Karna’s Wife: The Outcast’s Queen
మహాభారతంలో కర్ణుడిది విలక్షమైన పాత్ర. అతడు ఎవరో, ఎవరికి పుట్టాడో అతడికే తెలియని పాత్ర. అతడెంత సుగుణవంతుడైనా, సమాజం అతడిని ఆమోదించలేదు. అతడెంతటి పరాక్రమవంతుడైనా కులం పేరిట అవమానాలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. ఆ కులాన్ని బేఖాతరు చేస్తూ, అతడిని ఆదరించి, అభిమానించి, రాజ్యాభిషేకం చేసిన స్నేహితుడు దుర్యోధునుడు, పాండవుల విషయానికి వచ్చేసరికి, ధర్మాధర్మాల సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తాడు. ధర్మానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడే కర్ణుడు, తనకి సహాయం చేసిన మిత్రుడి కోసం ఏదైనా చేయడానికే నిశ్చయించుకుంటాడు. ఆ నిర్ణయం వల్ల కర్ణుడు మంచి-చెడు, ధర్మం-అధర్మం మధ్య నలుగుతూనే ఉంటాడు. చిట్టచివరకు, తానూ ఓ పాండవుడన్న నిజం తెలుసుకున్నా, తన స్నేహాన్ని వదులుకోడు. మరణం తథ్యమని తెలిసీ, యుద్ధానికి వెళ్తాడు. ఓ వీరుడిలా మరణిస్తాడు.
అతంటి కర్ణుడి కథను, తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి, అతడిని కట్టుకున్న భార్య చెప్తే ఎలా ఉంటుంది? భార్యంటే, ఏ యుద్ధంలోనో గెల్చుకొచ్చిన భార్య కాదు. ఏ రాజకీయ బేరమో అంతకన్నా కాదు. కర్ణుడు ఒక నిమ్నకులానికి చెందినవాడని తెలిసి, అతడిని సమాజం ఎన్నడూ ఆమోదించదని తెలిసి, ఒక క్షత్రియ పుత్రికగా అతడి పెళ్ళి చేసుకుంటే తన జీవితం చెల్లాచెదురు అవ్వగలదని తెలిసి, చేసుకుంటే కర్ణుడినే చేసుకుంటాను, లేకపోతే అవివాహితగానే ఉండిపోతాననేంత వెర్రి ప్రేమతో, చిన్ననాటి నుండి అనుకుంటున్న సంబంధం – అర్జునుడిని – కాదని, స్వయంవరంలో కర్ణుడి మెడలో దండవేసి మరీ అతడిని ఎన్నుకున్న ఉరువి వైపు నుండి ఆ కథ చెప్తే ఎలా ఉంటుంది? ఈ పుస్తకమంత అబ్బురంగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది.
ఈ రచనలో ఎంత నిజముంది, ఎంత కల్పన ఉంది అన్నది నాకు తెలీదు. నేను మహాభారతం మూలాన్ని చదవలేదు. అందుకని ఈ రచనలోని తప్పొప్పుల సంగతి నాకు తెలీదు. నేను దీన్ని ఒక ఫిక్షన్ రచనగానే చూశాను. కథల్లో నిజానిజాల కన్నా, సంభవాసంభవాల కన్నా అవి చదువుతున్నప్పుడు / వింటున్నప్పుడో మనలో కలిగే భావావేశాలే ముఖ్యం నాకు. It’s not about how a true a story is, it is about how it made you feel inside -అనేదే నమ్ముతాను. ఆ లెక్కన, నాకీ పుస్తకం చాలా బాగా నచ్చేసింది.
