు అరలుగా పుస్తకాలను ఉంచిన ఇండోనేశియా వారి స్టాల్ చూసాక నాకు బల్బు వెలిగింది ఎందుకు ఇక్కడ చాలా మంది వాళ్ళ భాషల్లో పుస్తకాలు మాత్రమే పెట్టుకుంటారో!
అక్కడనుండి గమనిస్తే, చిన్నా పెద్దా ప్రతిదేశం వారి స్టాల్ వద్దా ప్రముఖంగా కనిపించిన అంశం – తమ దేశ సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించడానికి ఆహ్వానం. చాలా చోట్ల ఈ ఆహ్వానంతో పాటు ఆయా దేశాల ప్రభుత్వాలు ఇలా అనువాదం చేసే ప్రాజెక్టులకి అందించే సహకారం, ఇచ్చే గ్రాంట్లు వగైరాల గురించిన వివరాలు. జార్జియా, ఇస్టోనియా, లిథువేనియా వంటి చిన్న దేశాలు మొదలుకుని కొంచెం పెద్ద దేశాలైన టర్కీ, ఇటాలీ, స్పెయిన్ వంటి దేశాల దాకా ఇదే కథ (మన దేశం స్టాల్స్ గురించి చివర్లో రాస్తాను).
ఇస్టోనియా దేశం మ్యాపు మీద ఎంత చిన్నదిగా కనిపిస్తుందో, ఆ స్టాల్ సైజుతో పోల్చుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది. మన నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాల్ కంటే పెద్దదిగా ఉన్నట్లు అనిపించింది. అక్కడ ఒకే ఒక మనిషి కూర్చుని, వచ్చే పోయే వాళ్ళని పలకరించడం కూడా చేయకుండా ఎవరితోనో చర్చలో మునిగిపోయి ఉంటే, ఇక్కడ వెళ్ళగానే వాళ్ళ దేశపు రచయితల గురించి పరిచయం చేసే చిన్న చిన్న పుస్తకాలు పంచడం మొదలుపెట్టారు! అక్కడ ఇస్టోనియన్ సాహిత్య పత్రిక ఒకదాన్ని ఉచితంగా పంచిపెడుతూంటే తీసుకొచ్చాను. ఆరోజు నేను ట్రెయిన్లో ఒక ఇస్టోనియన్ నవల చదువుతూ వచ్చాను అని చెప్పగానే ఆశ్చర్య పోయి, ఆనందపడి, మరి కాసేపు మాట్లాడారు. అప్పుడు వాళ్ళ సాహిత్యం గురించి, అది ప్రపంచంలోని ఇతర దేశాలను చేరేందుకు వాళ్ళ దేశంలో జరిగే కృషి గురించీ చెప్పారు. ఫలానా నవలలో ఇతర రచనలో ఇతర భాషల్లోకి అనువాదం చేస్తే బాగుంటుందని ఏటేటా ఓ పదిమంది సమావేశమై నిర్ణయిస్తారట వాళ్ళు అధికారికంగా! ఆ తరువాత ఆ నవలల గురించిన సంక్షిప్త పరిచయాలు ఉన్న పుస్తకం ఒకటి విడుదల చేసి, ఇలా బుక్ ఫెయిర్ లో అనువాదకులని ఆహ్వానిస్తారట! కానీ, ఆంగ్లానువాదాలు తక్కువే ఉన్నాయి నేను చూసినప్పుడైతే. ఇతర ఐరోపా భాషల్లోకి అనువాదాలు ఎక్కువ అని చెప్పారు.
కాసేపు తరువాత లిథువేనియా స్టాల్ చూశాను. అక్కడా ఇలాగే గత ఏడాది లిథువేనియన్ భాషలో వచ్చిన ఉత్తమ పుస్తకాలంటూ ఓ జాబితా, వాళ్ళ రచయితల గురించి ప్రచారం వగైరా కనిపించాయి. అయితే ఇస్టోనియాలాగ ఏటేటా సమావేశమై అనువాదాలు ఆహ్వానించడం ఇలాంటివన్నీ చేయము అన్నది అక్కడ కనబడ్డావిడ. మరీ ఇస్టోనియా స్టాల్ అంత కాకపోయినా, బల్గేరియా, రొమేనియా, టర్కీ, లాట్వియా, చెక్ రిపబ్లిక్ ఇలా అనేక యూరోపు దేశాల స్టాల్స్ అన్నింటిలోనూ వాళ్ళ భాషలోని కొత్తా పాతా ప్రముఖ రచయితల గురించిన చిన్ని పుస్తకాలు అక్కడ కూర్చుని చదవడానికి కొన్నీ, ఉచిత పంపిణీకి కొన్నీ ఉంచారు. వీటిలో కనబడే పేర్లు మనకి ఆ దేశం గురించి బయట తెల్సిన రచయితల పేర్లు కాకపోవడం నాకు ఆసక్తికరంగా అనిపించింది. అక్కడికి నేనేదో ప్రపంచ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివానని కాదు. ఏమీ తెలియని నాక్కూడా పత్రికల్లో కొన్ని పేర్లు కనబడతాయి. అది కాక, చదివే స్నేహితులు అప్పుడొకటి ఇప్పుడొకటి చెబుతూ ఉంటారు రచయితల గురించి. కానీ, ఇక్కడ పరిచయాలు రాసినది వాళ్ళ గురించి కాదు అంటున్నానంతే!. అంటే ఆల్రెడీ అంతర్జాతీయంగా పేరు పొందిన రచయితలు కాకుండా ఇతరుల గురించి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు నేను అర్థం చేసుకున్నాను.
