రూపం-సారం: సాహిత్యంపై బాలగోపాల్
డిటీయల్సీ సమావేశాలు: ఆగస్ట్ 31, 2014, అక్టోబర్ 26, 2014.
పాల్గొన్న వారు: మద్దిపాటి కృష్ణారావు, కాజా రమేష్, కొత్త ఝాన్సీలక్ష్మి, పిన్నమనేని శ్రీనివాస్, బూదరాజు కృష్ణమోహన్, నర్రా వెంకటేశ్వరరావు, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, ఆరి సీతారామయ్య, పోలాప్రగడ ఫణి, చేకూరి విజయసారధి, సానం శైలేంద్రనాథ్, గోలి శ్రీనివాసరావు.
సమీక్షకుడు: ఆరి సీతారామయ్య.
[బాలగోపాల్ గారి వ్యాసాలు అర్థం కావాలంటే మార్క్సిజం గురించి కొంతైనా తెలిసుండాలి. మాలో చాలా మందికి మార్క్సిజం గురించి అంతగా తెలియదు. మాలాంటి వారికి బాలగోపాల్ వ్యాసాలు అర్థం కావటానికి సహాయ పడుతుందనే ఉద్దేశంతో మార్క్సిజం గురించి ఓ చిన్న పరిచయం ఈ వ్యాసం మొదటి భాగంలో పొందుపరిచాము. అది అవసరం లేని వారు రెండవ భాగం నుంచి చదవొచ్చు.]
నేను ఆలోచిస్తాను, కాబట్టి నేను ఉన్నాను అన్నాడు డెకార్ట్. అంటే ఆలోచనే మనిషి ఉనికికి ఆధారం. చరిత్రని నడిపేది ఆలోచనలు (ఐడియలిజం, భావవాదం) అని భావించాడు హేగెల్. ఒక చారిత్రక సందర్భంలో ఒక ఆలోచన ప్రబలంగా ఉంటుంది. దానిలో అంతర్గతంగా ఉండే వైరుధ్యంతో అది పోటీపడుతుంటుంది. వీటిమధ్య జరిగే ఘర్షణలోంచి రెండిటిలోని పార్షికాంశాలతో ఒక సంకీర్ణ ఆలోచన ఉద్భవిస్తుంది. కొంతకాలం తర్వాత ఈ సంకీర్ణ ఆలోచనలోని వైరుధ్యాల మధ్య ఘర్షణ జరుగుతుంది. చరిత్ర ఇలా ముందుకు నడుస్తుంది (డయలెక్టిక్, గతి తర్కం). ఇది హేగెల్ ఆలోచన.
మనిషి ఉనికికి కారణం ఆలోచనలూ, వాటి వల్ల కలిగే చైతన్యం కాదు, భౌతిక సామాజిక పరిస్థితులనేది మార్క్స్, ఎంగెల్స్ వాదన (మెటీరియలిజం, భౌతిక వాదం). చరిత్రను నడిపేది భౌతిక సత్యాలు, ముఖ్యంగా ఉత్పత్తి విధానం. చరిత్రలో ఒక్కో దశలో ఉన్న ఉత్పత్తి విధానంలో అంతర్గతంగా ఉన్న వైరుధ్యాల మధ్య ఘర్షణ జరుగుతుంది. వీటినుంచి కొత్త ఉత్పత్తి విధానం ఉద్భవిస్తుంది. చరిత్ర ఇలా నడుస్తుంది (హిస్టారికల్ మెటీరియలిజం, చారిత్రక భౌతికవాదం, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను – శ్రీశ్రీ).
ఉత్పత్తి విధానం అంటే ఉత్పత్తికి అవసరం అయ్యే ఉత్పత్తి శక్తులూ, (ప్రకృతీ, పరికరాలూ, తగిన చోటూ, తదితరాలు) ఉత్పత్తి సంబంధాలూ. ఉత్పత్తి సంబంధాలు అంటే ఉత్పత్తి శక్తుల మీద ఆధిపత్యం ఉన్న వారికీ, ఉత్పత్తిచేసేవారికి మధ్య ఉండే సంబంధాలు.
సామ్రాజ్యాలున్న రోజుల్లో ఒక రాజు ఎంత భూమిని ఆక్రమించుకుంటే అంత వరకు ఆ సామ్రాజ్యం ఉండేది. అందులోని మనుషులందరు ఆ రాజు ఏది శాసిస్తే అది చేసేవారు. రాజ్యాలు పోయి, భూమిని రాజ వంశీయులూ పై అధికారులూ పంచుకున్నప్పుడు భూస్వామ్యం ఏర్పడింది. సంపద అంతా భూమి నుంచి వచ్చిందే. భూమి మీద పనిచేసే వారందరూ భూస్వామి బానిసలు. వారి కష్టం వల్ల సంపద పుడుతుంది, దాన్ని భూస్వామి అనుభవిస్తాడు. పని చేసే వారికి బతకటానికీ పనిచెయ్యటానికీ కావాల్సినవన్నీ సమకూర్చటం భూస్వామి బాధ్యత. వస్తువులను అమ్ముకున్నట్లు భూస్వామి బానిసలను కూడా అమ్ముకోవచ్చు. అంటే బానిస కూడా ఆ వ్యవస్థలో ఒక మారకపు సరుకే (వర్తకపు సరుకు, కమాడిటీ). ఐరోపా ఖండంలో పదహారవ శతాబ్దం తర్వాత పెట్టుబడిదారీ విధానం వచ్చింది. ఫాక్టరీల్లో పనిచెయ్యటానికి పెద్ద ఎత్తున కూలీలు అవసరం అయ్యారు. ఈ కూలీలకోసం భూస్వామ్యానికీ, పెట్టుబడిదారీ విధానానికీ జరిగిన ఘర్షణలో క్రమంగా పెట్టుబడిదారీ విధానం స్థిరపడింది, భూస్వామ్యం అంతరించింది (అమెరికాలో జరిగిన అంతర్యుద్ధం ఇలాంటిదే).
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో కార్మికుడు మారకపు వస్తువు కాదు. ఇరవైనాలుగు గంటలూ అతను యజమాని అధీనంలో ఉండడు, అతని పూర్తి బాధ్యత యజమానిది కాదు. రోజులో కొంత భాగం, ఎనిమిది గంటలు అనుకుందాం, (ఇదివరకు ఇది పదహారు, పన్నెండు, పది గంటలుగా మారుతూ వచ్చింది) కార్మికుడు యజమాని ఫాక్టరీలో పనిచేస్తాడు. యజమాని అతనికి ఆ పనిచేసిన సమయానికి జీతం ఇస్తాడు. అంటే ఇదివరకు భూస్వామ్యంలో తనే మారరకపు వస్తువుగా ఉన్న పనిచేసే మనిషి ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థలో తన శ్రమను కొంతకాల పరిథిలో మారకపు వస్తువుగా అమ్ముకుంటున్నాడు. స్థూలంగా ఉత్పత్తి సంబంధం అంటే ఇది.
ఎనిమిది గంటల్లో ఒక కార్మికుడు వెయ్యి రూపాయలకు అమ్మ దగ్గ వస్తువులను ఉత్పత్తి చేశాడనుకుందాం. యజమానికి ఆ వస్తువుల తయారీకి అయిన ఖర్చు ఐదువందల రూపాయలు అనుకుందాం. అందులో నాలుగు వందలు కార్మికుడి జీతం, వంద రూపాయలు ఇతర ఖర్చులు (ఫాక్టరీ అద్దె, ముడి సరుకులు, పనిముట్ల అరుగుదల లాంటివి). అంటే యజమానికి ఐదు వందల రూపాయల లాభం వచ్చింది. ఇది కార్మికుడి శ్రమవల్ల వచ్చిన లాభం వల్ల కాబట్టి నాలుగు వందలజీతం ఇచ్చి తొమ్మిదివందల పని చేయించుకున్నాడన్న మాట యజమాని. అంటే శ్రమ దోపిడీ చేస్తున్నాడన్న మాట.
గత రెండు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల శ్రమనుంచి ఉత్పత్తి అవుతున్న సంపదలో అధికభాగం కొద్ది మంది జేబుల్లోకి మాత్రమే పోతుందని థామస్ పికెటీ అనే ఫ్రెంచ్ ఆర్థిక శాస్త్రవేత్త ఇరవైయ్యొకటవ శతాబ్దంలో పెట్టుబడి (కాపిటల్ ఇన్ ది 21st సెంచురీ) అనే పేరుతో రాసిన గ్రంధంలో విశదీకరించారు (2013). ఇది అవధులు లేకుండా ఇలాగే సాగితే ప్రజాస్వామ్యం స్థానంలో అల్పజనపాలన (ఓలిగార్కీ) ఏర్పడుతుందని అన్నారు. అమెరికాలో ఈ వ్యవస్థ ఇప్పటికే వచ్చింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మౌలికమైన మార్పులు రావు. ప్రజలు మాత్రం అధికారం మాచేతుల్లో వుంది, వోటేసి ప్రభుత్వాన్ని మార్చేశాం అనుకుంటూంటారు.
ఉత్పత్తి విధానం సమాజ పునాది. ఈ పునాది మీద ఆధారపడి ఉపరితలంలో కనపడేవి (ఉద్భవించేవి) ఆ సమాజ రాజకీయ, మత, తాత్విక, చట్ట, కళా రూపాలు. సాహిత్యం కళారూపాలలో ఒకటి. పునాదికీ ఉపరితలానికీ ఉండే సంబంధం క్లిష్టమైనది కావటంవల్ల, వాటి మధ్య సంబంధం లేనట్లు కనపడవచ్చు. తమ శ్రమఫలితం పరాధీనం అవుతున్నదన్న విషయం కార్మికులందరికీ తెలియక పోవచ్చు. అంత చైతన్యం వారిలో ఉండకపోవచ్చు. శ్రమ చేసే కార్మికులకేకాక ఆఫీసుల్లో పనిచేసేవారి శ్రమ కూడా దోపిడీకి అతీతం కాదు, వారికి తెలిసినా తెలియకపోయినా. ఒక పెద్ద ఐటీ కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాకు చాలా జీతం ఇస్తున్నారు కదా, నాశ్రమ ఫలితం అంతా నా జీతం ద్వారా నా చేతికి వస్తుంది అనుకోవచ్చు (ఫాల్స్ కాంషస్‌నెస్, తప్పుడు చైతన్యం). అక్కడ పనిచేసే వారందరికీ వాళ్ళ శ్రమకు తగిన జీతం ఇచ్చేటట్లయితే ఆ కంపెనీకి వేలకోట్ల లాభం రావటం అసాధ్యం.
