విజ్ఞాన్ రత్తయ్య జీవన కెరటాలు

వ్యాసకర్త: వేణు
******
ఆత్మకథ అంటే మితిమీరిన స్వోత్కర్ష, పర నిందలే కదా అనుకునేవారి అంచనాలను తలకిందులు చేసే పుస్తకం ‘పదండి ముందుకు’. 31 వారాలపాటు (అక్టోబరు 30, 2013 నుంచి మే 28, 2014) ‘నవ్య’ వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమైన విజ్ఞాన్ రత్తయ్య జీవన ప్రస్థానమిది.

స్వీయానుభవాలను చెపుతూనే వాటినుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను ఆత్మీయంగా, ఆహ్లాదకరంగా సూచించే విలక్షణ రచన ఇది. పల్లెటూరి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ప్రతికూల పరిస్థితులను ఎదురీది చదువుకున్న క్రమం, ముందుచూపుతో కొత్త వ్యవస్థకు బాటను వేసిన సాహసం… ఆశ్చర్యాన్నికలగజేస్తాయి.

ఆయన స్థాపించిన విద్యాసంస్థ ‘విజ్ఞాన్’- ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే లావు రత్తయ్య పేరు విజ్ఞాన్ రత్తయ్యగా మారిపోయింది. ఇదంతా 32 సంవత్సరాల వయసుకే! లెక్చరర్ ఉద్యోగం ఇవ్వటానికి నిరాకరించిన పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మరో ఇరవై ఏళ్ళ తర్వాత ఆయనను సాదరంగా ఆహ్వానించింది. సెక్రటరీ స్థానంలో కూర్చోబెట్టింది. అపురూపమైన ఈ అనుభవాన్నీ, ఊహించని మలుపులనూ, సాధించిన విజయాలనూ నెమరువేసుకోవటంతో మొదలవుతుంది ఈ రచన.

ఆ రకంగా ఇది ఒక గెలుపు గాథ కూడా! సాధారణ అధ్యాపకునిగా జీవితం ఆరంభించి… విద్యారంగంలో పెనుమార్పులకు కారకుడై… విశ్వవిద్యాలయ చైర్మన్ గా ఎదగడం చిన్నవిషయమేమీ కాదు. ‘వ్యక్తే వ్యవస్థగా మారిన అద్భుతమిది’ అంటారు సినీ గేయ రచయిత భువనచంద్ర తన ముందుమాటలో.

తెలుగునాట మూడున్నర దశాబ్దాల విద్యారంగ పరిణామాలకు ఈ రచన స్థూలంగా అద్దం పడుతుంది.

పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు తమ ఆదాయంలో అత్యధిక భాగం వెచ్చించటం మనకిప్పుడు తెలుసు. కానీ మూడు దశాబ్దాల క్రితం తెలుగునాట ఇలాంటి భావన పాదుకొల్పటానికి కారకులైనవారిలో రత్తయ్య పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. పిల్లలు చదువుకుంటే తమ సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మార్పు వస్తుందని మధ్యతరగతి తల్లిదండ్రులు స్పష్టంగా గుర్తించారు. అందుకే… ‘ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం చరిత్ర నమోదయితే గనక కనీసం ఒక అధ్యాయం నాకు కేటాయించవలసిందేనని నాకో దృఢ నమ్మకం. ఇది గర్వం అని పాఠకులెవరైనా అనుకోవచ్చు. కానీ అది గర్వం కాదు- నేను చేసిన కృషిపై నాకున్న నమ్మకం’ అంటారాయన.

