వాన కురిసిన పగలు
వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం
[ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2006 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.]
తమ్మినేని యదుకుల భూషణ్ గారి కవితా సంకలనం ‘వాన కురిసిన పగలు’ మీద ఒక సమీక్ష:
కళాకారులు, కవుల అన్వేషణ అంతా ప్రపంచాన్ని బంధించే ఒక లయ, ఒక సౌష్ఠవం, సౌందర్యం వీటికోసమే. అందుకే కవులు సహజంగా స్వేచ్ఛా ప్రియులు, సౌందర్యోపాసకులు అయి ఉంటారు. ఎవరైతే వస్తువు భౌతిక స్థితిని దాటి చూడలేరో వాళ్ళకి కవి దర్శించి గానం చేసిన సౌందర్యం అర్ధం కాదు. అనాదిగా కవి దాహానికీ, స్వేచ్ఛా ప్రియత్వానికీ, తీరని కలలకీ ప్రతీకగా అతని ప్రేయసి నిలుస్తోంది. Muse (కావ్యదేవత) కవిని పూనుతుందంటారు చలం. దాదాపు ముప్పై కవితలున్న భూషణ్ గారి ఈ ‘వాన కురిసిన పగలు’ లో అడుగడుగునా మనకి ‘ఆమె’ కనిపిస్తుంది .(బాటసారి,నిన్ను పోగొట్టుకున్న సవ్వడి,నీవు, అతడు ఆమె,కళ్ళు, స్పర్శ రేఖ మొదలైన కవితల్లో) వైరుధ్యాలతో నిండిన ఆమె స్వభావాన్ని చక్కని ప్రతీకలతో రెండు కవితల్లో వర్ణిస్తారు భూషణ్ ..
వృక్షాలను కూల్చి
పెను వేగంతో
విరుచుకుపడే
తుఫానువి
ఎండమావులు దాల్చి
కనుచూపు మేర
పరుచుకున్న
ఎడారివి (నీవు)
రాకాసి మంటలా
ఆకాశాన్ని తాకి
పొగనాలుకతో
తెగ నస పెట్టేది
సీసాలో
ఆసీనురాలై
మత్తిలిన కన్నులతో
బొత్తిగా మాట్లాడదు (స్వభావం)
‘అతడు — ఆమె’ కవిత ఇద్దరి వాదనలనీ గమ్మత్తుగా వినిపిస్తుంది..
అతడు :
తానున్న చోటికి
రానంది నది
ఏ ముద్ర వహిస్తుంది
సముద్రం?
..
అమలిన కాంతుల్లో
అమావాస్య చీకటిలో
మమేకమై-
ఆమె మాట్లాడదు
ఆమె :
తేనెటీగ ఒకటి
ప్రదక్షిణం చేస్తోంది
నిదర్శనం లేదు
హాని చేయదని
..
అతడు రాడు
రాత్రి శబ్దాల్లో
చిత్రించని బొమ్మల్లో
బ్రతికే ఉన్నాడు
చివరికి అతనికి ఆమె అందదు. శలభానికి దీపంలా, కవికి కవిత్వంలా. దేనికోసమైతే వెతుక్కుంటామో అది ఎప్పటికీ దొరకదన్న జెన్ వాక్యాన్ని భూషణ్ గారే ఏదో వ్యాసంలో ఉటంకించారు. అందుకని కవి ఇలా వాపోతాడు…
ఇక్కడే కూర్చున్నా!
ఇలాగే ఎండపడుతోంది
నిశ్శబ్దంలో
నిన్ను పోగొట్టుకున్న
సవ్వడి మాత్రం
నిలుచుంది (నిన్ను పోగొట్టుకున్న సవ్వడి)
ఐతే ‘నిన్ను పోగొట్టుకున్న సవ్వడి’ అన్న ప్రయోగం అంత మూర్తంగా అనిపించదు. ఆమెని పోగొట్టుకున్న తర్వాత కవి పడే వేదన ‘ప్రేమ కవితకు చెల్లు చీటీ’ అన్న కవిత ప్రతిఫలిస్తుంది…
తాగలేనని
తెలిసి కూడా
తేనె తుట్టెను కదిపి నిలిచితి
అడవిలోపల అరుపులెన్నో
ఆదుకొన్నవి
కొండ గుట్టలు
..
