An Unquiet Mind: A Memoir of Moods and Madness

జీవితంలో మనకు ఎదురయ్యే కొందరు ప్రవేశ పరీక్షల్లాంటి వారు. వాళ్ళకంటూ ఓ సిలబస్ ఉంటుంది. అందులో మనకి ప్రావీణ్యత ఉంటేనే, మనం వారికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. పరీక్షలో వచ్చిన మార్కుల బట్టి స్నేహం, సఖ్యత వగైరా. మిగితా ఎన్ని అర్హతలు, ఆస్తులూ ఉన్నా, అవ్వన్నీ అవుట్-ఆఫ్-సిలబసే అన్నమాట. అలాంటి ఒకానొక ప్రవేశ పరీక్షలో నన్ను దారుణంగా దెబ్బకొట్టిన సబ్జెక్ట్ “డిప్రెషన్”. స్టేట్ రాంకులు అటుంచి, కనీసం కటాఫ్ మార్కుల దరిదాపుల్లో కూడా రాలేకపోయాను. “నీకేం తెల్సు డిప్రెషన్ అంటే ఏంటో? వాళ్ళతో ఎలా ఉండాలో?” అన్న నిష్టూరాలనుండి “చేతనైతే స్నేహంగా ఉండు..”లాంటి ఉచిత సలహాలు అందుకున్నాను.

ఎంసెట్ ఎత్తేశాక, ఏ బి.కామ్‍తోనో కామ్‌గా సెటిల్ అయిపోక, ఇంక ఎంసెట్ రాసే అవకాశం లేకున్నా, ఆ సిలబస్ ఎందుకు చదవటమంటే, ఆశ చావక కాదు, అసలు అంత దారుణంగా తప్పానో తెలియక, అర్థంకాక. అందుకే, మానిక్ డిప్రెషన్‌తో బాధపడుతున్న ఒక మానసిక వైద్యురాలు రాసుకున్న ఆత్మకథ ఈ పుస్తకం అని తెలియగానే చదవకుండా ఉండలేకపోయాను. ఓ ఐదారేళ్ళ కిందట వరకూ “డిప్రెషన్” అంటే బంగాళా ఖాతంలో అల్పపీడనం అని మాత్రమే తెల్సు. అక్కడ ఏర్పడేలానే మనుషుల జీవితాల్లోనూ అల్పపీడనాలు ఏర్పడతాయని, అలా పట్టినప్పుడు, ఎంతటి కలవిడిగల మనిషి అయినా ముసురుపట్టేసి మూల కూర్చుంటాడని, ఎంతో ఎమోషనల్ నష్టం జరిగేి విధంగా ఈ అల్పపీడనం తీరాన్ని దాటుతుందని, మానవ సంబంధాల్లో అది సృష్టించే భీభత్సం నుండి తేరుకోవడం దాదాపు అసాధ్యమని, తేరుకున్న ఏ కొందరో దాన్ని మాయలాంటి ప్రేమ మహిమ అంటారని నాకప్పుడు తెలీదు. ఇప్పుడు తెల్సినా, అది పెద్ద లెక్కల్లోకి రాదు. “పుస్తకాల్లో చదివేస్తే డిప్రషన్ గురించి తెలిసిపోతుందనుకుంటున్నావా?” అన్న ప్రశ్న నాకు అప్పుడే వినిపిస్తోంది.

ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కానీ డిప్రషన్‌ను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. డిప్రషన్‌ను అసలు అర్థం చేసుకోవడం దేనికి? అంటే, అది మన చుట్టూ ఉన్న ఎవరిలోనైనా ఉండే అవకాశం ఉంది. దాని గురించి తెల్సుకొని, “చేతనైతే స్నేహంగా” ఉండడానికి ప్రయత్నించడం కోసం. లేదూ, ఎందుకొచ్చిన తలనొప్పి అని పక్కకు తొలిగే అవకాశాలున్న కేసుల్లో, కనీసం జరిగినదానికి వాళ్లనో, మనల్నో దోషులుగా చిత్రించుకోనవసరం లేదని తెలీడం కోసం. ఎందుకంటే, మన జీవితాలకు కరణ్ జోహర్ నిర్దేశకుడు కాడు కాబట్టి, ఒక్క చెంపదెబ్బ కొట్టి, కాస్త గట్టిగా లెక్చరిచ్చి, డిప్రెషన్ ఉన్న పరిణితి చోప్రాను సెకెండ్ హాఫ్‌లో మామూలు హీరోయిన్‌ను చేసేసినట్టు మనకి కుదురదు కాబట్టి.