కథ క్లుప్తంగా:
పుకేయ రాజ్యానికి చెందిన రాకుమార్తె ఉరువి. వాళ్ళ అమ్మా, కుంతిదేవి చిన్ననాటి స్నేహితులు. అందువల్ల, ఉరువి కూడా పాండవులు, కౌరవులతో కలిసి ఆడుకుంది. భీష్మ పితామహ ఒడిలో కూర్చొని ఆడుకుంది. హస్తినాపురంలో కౌరవ, పాండవ కౌశలాన్ని అందరికి చూపడంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మొట్టమొదటిసారిగా కర్ణుడిని చూసింది. అక్కడే మనసు పారేసుకుంటుంది. అతడిని తప్ప వేరొకరని వివాహమాడనని మొండికేసింది. తల్లిదండ్రులు ఎంత వారించినా వినదు. చివరకు, తన మాటే నెగ్గించుకుంటూ, తనపై ఎన్నో ఆశలు పెట్టుకునున్న అర్జునిడి ఆశలు అడియాశలు చేస్తూ, కర్ణుడి మెడలో మాల వేసింది. ద్రౌపది స్వయంవరంలో తనకి జరిగిన అవమానాన్ని ఇంకా జీర్ణించుకోలేని కర్ణుడి, ఓ క్షత్రియ కన్య తనను ఎన్నుకోవడమేమిటని ఆమెను నిలదీశాడు.
అతడంటే ఎంత ఇష్టమో చెప్పింది. కాపురానికి వచ్చాక సఖ్యంగా ఉన్నా, ఆప్యాయత మాత్రం చూపని కర్ణుడి మొదటి భార్యతో, తననో అపురూప సౌందర్యంగా చూడ్డం తప్పించి, తమలో ఒకరిగా చూడలేని అత్తమామలతో, తాను గౌరవించే వదినకు సవతిగా వచ్చినందుకు ద్వేషించే మరిదితో తనకు వీలైనంత ఒద్దికగా, జాగ్రత్తగా గౌరవమర్యాదలతో ప్రవర్తించింది.
అయితే, కర్ణుడికి దుర్యోధునికి మధ్య పెరుగుతున్న స్నేహం ఆమె ఎప్పుడూ సహించలేదు. మయసభలో యాగం జరుగుతున్నప్పుడు ద్రౌపది చూసిన ఒక్క చూపులో కర్ణుడిపై ఆమె ప్రేమను పసిగట్టేసింది. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కర్ణుడి పాత్రను తీవ్రంగా విమర్శించింది. అతడితో గొడవపడింది. అతడిని, అతడి కుటుంబాన్ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. కర్ణుడే వచ్చి తీసుకెళ్తానన్నా వినలేదు. తల్లిదండ్రులు చెప్పినా, కుంతిదేవి బతిమిలాడినా కాపురానికి తిరిగి వెళ్ళదు. చివరకు, బిడ్డ పుట్టాక మళ్ళీ తిరిగి వెళ్ళింది.
యుద్ధ సమయంలో కర్ణుడికి తన జన్మ రహస్యం తెలిశాక ఆమెకే మొదట చెప్పాడు. అప్పటివరకూ తన తల్లికన్నా ఎక్కువ ఆరాధించిన, అభిమానించిన కుంతిదేవి ఇలాంటి పనిచేసుంటుందని, ఎప్పటికప్పుడు కర్ణుడు నానామాటలూ పడుతున్నా ఆమె నోరు మెదపకుండా ఉన్నందుకు ఆమెను తీవ్రంగా ద్వేషిస్తుంది. ఆమె ఎంత వారించినా కర్ణుడు యుద్ధానికి వెళ్ళి , వీర మరణం పొందుతాడు. అలా జరుగుతుందని ముందు నుంచి ఊహించినా, అతడి మరణంతో, యుద్ధం కలిగించిన బీభత్సం నుండి కోలుకోలేకపోయింది. చివరకు ద్రౌపది, కుంతిలు వచ్చి ఆమెకు నచ్చజెప్పి, ఆమె కుమారుడిని పాండవుల సంరక్షణలో పెరగడానికి అనుమతించడంతో, కుంతిని క్షమించడంతో కథ ముగుస్తుంది.