శ్రమదోపిడి గురించి కొందరికి పూర్తి అవగాహన ఉంటుంది. మోసానికి గురి అవుతున్నారన్న చైతన్యం (వర్గ చైతన్యం) శ్రామికులందరికీ కలిగేలా చేయ్యటం కమ్యూనిస్టులు చెయ్యవలసిన పని అని మార్క్సిస్ట్ లెనినిస్టుల అభిప్రాయం. చైతన్యం కలిగించటం ఎలా? వ్యవస్థను మార్చటం ఎలా? ఎందుకు మార్చాలి? ఎవరికోసం మార్చాలి? ఇందులో ఉపరితలం (సాహిత్యంతో సహా) నిర్వహించే పాత్ర ఏంటీ? ఈ ప్రశ్నలకు కనీసం గత నూట యాభై రెండు వందల సంవత్సరాలుగా వామపక్ష సైద్ధాంతికులు సమాధానాలు వెతికారు, వెతుకుతున్నారు. వారి మధ్య ముఖ్యంగా రెండు విషయాల గురించి (పునాదికీ ఉపరితలానికీ సంబంధం ఏంటీ? వ్యవస్థను మార్చటం ఎలా?) పెద్ద అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఇందువల్లే కొన్ని దేశాల్లో పలు వామపక్ష పార్టీలు ఏర్పాటు కావటం జరుగుతుంది.
ఒక చోట పెట్టుబడిదారీ విధానం పోతే ఆ గాలి తమవైపు సోకుతుందన్న భయం ఇంకొకచోట ఉండే పెట్టుబడిదారులకు కలుగుతుంది. అలా పోకుండా ఉండటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తారు. ఫ్రాన్స్ లో శ్రామికులు తిరుగుబాటు చేసినప్పుడు (పారిస్ కమ్యూన్, 1872) బూర్జువా వర్గం 30,000 మందిని చంపింది. రష్యాలో 1917 లో విప్లవం వచ్చినప్పుడు చుట్టు పక్కల ఉన్న 14 దేశాల సైన్యాలు (బ్రిటీష్ ఇండియాతో సహా) రష్యామీద దాడి చేసి యుద్ధం చేశాయి. చిలె లో ప్రజాస్వామికంగా వాపపక్ష ప్రభుత్వం వచ్చినప్పుడు (1970) దాన్ని బలవంతంగా కూలదొయ్యటంలో ప్రధాన పాత్ర వహించింది రాగి పరిశ్రమ గుత్త పెట్టుబడిదారులు.
మరి శ్రామికుల ప్రభుత్వాలు ఎలా వస్తాయి, ఎలా స్థిరపడతాయి? పెట్టుబడిదారీ వ్యవస్థ పోయి సామ్యవాద వ్యవస్థ రావాలంటే మొదట చెయ్యాల్సిన పని ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటంలో నెగ్గాలనీ, శ్రామిక వర్గాన్ని అధికారంలోకి తీసుకురావాలనీ, ఉత్పత్తి విధానాన్ని మార్చే ప్రయత్నంలో కొంత నియంతృత్వ వైఖరి అవసరం అవుతుందనీ అన్నారు మార్క్స్, ఎంగెల్స్. 19 వ శతాబ్దం మధ్య భాగంలో ఏ పరిపాలన అయినా అధికారంలో ఉన్న వారు చేసిన నియంతృత్వ పరిపాలనే. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ చేసే నియంతృత్వ పరిపాలన. అప్పటి సమాజంలో ప్రజల్లో అత్యథిక సంఖ్య శ్రామికులది కాబట్టి, వారికి వర్గ చైతన్యం ఉంటే, వారి ప్రభుత్వం అత్యథిక మెజారిటీతో ఉండే ప్రభుత్వం కాగలదు. బూర్జువా వర్గం సమ్మతించకపోయినా, కొంత నియంతృత్వ వైఖరితో ఉత్పత్తి విధానాన్ని మార్చవచ్చు. మార్క్స్, ఎంగెల్స్ ల ఆలోచన ఇలా వున్నా, ఆచరణవరకు వచ్చే సరికి పెట్టుబడిదారీ వ్యవస్థ తన అధికారాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో అర్థంకాకపోతే దాన్ని వ్యతిరేకించటం దానిమీద విజయం సాధించటం సాధ్యంకాదు. సాధించిన విజయం ఆశించిన విజయం ఒకటేనా అని కూడా ఆలోచించాలి.
ఫ్రా న్స్ లో (1872), ఆ తర్వాత 1920 దాకా ఐరోపా దేశాల్లోజరిగిన పోరాటాల దృష్టిలో ఉద్యమకారుల్లో చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఎడ్వర్డ్ బెర్న్ స్టైన్ (జర్మనీ, 1850-1032) సమాజవాద సమాజం (సోషలిస్ట్ సొసైటీ) అనివార్యం కాదనీ, కార్మిక సంఘాలద్వారా, ప్రతినిధి సభలద్వారా (పార్లమెంటరీ మెథడ్స్) పౌరహక్కులకోసం పోరాడవచ్చనీ, ప్రజాస్వామిక పద్ధతులతోనే సంకీర్ణవర్గ సమాజం ఏర్పడగలదనీ భావించారు. కార్ల్ కౌట్స్కీ (జర్మనీ, 1854-1938) సమాజవాద సమాజం తప్పకుండా ఏర్పడుతుందనీ, కాని దాన్ని సాధించటం ప్రతినిధి సభలద్వారా సాధ్యం కాదనీ భావించారు. కాని సమసమాజాన్ని ఏర్పాటు చేసే పథంలో నియంతృత్వ ధోరణిని వ్యతిరేకించారు. సమసమాజం తప్పక వస్తుందని నమ్మిన వాళ్ళలో రోసా లక్సెంబర్గ్ ఒకరు (పోలండ్, 1871-1919). శ్రామిక వర్గానికీ కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య లక్ష్మణ గీత గీసినవారిలో ప్రథములు అని చెప్పుకోవచ్చేమో. శ్రామికుల హక్కులకోసం జరిగే పోరాటంలో శ్రామికులదే ముందు చోటనీ, వారి చర్యల ద్వారా తప్పులు జరిగితే వాటినుంచి నేర్చుకుని శ్రామికులు సంఘటితం అవుతారనీ, బలపడతారనీ, పోరాట మార్గాన్ని పార్టీ నిర్ణయించకూడదనీ, ముఖ్యంగా పార్టీలో పనిచేసే కార్యవర్గం చెప్పుచేతల్లో శ్రామిక వర్గం ఉండకూడదనీ ఆమె అభిప్రాయపడ్డారు. రష్యా విషయంలో అక్కడి శ్రామిక వర్గం చాలా చైతన్యయుగంగా ఉన్నదని నమ్మినా, రష్యా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న దేశం కావటంతో, పెట్టుబడి విధానం బలహీనంగా ఉన్న దేశం కావడంతో, వ్యవసాయ కార్మికుల (పెజంట్స్) ద్వారా విప్లవం సాధ్యం కాదని ఆమె అనుకున్నారు.
పార్టీ-శ్రామిక వర్గం సంబంధం విషయంలో చాలా వరకు లక్సెంబర్గ్ లాగానే ఆలోచించారు లియోన్ ట్రాట్స్కీ (రష్యా, 1879-1940). కాని 1910 వ దశకంలో పార్టీ నాయకత్వం వైపే మొగ్గాడు. రష్యాలో విప్లవం సాధ్యం అని నమ్మారు. కాని విప్లవం వస్తే అది చుట్టు పక్కల ఇంకా అభివృద్ధిచెందిన దేశాల్లో కూడా విప్లవం వస్తేనేకాని నిలబడలేదని భావించారు. వ్లాదిమీర్ లెనిన్ (రష్యా, 1870-1924) రష్యాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, విప్లవం పార్టీ నాయకత్వం తోనే సాధ్యం అని నమ్మిన వారు. శ్రామిక వర్గ పాలన ఏర్పడిన తర్వాత ఇతర దేశాలు రష్యామీద యుద్ధానికి దిగిన సందర్భంలో నియంతృత్వ పంధాలో వ్యవహరించారు. లెనిన్‌తో విభేదించిన వారిలో రోసా లక్సెంబర్గ్ ముఖ్యులు. లెనిన్ అనుసరించిన నియంతృత్వ ధోరణి వల్లే లెనిన్ వైఖరి ముదిరి స్టాలిన్ వైఖరిగా మారిందని మార్క్సిజాన్ని వ్యతిరేకించేవారే కాకుండా సమర్ధించేవారుకూడా అభిప్రాయపడతారు.
కాని బలవంతం లేకుండా శ్రామిక వర్గ విమోచన సాధ్యమా? ఫ్రాన్స్ లో, రష్యా లో ఉన్న అనుభవంతో, శ్రామికుల ప్రభుత్వాలు ఏర్పాటు కావాలన్నా, బయటి శక్తులనుంచి వాటిని కాపాడుకోవాలన్నా సాయుధ పోరాటం అవసరమనీ, శ్రామికులు సాయుధులుగా ఉంటే ఫ్రాన్స్ లోనూ, చిలె లోనూ విప్లవ వ్యతిరేక శక్తులు గెలిచేవి కాదనీ కొందరు మార్క్సిస్టులు భావించారు. పై అభిప్రాయాలు, అభిప్రాయ భేదాలూ ఆచరణకు సంబంధించినవి. పునాది-ఉపరితలాల సంబంధం గురించి , వాటి-మధ్య ఉండే పరస్పర ప్రభావాల గురించి కూడా చాలా అభిప్రాయ భేదాలున్నాయి.
గిఓర్గీ లూకాచ్ (హంగరీ, 1885-1971) మనిషి పునాదికి నిశ్చేష్టితమైన ప్రతిబింబం కాదనీ, పునాది నిర్ణయించే అవధుల్లోనే అయినా మనిషికి కొంత స్వతంత్రాధికారం ఉంటుందనీ భావించారు. బూర్జువా వర్గం తమ ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవటంలో వాడే ముఖ్య మైన ఆయుధం సాంస్కృతిక ఆధిపత్యం అని ఇటలీ దేశస్తుడు ఆంటోనియో గ్రాంశీ (1891- 1937) భావించాడు. తమ తెలివైన ప్రచారం ద్వారా పాలక వర్గాలు సమాజంలో బౌద్ధిక, నైతిక ఆధిపత్యం (ఉపరితలం) వహిస్తారనీ, వారి నాయకత్వానికి సమాజంలో చదువు, మతం, ప్రచార మాధ్యమాల ద్వారా సమ్మతి సృష్టిస్తారనీ, వారి సంస్కృతినే ప్రజలు కామన్ సెన్స్ లాగా స్వీకరించేటంత సమ్మోహితులయ్యేట్లు చేస్తారనీ, వారితో పోటీ పడాలంటే అదే పద్ధతిని వాడాలనీ గ్రాంసీ అభిప్రాయపడ్డాడు.