ఇవన్నీ ఒక ఎత్తు, అక్కడే జరుగుతున్న Antiquarian Book Fair ఒక ఎత్తు. ఈ పాత, అరుదైన పుస్తకాల వ్యాపారం గురించి ప్రదీప్ సెబాస్టియన్ వ్యాసాల్లో చదవడమే తప్ప నేనెప్పుడూ వెళ్ళలేదు అలాంటి ప్రదర్శనకి. గతంలో వచ్చినపుడు ట్రైనుకి ఆలస్యం ఔతోందని పైపైన చూసి వెళ్ళిపోయా ఈ ప్రదర్శనని. నాకు మట్టుకు చాలా నచ్చింది ఈ ప్రదర్శన. ఎప్పుడో నాలుగొందల ఏళ్ళ నాటి పుస్తకాలు, వాటికి గల విపరీతమైన ఖరీదులూ, వాటిని అందంగా అమర్చిన విధానం – ప్రతీదీ నామట్టుకు నాకు అబ్బురంగా అనిపించింది. తరువాత నవంబర్ లో స్వీడెన్ దేశంలోని ఉప్సలా విశ్వవిద్యాలయానికి వెళ్ళినపుడు వారి గ్రంథాలయం Carolina Rediviva లో మరికొన్ని అరుదైన పాత manuscripts చూశాను – కానీ, ఇక్కడ చూసినన్ని పుస్తకాలను చూడ్డం మట్టుకు ఇదే మొదటిసారి.
ఇకపోతే, ఈ వ్యాసం ఇక్కడిదాకా చదివిన వారు అదే ఓపికతో తదుపరి భాగాన్ని కూడా చదివి, నేనేదో మన దేశాన్ని ఆడిపోసుకుంటున్నాని భావించరనీ; నా అజ్ఞానాన్ని క్షమిస్తారనీ ఆశిస్తూ, మన దేశం పబ్లిషర్ల స్టాల్స్ లో నన్ను కొంచెం ఆశ్చర్యపరచిన అంశాల గురించి విన్నవించుకుంటాను.
* నే.బు.ట్ర వారిది ఓ పెద్ద స్టాల్ ఉండటంతో ఆనందంగా లోపలికెళ్ళాను. లోపల కలెక్షన్ మన దేశంలో ఉన్న భాషా వైవిధ్యాన్ని అడ్వర్టైజ్ చేసి ప్రముఖంగా చూపుతున్నట్లు లేకపోయినా, అక్కడ ఉంచిన ఆంగ్లానువాదాల్లో పలు భాషలు ఉన్నట్లు గమనించాను (రెండు తెలుగు పుస్తకాలు చూశాను. ఒకటి వోల్గా రచనకు అరి సీతారామయ్య అనువాదం. మరొకటి గుర్తులేదు). కానీ, ఇన్ని భాషలకి ఆంగ్లానువాదాలు ఉన్నాయన్న సంగతి అక్కడ బయటివ్యక్తులకి తెలిసేలా లేదు. పైగా, ఆంగ్లంలో తప్ప మూల భాషలో అసలు దాదాపు నాకే పుస్తకమూ కనబడలేదు (హిందీవి కొన్ని తప్ప). తక్కిన దేశాల స్టాల్స్ చూసొచ్చాక చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ విషయం.
* ఒకానొక ఢిల్లీ పబ్లిషర్స్ వారి స్టాల్ లో ఇంజనీరింగ్, మెడిసిన్, అకౌంటన్సీ పాఠ్యపుస్తకాలను ప్రదర్శించారు. మొత్తం స్టాల్ మొత్తం ఇలాంటి టెక్స్ట్ పుస్తకాలే. నేను షాక్ నుండి తేరుకోడానికి కొంచెం టైము పట్టింది. అంటే మన ప్రివేటు టెక్స్ట్ బుక్స్ కి ప్రపంచంలో అంత డిమాండ్ ఉండా? అని సందేహం కూడా కలిగింది.