భాష – శైలి:
ఈ రచనలోని చాలా సరళంగా, ప్రస్తుత వాడుకున్న భాషలా ఉంటుంది. అసలెక్కడా పౌరాణికాల్లో కనిపించే సంభాషణలు, పిలుపులు కనిపించవు. అందుకని చదువుతున్నప్పుడు అక్కడక్కడా ఎబ్బెట్టుగా అనిపించే అవకాశం ఉంది. కర్ణుడు, ఉరువి మధ్య రొమాన్స్ చదువుతున్నప్పుడు కూడా కంటెంపరరీ కథ ఏదో చదువుతున్న భావన కలుగుతుంది. అలా అని, భాష బాలేదని కాదు. సరళంగా, సూటిగా, తేలిగ్గా అర్థమయ్యేలా, అన్నింటికన్నా ముఖ్యంగా కథను చక్కగా నడిపిస్తుంది.
పాత కథే – కొత్త దృక్కోణం:
కర్ణుడి కథ పాతదే అయినా, అది బాగా తెల్సున్న కథే అయినా, ఇక్కడ మాత్రం ఉరువి వైపు నుండి కథ చెప్పుకురావడం వల్ల కొన్ని కొత్త దృక్కోణాలు కనిపిస్తాయి. తన మనసుకి నచ్చినవాణ్ణి పెళ్ళిచేసుకోవడం ఆనాటి రాజకుమారులకు ఎంత కష్టమో అర్థమవుతుంది. తమని కాదని ఉరువి ఒక తక్కువజాతి వాణ్ణి పెళ్ళిచేసుకున్నందుకు ఆమె తండ్రిపై ఒత్తిడి పెడతారు స్వయంవరానికి వచ్చిన రాకుమారులు. పెళ్లైయ్యాక అత్తారింట్లో నెగ్గుకురావడం గురించి వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకోవచ్చు.
ఇందులో నాకు బాగా నచ్చిన అంశం – ద్రౌపది – కర్ణుడు – ఉరువి మధ్య నడిచిన త్రికోణ ప్రేమకథ. ద్రౌపదికి కర్ణుడంటే ఇష్టం. కానీ ఆమె పుట్టుకే అర్జుణ్ణి పెళ్ళాడ్డానికి. అందుకని ఆమె మనసు ఎంత పోరినా, కర్ణుడిని పెళ్ళిచేసుకోదు. తన కోరికను బయటపడనివ్వదు. ఉరువి చిన్నప్పటి నుండి ఆమెను అర్జునుడికి ఇచ్చి చేయాలని పెద్దల ఆలోచన. కర్ణుడే కనిపించకపోతే ఆమె అర్జునుడినే చేసుకునేదేమో! కానీ, కర్ణుడు మీద మనసు పడ్డాక ఆమె మరో ఆలోచన లేకుండా అతడినే కోరుకుంటుంది. సొంతం చేసుకుంటుంది. అయినా, ద్రౌపదికి తన భర్తపై ఆశ ఉందని తెల్సినప్పుడు ఈర్ష్యతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో, ద్రౌపది వస్త్రాపహరణంలో కర్ణుడి తీరును ఉరువి విశ్లేషించే తీరు ఈ రచనకు హైలైట్ అని నా ఉద్దేశ్యం. ప్రేమో, ద్వేషమో తేల్చుకోలేని ఒక బంధం మధ్య నలిగిపోయిన ఆమె మనసును బాగా ఆవిష్కరించారు.
అంతకన్నా గమ్మత్తుగా అనిపించిన విషయం, భర్తమీద కోపంతో పుట్టింటికి వచ్చేసిన కూతురు, తను కర్ణుడిని చేసుకోవటం మంచి నిర్ణయం కాదేమోనని బాధపడుతుంటే, ఆ వివాహాన్ని ముందు నుంచి కాదంటున్న ఆమె తల్లి వచ్చి “ఇంకా నయం! నిన్నా అర్జునుడికిచ్చి పెళ్ళి చేయలేదు. లేకపోతే, మొన్నటి సభలో ద్రౌపది బదులు నువ్వుండేదానివేమో కదా?! కర్ణుడే నీకు తగిన వరుడు. నేను ఆనాడు చూడలేకపోయాను, గానీ!” అని అనటం.