ప్రజలను అదుపులో వుంచటానికి ప్రభుత్వాలు భావాధారమైనవి (ఐడియొలాజికల్ – కుటుంబం, చర్చ్, బడి, కొ్ర్ట్, మీడియా), అణచివేతకు ఉపయోగపడేవి (రిప్రెసివ్ – పొలీస్, మిలిటరీ, క్రిమినల్ జస్టీస్) అని రెండు రకాల ఉపరితల సంస్థలను వాడతాయనీ, పరిస్థితినిబట్టి ఏదో ఒకరకమైన సంస్థలను ఎక్కువగా వాడుతుంటాయనీ, ప్రజలను అదుపులో ఉంచటమే పెట్టుబడిదారీ ప్రభుత్వాల ముఖ్యోద్దేశమనీ భావించాడు ఫ్రెన్చ్ మార్క్సిస్ట్ ఆల్తుస్సేర్ (1918-1990). ముఖ్యంగా గమనించవలసింది మార్క్సిస్టుల మధ్య పునాది-ఉపరితలం సంబంధం గురించి ఏకాభిప్రాయం లేదనీ, చాలా రకాల దృక్పథాలకు చోటుందనీ.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పశ్చిమ దేశాలలో మార్కిస్టులమని చెప్పుకునే కొందరు మేధావులు ఉపరితలానికీ పునాదికీ అంత అనివార్య సంబంధం ఏమీ లేదని చెప్తూ ఉన్నారు. కాని ఈ విషయం ఇంకా తెలుగు నాట పాలక వర్గాల దాకా వెళ్ళినట్లు లేదు. ఉపరితలం పునాదిని మార్చేస్తుందని వీరి భయం. వాడి సంచిలో శ్రీశ్రీదో వరవరరావుదో కవిత్వం దొరికిందని పిల్లవాళ్ళను చితగ్గొడుతుంటారు పొలీసులు.
పొలీసులతో ప్రజలను అణచివెయ్యటం ఎవ్వరికైనా సులభంగా అర్థం అవుతుంది. కాని బౌద్ధిక, సాంస్కృతిక, ప్రచార సాధనాలద్వారా లొంగదియ్యటం అంత సులభంగా అర్థంకాదు. ఉదాహరణకు క్రిస్మస్ పండగ తీసుకుందాం. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 25 దాకా అందరూ ఆలోచించేది క్రీస్తుని గురించి కాదు, బంధువులకూ మిత్రులకూ ఏం బహుమతులు కొనాలా అని, ఎవరినైనా మర్చిపోతే ఏమనుకుంటారో, విలువైన బహుమతి కొనకపోతే ఏమనుకుంటారో అని. ఈస్టర్ పండగలో ముఖ్యమైన ఆలోచన ఎగ్ హంట్ గురించి. మదర్స్ డే రోజు తల్లికీ, ఫాదర్స్ డే రోజు తండ్రికీ ఏం కొనివ్వాలా అని. వాలెంటైన్స్ డే అంటే ప్రియుడికి, ప్రియురాలికి ఏం కొనాలా అని. ప్రెసిడెంట్స్ డే ఎవరిని గౌరవించటానికో కూడా ఎవ్వడికీ తెలియదు, ఆరోజు ప్రెసిడెంట్స్ డే సేల్ ఉంటుందని మాత్రం అందరికీ తెలుసు. అంటే మన సంస్కృతి అంతా కొనటం లాగా తయారైనదన్నమాట. పైగా నేను స్వతంత్రుణ్ణి, నామీద ఎవ్వడి ఆధిపత్యం లేదు, అనుకుంటూనే మనం ఇలా తయారయ్యాం. ఎలా? ఎవ్వరి ప్రభావం ఇది? ఇదంతా అనాలోచితంగా జరిగిందా? దీని వెనుక చెయ్యి ఎవ్వరిదీ? పెట్టుబడిదారీ వ్యవస్థదా, కాదా? ఇంత పకడ్బందీగా తయారైన వ్యవస్థని మార్చటం సాధ్యమా?
2
వ్యవస్థను మార్చేది ఎవరికోసం?
1917 లో రష్యాలో పెట్టుబడిదారీ విధానాన్ని తొలగించి సమాజవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాని 75 సంవత్సరాల తర్వాత అక్కడి సమాజం సమాజవాదాన్ని తిరస్కరించి పెట్టుబడిదారీ విధానానికి మారింది. అంటే సమాజవాదం కంటే, పెట్టుబడిదారీ విధానమే మంచిదని నిర్ణయించినట్లేకదా? 1940వ దశకంలో తెలుగునాట కమ్యూనిస్ట్ పార్టీకి చాలా బలం ఉండేది. 1952 లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతంలో 41 స్థానాలు గెలిచి కమ్యూనిస్ట్ పార్టీ మొదటి స్థానంలో ఉండింది. ఇప్పుడు ఆ పార్టీకి నామ మాత్రమైన గుర్తింపుకూడా లేదు. ఎందువల్ల? 1950 వ దశకంలో కమ్యూనిస్ట్ పార్టీకి కోస్తా జిల్లాల్లో పేదల్లో కంటే ‘మధ్య తరగతి అగ్రకుల శూద్ర రైతు’ వర్గంలోనే ఎక్కువ ప్రాబల్యం ఉండేది? ఇదెలా అర్థం చేసుకోవటం? ఇప్పుడు ఆ బలం పూర్తిగా అణగారిపోయింది. ఏందువల్ల? (చరిత్ర, మనిషి, మార్క్సిజం)
కమ్యూనిస్ట్ పార్టీలో చేరే అందరి ఉద్దేశం విప్లవంకాదనీ, సమీప అవసరాలకోసం పార్టీలో చేరే వారు ఉంటారన్న విషయం గుర్తించాలంటారు బాలగోపాల్. “తమ వ్యక్తిత్వాన్ని కించపరిచే గణ ఆచారాలపట్ల నిరసనతో … ఆదివాసీ స్త్రీలు తమకు అందుబాట్లో ఉన్న ఏకైక తిరుగుబాటులో భాగం అవుతారు.” వాళ్ళకు కావాల్సింది వారి పరిస్థితి మెరుగు పడటం. అంతే కాని, ఆ తిరుగుబాటు అంతిమ లక్ష్యాలతో వాళ్ళకు నిమిత్తం ఉందని … అనుకోవటం భ్రమ” అంటారు బాలగోపాల్. ఆదివాసీ జీవితంలో కొంత మార్పు వచ్చి ఆ స్త్రీల జీవితాలు కొంత సులభం ఐతే వాళ్ళు తిరుగుబాటులో కొనసాగుతారా? ఆదివాసీ స్త్రీల విషయమే కాదు, ఇది అందరికీ వర్తించే విషయమే.
కొందరి చైతన్యంలో పెద్ద మార్పు వచ్చి అందరికోసం పోరాడటం తమ లక్షంగా భావించి ఉద్యమంలో ఉండిపోవచ్చు. కానీ అందరికీ అంత చైతన్యం ఉండదు. ఇది ఉద్యమ వైఫల్యం కాదు, మానవ సహజ స్వభావం అంటారు బాలగోపాల్ (చరిత్ర, మనిషి, మార్క్సిజం). రష్యాలో కమ్యూనిస్ట్ పాలనకు సపోర్ట్ తగ్గిపోవటానికి ఇదొక కారణం అయ్యుండవచ్చు.
“సమసమాజ ధ్యేయం మనుషులు చైతన్యవంతంగా ఎంచుకునే రాజకీయ లక్ష్యమే తప్ప అణచివేత నుంచి అనివార్యంగా పుట్టే కాంక్ష కాదు…. ధనికులకంటే పేదవాళ్ళలో, అగ్రకులాలకంటే దళితులలో, పురుషులకంటే స్త్రీలలో, ఈ చైతన్యాన్ని సాధించటం కొంత సులభం కావచ్చునని నమ్మటం అసంబద్ధంకాదు. కాని దీనిలో అనివార్యత ఏమీ లేదు. చివరికి మనుషులు సమసమాజాన్ని కాంక్షించబోయేది కార్మికులుగా, ఆదివాసులుగా, స్త్రీలుగా, దళితులుగా కాదు, చైతన్యవంతులయిన వ్యక్తులుగా,” అంటారు బాలగోపాల్. 1940 వ దశకంలో కోస్తా జిల్లాల్లో రైతాంగంలో కమ్యూనిస్ట్ పార్టీ మీద సానుభూతి ఉండటానికి కారణం ఈ విశ్లేషణలో అర్థం అవుతుంది. [తెలుగులో కథలు రాసేవారు చాలామంది ఇప్పటికీ అన్నదమ్ముల మధ్య తేడాలొస్తే అన్న వైపు, తండ్రికీ బిడ్డకూ తేడా వస్తే తండ్రి వైపూ, పల్లెటూరి వాడికీ పట్టణం వాడికీ తేడా వస్తే పల్లెటూరి వాడి వైపూ, రైతుకూ వ్యాపారస్తుడికీ మధ్య తేడా వస్తే రైతు వైపూ అనివార్యంగా ఉంటుంటారు. మంచి చెడ్డలు చైతన్యాన్ని బట్టి ఉంటాయిగాని, వర్గాన్ని బట్టి ఉండవన్న ఆలోచన చాలా మంది కథా రచయితలకు ఇంకా రాలేదు.]
మార్క్స్, ఎంగెల్స్ అభిప్రాయంలో శ్రామిక నియంతృత్వం అనివార్యం (కమ్యూనిస్ట్ మేనిఫెస్టో). కాని వారు దాన్ని మెజారిటీ నియంతృత్వం అన్న భావనలో అన్నారు. శ్రామికులైనంత మాత్రాన చైతన్యం రాదు. వారికి చైతన్యం వచ్చేదాకా ఓపిక పట్టలేని పార్టీ వారి తరఫున సాయుధ పోరాటం చేస్తే అది మెజారిటీ పోరాటం కాదు. ప్రజల్లో సమసమాజ కాంక్ష రానంతవరకూ,” సోషలిజం నిర్మిస్తామంటూ ఏర్పడే ఏ ప్రభుత్వమైనా ఏదో ఒక పునాది ప్రజా సమూహం పేరు మీద ఏదో ఒక పార్టీ చలాయించే నియంతృత్వమే,” అన్నారు బాలగోపాల్. ఈ విషయం మీదనే 1910 వ దశకంలో రోసా లక్సెంబర్గ్ కీ లెనిన్ కీ మధ్య పెద్ద వివాదం జరిగింది. సమసమాజ స్థాపనలో ప్రజలందరి పాత్ర ఉండాలనీ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అది అవినీతికీ, నియంతృత్వానికీ, హింసకూ దారి తీస్తుందని రోసా లక్సెంబర్గ్ అభిప్రాయపడ్డారు. తెలుగు నాట నక్సలైట్ ఉద్యమంవల్ల గామీణ పేద ప్రజలకూ, ఆదివాసులకూ మేలు జరిగిందని అంగీకరిస్తూ, ఉద్యమకారుల హింసామార్గాన్నీ, అవినీతినీ బాలగోపాల్ విమర్శించారు. (చీకటి కోణాలు, మూడు దశాబ్దాల నక్సల్బరీ గమ్యం గమనం’ పుస్తకంలో వచ్చిన వ్యాసం, 1998). నక్సలైట్ల గమ్యం ఆనాటి రష్యాలో బోల్షివిక్కుల లాగానే అధికారం చేజిక్కుకోవటం. కాని ప్రజల్లో అధిక భాగానికి వారిమీద సహృద్భావం లేదు, ప్రస్తుత వ్యవస్థను మార్చాలనే అభిప్రాయం లేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యమకారులు చెయ్యాల్సిన పని ప్రజలను చైతన్యవంతులను చెయ్యటం. అంత ఓపిక లేక, సాహుధ పోరటంచేస్తాం అంటే అది ఎవరికోసం? సాయుధ పోరాటంచేసి అధికారం చేజిక్కుచ్చుకుంటే, అది నిరంకుశ ప్రభుత్వానికి దారి తీస్తుందనీ, ఆ ప్రభుత్వం తరఫున జరిగేది హింసాకాండ అనీ, అలాంటి ప్రభుత్వాలు ఎంతోకాలం ఉండవనీ చరిత్ర నేర్పిన పాఠం.