* ఇతర చిన్న చిన్న స్టాల్స్ లో ఖాళీ స్టాండ్స్ ఉండడం కొంచెం నిరాశకు గురిచేసింది. కోల్కత కు చెందిన ఒక స్టాల్ లో, తమిళపత్రిక KalachuvaDu స్టాల్ లో అయితే, ఒక మోస్తరు అర లో ఏడెనిమిది పుస్తకాలకి మించి లేవు. అవసరం లేదనుకున్నారా? ఎవరన్నా నెట్వర్కింగ్ లో భాగంగా వచ్చిన తోటి పబ్లిషర్లకి ఉన్న పుస్తకాలన్నీ పంచిపెట్టేశారా? – అని సందేహాలు వచ్చాయి.
* పిల్లల సెక్షన్ లో ఎక్కువసేపు తిరగలేదు కానీ, నాకు కనబడ్డ ఒకట్రెండు ఢిల్లీ ప్రచురణకర్తల స్టాల్స్ లో అయితే – విదేశీ కథలు, స్వదేశీ పేర్లతో ఉన్న పుస్తకాలు మట్టుకు కనబడ్డాయి!! మనకున్న పిల్లల కథలూ అవీ అడ్వర్టైజ్ చేయాల్సింది పోయి వాళ్ళ నుండి మనం తీసుకున్న కథల్ని వాళ్ళకే ప్రదర్శించడం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఏమాటకామాటే, ఇది చూశాక నే.బు.ట్ర. స్టాల్ లో మాధవ గాడ్గిల్ గారి Muchkund, అటువంటి మరికొన్ని కొత్తగా వచ్చిన పిల్లల పుస్తకాలు చూడ్డం మట్టుకు ఆనందం కలిగించింది.
-మొత్తానికి ఏ భాషని మార్కెట్ చేయాలో నిర్ణయించుకోలేకో, అన్ని భాషల గురించీ చెప్పడమే ఓ వెరైటీ అని నాలా అనుకోలేకో, ఆంగ్లంలో ఉంటే తప్ప ఎవరూ చూడరనుకునో (మామూలు పుస్తక ప్రదర్శనలో అది నిజమఏ ఏమో కానీ, ట్రేడ్ ఫెయిర్లో కాదేమో అని నా అభిప్రాయం), ఏదో రావాలి-వచ్చి స్టాల్ పెట్టాలి – ఓ పనైపోతుంది అనుకునో కానీ, చిన్న పెద్దా ఇతర దేశాల స్టాల్స్ తో పోలిస్తే మన దేశం వారు అంతగా మార్కెట్ చేసుకోడంలో ఆసక్తి ప్రదర్శించలేదు అని నాకు అనిపించింది.
అవీ ఆ పుస్తక ప్రదర్శన గురించి నాకు ఇప్పటికి గుర్తు ఉన్న విషయాలు!
C.Narsing rao.
ఎన్నో కొత్త విషయాలు తెలిపినారు. ధన్యవాదములు
padmasri
చాలా బాగా రాసారు . మంచి విషయాలు తెలిసాయి . అభినందనలు .
pavan santhosh surampudi
చాలా ఆశ్చర్యం కలిగింది మీ వ్యాసం వల్ల. భలే వుంది. ఇలా ఫలానా పుస్తకాలు అనువాదం చేయమని, వాటికి అవసరానికి తగ్గట్టు గ్రాంట్లు కూడా ఇస్తామని పిలిచి అనువాదాలు చేయించుకుంటున్నారా?
టాగూర్ కవిత గుర్తొస్తోంది ‘‘ప్రభూ! మేల్కొలుపు మా సాహిత్యాన్ని ఆ స్వర్గానికి’’.
సౌమ్య
నాకూ చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. కొన్ని దేశాల బ్యానర్లు అవీ ఫొటోలు కూడా తీశాను ఆరోజు. బద్దకించి ఇక్కడికి అప్లోడ్ చేయలేదు ఇంకా 🙂
ముఖ్యంగా, కొన్ని మనతో పోలిస్తే చాలా చాలా చిన్న దేశాల వారు సర్చ్ కమిటీలు పెట్టుకుని మరీ ప్రతి ఏడాదీ ఏవి అనువాదం చేయించాలో నిర్ణయిస్తారని తెలిసి ముచ్చటేసింది.