చదివించే అరుణ పప్పు కథలు

వ్యాసకర్త: చాతుర్య

పాత్రికేయ వృత్తిలో ఉండి విశేషమైన రచనలతో ఆకట్టుకుంటున్న నవతరం రచయిత్రులలో అరుణ పప్పు ప్రధమ స్థానంలో ఉందనిపిస్తుంది ఈ “చందనపు బొమ్మ” లోని కథలన్నీ చదివితే.  వ్యక్తిగతం వేరు. వ్యావహారికం వేరు. వృత్తి వేరు.ప్రవృత్తి వేరు.అయితే అసంగతమైన సంగతులు కొన్ని వృత్తి లో కలిసిపోయి ప్రవృత్తికి కూడా పాకిపోయే అవకాశం ఉంది. దీన్నే సూచనగా చెప్పిన ‘ఎవరికీ తెలియని కథలివిలే’ కథలో ఒక ఊహించని మలుపు ముగింపు.ఇవి కొందరి కథలే అయినా తనకి అన్వయించుకున్న కథానాయిక కథ.మాధవ ద్వారా వ్యక్తీకరించబడిన సున్నితమైన ప్రేమ కథ.ఇది అరుణ పప్పు తొలి కథ.

ఒక మనిషి కోరుకునే ఏకాంతం తన అంతరాత్మ సంఘర్షణ వినడానికి ఉపయోగపడితే ,కోరుకునే తోడు మాత్రం భావాత్మకమైన అలజడుల వ్యక్తీకరణ కోసం. మనిషి మనసుకూ, మనసులో సంచలనాలకూ మధ్య గీసిన సన్న గీత “ఏకాంతంతో చివరిదాకా” కథలో కథానాయిక పాత్ర అదితి ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది.
తాత్విక నిర్మాణంతో నడిపిన మంచి శిల్పం ఉన్న కవితాత్మక కథ “వర్డ్ కాన్సర్” ..పదాలు శరీరమంతా పాకిపోయి అదే కాన్సర్ అనుకుంటే అందులో సృజనాత్మకమైన, భావుకత్వంతో కూడుకున్న పదాలు లేవు.ఇది కాన్సర్ కన్నా పెద్ద జబ్బు.
అమెరికాలో మరణించే ప్రవాస భారతీయుల శవాల్ని భారతదేశం పంపడానికి పూనుకునే వ్యక్తుల్లో ఒకరి మానసిక సంచలనం “ఈ కానుకివ్వలేను ” కథ.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టి.వి. చానల్స్ పై ,నేర కార్యక్రమాలపై సంధించిన వ్యంగ్య రచన “24*7 క్రైం ఇప్పుడిదే సుప్రీం” .

కథా సంపుటికి శీర్షిక అయిన “చందనపు బొమ్మ” నిజంగా అద్భుతమైన కథ.బొమ్మతో ఒక పాపకున్న అనుబంధాన్ని ప్రేమాప్యాయతల పూతతో అద్ది చెప్పిన కథ.

పుస్తకాలు ,పుస్తకాల షాపుతో అనుబంధం కలిగి ఉన్న ‘ఆచార్య ‘ ను ఆవిష్కరించిన కథ” కరిగి పోయిన సైకత శిల్పం”.
ప్రయాణానికీ,పర్యటనకీ మధ్య ఉన్న తేడాను రొమాంటిసైజ్ చేస్తూ చెప్పిన కథ “భ్రమణ కాంక్ష “. ‘కలిసి ఉంటేనే బంధం ఏర్పడుతుందా?’అంటూ “ఒక బంధం కావాలి” కథలో కథానాయిక పాత్ర పడ్డ సంఘర్షణ, చివరికి తీసుకున్న నిర్ణయం మానవ సంబంధాల నేపధ్యంలో గొప్పగా ప్రతిఫలించాయి. మనసు ‘లోపలి ఖాళీలు ‘ ఎప్పుడు పూరించుకోవాలో,ఎలా నింపుకోవచ్చో తెలియజెపుతూ రాసిన కథ “లోపలి ఖాళీలు”.

ఒకసారి కథలు చదవడం అంటూ మొదలుపెడితే ఆపకుండా చేయడం అరుణ పప్పు ప్రత్యేకత. కథాభిమానులు దాచుకోవాల్సిన – జీవంతో ,ప్రేమతో కూడిన – కథల సంపుటి ఇది.  రచయిత్రి అరుణ పప్పు  అభినందనీయురాలు. ప్రచురణ కర్తలు చెప్పినట్టుగానే ఈ కథలను చదివి పాఠకులు చక్కని అనుభూతికి లోనవుతారు.
ప్రచురణ : డిసెంబర్ 2012,రాష్ట్ర కథానిలయం,నందలూరు,కడప-జిల్లా.
కాపీల కొరకు : విశాలాంధ్ర బ్రాంచిలు , రాష్ట్ర కథానిలయం మరియు పుస్తక కేంద్రాలు.

ఈ కథల సంపుటి పై వచ్చిన మరో పరిచయ వ్యాసం ఇక్కడ.

చందనపు బొమ్మ
అరుణ పప్పు
Fiction
December 2012
Paperback

You Might Also Like

Leave a Reply