ఏకే 47… చెక్క తుపాకీ
1977 ప్రాంతాల్లో ఎంసెట్ కోచింగ్ కు గుంటూరు ‘రవి కళాశాల’ అధినేత సీవీఎన్ ధన్ (చెన్నావఝల విశ్వనాథన్) కు విపరీతమైన పేరు. రాష్ట్రం నలుమూలల నుంచీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చేవారు. దానికి పోటీగా మరో కేంద్రం స్థాపించాలనే ఆలోచన కూడా దుస్సాహసం అనుకునే పరిస్థితి. అలాంటిది పాతికేళ్ళ వయసులో చేతిలో వెయ్యి రూపాయిలైనా లేని రత్తయ్య ఎంసెట్ కోచింగ్ సెంటర్ మొదలుపెట్టారు! అలా విజ్ఞాన్ సంస్థ పుట్టింది. కాన్సెప్టులు క్షణ్ణంగా చెప్పడం, విద్యార్థుల లెర్నింగ్ లకు పెద్దపీట వేయటం చేశారు. థన్ ను ఏకే 47తో, తనను చెక్క తుపాకీతో పోల్చుకున్న రత్తయ్య తన చెక్క తుపాకీ గురితప్పలేదని చమత్కరిస్తారు. వరుస విజయాలతో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తర్వాతి కాలంలో రవి కళాశాల ప్రాభవం అడుగంటి ధన్ ఒంటరిగా మిగిలిపోయారు. ఆయన అలా డీలాపడిపోవటం చూడలేని రత్తయ్య ఉదాత్తంగా స్పందించిన తీరు ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గది. ముందుగా చెప్పకుండా ఆయనకు ఘన సన్మానం ఏర్పాటు చేసి అమితంగా సంతోషపెట్టారు.

నాగార్జునసాగర్ ఏపీఆర్ జేసీ ప్రేరణతో 1983లో రత్తయ్య తొలి ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలను స్థాపించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలక్కూడా ప్రాధాన్యమిచ్చి విద్యార్థులు ఒత్తిడి బారిన పడకుండా, ఆనందంగా చదువుకుని, మెరుగైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దారు. ఈ పరిణామం రాష్ట్రంలోని విద్యావ్యవస్థ తీరుతెన్నులనే మార్చేసింది. అయితే కాలక్రమంలో కార్పొరేట్ కళాశాలల్లో విద్య ఇరుకిరుకు భవనాల్లో సాగుతూ, ర్యాంకుల కోసం రుబ్బుడు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ వ్యవస్థకు ఆద్యుడిగా రత్తయ్యకు ఈ దుష్పరిణామాలపై ఆవేదన ఉంది. విజ్ఞాన్ సంస్థను ప్రస్తుత కార్పొరేట్ కాలేజీల గాటన కట్టేసేవారి అపోహలను తొలగించటానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది.

16 సంవత్సరాలపాటు నడిపిన ‘సుప్రభాతం’ పత్రిక గురించీ, రాజకీయ రంగ ప్రవేశం గురించీ చాలా విశేషాలున్నాయి.

అంతరంగ ఆవిష్కరణ
‘బస్టాండుకో, రైల్వేస్టేషనుకో వెళితే మామూలుగానే ఉంటాను. అదే విమానాశ్రయానికి వెళితే మాత్రం నాకెందుకో తెలియని బెరుకు ఆవహిస్తుంది. చాలా పెద్ద స్థాయి సమావేశాలకు వెళ్ళినపుడు కూడా అదే పరిస్థితి. వయసులో ఇంత పెద్దవాడినైనా, ఇంగ్లిష్ బాగా వచ్చినా, చేతిలో డబ్బున్నా కూడా అలాంటి చోట్లకు వెళ్ళినపుడు నాలోపలి పల్లెటూరి మనిషికి ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది’- ఈ రకంగా తన అంతరంగాన్ని భేషజాలేమీ లేకుండా ఆవిష్కరించుకోవటం ముచ్చటేస్తుంది.