అలానే, కుంతి పాత్రను కూడా కొత్త వెలుగులో చూసే వీలు కలిపిస్తుంది. ఎంతసేపూ వీరాధివీరులకు తల్లిగానే కనిపించే కుంతి, ఒక రహస్యాన్ని తనలో దాచుకొని ఉంటుంది. అలాంటి పాత్రకు ఆప్యాయతానురాగాల్లో కన్నకూతురిలాంటి ఉరువి వైపు నుండి ఆమె చీకటి రహస్యాన్ని చూడ్డం కొత్తగా ఉంటుంది.
మహాభారతంలో పాత్రలన్నీ సంక్లిష్టమైనవి. వేటిని నలుపు-తెలుపుగా తేల్చిపారేయలేం. అందులో కర్ణుడి పాత్ర మరీను. ఈ రచన ఆ సంక్షిష్టతను మరింత జటిలం చేస్తూనే ఒక కొత్త దృక్కోణాన్ని చూపిస్తుంది. అట్లాంటివి చదువుకోవడానికి ఇష్టపడేవారు తప్పక ప్రయత్నించవలసిన పుస్తకం ఇది.
Fiction
Rupa Publications
2013
ebook
లక్ష్మీదేవి
ధర్మనందనుడు అనుక్షణమూ తన పొరబాటని, తన సతిని, సోదరులను కష్టాలపాలు జేసినానని కుమిలిపోతాడు.
కర్ణుడు సోదరులను అనుక్షణమూ అవమానించి బాధించే సుయోధనుని ఇంకా రెచ్చగొడుతుంటాడు.
కాబట్టి కర్ణుడిని ధూర్తుడని అనుకున్నాను.
జడ్జిమెంట్లు ఇచ్చే స్థాయి నాకు లేదు.
లక్ష్మీదేవి
కర్ణుడుఎప్పుడూ పశ్చాత్తాపపడినట్టు లేదు.
శరత్ కుమార్
“మహాభారతంలో పాత్రలన్నీ సంక్లిష్టమైనవి. వేటిని నలుపు-తెలుపుగా తేల్చిపారేయలేం.” ఇది చక్కని జడ్జిమెంట్. కర్ణుని “స్వార్థపరుడూ దానగుణం తప్ప ఏ సుధర్మాన్నీ పాటించని ధూర్తుడు” అన్న లక్ష్మీదేవిగారి జడ్జిమెంటుకు ఇది తగిన జవాబు. కర్ణుడు ధూర్తుడైతే జూదమాడి రాజ్యాన్ని, భార్యను కూడా ఒడ్డిన ధర్మరాజూ ధూర్తుడే. కనుక ఎవరినైనా నలుపు-తెలుపుల దృష్టి నుంచి అంచనా వేయడమే న్యాయం.
లక్ష్మీదేవి
చదువరులు ఆసక్తి కలిగించేలా వ్రాసిన పుస్తకాల వైపు ఆకర్షితులు కావడం సహజం.
అది ఒక అభిరుచి. కానీ రచన అనేది బాధ్యతతో కూడిన అభిరుచి. వారు కల్పిత కథలనెన్నైనా
సృష్టించవచ్చు. కానీ జగద్ధితమే(జగత్తుకు మేలు ) లక్ష్యంగా వ్రాసిన రామాయణ, భారత
పాత్రలను ఘటనలను కాపీ కొట్టి ఇష్టం వచ్చినట్టు స్వభావాలను మార్చివ్రాయడం రచనాకారుల
బాధ్యతారాహిత్యమే.
తమ యింటి కారునే ( దొంగతనంగా) రంగులు పూసి అమ్ముకొనే దొంగలకూ వీరికీ తేడా ఏముందో మరి.
అదీ ముఖ్యంగా స్వార్థపరుడూ దానగుణం తప్ప ఏ సుధర్మాన్నీ పాటించని ధూర్తుడూ అయిన కర్ణుని
పాత్ర ను ఎంత తేలిగ్గా తీసుకుంటారో సాధ్వి ద్రౌపది స్వభావాన్నీ అంత తేలిగ్గా తీసుకొని మార్చేస్తూ ఉండడం బాధాకరమైన విషయం.