బాలగోపాల్ కమ్యూనిజాన్ని తిరస్కరించాడు, మా వైపు వచ్చాడు అని వాదించే విశ్వనాథ వర్గం వారున్నారు. పై అభిప్రాయంలో బాలగోపాల్ సమసమాజాన్ని తిరస్కరిస్తున్నట్లు కనబడదు. ఆచరణలో సమసమాజ గమ్యం ఎలా చేరుకోవాలి అన్న విషయం మీద తన అభిప్రాయం చెప్పారు.
విప్లవం వస్తే సరిపోతుందా?
“అణచివేతపట్ల వ్యతిరేకతతో బాటు, సమిష్టితత్వం, సహజీవన సంస్కృతీ పెరగాలి. ఇవి రెండూ ఒకటి కాదు. మొదటిది సాధిస్తే రెండవది దానంతడది సిద్ధించదు. రెండవది సాధ్యం కావాలంటే మానవ ప్రవృత్తిలోని అనేక వికారమయిన లక్షణాలను ద్వేషించటం నేర్చుకోవాలి,” అన్నారు బాలగోపాల్.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావటానికి చాలా కారణాలు ఉండవచ్చు. అందులో ఒకటి అంతరిక్ష నౌకలను తయారుచెయ్యగల దేశం పౌరులకు నిత్యావసర వస్తువులను సమకూర్చి పెట్టలేకపోవటం. దీనికి కొంత కారణం పెట్టుబడిదారీ వ్యవస్థతో పోటీ పడవలసిన అవసరం రావటం, దేశ రక్షణను దృష్టిలోపెట్టుకుని ఒక ప్రాధాన్య క్రమం ఏర్పాటు చేసుకోవలసి రావటం కావచ్చు. కాని ప్రజలలో బలమైన అసంతృప్తి ఉండటంలో కూడా దేశ భద్రతకు ప్రమాదం ఉందని గ్రహించకపోవటం కూడా దేశం విచ్చిన్నం కావటానికి ఒక కారణం అయివుండవచ్చు.
దీనికి తోడు “మనుషులు కోరుకునేది ఏదీ పరిపూర్ణంగా దొరకదు. శ్రమకు తగిన ఫలితం, వ్యక్తిత్వానికి తగిన గుర్తింపు మాత్రమే కాదు. ప్రేమా, సౌందర్యం, సంతోషం, ఏదీ మానవ జీవితంలో పరిపూర్ణంగా లభించదు. దయ, సాహసం, దాతృత్వం, వంటి గుణాలేవీ మనుషులు పరిపూర్ణంగా ప్రదర్శించలేరు. మానవ జీవితంలో అన్నికోణాలలోనూ ఉన్న ఈ అపరిపూర్ణతకు శ్రమదోపిడీ, అణచివేతా, అసమానతా, పేదరికం వంటి వ్యవస్థాగతమయిన విషయాలు కొంతమేరకు కారణం. కానీ వాటినన్నిటినీ వడపోసినా, మానవ అస్తిత్వానికి స్వాభావికమైన అపరిపూర్ణత మిగిలిపోతుంది,” అంటారు బాలగోపాల్.
ఆశించిన మేరకు ప్రేమా, సౌందర్యం, సంతోషం లభించక పోవటమే కాదు, మనిషికి కూడబెట్టటం, అనుభవించటం విషయంలో పరిమితి లేకపోవటం సహజ స్వభావమేమో. ప్రపంచాన్ని ఒక భోజ్య వస్తువుగా చూసే వైఖరి మనుషులందరిలోనూ ఉన్నదనీ, “దానిని మానవ జీవితంలో ప్రధాన విషయం చేసి చాలా ఆకర్షణీయంగా విపులీకరించి ఒక ప్రచండ భోజ్య సంస్కృతిని (కన్సూమర్ కల్చర్) సృష్టించింది బూర్జువా వ్యవస్థ,” అన్నారు బాలగోపాల్. అలాంటి సంస్కృతితో సమాజ వాద వ్యవస్థ పోటీ పడి (సోవియట్ యూనియన్ అయినా, మరో దేశం అయినా) నెగ్గగలగటం అసంభవం అనిపిస్తుంది. “వ్యవస్థను మార్చేస్తే మనలోని ఆ వైఖరి పోదు, ఆ వైఖరిని మనం మానవీయంగా నియంత్రించుకోగలిగినప్పుడే బూర్జువా వ్యవస్థను మార్చేయ గలుగుతాం,” అన్నారు బాలగోపాల్. “ప్రపంచాన్ని భోజ్య వస్తువుగా కాక తనలో భాగంగా, తనను ఈ ప్రపంచంలో భాగంగా చూసే మమైక్యతా సంస్కృతి కూడా మనిషికి స్వాభావికంగానే సంతృప్తినిస్తుంది. దీనిని మానవ జీవితంలో ప్రధాన విషయం చేయటం సాధ్యమైతేనే కమ్యూనిజం సాధ్యం అవుతుంది,” అన్నారు. ప్రస్తుతం ఇలాంటి ప్రయత్నం కొంతవరకైనా చేస్తున్నది పర్యావరణ ఉద్యమకారులు (ఎన్వైరాన్‌మెంటలిస్ట్స్), కమ్యూనిస్టులు కాదు, అని తన నిరాశను వ్యక్తం చేశారు.
3
రూపం – సారం
మార్క్సిస్ట్ భావజాలంలో “ఉత్పత్తి (పునాది) చేత నిర్ణయించబడే ఉపరితలంలో కళ ఒక భాగం.” కళాంశాల్లో సాహిత్యం ఒకటి. అంటే ఒక కాలంలో వచ్చే సాహిత్య మూలాలు ఆనాటి ఉత్పత్తి సంబంధాల నుంచే ఉద్భవిస్తాయి, ఎక్కడనుంచో వూడిపడవు. ఒక నిర్దిష్ట కాలంలో ప్రబలంగా ఉండే భావజాలం ఆ నాటి పాలకులకు అనుకూలంగా ఉంటుంది. అదే నిజం, అదే సత్యం అనిపిస్తుంది. శ్రామికులు ఆ భావజాలానికి అలవాటుబడి ఒక తప్పుడు చైతన్యంలో (ఫాల్స్ కాన్షస్‌నెస్) ఉంటారు. సాహిత్యం శ్రామికులను సంఘటితం చేసి చైతన్యవంతులుగా చేసే, చూపే ప్రయత్నం చేస్తుంది అనేది సమాజవాద వాస్తవ వాదంలో (సోషలిస్ట్ రియలిజం) ముఖ్యాంశం.
కాని సాహిత్యం ఒక కళా రూపం కాబట్టి దాన్ని పూర్తిగా ప్రచారంకోసం వాడటం మీద వాదోపవాదాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. నగ్న ప్రచారం సాహిత్యానికి హానికరం అన్నారు ప్లెఖనోవ్ (1856-1918). సాహిత్యాని గురించి లునషార్స్కీ (1875-1933) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి: కొత్త విషయాల గురించి రాసే వాడు మంచి (valuable) రచయిత; సాహిత్యంలో శైలీ వస్తువూ అవిభాజ్యంగా (should merge into one indivisible whole) ఉండాలి; ఎవరిని ఉద్దేశించి రాశారో వారిమీద అత్యధిక ప్రభావం ఉండాలంటే వస్తువుకు తగిన రూపం ఉండాలి; శుష్క ప్రచారంతో నింపేస్తే సృజన సాహిత్యం పాఠకులకు ఆసక్తికరంగా ఉండదు (leaves the reader cold).
ధోరణి సాహిత్యం (టెండెన్సీ లిటరేచర్) మీద ఎంగెల్స్ కటువైన విమర్శలు చేశారు. [కథలో] రాజకీయాలు చొప్పించటం బాగా రాయటం చేతగాక గుర్తింపు పొందటానికి పడే పాట్లు అని వ్యక్తీకరించారు. మరో చోట – పనికిమాలిన వాడు, సామర్థం లేక, (తన వర్గపక్షపాతం చూపించటానికి) చెత్త రాశాడు, గుర్తింపు కోసమే – అన్నారు ఓ రచయిత గురించి (రేమన్డ్ విలియమ్స్, 1977) . ఈ రోజు కూడా సాహిత్యాన్ని పాఠాలు చెప్పడానికీ, సమస్యలకు పరిష్కారాలు చూపించటానికీ, నీతులు బోధించడానికీ వాడాలనే వారికీ, వాడుతున్న వారికీ ఈ పై వ్యాఖ్యలు గమనించదగ్గవి.
ప్రతి మనిషికీ ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది, ఆ దృక్పథంతోనే రచనలు చేస్తారు, రచయిత ప్రాపంచిక దృక్పథం అతని/ఆమె కథలు చదివితే తెలిసిపోతుంది అంటుంటారు కొందరు విమర్శకులు, ఇప్పుడు కూడా. ప్రాపంచిక దృక్పథం అంతగా ముఖం మీద ప్రదర్శిస్తూ రాసే రచయితల గురించే పైన ఎంగెల్స్ మాట్లాడింది. మంచి కథల్లో, నవలల్లో పాత్రల ప్రాపంచిక దృక్పథం మనకు అర్థం కావాలి, రచయితలది కాదు. రచయిత తన అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెప్పాలని ఎంగెల్స్ అన్నాడు. పరోక్షంగా అంటే పాత్రల ద్వారా. పి.సత్యవతి కథా సంకలనం ‘మెలకువ’ కు ముందుమాటలో శివారెడ్డి ఇలా రాశారు: “కథ చదివేటప్పుడూ, చదివిన తర్వాతా, కథలో పాత్రలే గుర్తొస్తాయి తప్ప సత్యవతిగారు రారు. పాత్రలు యధేచ్చగా ఎదుగుతాయి, సంచరిస్తాయి, ఆలోచిస్తాయి, కలలు గంటాయి. …. సత్యవతి గారు కథకీ, పాత్రలకీ అడ్డం రారు. పాత్రల్ని తీసుకొచ్చి వేదిక మీద అలా వదలి వెళ్ళిపోతారు”. పరోక్షంగా అంటే ఇలా వుండాలి.
మంచి సాహిత్యం అంటే
బాలగోపాల్ అభిప్రాయంలో మంచి సాహిత్యం అంటే ఎలా ఉంటుంది? కొ. కు. సాహిత్య విమర్శ గురించి రాస్తూ (1983), ” [కొ. కు.] మంచి సాహిత్యం రాయాలంటే మంచి విమర్శ రావాలంటాడు. ఏమిటీ ‘మంచి’ అని మనం చిరాకు పడబోతుండగా, ‘మంచి’ అంటే వర్గ స్వభావాన్నిబట్టి వుంటుందని వివరిస్తాడు,” అని రాశారు బాలగోపాల్. ఈ మంచి గురించి మరేమీ వ్యాఖ్యానం చెయ్యకపోవటం కొ. కు. అభిప్రాయమే బాలగోపాల్ అభిప్రాయంకూడా అని అనుకోవచ్చు.
