మా బాబు

వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్
*************

చాన్నాళ్ళకి తెలుగు పుస్తకం చదివే అవకాశం దొరకంగానే, విశ్వనాథ వారి నవలల పఠనం తిరిగి మొదలు పెట్టాను. అనుకున్నదే తడువు మా బాబు నవల చేతికందింది. ఈనవలకు ఎందరో ఆంగ్లానువాదం వ్రాద్దామని సాహసించి, ఆ రసాస్వాదనను అనువాదంలో తేలేక తమ పనిని మధ్యలోనే విరమించుకున్నారన్న విషయం ఏకాధిక వ్యక్తుల నుండి నేను వినడం జరిగింది. మా బాబు వ్రాయబడిన శైలి ముఖ్యంగా నన్నాకుట్టుకుంది, చదవడం మొదలుపెట్టిన ఐదారు గంటల్లో ఈ పుస్తకం పూర్తి చేసాను, పుస్తకం చదివింపచేసే గుణం కలదని వేరే చెప్పనక్కరలేదు. కష్టాలూ కన్నీళ్ళతో మొదలయిన కథ, తరువాతి పేజీలో ఇంకెంత పెద్ద దుఃఖం చదవడానికి సిద్ధపడాలో అన్న అనుమానాన్ని మనసులో రేకెత్తిస్తూ,

ఈ సన్నివేశంలో నేనుంటే ఏం చేద్దును?

బహుశా ఈ  సందర్భం నేనుంటే అసలు జరగనిచ్చేవాణ్ణి కాదేమో.

పగవారిక్కూడా ఇలాంటి కష్టాలు వద్దు భగవంతుడా!

అని మనసారా అనుకున్న క్షణాలు.

ఏమోయీ రచయితా, కథని సుఖాంతపఱచలేదేమి? అరవ సినిమాలకు నీ నవలే ఆద్యమా?  

అన్న సంశయాలు, పాత్రల దీన స్థితికి రచయితని మనసులోనే తిట్టుకోడాలు (ఆయనకి క్షమాపణలతో), పాత్రలను గుద్దాలనీ, కొట్టాలనీ అనిపించడం – ఇల్లా సాగింది నా పఠనమంతా!

1935 లో వ్రాయబడిన ఈ నవల, ఆ నాటి కాపు కులంలో ఉన్న సామాజిక పరిస్థితి. ఇతర కులాల వ్యవహారం, గ్రామ్య జీవనం, అప్పుడే ఊపిరి పోసుకుంటున్న పట్నవాస బ్రతుకులూ-కొత్త పోకడలను విశ్లేషించడం, మాతృప్రేమకూ-స్త్రీప్రేమకూ మధ్య వ్యత్యాసం, బుద్ధి జీవునికీ-బుద్ధిహీనునికీ మధ్య జరిగే సంఘర్షణలు, ఒక సాత్త్విక మనస్కుణ్ణి సైతం దుర్మార్గంగా వ్యవహరింపచేయబోయిన సన్నివేశాలు మొ॥ విషయాలను సుదీర్ఘంగా చర్చిస్తుంది.

ఇక కథా విషయానికి వస్తే పుట్టడంతోటే తల్లిని అంతకు మునుపే తండ్రినీ పోగొట్టుకున్న ఒక బాలుడి ఆత్మకథే ఈ నవల. మేనమామ ఇంటికి చేరిన పసికందు వచ్చిన వేళావిశేషం మామ కూడా హరీ అంటాడు, బాబు పిన్ని అతన్ని తన అత్తగారింటికి తీసుకుపోతుంది. అక్కడ ఆ బిడ్డడి కష్టాలు అంతా ఇంతా కాదు. బానిసకన్నా హీనంగా చూస్తారు ఇంట్లో వారు. అక్కడి నుండి పారిపోవటంతోటి కథ రసవత్తరమవుతుంది. కొందరు మంచి మనుషులను దారి మధ్య కలుసుకుని ఒక పెద్ద మనిషి ఇంటికి చేరతాడు, ఆ పెద్దమనిషి ఇంట తెలివి నేర్చి, లోకం నేర్చి, ఇంటి పెద్దకొడుకవుతాడు ఇంట్లోని పిల్లలకి అన్నవుతాడు, ఆ వెంటనే ఆ పెద్ద మనిషి చావు, ఇంట్లోంచి పిల్లల మేనమామ వరుస వ్యక్తి ఈతణ్ణి గెంటేయటం, మళ్ళీ ఇల్లు లేని అనాధ అవడం. ఎక్కడికి వెళ్ళాలో అసమంజసంలో పడి ఒక ఊరి నుండి మరో ఊరికి తిరుగుతూ పాములోళ్ళ చెంత చేరతాడు. అక్కడ వారిలోకి కలుపుకునేందుకు పాములవాడు కుట్ర చేసినా, ఈతను తప్పించుకుని తిరిగి తన మేనమామ భూమ్మీద వదిలివెళ్ళిన మేనమామ భార్యనూ, మరదలూ బావమరిదినీ చేరుకుని చేరదీస్తాడు. తిరిగొచ్చి తనకు దేవుడిచ్చిన తమ్ముళ్ళనీ, చెల్లెలినీ వెంటపెట్టుకొని వచ్చి అందరి ఆలనా పాలనా చూస్తాడు. మరదలితో పెళ్ళి బెడిసికొట్టడం, పిల్లల చదువులు, ఊరి వ్యవహారాలు చక్కబెట్టడం, పాత పాములోళ్ళ పగను అణచడం, ఆ పై ముఖ్యమైన ఆత్మీయుణ్ణి కోల్పోవడంతో కథ ముగుస్తుంది. చివర్లో రెండో తరం పిల్లలనీ చేరదీయబోవడంతో కథ సుఖాంతమనిపించారు రచయిత.

