మహాకవి అస్తమయం (1980 వ్యాసం)

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణించినప్పుడు వచ్చిన సంపాదకీయం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్. ఈ పుస్తకం నుండి స్వీకరించిన ఇతర సాహిత్య సంబంధిత వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు)
******
“ప్రాణసఖుడె నా కోసమై పంపినాడు
పల్లకీయన హృదయమ్ము జల్లుమనియె
వీడని వియోగమున వేగు మ్రోడుమేను
తలిరుతోరణమై సుమదామమాయె”

అని కృష్ణశాస్త్రిగారు ఏనాడో వ్రాశారు. ఆయన కోసం ఏ అదృశ్య ప్రాణసఖుడో పంపిన ఆ పల్లకి ఇప్పుడు వచ్చింది. ఎనభై రెండు సంవత్సరాల నిండు వయసులో ఆయన ప్రణయ పల్లకి వంటి ఆ పూల పల్లకిలో పూలమాలవలె, కొసరు నడలకు తూగాడుతూ కూర్చుని వెళ్ళిపోయారు.

ఆయన వెళ్ళిపోయారంటే అసంఖ్యాకులైన ఆయన కవితా ప్రియులకు, ఆప్తులకు నమ్మశక్యం కాని దుఃఖకర దుర్వార్త. శారీరకంగానే ఆయనకు వృద్ధాప్యం. మానసికంగా నిత్య యౌవనం, నిత్యోత్సాహం. గొంతు మూగవోయినా, గుండె పాడుతూనే వుండేది. “ముసలితనంలో మూగతనం భయంకరం-శిథిల మందిరంలో అంధకారం లాగున” అని ఆయనే వ్రాసుకున్నారు. కనుకనే ఎన్నడూ శీతవేళను దరికి రానిచ్చేవారు కారు! “వీథి వాకిటను జరా పదధ్వని వినబడగానే, వీట లేడని చెప్పించి”నట్టుగా వుండేవారు. ఎప్పుడూ పదిమందిలో కూర్చుని, కాగితంపై కలంతో ఆయన కురిపించే చలోక్తుల మరంద ధారలలో తడియని వారు వుండేవారు కారు. చివరివరకు తన జీవితాన్ని ఒక “ప్రియాననాన్వేషణోత్సవ యాత్ర”గా ఆయన కొనసాగించారు.

కృష్ణశాస్త్రి గారి పేరు చెప్పగానే అరవై ఏళ్ళనాటి ఆంధ్ర సాహిత్య చరిత్ర కనుల ముందు ముసురుతుంది. ఆయన సాహిత్య ప్రవేశంతో ఒక చీకటింటి లోనికి ఉదయ సూర్యకిరణం తొంగి చూచినట్టు అయింది. చల్లని పిల్ల తెమ్మెర వీచినట్టు అయింది. ఒక విరహ వీణ తరళ తరళ తంత్రీగతులతో మ్రోగినట్టు అయింది.

అది రాయప్రోలు, విశ్వనాథ, అబ్బూరి, నాయని, దువ్వూరి, తల్లావఝల, నండూరి, వేదుల మొదలైన కవుల స్వర్ణయుగం. ఆనాడు వారి సహచరుడుగా, వారి కవిత్వ ప్రచారకుడుగా కృష్ణశాస్త్రిగారు తెలుగునేల నాలుగు చెరుగుల పర్యటిస్తూ, అనర్గళ వాగ్ధాటితో ప్రసంగిస్తూ నవ్య కవిత్వానికి ఎనలేని ప్రచారం కల్పించారు.