1990 తర్వాత వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో మంచి సాహిత్యానికి వర్గ స్వభావం ఉండాల్సిన అవసరం లేదని బాలగోపాల్ భావించారని తెలుస్తుంది. “లోతయిన ఏ చారిత్రక పరిణామమయినా అనేక ఆశలనూ అకాంక్షలనూ భయాలనూ మేల్కొలుపుతుంది. అప్పటి వరకూ పట్టించుకోని జీవిత విశేషాలపట్ల కుతూహలాన్ని మేల్కొలుపుతుంది. జీవితంపైన ఒక బలమైన సర్చిలైట్ వేస్తుంది. ఆ మేల్కొలుపులో ఆశ కంటే భయమే ప్రధానమైనా… అది చీకటికోణాలలో దాగివున్న మానవ జీవిత విశేషాలపై భళ్ళున ఉదయించే ప్రభాతప్రసారమే. నిస్తేజమయిన బతుకు చీకట్లలో చూడటానికి ఏమీ లేదనుకున్న కళ్ళకు అనేక కొత్త విషయాలను … అది దివ్వెతో వెలిగించినట్లు చూపిస్తుంది. ఆ కొత్త వెలుగులో కనిపించే కొత్త భయాలు, కొత్త ఆశలు, కొత్త విషయాలు, కొత్తగా కనుగున్న పాత విషయాలు గొప్ప సాహిత్యానికి కథా వస్తువు” (చరిత్ర, మనిషి, మార్క్సిజం, 1993). “అటువంటి సందర్భాలలో… సాహిత్యం కార్యక్షేత్రమైన మానవ అస్తిత్వ నైజంలోని అన్ని రకాల సందిగ్ధాలు తీవ్ర పరిణామం తీసుకుంటాయి. అందుకే నిలిచిపోయే సాహిత్యం పుడుతుంది.” (ఖాళీలను పూరించడమే సాహిత్యం పని, 2001).
అసహజ శిల్పం
శిల్పం విషయంలో మార్క్సిస్టులకు ఒకప్పుడు (తెలుగునాట ఇప్పటికికూడా) ఉన్న వైఖరిని 1995 లో రాసిన ‘మరణానంతర ఊహ’లో బాలగోపాల్ తీవ్రంగా విమర్శించారు. “తెలుగులో కథాసాహిత్య శిల్పం మొత్తం మీద ఇంకా రియలిజం పరిథులు దాటిపోలేదు. నిజ జీవితంలో లాగా తెలుగు కథా సాహిత్యంలో కూడ కాలం ఎప్పుడూ గతం నుండి భవిష్యత్తు వైపే ప్రవహిస్తుంది. కార్య కారణ సంబంధాలు కర్త కర్మ క్రియల లాగా ఉండవలసిన చోటే ఉంటాయి. చైతన్యాన్ని ఎప్పుడూ పదార్థమే నిర్ణయిస్తుంది,” అంటూ సమాజవాద వాస్తవికతా వాదం పైన అసమ్మతి వ్యక్తం చేశారు. ఈ వాస్తవికవాదం పునాదులు లునషార్స్కీ సాహిత్య విమర్శలో కనబడతాయి. “…over-originality of form, where the emptiness of content is camouflaged by formal inventions and ornamentation. Writhers infected by the formalists, those typical representatives of bourgeois decadence, have been known to try to adorn and embellish their honest and weighty content with various tricks, thereby ruining their work.” వాస్తవికం కాని శైలి (అవాస్తవిక, అధివాస్తవిక, అర్థరహిత శైలి) ఒక్కొక చారిత్రక సందర్భంలో పాత్రల మానసిక స్థితిని అభివ్యక్తీకరించటంలో సహాయపడుతుందని కొందరు మార్క్సిస్టులు భావించారు, బాలగోపాల్ వారితో ఏకీభవించారు. “Most mobile, innovtive, and experimental forms belong to social systemsin which these new characteristics are evident or even dominant. Periods of major transition between social ystems are commonly marked by emergence of radically new forms…” అన్నారు బ్రిటీష్ మార్క్సిస్ట్ రేమండ్ విలియమ్స్ (1977). “జీవితంలో అర్థం కానిది ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుంది. … ఎవ్వరికీ ఏ అన్యాయం చేయని వాళ్ళు కష్టాలకు లోను కావటం అనేది మనం ఎన్ని కర్మ సిద్ధాంతాలు నమ్మినా, ఎంత సైన్స్ చదివినా ‘అర్థం’ చేసుకోలేము. అంటే దానికి సమ్మతించలేము. ఈ అర్థంలో ఆధునిక రాజ్యం, పెట్టుబడి అర్థరహితమైనవే. అవి శాసించే జీవితం అర్థరహితమైనదే. శిల్పం రీత్యా అర్థరహితంగా అనిపించే సాహిత్య శైలే దీనిని బాగా వ్యక్తం చేస్తుంది, ” అని వివరించారు బాలగోపాల్ (మరణానంతర ఊహ, 1995).
అన్ని సమాజాల్లోనూ వ్యవస్థల్లోనూ మనుషుల జీవితాల్లో ఎంతోకొంత అపరిపూర్ణత ఉంటుందని బాలగోపాల్ అభిప్రాయపడిన విషయం ఇదివరకే చెప్పుకున్నాము. “ఊహించుకోగల పరిపూర్ణతకూ, సాధించగలదానికీ మధ్య ఎప్పుడూ ఉండే అగాధాన్ని కాల్పనికంగా పూరించుకుని ఊహాత్మకంగా సంతృప్తిచెందే ప్రయత్నం చరిత్రచివరిదాకా సజీవంగానే ఉంటుంది. అయితే ఇది ఊహను నిజమని నమ్మజూపే భావజాలం రూపంలో కాక ఊహను కాల్పనిక సృష్టిగా స్పష్టంగా గుర్తించే సాహిత్యము, కళల రూపంలో జరగగలిగితే అమానుషతకు తావులేకుండా చూడవచ్చు. అందువల్ల మానవ జీవితాన్ని మానవీయంగా పునర్నిర్మించే ప్రయత్నంలో అవాస్తవిక కాల్పనిక సాహిత్యానికి తనదయిన స్థానంఎప్పుడూ ఉంటుంది,” అన్నారు బాలగోపాల్ (మరణానంతర ఊహ, 1995).
ఖాళీలు
మార్క్సిస్ట్ సిద్ధాంతంలోగానీ, ఆచరణలోగానీ జీవితంలో ఎదురయ్యో ప్రతి ప్రశ్నకీ మార్క్స్ ఉవాచలో సమాధానలు దొరుకుతాయనే వారితో విసుగొచ్చేసినట్లు రాశారు బాలగోపాల్. “ఈ రోజు తెలుగునాట పరమ సత్యాలనూ అంతిమ పరిష్కారాలనూ జేబులో పెట్టుకు తిరుగుతున్న ఉద్యమ మేధావులు ఆ (ఆత్మ విమర్శనా) దృక్పథాన్ని కొంచెం ఒంటబట్టించుకుంటే వారికే కాదు అందరికీ మంచిది,” అన్నారు (ఆధునికానంతర వాదం నుంచి నేర్చుకోవలసింది ఆత్మ విమర్శ, 1998). సాహిత్య విమర్శ విషయంలోకూడా మన ఉద్యమ కారులు సాంప్రదాయ దృక్పథమే కాకుండా ఇతర వామపక్ష సాహిత్య కారుల అభిప్రాయాలు కూడా అధ్యయనం చేసి ఉంటే ప్రయోజనం ఉండేది అన్నారు (ఖాళీలను పూరించటమే సాహిత్యం పని, 2001). మార్కిస్ట్ సిద్ధాంతంలో, మార్క్సిస్ట్ సాంప్రదాయ సాహిత్య విమర్శలో ఉన్న ఖాళీలను సాహిత్యం పూరించగలదని భావించారు. ముఖ్యమైన ఖాళీలు మానవ ప్రవృత్తికీ సమసమాజ ఆదర్శానికీ మధ్యనున్న జవాబు దొరకని ప్రశ్నలు. భోజ్య సంస్కృతి కలిగించే అపరిపూర్ణత, దీనివల్లా, మానవ సహజమైన అపరిపూర్ణత వల్లా కలిగే ఆరాటాలు, వ్యక్తిత్వానికీ సమిష్టితత్వానికీ మధ్య ఉన్న అగాథం – వీటిని కథా వస్తువులుగా తీసుకుని జీవితాన్ని ప్రతిఫలించే సాహిత్యం విలువైన సాహిత్యం అవుతుందని బాలగోపాల్ అభిప్రాయం.
తెలుగునాట నక్సలైట్ల హింసాకాండతోనూ, మేధావుల హ్రస్వదృష్టితోనూ విభేదించిన బాలగోపాల్ తన దైన సిద్ధంతాన్నేదైనా ప్రతిపాదించారా అని చూస్తే, లేదనిపిస్తుంది. వ్యక్తం చేసిన అభిప్రాయాలమేరకు, అస్తిత్వవాదంతోనూ, పర్యావరణవాదంతోనూ కొంత సంతృప్తిపడినట్లు తెలుస్తుంది. “చైతన్య యుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్లయియే జీవితంలో ఖాళీలు ఉండవు” అని బాలగోపాల్ భావించడం “Man is condemned to be free” అన్న సార్త్ర్ ప్రత్యయాన్ని ప్రతిబింబిస్తుంది. బాధ్యతాయుతంగా బ్రతకటం, సాటి మనుషుల హక్కులను గౌరవించటం అస్తిత్వవాదంలో ముఖ్య సూత్రాలు. అలా బ్రతకటం సులభం కాదు. అస్తిత్వవాదులను ఆందోళనా, ఒంటరితనం వెంటాడుతూంటాయి. అందువల్ల అస్తిత్వవాదం ఖాళీలను పూరిస్తుందనటంకూడా పూర్తిగా వాస్తవం కాదేమో. భోజ్య సంస్కృతిని కొంతమేరకు పర్యావరణవాదం ప్రతిఘటిస్తుందని భావించారు బాలగోపాల్. సమాజం పట్ల వ్యక్తి బాధ్యతను పెంచే పర్యావరణవాదం బాలగోపాల్ అవసరం అని చెప్తున్న సమిష్టితత్వాన్ని పెంచుతుంది కాబట్టి హర్షణీయం.
