వీరి వీరి గుమ్మడిపండు
వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు
*******
వీరి వీరి గుమ్మడిపండు…పేరు చూస్తేనే పుస్తకాన్ని చదవాలనిపించింది. ఎందుకంటే,చిన్నప్పటి ఆటను గుర్తు తెచ్చింది. ఇదేదో చదవాలే! అనిపించింది. ఆసక్తి పుట్టింది. అంతలోనే ఒక చిన్న సందేహం? ఇదేంటి? గుమ్మడిపండు అన్నారు. టైటిల్ లో ఆకు బొమ్మ వున్నది. వెనుక భాగాన వివిధ రకాల మొక్కలు, పూలు. ఈ పండు..పేరుకు, ఆకు…బొమ్మకు సంబంధం ఏమిటో
తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగింది. అంత ఆకర్షణీయమైన టైటిల్. హరిత వర్ణంతో ఆకర్షణీయంగా వున్న కవర్ పేజీ తిప్పగానే లోపల నా చిన్నప్పటి ఆటకు సంబంధించిన బొమ్మ. కుతూహలం ఆగలేదు. మొత్తం పుస్తకం ఏకబిగిన ఒక గంటన్నరలో నన్ను చదివించిన పుస్తకం ఇది. ఈ పుస్తకం మొత్తం మంచి క్వాలిటీ గల పేపరులో అందమైన రంగు రంగుల బొమ్మలతో ముద్రించబడడం చదవడానికి మరో ఆకర్షణ.
ఏమిటీ? చెబుతుంటేనే ఏం పుస్తకమబ్బా? ఇది. అని ఉవ్విళ్ళూరుతున్నారని అర్థమవుతున్నదిలెండి. ఇక అసలు విషయానికి వస్తున్నాను. ఇందులో డాక్టర్ కొప్పుల హేమాద్రి గారు దాదాపు అరవై రకాలైన వివిధ రకాల చెట్లు, మొక్కలు వాటి భాగాల గురించి వివరించారు. ఎంతో చక్కగా మొక్కలు, వాటి పూలు, పండ్లు, కాండాలు, ఇలా సమస్త విషయాలను గూర్చి శ్రమకోర్చి, కఠోర తపస్సుతో సేకరించి, ఒక మంచి ఉపయుక్తమైన పుస్తకాన్ని మనకు అందించారు. నిజంగా వారికి హ్యాట్సాఫ్ అండి.
మనకందరికీ బాగా సుపరిచితమైన వేప, కానుగ, చింత, మర్రి చెట్ల గురించే గాక, మనకు తెలియని ఎన్నో చెట్లు, మొక్కల గురించి సవివరంగా తెలపడం ఒక ఎత్తైతే, మొక్కలు మనకు తెలిసినవైనా, రోజూ చూస్తున్నవైనా, వాటి గురించి మనకు తెలియాల్సినవి చాలా వున్నాయని, పుస్తకం చదివాక గానీ అర్థం కాలేదు. ఇక విద్యార్థులకు, ఉపాధ్యాయులకైతే, మరీ ముఖ్యంగా ఉన్నత పాఠశాల, కాలేజీలలో బోటనీ చదువుతున్న విద్యార్థులకు, వారి అధ్యాపకులకు ఒక అద్భుతమైన ఉపయుక్త గ్రంథమని, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇందులో ఆ సబ్జెక్టుకు సంబంధించిన మామూలు విషయాలే గాక శాస్త్రీయనామాలతో కూడిన విశ్లేషణను ఎంతో సులభ శైలిలో అందించారు హేమాద్రి గారు.
ఆంధ్రిక అనే అమ్మాయి, ఉపాధ్యాయుడైన వాళ్ళ మామయ్యతో సంభాషణ రూపంలో ఎంతో చక్కగా ఒక హోమ్లీ వాతావరణంలో వివరించబడింది. పైగా ఒక చక్కని పిక్నిక్ కు వెళ్ళివచ్చినట్లు కూడా అనిపించింది. కార్టూన్ లతో, నానుడులతో మనకు విషయాన్ని హాస్యపూరితంగా, సరదాగా, సులభశైలిలో అందించారు రచయిత. ఇంతవరకూ ఏ ఇతర పుస్తకాలలో లేని విధంగా పాఠకులు చదివాక, చివరలో నెమరు వేసుకునే విధంగా ఆసక్తికరమైన పజిల్స్ ఇవ్వడం ఓ మంచి పద్ధతికి శ్రీకారం చుట్టినట్టయింది. దీనిని ఒక చిరు ఆయుర్వేద వైద్య పుస్తకంగా కూడా చెప్పుకోవచ్చు. చివరలో ఇచ్చిన పారిభాషిక పదకోశం చదువరులకు సందేహనివృత్తికై, ఎంతో ఉపయుక్తంగా వున్నది.
రోజు రోజుకూ జనాభా పెరుగుతుండడం వలన భూమిపై స్థలాభావం ఏర్పడుతున్నది. పైగా ప్రజలలో వ్యాపారదృక్పథమూ పెరిగింది. స్వార్థంతో మనుషుల స్వభావాలు మారిపోతున్నాయి. వృక్షజాతి అంతరించి పోతున్నా, కాలుష్యం పెరుగుతున్నా, పట్టించుకునేవారే కరువైనారు. ఇది గమనించిన మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వఛ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఇలాంటి ఈ తరుణంలో, వాటి విలువను తెలుపుతూ ఈ పుస్తకం మన ముందుకు రావడం మరీ ముదావహం. దీనిని చదివిన తరువాతైనా పాఠకులలో మార్పు కలిగి ప్రకృతి పరిరక్షింపబడుతుందని నమ్ముతున్నాను.
ఒక చక్కటి శైలితో ఎంతోమందికి ఉపయుక్తమైన ఈ గ్రంథం ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలోనూ, కాలేజీలలోనూ ఉండదగినది. ఇంత చక్కటి పుస్తకాన్ని చదివాక పాఠకులు రచయిత కృషిని అభినందించకుండా వుండలేరన్నది నా స్వంత అభిప్రాయం.
సెప్టెంబర్ 2014 న 3వ ముద్రణగా 88 పేజీలతో అనంత వృక్షవిజ్ఞానాన్ని పంచుతున్న ఈ పుస్తకం వెల రూ.180 లు అనేది ఇందులోని విజ్ఞానంతో పోల్చితే ఇది పెద్ద ఖరీదేమీ కాదు.. ఈ పుస్తకాన్ని Dr.Koppula Hemadri, B-17, Samrat
Apartments, Srinagar Colony, Ring Road, Vijayawada-520 008 అనే చిరునామా ద్వారానూ, ఫోన్:0866-2541711, cell:98482 96865 ల ద్వారానూ లేదా అనే koppulahemadri@yahoo.com ఈమెయిల్ ద్వారా గానీ పొందవచ్చు.
Leave a Reply