ఆయన పేరు భావ కవిత్వానికి పర్యాయ పదమైంది. గిరజాల జుట్టు, మెరుగు కళ్ళజోడు, తెల్లని లాల్చీ, పంచె, పల్లెవాటుతో ఆయన భావకవికి మారుపేరైనారు. సుకుమారమయిన భావనతో, ఒక జయదేవుడికో, ఒక రవీంద్రుడికో మాత్రమే సాధ్యమనిపించే “మధుర కోమల కాన్తవదావళి”తో ఆయన విరచించిన కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం, మహతి వంటి ఖండకావ్యాలు ఆనాటి యువతరాన్ని ఉర్రూతలూగించాయి. షెల్లీ ప్రభావంలో జీవన విషాదంలోని మాధుర్యాన్ని, స్వేఛ్చాతత్వాన్ని గానం చేశారు. రఘుపతి వెంకటరత్నంనాయుడు గారి శుశ్రూషలో బ్రాహ్మ సమాజ ప్రార్థన గీతాలుగా-
“అంతరాంతరము నీ యమృత వీణేయైన
మాట కీర్తనమౌను, మనికి వర్తనమౌను
ఈ యనంతపథాన ఏ చోటికాచోటు
నీ యాలయమ్మౌను నీ యోలగమ్మౌను” ..
వంటి మధుర గేయాలెన్నో లిఖించారు. టాగోర్ విరచిత జాతీయగీతంతో పోల్చదగిన “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి” వంటి దేశభక్తి గీతాలెన్నో వ్రాశారు. అసదృశ భావనా ప్రౌఢితో ఎన్నో రేడియో రూపకాలు, పద్యశైలికి తీసిపోని గద్యశైలిలో ఎన్నో ప్రసంగ వ్యాసాలు వ్రాశారు.

ఇక చలనచిత్ర కవిగా ఆయన రచించిన పాటలు వాటికవే సాటి. మూడు దశాబ్దాల నాటి “మల్లీశ్వరి”కి ఆయన కూర్చిన గీతాల మాధుర్యం నేటికి కూడా తెలుగు రాని వారిని అలరిస్తూనే వున్నది. తుదివరకు ఆయన చలన చిత్రాలకు మధుర గీతాలను అందిస్తూనే వున్నారు. ఏ మాత్రం సాహిత్యాభిరుచి గల నిర్మాత అయినా, కృష్ణశాస్త్రి గారి తీయని పాట ఒకటైనా లేనిదే తన చిత్రం పూర్తి అయినట్టు భావించేవాడు కాదంటే అతిశయోక్తి కాదు. ఆయన లేని వెలితి అటు సాహిత్య రంగానికి, ఇటూ చలనచిత్రసీమకు ఎన్నడూ తీరనిది.

కృష్ణశాస్త్రి గారిలో ఎన్నదగిన మరొక విశేషం – తన తరం కవులలో పెక్కుమందివలె ఆయన 1920ల లోనో, 1930లలోనో ఆగిపోలేదు. కాలం నిత్య పరిణామ ప్రగతిశీలమైనదని ఆయనకు తెలుసు. కనుకనే ఆయన కాలంతో పాటు ముందుకు నడిచారు. కొత్త వెలుగులను, కొత్త గాలులను ఆయన నిండు గుండెతో ఆహ్వానించారు. అభ్యుదయ భావాలకు ఆయన ఎప్పటికప్పుడు స్వాగతం చెప్పారు. కనుకనే ఆయన రచనా వ్యాసంగం పోను పోను నవనవోన్మేషంగా, బహుముఖంగా వికసించింది. యువకులలో యువకుడుగా వారితో ఆయన చేతులు కలిపి ముందుకు సాగిపోయారు. వివిధ సాహిత్య వేదికలపై నుంచి కడచిన మూడు, నాలుగు దశాబ్దాలుగా ఆయన చేసిన ప్రసంగాలు, వాటిలో వ్యక్తమయిన కవిత్వ తత్వ వివేచన, హేతువాద పటిమ, అభ్యుదయ భావస్ఫూర్తి, నేటి యువతరం ఆకళించుకోదగినవి.

వ్యక్తిగా కృష్ణశాస్త్రి మరి లేరు. కాని, కవిగా ఆయనకు మృత్యువు లేదు. ఆయన కవిత తెలుగు భాష వున్నంతకాలం వెలుగొందుతూనే వుంటుంది.

(ఫిబ్రవరి 26, 1980)

You Might Also Like

Leave a Reply