మార్క్సిజంమీద బాలగోపాల్ అభిప్రాయాల్లో మార్పు 1987-1990 కాలంలో వచ్చింది. అది సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవుతున్న సమయం. చైనా పేరుకు కమ్యూనిస్ట్ దేశం అని చెప్పుకుంటున్నా పెట్టుబడిదారీ వ్యవస్థవైపు మారుతున్న సమయం. ఆ చారిత్రక దశలో చాలా మంది మార్క్సిస్టులు నిరాశపడ్డారు. పెట్టుబడిదారీ వ్యవస్థ మార్చటం అసంభవం అనుకున్నారు (టెర్రీ ఈగిల్టన్, 2011). బాలగోపాల్ గారి అభిప్రాయాల్లో మార్పు రావటానికి ఈ నిరాశ ఎంతవరకు కారణమో చెప్పటం కష్టం.
జీవితాల్లో ఖాళీలు ఉంటాయన్నది కొత్త విషయం కాదు.”Religion is the sigh of the oppressed creature, the heart of a heartless world, just as it is the spirit of a spiritless situation. It is the opium of the people,” అని నిరాశా నిస్పృహలతో కూడిన జీవితాలకు మతం ఉపశమనం కల్పిస్తున్న విషయం మార్క్స్ గుర్తించారు. కాని అది ఉత్తిత్తి ఉపశమనమేనని, నిజమైన ఉపశమనం ఉత్పత్తి విధానాన్ని అర్థం చేసుకోవటంలో ఉంటుందనీ అన్నారు. కానీ మానవ జీవితంలోని ఖాళీలు ఆర్థిక దోపిడి అంతం కావటంతో ముగిసిపోవనీ, సమసమాజం వైపు చేసే ప్రయాణంలో మానవ ప్రవృత్తిలో మార్పు రావాలనీ, మనిషికి సమాజంతో మమేకమయ్యే సంస్కృతి అలవడాలనీ బాలగోపాల్ భావించారు. ఈ ప్రయాణంలో సృజనాత్మక సాహిత్యం సహకరించగలదని ఆశాభావం వ్యక్తపరిచారు.
————————————————————————–
ఈ సమీక్ష రాయటంలో ఉపయోగపడిన పుస్తకాలూ, వెబ్ సైట్లూ:
1. రూపం-సారం. సాహిత్యంపై బాలగోపాల్. హైదరాబాద్ బుక్ ట్రస్ట్. 2011.
2. చీకటి కోణాలు. కె.బాలగోపాల్. మూడు దశాబ్దాల నక్సల్బరీ గమ్యం గమనం’ పుస్తకంలో వచ్చిన వ్యాసం, 1998.
3. Marxs and Engels. Basic Writings on Poltics and Philosophy. Ed. L. S. Feuer. Anchor Books. 1959.
4. Twentieth-Century Marxism. Eds. Daryl Glaser and David M. Walker. Routledge. 2007.
5. Marxism and Literature. Raymond Williams. Oxford University Press. 1977.
6. Why Marx Was Right. Terry Eagleton. Yale University Press. 2011.
7. Introduction to Socialism. Leo Huberman and Paul M. Sweezy. Modern Reader Paperbacks. 1968.
8. Formalism and Marxism. Tony Bennett. Methuen & Company. 1979.
9. https://www.marxists.org
10. http://www.nimbinaustralia.com
11. http://www.cla.purdue.edu/english/theory/marxism/modules/althusseride
12. http://www.workerscontrol.net
Raghavendra
రంగనాయకమ్మ గారు మనకున్న మేటి మేధావుల్లో ఒకరు.వారి అభిప్రాయాల్తో అంగీకరించినా, అంగీకరించకఫోయినా వారి మాటను పరిగణనలోకి తీసుకోవలసిందే. సమీక్షకుల హ్రస్వ ద్రుష్త్ట్టిని తిరుపాలు గారు సమర్ధవంతంగా పట్టేసారు.
Raghavendra
తిరుపాలు గారి బాధ నాకర్థమైంది.
Manjari Lakshmi
“తిరుపాలు గారి బాధ నాకర్థమైంది.” అంటే ఆయన రంగనాయకమ్మ గారి వ్యాసాన్ని పరిగణలోకి తీసుకోలేదని బాధ పడుతున్నారనా మీ ఉద్దేశ్యం? లేదా ఇంకేదైనా?
Thirupalu
//“మంచి చెడ్డలు చైతన్యాన్ని బట్టి ఉంటాయిగాని, వర్గాన్ని బట్టి ఉండవన్న ఆలోచన చాలా మంది కథా రచయితలకు ఇంకా రాలేద // నేది మౌలికంగా తత్వ శాస్త్రానికి సంబందించిన ప్రశ్న. విశ్వం ఉన్నది గనుక దాన్ని మన చైతన్యం ద్వార అర్ధం చేసుకుంటున్నామా లేక మనకు చైతన్యం ఉన్నది గనుక లేని విశ్వాన్ని అర్ధం చేసుకొంటున్నామా? అన్న ప్రశ్న వచ్చినపుడు భౌతిక వాధులైన వారు మొదటి దాన్నే ఎంచుకుంటారు. భావ వాదులు చైతన్యాన్నే ఎంచుకుంటారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ‘ అవసరం సృజనకు తల్లివంటిది ‘ ఈ అవసరమే మనిషికి చైతన్యాన్ని ఇస్తుంది. ఆ చైతాన్యమే ఆ అవసరం తీర్చుకో గల మార్గాన్ని చూపుతుంది. సమాజం లో ఉన్న వర్గాన్ని చైతన్యం గల మనిషే అర్ధం చేసుకో గలడు. ఎందుకంటే అతనికి చైతన్యం అతను సమాజంలో ఎదిగే క్రమంలో ఏర్పడినది.( అదైనా అందరికి కాదులెండి) అంటే అవసరం ఇచ్చింది. చైతన్యం లేని వారికి కూడా అవసరాలున్నాయి కాని అతని ఎదుగుదలకు కావలసిన చైతన్యం అందే క్రమంలో అతను లేడు. అతని అవసరాలు ఇంకా పెరగాల్సి ఉంది. పెరినపుడు అని వార్యంగా ఆ చైతన్యాన్ని అందుకోగలడు.
బాల గోపాల్ గారు మర్క్సిజానికి కొన్ని పరిమితులున్నాయని చెప్పరే గాని, ఆ పరిమితులేంటో ఆయన పూరించలేదు. పూరించలేక పోగా కొత్త సిద్ధాంతాని కూడా ప్రతి పాదించలేదు. అంత వరకు ఆయన్ మర్క్సిజాన్ని అధిగ మించనట్లె భావించాలి. ఇదే విషయమై రంగ నాయకమ్మ గారు ఆయన ఎత్తి చూపిన లోపాలమీద ‘్కొండను తవ్వి ఒక ఎలకనైనా పట్ట నట్ళు ‘ అనే ప్రతి విమర్శ చేశారు దానికి ఆయన జవాబిచ్చినట్లు కనపడలేదు. ఇలాంటి విషయాలేవి మీ సమీక్షలో తీసుకోలేదు గనక ఇది అసమగ్ర మైనదే నని భావించాల్సి ఉంటుంది.
ఆయన్నెవరు పుట్టుకతో మార్క్సిష్టు అని చెప్పటం లేదు. ఆయన పెరి గే క్రమంలోనే ఆ భావాలు అబ్బి ఉంటాయి. స్కూల్ రోజుల్లోనే మార్క్సిష్టు కాక పోయినందు వల్ల ఆయన మెదావిత్వానికి వచ్చిన నష్టమేమి లేదు.
ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి బాలగోపాల్ ని అంచనా వేయడంలో ఆయనంత మేధావిననో లేక ఆయన్ని విమర్శించేంత గొప్ప వాన్ననొ ఈ వ్యాఖ్య రాయటం లేదు. ఇక్కడ సమిక్షా విషయం సమగ్రమైనది కాదని ఈ సమీక్షలకు కూడా వాల్లే చెప్పుకున్నట్లు సిద్ధంత అవగాహన లేదని నాకనిపించింది గనుక దాన్ని ఖండించాలని అనుకోని ఈ వ్యాఖ్య…..!
ari sitaramayya
మీ వ్యాఖ్యకు ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమాపణలు. మా చర్చా సమీక్ష సమగ్రంగా లేనందుకు చింతిస్తూ, ఆ విషయం మా దృష్టికి తీసుకువచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాలగోపాల్ గారి అభిప్రాయాల మీద జరిగిన చర్చను సమగ్రంగా ఆకళింపు చేసుకున్న మీరు అభినందనీయులు.
Manjari Lakshmi
“లెనిన్, మార్క్స్ కార్మిక వర్గం వారు కాదు.”
శ్రామిక వర్గం అనే దాంట్లో ప్రధానంగా రొండు విభాగాలు ఉంటాయి. మేధా శ్రమలు చేసే వారు, శారీరక శ్రమలు చేసే వారు. ఇందులో కూడా ఒక పెట్టుబడిదారుని క్రింద పని చేసే వారిగా ఉండే వాళ్లూ తామే స్వతంత్రంగా(స్వంత ఉత్పత్తిసాధనాలు కలిగి శారీరక శ్రమలు చేసేవాళ్ళుగా గానీ – డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, రచనలు చేసే వాళ్ళుగా ఉండే స్వతంత్ర మేధా శ్రామికులుగా గానీ ) పని చేసే శ్రామికులు అనే రొండు రకాలుగా ఉంటారు. కార్ల్ మార్క్స్, లెనిన్ స్వతంత్ర మేధా శ్రామికులు. కార్ల్ మార్క్స్ వ్యాసాలు రాయటం, ఉపన్యాసాలు ఇవ్వటం ఒక పత్రిక సంపాదకుడిగా(ఒక పెట్టుబడి దారుడి క్రింద?) పని చెయ్యటం చేసినట్లుగా నేను చదివాను. అలాగే లెనిన్ లాయరు చదువు చదివి స్వంతంగా లాయరు ప్రాక్టీస్ చేసాడు. లెనిన్ తండ్రి కూడా స్కూల్స్ మీద డైరెక్టర్ గా పని చేశాడని ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి కూడా అతను మేధా శ్రామికుల కుటుంబాన్నించి వచ్చినవాడే. అయితే శారీరక శ్రమలు చేసే వాళ్ళ కన్నా ఈ మేధా శ్రామికులకే వర్గ చైతన్యం/ సిధ్ద్ధాంతాలు నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉండటమనేది సహజమే కదా. అసలు పని చెయ్యని వాళ్ళు కూడా ఏ వర్గం అని తెలుసుకోవాలంటే వాళ్ళు ఎవరి మీద బతుకుతున్నారో ఆ వర్గానికే చెందుతారనీ, పెట్టుబడి దారుడి భార్య పెట్టుబడి దారీ వర్గానికే చెందుతుందనీ, నిరుద్యోగి తనింట్లో శ్రమ చేసే వాళ్ళ మీద బతుకుతుంటే అతను కూడా శ్రామిక వర్గం క్రిందకే వస్తాడని రంగనాయకమ్మ గారి పెట్టుబడి పరిచయం లో రాయబడి ఉంది. ఆ పుస్తకం చదివితే వర్గాల గురించి వర్గ విభాగాల గురించీ బాగా తెలుసుకొనే అవకాశం ఉంది.
ari sitaramayya
మీరన్నది నిజమే. నేను కార్మిక వర్గం వారు కాదు అన్నది శ్రామిక వర్గం వారు కాదు అన్న అర్థం లో.