కథను మరికొంచెం ఆలోచింపచేసేదిగా తీర్చిదిద్దవచ్చు. అవసరమయిన చోట్ల వివరణ లేదు. కొన్ని చోట్ల కథకు అనవసరమైన చర్చ ఉంది. నిజ జీవితంలో ఆ చర్చకు తనదైన ప్రాముఖ్యత ఉంది, కానీ అది వేరే విషయం.

వీర-కరుణ రసాలు ముఖ్యంగా నవలంతా ఏరులై పారుతాయి. ఒక పక్క మాతృ ప్రేమను పతాక స్థాయికి చేరుస్తూనే స్త్రీ ప్రేమను పాతాళానికి తెలిసి తెలిసే తోసేసారు. పిచ్చి చెల్లెలూ – పిన్నమ్మ కొడుకు మధ్య గల ప్రేమానురాగాలను మరింత అందంగా చూపించి స్త్రీ-ప్రేమనూ మరింత అందంగా చూపించి ఉంచవచ్చుగానీ, మరదలికీ-తమ్ముడికీ మధ్య ప్రేమను పదే పదే చూపి స్త్రీ ప్రేమను అధమంలో ఉంచారు. అది రచయిత ఉద్దేశ్యపూర్వకంగా చేసి ఉండవచ్చును.

నవలలోని ప్రతి పురుష పాత్రలోనూ వీరరసం ఉట్టిపడుతుంది. వ్యవసాయానికి కావాల్సిన దేహదారుఢ్యం, మెళకువలూ, గ్రామాలలో వ్యవహారాలు జరిగే తీరు చూడముచ్చటగా రచయిత కళ్ళకు కట్టినట్టుగా చూపాడు.

పూర్తి జీవితం కష్టాలననుభవించినా సుఖం కోసం పాకులాడని అరుదైన వ్యక్తి మనకు నవలలో వ్యక్తమవుతాడు. ఇది సహజత్వానికి ఆమడ దూరం.

కథనం నాకు చాలా చాలా నచ్చింది. కొన్ని సన్నివేశాలలో నాకు కన్నీళ్ళు వచ్చాయి.

 

Maa Babu
Viswanatha Satyanarayana

You Might Also Like

3 Comments

  1. Raghavendra

    మరదలి ప్రేమ అధమంగా ఎందుకు అనిపించినదో చెప్పగలరా రహ్మానుద్దీన్ గారూ?

    1. రహ్మానుద్దీన్

      ఇక్కడ చూపబడినవ్ రెండే ప్రేమలు – తల్లి ప్రేమ, స్త్రీ ప్రేమ. ఈ రెంటిలో ఒకటి ఉన్నతంగా చూపబడితే, రెండోది అధమమనేగా అర్ధం!

  2. pavan santhosh surampudi

    నా లెక్కలో ఈ నవల పతాకస్థాయినందిన కరుణ రసం.. విశ్వనాథుడు తన నిజస్వరూపమైన కరుణరసాన్ని మొత్తం నవలంతా ఒలికించాడు. వీరమైనా మరోటైనా దానికి మరో రూపాలే తప్ప నిజానికి ఉన్నది కరుణమొక్కటే.

Leave a Reply