ఏక్ కహానీ కె తీన్ రంగ్: స్కైబాబ
ఒకే కథ, మూడు రంగులంటూ వచ్చిన చిట్టి పుస్తకం ఇది. “సెల్ ఫోన్ కథలు” అని దీనికి ఉపశీర్షిక కూడా ఉంది. ఆసక్తిని రేకెత్తించే బొమ్మ కూడా ఉంటుంది అట్ట మీద.
పుస్తకంలో ముందుమాటలూ, అభిప్రాయాలూ కాకుండా మూడు కథలు ఉన్నాయి: ౧) మిస్ వహీదా ౨) జమీలా ౩) మౌసమీ. అన్ని కథల నేపథ్యమూ ఒకటే. కుటుంబపరంగా, సమాజపరంగా ఎన్నో ఆంక్షలను, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొనే కొందరు ముస్లిమ్ యువతులు, సెల్ ఫోన్ సహాయంతో, ఆ ఆంక్షలను, అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నించారో, ఫోన్‍లో కనిపించని వ్యక్తితో తమ మనసును ఎంతెలా బయటపెట్టుకున్నారో అన్నదే కథాంశం. మరి, ఆ ఫోన్ పరిచయాలు స్నేహాలుగా మారి, ఆపై ఎలాంటి పరిస్థితులకు దారులు తీశాయన్నది చదివి తెల్సుకోవాల్సిందే. ఒక చట్రంలాంటి దాంట్లో ఇరుక్కుపోయిన స్త్రీ, ఎక్కడో దూరాన ఉన్న ఒక పురుషుడు, వాళ్ళిద్దరి మధ్య ఒక ఫోన్ సంబంధం అన్నవి మూడు కథల్లోనూ ఒకటే అయినా, మూడు కథలూ వేరువేరుగా ముగుస్తాయి. వేరువేరు ప్రశ్నలను లేవదీస్తాయి.
మిస్ వహీదా కథలో ఒక స్త్రీ తనకు ఫోన్‍లో పరిచయమైన వ్యక్తితో తన కష్టసుఖాలు, అభిప్రాయాలు చెప్పుకుంటూ ఉంటుంది. తనని పెళ్ళిచేసుకోమని అడుగుతుంటుంది, అతడి అప్పటికే పెళ్ళై ఉందని తెల్సి కూడా. ఉన్నట్టుండి ఆమె నుండి కాల్స్ రావడం ఆగిపోతుంది. ఆమెను గురించి కనుక్కోవడానికని వాళ్ళ ఊరు వెళ్తాడు అతడు. అప్పుడు ఆమె గురించి, ఆమె గురించిన కొన్ని నిజాలను తెల్సుకుంటాడు. అతడితో పాటు పాఠకుడు కూడా నిర్ఘాంతపోయే పరిస్థితి.
జమీలాలో కూడా ఒక స్త్రీ, తనకి నచ్చిన రచయితతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అయితే, ఇద్దరి మధ్యన సంభాషణలను పూర్తిగా ఇవ్వకుండా, కేవలం ఆమె అంటున్న మాటలలోనే కథ చెప్పేటట్టు ఎందుకు ఎన్నుకున్నారో మరి. అవి సెల్‍లో మాటలే అయ్యుండక్కర్లేదు, మెయిల్స్, ఎస్.ఎం.ఎస్ ఏమన్నా అనుకోవచ్చు. సెల్‍ఫోన్ లో అవతలి మనిషి ఎంత మితభాషి అయినా, కనీసం “ఓ”, “ఊ” లాంటివైనా అనాలి కదా? అయితే, వాళ్ళిద్దరి మధ్యన నడుస్తున్నది మాత్రం పాఠకునికి బానే తెలుస్తుంది. మొదటి కథకు విరుద్ధంగా, ఈ కథలో ఆమె అతడి సహాయంతో తనకున్న కష్టాలను తనే తీర్చుకుంటుంది.
ఈ రెండు కథల్లోనూ ఆర్ధికంగా వెనుకబడ్డ ముస్లిమ్ కుటుంబాల్లో ఆడపిల్లలను చదివించకపోవటం, ఎంతో కొంత చదివించినా, ఆమె పెళ్ళి గురించి తొందరపడ్డం, పెళ్ళి విషయంలో ఆమె అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా, ఇష్టమున్నా లేకున్నా బలవంతపు పెళ్ళి చేయడం లాంటివన్నీ కామెన్. అలాంటి పరిస్థితుల్లోండి వాళ్ళిద్దరూ బయటపడ్డానికి ఏ మార్గాలు ఎన్నుకున్నారనేదే రెండు కథల్లోని తేడా.
ఇహ, మూడో కథ మౌసమీ ఆసక్తికరమైన శైలిలో నడుస్తుంది. ఇందులోనూ అమ్మాయి-అబ్బాయి మధ్య పరిచయం, స్నేహం మొబైల్లోనే అయినా, వాళ్ళ బంధంలో అనేక స్టేజీలను ఋతువులతో పోలుస్తూ, ఒక్కో ఋతువులో ఒక్కో సంఘటన చెప్పుకొస్తారు. అయితే, ఇందులో మరొక ట్విస్ట్ ఇచ్చారు. (అది చెప్పేస్తే మొదటి సారి చదివేవాళ్ళకి సర్ప్రైజ్ ఎలిమెంట్ పోతుంది – అందుకని చెప్పటం లేదు.)
ఈ మూడూ కాక, మిస్ వహీదా కథనే మళ్ళీ అచ్చువేశారు. అది పూర్తిగా యాసలో ఉంటుంది. అదే బాగుంటుంది. మొదట ఇచ్చిన కథలో సగం యాస, సగం మామూలు తెలుగులో తికమకగా ఉంటుంది. ఈ కథల్లో వాడిన యాస బాగా కుదిరింది. ఆయా పాత్రల ప్రాంతాన్ని, ఆచారవ్యవహారాలని సూచించే విధంగా ఉంటుంది.
పుస్తకం చివర్లో కొందరి అభిప్రాయాలు జతపరిచారు. అవి ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకరేమో మొదటి కథలో ట్రాజెడి బాలేదంటే, మరొకరు మూడో కథలో “ఫెయిరీ టేల్ ఎండింగ్” నమ్మశక్యంగా లేదని మరొకరు అన్నారు. ముఖ్యంగా, మూడో కథను గురించి అందులోని పాత్ర ఉన్న పరిస్థితుల్లోనే నిజజీవితంలో ఉన్న మనిషి అభిప్రాయం చెప్పటం నాకు నచ్చింది. ఆవిడ రాసినదాంట్లో చాలా నిజాలు ఉన్నాయి. నా మట్టుకు నాకు, అదో విలువైన అభిప్రాయంగా అనిపించింది.
కథలు బాగున్నాయి. కనీసం ఒక్కసారైనా చదవదగ్గవి. ఆపై అవి లేవనెత్తే ప్రశ్నలకు జవాబులు ఆలోచించదగ్గవి.
Fiction
Nasal Kitab Ghar
October 2013
Paperback
40
Leave a Reply