ముఖ్యం గా నాకు అర్థం అయింది – శ్రామిక వర్గం వారి కష్టనష్టాలను అర్థం చేసుకోవటానికి, వారి వైపు పోరాడటానికీ ఆ వర్గం వారే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. చైతన్య వంతుడైన ఏ వ్యక్తి అయినా ఆ పని చెయ్య వచ్చు. ఎంగెల్స్ విషయం తీసుకోండి. ఆయన పెట్టుబడిదారుడు. మిల్ నడిపినవాడు. కానీ మార్క్స్ తోనూ ఆయన ప్రతిపాదించిన శ్రామిక వర్గానికి అనుకూలమైన సిద్ధాంతాలతోనూ ఏకీభవించాడు. తన వర్గ ప్రయోజనాల వరకే ఆయన చైతన్యం పరిమితం కాలేదు. అది అందరి విషయంలో నిజం కాదు. అలాగే శ్రామిక వర్గం వారందరికీ వర్గ చైతన్యం ఉండాల్సిన అవసరం లేదు. క్లుప్తంగా బాలగోపాల్ గారి వ్యాసం ద్వారా నాకు అర్థం అయింది ఇదీ.
కామేశ్వరరావు
బాలగోపాల్ తన రచనల్లో సూటిగా స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలనూ, చేసిన విశ్లేషణలనూ, అటు సాంఘికవేత్తలూ ఇటు సాహిత్యవిమర్శకులూ కూడా లోతుగా చర్చించాల్సిన అవసరం చాలా ఉంది.
>>బాలగోపాల్ తన దైన సిద్ధంతాన్నేదైనా ప్రతిపాదించారా అని చూస్తే, లేదనిపిస్తుంది. వ్యక్తం చేసిన అభిప్రాయాలమేరకు, అస్తిత్వవాదంతోనూ, పర్యావరణవాదంతోనూ కొంత సంతృప్తిపడినట్లు తెలుస్తుంది.
బాలగోపాల్ అస్తిత్వవాదంతో సంతృప్తిపడినట్టుగా నాకీ పుస్తకంలో ఎక్కడా అనిపించలేదు. “అస్తిత్వవాదం” అంటే, ఇక్కడ “అస్తిత్వవాద ఉద్యమాలు”గా పిలవబడుతున్న స్త్రీ, దళిత, ముస్లిం వాదాలా? అతనీ ఉద్యమాల ఆవశ్యకతను కచ్చితంగా అంగీకరించారు కాని వీటిని అస్తిత్వవాద ఉద్యమాలనడం అతనికి పెద్దగా యిష్టం లేదన్నది స్పష్టం.
అసలు బాలగోపాల్ తనదైన సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించారా అని చూడ్డమే సమంజసం కాదు, నా ఉద్దేశంలో. ఆధునికానంతర వాదం ప్రధాన ప్రయోజనం “నిరంతర జ్ఞాన సిద్ధాంత ఆత్మవిమర్శనా దృక్పథం” అనీ, ఆ దృక్పథం అందరికీ అన్ని ఉద్యమాలకూ చాలా అవసరమనీ చెప్పారతను. చాలా వరకూ అతని ఆలోచనాధోరణి కూడా నాకు అదే అనిపించింది. అయితే దాని పరిమితులు కూడా ఆయన స్పష్టంగానే గుర్తించారు. కాబట్టి తాను ఒక ప్రత్యామ్నాయ జ్ఞానసిద్ధాంతాన్ని తయారు చేసే దిశగా కాక, తనకంటూ ఒక నిర్దిష్టమైన తాత్త్విక దృక్పథం పైనా, ఆచరణాత్మకమైన ఉద్యమం పైననే ఎక్కువ దృష్టి పెట్టేరని అనిపిస్తుంది. బాలగోపాల్‌కి తనకంటూ ఉన్న ప్రత్యేక తాత్త్విక దృక్పథం ఆయనన్న యీ మాటల్లో నాకు కనిపించింది:
“ఈ ప్రపంచాన్ని భోజ్య వస్తువుగా కాక తనలో భాగంగా, తనను ప్రపంచంలో భాగంగా చూసే మమైక్యతా సంస్కృతి కూడా మనిషికి స్వాభావికంగానే సంతృప్తినిస్తుంది. దీనిని మానవజీవితంలో ప్రధాన విషయం చేయడం సాధ్యమైతేనే కమ్యూనిజం సాధ్యం అవుతుంది.”
అయితే ఆ “మమైక్యతను” మానవజీవితంలో ప్రధాన విషయం ఎలా చేయగలం అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం అతనిదగ్గర లేదు. సాహిత్యం దానికి కొంత దోహదం చేయగలదని అతను భావించారు.
>>అందువల్ల అస్తిత్వవాదం ఖాళీలను పూరిస్తుందనటంకూడా పూర్తిగా వాస్తవం కాదేమో.
అస్తిత్వవాదం ఖాళీలను పూరిస్తుందని బాలగోపాల్ ఎక్కడా చెప్పినట్టు నాకు కనిపించలేదు.
>>మంచి చెడ్డలు చైతన్యాన్ని బట్టి ఉంటాయిగాని, వర్గాన్ని బట్టి ఉండవన్న ఆలోచన చాలా మంది కథా రచయితలకు ఇంకా రాలేదు.
“తన పరిసరాలతో – అందులో భాగంగా ఇతర మనుషులతోనూ – ఏ విధంగా వ్యవహరించాలన్న నిర్ణయాన్ని నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు మనిషి చైతన్యయుతంగానే తీసుకోవాలి. ఇది మనిషి అస్తిత్వ నైజంలోని ప్రధాన అంశం. ప్రతీ మనిషీ తనలో పుట్టిన స్వంత చైతన్యంతోనే నిర్ణయాలు తీసుకుంటారని కాదు. ఆ చైతన్యం అప్పటికే ఒక సామాజిక ఆలోచనారీతి చేత ప్రభావితమై ఉంటుంది. అయినప్పటికీ నిర్ణయం చైతన్యయుతమైనది”.
మనిషి వ్యక్తిగత చైతన్యానికీ సామాజిక చైతన్యానికీ మధ్యనుండే సున్నితమైన లంకె గురించి బాలగోపాల్ చెప్పిన మాటలివి. వీటిని జాగ్రత్తగా ఆలోచిస్తే, మంచి చెడ్డలు కేవలం వ్యక్తిగత చైతన్యంలోని అంశాలు కావనీ, వాటికి వర్గచైతన్యంతో బలమైన సంబంధం ఉంటుందని గ్రహించవచ్చు. కాబట్టి “మంచి చెడ్డలు వర్గాన్ని బట్టి ఉండవన్న ఆలోచన చాలామంది కథా రచయితలకు రాలే”దన్న ఆరోపణ సరికాదు.
మంచి సాహిత్యం, ముఖ్యంగా కథా నవలా. ఎలా పుడుతుందన్న విషయంపై బాలగోపాల్ చాలా స్పష్టంగా యీ పుస్తకంలో చెప్పారు:
“సాహిత్యానికి, ముఖ్యంగా కథానవలా సాహిత్యానికి వస్తువు వర్గాల మధ్య సంబంధాలు కాదు, వ్యక్తుల మధ్య సంబంధాలు. ఆ వ్యక్తులు కూలివాళ్ళో, రైతులో, పెట్టుబడిదార్లో అయి ఉంటారు. బ్రాహ్మణులో, మాలవాళ్ళొ అయి ఉంటారు. స్త్రీలో పురుషులో అయి ఉంటారు. ఆ మేరకు సామాజిక విశ్లేషణ దానికి నేపథ్యం అవుతుంది. కాని నేపథ్యం మాత్రమే అవుతుంది. నేపథ్యంలొ పుట్టి, ఆ చట్రంలో ఎదిగిన వ్యక్తుల వైయక్తిక ప్రత్యేకతలతో ప్రతిఫలించే సామాజిక సంఘర్షణ సాహిత్యానికి సమీప వస్తువు. దాని ద్వారానే సమాజం సాహిత్య వస్తువవుతుంది. సమాజం నేరుగా సాహిత్య వస్తువు అయినప్పుడు ఆ సాహిత్యం అంత సంతృప్తికరంగా ఉండదు.”
దీని అర్థం “మంచి చెడ్డలు వర్గాన్ని బట్టి కాక వ్యక్తి చైతన్యం బట్టి ఉంటాయి” అన్నది కానే కాదు!
ari sitaramayya
కామేశ్వరరావు గారూ,
మీ స్పందనకు కృతజ్ఞతలు. “బాలగోపాల్ తన రచనల్లో సూటిగా స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలనూ, చేసిన విశ్లేషణలనూ, అటు సాంఘికవేత్తలూ ఇటు సాహిత్యవిమర్శకులూ కూడా లోతుగా చర్చించాల్సిన అవసరం చాలా ఉంది.” అవును. వారి ఆలోచనలు తెలుగు సాహిత్య ప్రియులందరికీ చేరాలని మా సభ్యుల ఆకాంక్ష.
“బాలగోపాల్ అస్తిత్వవాదంతో సంతృప్తిపడినట్టుగా నాకీ పుస్తకంలో ఎక్కడా అనిపించలేదు.
“అస్తిత్వవాదం” అంటే, ఇక్కడ “అస్తిత్వవాద ఉద్యమాలు”గా పిలవబడుతున్న స్త్రీ, దళిత, ముస్లిం వాదాలా? అతనీ ఉద్యమాల ఆవశ్యకతను కచ్చితంగా అంగీకరించారు కాని వీటిని అస్తిత్వవాద ఉద్యమాలనడం అతనికి పెద్దగా యిష్టం లేదన్నది స్పష్టం.” అన్నారు మీరు. తెలుగునాట అస్తిత్వ ఉద్యమాలు అన్న పేరుతో నడుస్తున్న ఉద్యమాలను అస్తిత్వ ఉద్యమాలుగా బాలగోపాల్ గారు గుర్తించలేదు, నాకు తెలిసినంతవరకు. “చైతన్య యుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్లయియే జీవితంలో ఖాళీలు ఉండవు” అని బాలగోపాల్ భావించడం “Man is condemned to be free” అన్న సార్త్ర్ ప్రత్యయాన్ని (ఆయన ప్రచారం చేసిన అస్తిత్వ వాదాన్ని) ప్రతిబింబిస్తుంది. ఇదీ మా అభిప్రాయం.
ఇక వర్గ చైతన్యం-వ్యక్తి చైతన్యం గురించి “….దీని అర్థం “మంచి చెడ్డలు వర్గాన్ని బట్టి కాక వ్యక్తి చైతన్యం బట్టి ఉంటాయి” అన్నది కానే కాదు! అని రాశారు మీరు. “సమసమాజ ధ్యేయం మనుషులు చైతన్యవంతంగా ఎంచుకునే రాజకీయ లక్ష్యమే తప్ప అణచివేత నుంచి అనివార్యంగా పుట్టే కాంక్ష కాదు…. ధనికులకంటే పేదవాళ్ళలో, అగ్రకులాలకంటే దళితులలో, పురుషులకంటే స్త్రీలలో, ఈ చైతన్యాన్ని సాధించటం కొంత సులభం కావచ్చునని నమ్మటం అసంబద్ధంకాదు. కాని దీనిలో అనివార్యత ఏమీ లేదు. చివరికి మనుషులు సమసమాజాన్ని కాంక్షించబోయేది కార్మికులుగా, ఆదివాసులుగా, స్త్రీలుగా, దళితులుగా కాదు, చైతన్యవంతులయిన వ్యక్తులుగా,” అంటారు బాలగోపాల్. ఇవి బాల గోపాల్ గారి మాటలు.