అన్యాయాలు చేయకుండా, ఇతరులకు ఉపయోగపడే పనిచేస్తూనే మనం కూడా ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు అని చెప్పడానికి తన జీవితం వంద శాతం కాకున్నా చాలావరకు ఉదాహరణగా నిలబడుతుందంటారు. ఆత్మకథ రాయడానికి తనకు అర్హత ఉందా అని బేరీజు వేసుకుని, రాయటం ఎందుకు సమంజసమనుకుంటున్నానో స్పష్టం చేశారు. తన విజయానికి తానొక్కడినే సూత్రధారిని కాననే ఎరుక ప్రదర్శించారు. వివిధ దశల్లో తనకు సహాయం చేసినవారినీ, తోడుగా నిలిచినవారినీ కృతజ్ఞతతో తల్చుకున్నారు.

పుస్తకంలోని విషయాలను డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి ‘మూల్యాంకనం’ చేశారు. ‘మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాలకు విద్యను చేరువ జేసి సగౌరవంగా, సగర్వంగా బ్రతకడానికి ప్రేరకులయ్యారు’ అని రత్తయ్య కృషిని ప్రశంసించారు.

ఈ జీవన కెరటాలను అరుణ పప్పు అక్షరబద్ధం చేశారు. రత్తయ్య జీవన ప్రస్థానంతో సంబంధమున్న వివిధ వ్యక్తులను కలిసి మాట్లాడి ఆమె రచనా సమగ్రత కోసం ప్రయత్నించటం అభినందనీయం. సరళమైన భాషతో కథనం సాఫీగా, ఆసక్తికరంగా సాగింది.

పుస్తకంలోని కొన్ని మెరుపులు
* అయిందానికీ కానిదానికీ బెంబేలెత్తిపోయే బలహీనమైన మనస్సును జయించడమే విజయానికి మొదటి మెట్టు.
* దినపత్రికలూ, వివిధ పుస్తకాలూ చదివే అలవాటున్న ఏ విద్యార్థి అయినా జీవితంలో బోల్తా కొట్టేసే ప్రమాదం చాలా తక్కువ.
* పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం కచ్చితంగా మన తప్పే.
* సమస్యలను అనుభవాలుగా, అవకాశాలుగా చూడటమే జీవిత పాఠాలనుంచి నేర్చుకోవాలి.
* మహా సముద్రంలో ఈదాలని భావిస్తున్నపుడు బావిలోనే ఉండిపోకూడదు, అక్కడి విషయాలను పట్టించుకోకూడదు.

——————————————————————

పుస్తకం: పదండి ముందుకు (విజ్ఞాన్ రత్తయ్య జీవన కెరటాలు)
కథనం: అరుణ పప్పు
పేజీలు: 212
వెల: రూ. 200
ప్రచురణ : విజ్ఞాన్ పబ్లిషర్స్ లిమిటెడ్, వడ్లమూడి, గుంటూరు జిల్లా.
ప్రతులకు : అన్ని పుస్తక కేంద్రాలు
ఈ-బుక్ లింకు : http://kinige.com/book/Padandi+Munduku

Padandi Munduku (పదండి ముందుకు)
L. Rattayya, Aruna Pappu
Autobiography
Vignan Publishers Limited, Vadlamudi, Guntur Dist.
2014
212

You Might Also Like

4 Comments

  1. Aruna Pappu

    థాంక్ యు వేణు గారు. థాంక్ యు పుస్తకం టీం.

  2. V MADANMOHAN REDDY

    మా అబ్బాయి విజ్ఞాన్ లోనే చదివాడు. ఆ వాతావరణం నాకు చాలా నచ్చింది. ఆయన
    గొప్ప మనిషే.

  3. Anil battula

    గుడ్ రివ్యూ

  4. Sitha rentala

    ఆత్మకధల కున్న సౌగంధమే వేరు.అది నిజానికున్న ప్రత్యేకత అయిఉంటున్ది . శ్రీ రత్తయ్య గారి లాంటి వారి అనుభవాలు ,అభిప్రాయాలు ఎప్పుడు చదవతగ్గవి,పాటించతగ్గవి .

Leave a Reply