చాలా వరకూ ప్రేమ కవితలే అయినా ఇందులో జెన్ బౌద్ధం ఛాయలు కూడా అక్కడక్కడా గోచరిస్తాయి ‘జపనీయం’ , ‘వద్దు ’, ‘ ఖాళీ’, ‘చూడు’ మొదలైన కవితల్లో. ప్రతి కవీ, జెన్ ధ్యానీ కోరుకునే ఏకాంతాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తారు భూషణ్ ‘వద్దు’ అనే కవితలో..
..
విషాదము, ఆనందము
మార్చి మార్చి ప్రదర్శించే
ఖండిత వదనమూ వద్దు
కనులకు గంతలు కట్టి
ఏ కాల తీరాన్నో వదిలివేసే
నిష్ఠుర కవనమూ వద్దు
ఒక్క చుక్కా ఉదయించని
ఒంటరి సాయంత్రం
నిర్జన మైదానం
నాలోకి నేను
జారుకుని
ప్రోది చేసుకున్న
కొన్ని నిమిషాల
నిశ్శబ్దం చాలు.
విజయం అనే మాటకి అర్ధం లేదని చాలా కవితాత్మకంగా చెప్తారు ‘నాగార్జున సాగర్ ’ అనే కవితలోని ఒక ఖండికలో..
మ్యూజియం నిండా రాళ్ళేనా?
ఏ రాజును తల్చుకోను?
విజయాలకు అర్ధం లేదు
మారిపోనిదేముంది
ఇతని కవితల్లో గమనించాల్సిన మరొక విషయం లయ. అక్కడక్కడా ముత్యాల సరాలు కనిపిస్తాయి, చాలా పంక్తుల్లో రెండో అక్షరం ప్రాస పాటిస్తారు.ఈ గుణం వల్ల ఈయన కవితలు చదవడానికి హాయిగా ఉంటాయి.
వేడి చెక్కిలి వేటికోసం
గడిచిపోయెను కాలమంతా
కడలి నురుగులు కాటువేయును
పలవరించకు పాడుగతమును (పలవరించకు పాడుగతమును)
దాదాపు కవితలన్నీ క్లుప్తంగా, సరళంగా ఉన్న ఈ సంకలనంలోని ‘ఆమె’ అనే కవిత మాత్రం విమర్శకుడిగా భూషణ్ ప్రతిపాదించిన ప్రమాణాలకే నిలబడదేమో అనిపిస్తుంది.
ఆమె అందంగా నవ్వేది
నాతో మాట్లాడుతూ… నాతో మాట్లాడుతూ
ఆమె అందంగా నవ్వేది
అంటూ మొదలై ఒక కథలా మూడు పేజీలు సాగుతుంది. నేను గమనించిన మరొక విషయం భూషణ్ మొదటి పుస్తకం ‘ నిశ్శబ్దంలో నీ నవ్వులు ’ లోని కవితలకీ , ఇందులోని కవితలకీ పెద్ద తేడా కనిపించదు.కొన్ని భావాలు పునరావృతమౌతాయి. ఏది ఏమైనా జీరాడే జిలుగు తెరల వెనక దోబూచులాడే తిరిగిరాని యవ్వన స్మృతులను మేల్కొలిపే కవిత్వం ‘వాన కురిసిన పగలు’. వీలైతే మీరూ ఈ చిరుజల్లులో తడవొచ్చు.
ప్రతులకు thammineni@lycos.com కి మెయిల్ చెయ్యండి.
****************************************
గమనిక: పుస్తకం వివరాలు, ముఖచిత్రం ఆన్లైన్లో దొరకలేదు. పాఠకులెవరికైనా తెలిసిన పక్షంలో editor@pustakam.net కు మెయిల్ చేయడం కానీ, లేదా ఇక్కడే ఓ వ్యాఖ్య పెట్టడం కానీ చేయగలరు – పుస్తకం.నెట్ బృందం.
అనురాగ్
“మూర్తం” అనగానేమి మూలా గారు?
“ఆమె” కవితలోని “మూలా” శంక ఏమిటి? భూషణ్ గారి ఏ విమర్శ ప్రమాణాలకి అది తూగలేదో చెబితే మాకు అర్థమయ్యి అర్థమవకుండా ఉన్న concept అర్థమయ్యే అవకాశం ఉంటుంది.
అనురాగ్