వ్యక్తిగత చైతన్యం సమాజంతో సంబంధం లేకుండా ఉండదు. కానీ వర్గ ప్రయోజనాలకు పూర్తిగా పరిమితమై కూడా ఉండదు. లెనిన్, మార్క్స్ కార్మిక వర్గం వారు కాదు.
ari sitaramayya
ఈ సమీక్ష చదివి స్పందించిన మిత్రులకు కృతజ్ఞతలు.
మోహన్ గారు, మీ కాలేజీ రోజుల గురించి రాసినందుకు చాలా సంతోషం. బాలగోపాల్ గారి అభిప్రాయాల్లో కాలక్రమంలో మార్పులు వచ్చాయి. కాని ఒక్క విషయంలో మాత్రం రాలేదు. సిద్దాంతం ఏదైనా అది మనిషి మనుగడకు మంచి చేస్తుందా లేదా అనే ఆలోచించారు. మంత్రాలకూ మోసాలకూ దోపిడికీ తావులేని పరిపూర్ణమైన జీవితం సాధ్యమా, ఎలా సాధ్యం అవుతుందీ అని ఆలోచించారు. అంత మంచి మనిషి తెలుగువారు కావటమే గర్వకారణం అనిపిస్తుంది నాకు.
మంజరి లక్ష్మి గారూ, మీరన్నది నిజమే. ఇంకొంచెం వివరంగా సరళంగా రాస్తే బాగుండేదేమో. వీలయినంత వరకూ బాలగోపాల్ గారి మాటల్లోనే సమీక్ష రాయాలనే ప్రయత్నం చేశాను. ఆయన చాలా మిత భాషి లాగున్నారు. రాయటం కూడా చాలా క్లుప్తంగా చిక్కగా రాశారు.
మీరు చైతన్యం గురించీ, మనుషుల స్వభావాలలో మార్పులు రావటం గురించీ రాశారు. మానవ స్వభావం గురించి బాలగోపాల్ గారి అభిప్రాయాలు “చరిత్ర, మనిషిం మార్క్సిజం” అన్న వ్యాసంలో ఉన్నాయి. “సమాజ వాదం నుంచి కమ్యూనిజం లోకి వెళ్ళే దారిలో పునాది మార్పులతో పాటు భావలలో మార్పు రావటం కూడా జరిగే క్రమం ఉంటుందని విన్నాను” అని మీరు అన్నారు. ఇది మార్క్సిస్ట్ దృక్పథమే (నాకు తెలిసినంతవరకు). కాని రష్యాలో అలాంటి మార్పు వచ్చినట్లు లేదు. ఉత్పత్తి వ్యవస్థకు అతీతంగా మానవ స్వభావంలో కొన్ని అంశాలు ఉంటాయని బాలగోపాల్ గారి అభిప్రాయం.
ఇక చైతన్యం గురించి – సమాజ వాద వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా, సమిష్టితత్వం మనిషిలో ఇంకితేనే కాని అసంతృప్తీ అపరిపూర్ణతా తొలగిపోవు అని బాలగోపాల్ గారు అభిప్రాయపడినట్లు మాకు తోచింది. ఇది స్వలాభాన్ని పెంపొందించే చైతన్యానికి అతీతమైన సామాజిక వ్యక్తి చైతన్యం. “మరణానంతర ఊహ” వ్యాసంలో దీని గురించిన వివరాలు కొన్ని ఉన్నాయి.
మీ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేక పోయానేమో. వివరంగా మాట్లాడాలనిపిస్తే ari.sitaramayya@gmail కి మెయిల్ పంపించండి. థాంక్స్.
mohan c v r
మార్క్సిజంమీద బాలగోపాల్ అభిప్రాయాల్లో మార్పు 1987-1990 కాలంలో వచ్చింది—-
బాల గోపాల్ చిన్న నాటి స్నేహితుడిగా (స్కూల్ సహచరుడిగా)
చిన్న నాటి బాల గోపాల్ లో మార్క్సిస్ట్ అభిమానం రవ్వంతైనా ఉండేది కాదని,
మార్క్సిస్ట్ మరియూ రష్యా వ్యతిరేక భావాలే మెండుగా ఉండేవని తెలియ చేస్తున్నాను.
అయన్ రాండ్ పుస్తకాలను వడ పోసి మమ్మలిని చదివేలా చేసింది తనే!!
అత్యంత తెలివి గల తన స్కూల్ జీవితం మా అందరి లాగే అమెరికా కలలతోనే ముగిసింది.
ఆ తరువాత నేను బాల గోపాల్ ని కలవ లేదు. తన గురించిన వార్తలు చదువుతూ,
నా సీనియర్ కర్నల్ ఎ ఎస్ కండల్ల (బాల గోపాల్ అన్నయ్య) గారి మాటల ద్వారా
డి డి కౌశంభీ గారి రచనల ప్రభావం, కావలి,వరంగల్ కళాశాల లో చదువుతున్నప్పుడు తను
మార్క్స్ పై అవగాహన పొందడమే కాకుండా విశేషమైన విశ్లేషకుడిగా రూపాంతరం చెందినట్ట్లు తెలిసింది
జీవితం లో మార్పు సహజం, సార్వజనీనం,సార్వకాలీనం కూడా!
pavan santhosh surampudi
రచయితలు, ఉద్యమకారుల జీవితాల గురించిన సరైన సమాచారం ప్రామాణికమైన జీవిత చరిత్రలు మన కాలాన్ని ముందు తరాల వారు అర్థం చేసుకోవడానికైనా చాలా అవసరం.(అసలు మనం అర్థం చేసుకోవడానికి కూడా పనికి వస్తాయి). అటువంటి ప్రామాణిక చరిత్రలకు మీవంటి సన్నిహితులైన వారి అనక్డోట్స్, అనుభవాలు పనికివస్తాయి. బాలగోపాల్ చిన్నతనంలో ఇలా వుండేవారని మీరు చెప్తేనే అర్థమవుతుంది. మీరు ఏదైనా మేగజైన్లోనో, వెబ్జైన్లోనో సంబంధిత వివరాలపై వ్యాసం వ్రాస్తే బావుంటుందని నా సూచన.
nagamurali
మంచి సమీక్ష. ఇందులోని అంశాలతో పరిచయం లేని పాఠకులకి కూడా అర్థమయ్యే విధంగా పరిచయ వ్యాసాల్ని కూడా పొందుపరచడం వల్ల వ్యాసం చాలా ఉపయోగకరంగా ఉంది. కృతజ్ఞతలు.
Manjari Lakshmi
“మంచి చెడ్డలు చైతన్యాన్ని బట్టి ఉంటాయిగాని, వర్గాన్ని బట్టి ఉండవన్న ఆలోచన చాలా మంది కథా రచయితలకు ఇంకా రాలేదు”. – పెట్టుబడి దారుడు – కార్మికుడు ఉన్నారనుకోండి. పెట్టుబడి దారుడు తన దోపిడీని కాపాడుకొనే ప్రయత్నమే చేస్తాడు కదా దానికి చైతన్యం కూడా తోడైతే అది ఎన్ని విధాలుగా చెయ్యచ్చో పరిశోధించి మీరు చెప్పిన భావ, కళా ప్రచారాల ద్వారా కూడా చేస్తాడు. అది కార్మిక వర్గానికి చెడు పెట్టుబడిదారీ వర్గానికి మంచిని కలగ చేస్తుంది కదా! అదే కార్మికుడు చైతన్యం లేకపోయినా తను పెట్టుబడి దారుడు పెట్టె బాధల్ని ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు కదా. అదే అతనికి వర్గ చైతన్యం కూడా ఉంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా ప్రయత్నిస్తాడు. అప్పుడు అది పెట్టుబడి దారీ వర్గానికి చెడు, కార్మిక వర్గానికి మంచి అవుతుంది కదా. నా ప్రకారం వర్గాలుగా ఉన్న సమాజంలో ఎవరి వర్గ చైతన్యం వాళ్ళకు పెరగడం/ పెరగక పోవటం, దాని వల్ల వారికి కలిగే మంచి /చెడు అనేవి ఉంటాయి కానీ అందరికీ కలిసిన (వర్గాలేలేని) మంచి, చెడు కూడా కలిగే చైతన్యం ఎలా ఉంటుందీ?
Manjari Lakshmi
“ఉత్పత్తి విధానం అంటే ఉత్పత్తికి అవసరం అయ్యే ఉత్పత్తి శక్తులూ, (ప్రకృతీ, పరికరాలూ, తగిన చోటూ, తదితరాలు) ఉత్పత్తి సంబంధాలూ. ” నేను చదివిన ప్రకారం ఉత్పత్తి శక్తులు అంటే ఉత్పత్తి సాధనాలు(ప్రకృతి సహజమైన భూమి, ఉత్పత్తి పరికరాలు కలిపి అంటారు), ఉత్పత్తి చేసే కార్మికుల్ని కలిపే అంటారు. ఉత్పత్తి, పంపకాల విషయంలో మనుష్యుల మధ్య ఉండే సంబంధాలను ఉత్పత్తి సంబంధాలు అంటారు. ఆ సంబంధాలు బానిస యజమాని – బానిస, భూస్వామి-కౌలు రైతు, పెట్టుబడి దారుడు- కార్మికుడు అలా మారుతూ వచ్చాయి.
Manjari Lakshmi
సోషలిజం అనటానికే మీరు సమాజ వాదం అంటున్నారు కదండీ. కానీ అందరు సామ్య వాదం అంటారు కదా. అయితే సరిగ్గా చూస్తే సమాజ వాదం అనేదే కరెక్టుగా అనిపిస్తోంది. అయితే ఈ సమాజ వాదం నుంచి కమ్యూనిజం లోకి వెళ్ళే దారిలో పునాది మార్పులతో పాటు భావలలో మార్పు రావటం కూడా జరిగే క్రమం ఉంటుందని విన్నాను. ఇదివరకు ఈ బాల గోపాల్ గారి వ్యాసాలు చదివి అంత అర్ధం కాక వదిలేశాను. మీ వ్యాసం కూడా మొత్తం మళ్ళా ఒకటికి రొండు సార్లు చదివితే గానీ అర్ధమయ్యేట్లు లేదు. ఆయనవి ప్రస్తావించేటప్పుడు మీరు ఇంకొంచం సరళమ్ గా చెపితే బాగుండేదేమో అనిపించింది.
Bhanu Prakash
హ్యాట్సాఫ్ టు యూ,నిజానికి ఈ రివ్యూ మీదే ఇంకో రివ్యూ రాయొచ్చు.