నన్ను అడిగితే, ఈ పుస్తకాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి: ఆమెకు ఉన్న రోగం మానసికమైంది అయినా లేక శారీరకమైంది అయినా,ఆ  రోగానికి బోలెడన్ని పేరుప్రఖ్యాతలు ఉన్నా, లేకున్నా, దాని వల్ల ఆమెకు, ఆమె చుట్టుపక్కల వాళ్ళకి కలిగే కష్టనష్టాలు తీవ్రమైనవి అయినా, మామూలివి అయినా, వాటిని అన్నింటిని ఒక పెద్ద “X” అనేసుకొన్నా కూడా, ఈ రచన కూడా చాలా ఇన్స్పిరేషనల్. “A teacher is the best student and a doctor is the worst patient” అనే విన్నాను ఇప్పటి వరకూ. ఈవిడ మాత్రం అంత సంక్లిష్టమైన పరిస్థితి ఉండి కూడా, దానికి మందుగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది వాడినా కూడా తాను ఎంచుకున్న వృత్తిలో చాలా విజయాలు పొందింది. తన చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంది. స్నేహంగా మెలిగింది. (అందుకు తగుమోతాదులో క్రెడిట్ అవతలివాళ్ళకి కూడా ఇవ్వాలి అనుకోండి..) తన చిన్నప్పటి కలను సాకారం చేసుకుంది. పిహెచ్‌డి వరకూ వెళ్ళగలిగింది. ఆ మధ్యలో ఎన్నో ప్రేమలూ, పెళ్ళిళ్ళూ. కుటుంబంలో సమస్యలు. పిల్లలు లేకపోవటం. వీటి అన్నింటికోసం బాధపడింది. అయినా, నెగ్గుకొచ్చింది. ఆ కబుర్లన్నీ వింటుంటే బోలెడంత ఆశ్చర్యం. ప్రోత్సాహం.

రెండు: ఈమెకు ఉన్నది ఓ మానసిక రోగం. (Manic Depression Disorder) పై పేరాలో నేను రాసినట్టు, ఇట్లాంటి జబ్బులను ఓ పెద్ద “ఎక్స్”కింద తోసేసి, చేతులు దులిపేసుకుందామని చూస్తుంటారు. అదేం పెద్ద విషయం కాదన్నట్టు. ముఖ్యంగా, అదో రోగం, దానికి చికిత్స అవసరం, ఆ చికిత్సలో భాగంగా మందులు వాడాల్సి వస్తుందన్నది చాలా మంది ఒప్పుకోరు. ఈవిడ కూడా మొదట్లో ఒప్పుకోలేదు. “లిధియమ్” అనే మందు తీసుకోడానికి ముందు భయపడింది, దాని సైడ్-ఎఫెక్ట్స్ గురించి. నిరాకరించింది. తీసుకోక తప్పనిసరి పరిస్థితుల్లో మందులు మొదలెట్టింది. క్రమేణ, అవి చేస్తున్న కీడునూ, మంచిని బేరిజు వేసుకోగలిగింది. ఆ తర్వాత తన వద్దకు వచ్చే రోగులకూ దాన్ని రికమెండ్ చేసింది. ఎంతగా అంటే, ఒకానొక చోట, “ఈ రోగాన్ని కావాలని కోరుకుంటావా?” అని అడిగితే, “నాకు లిథియమ్ సరిపడకపోతే, ఖచ్చితంగా వద్దనేదాన్ని. కానీ లిథియమ్ నా మీద బా పనిచేసింది కాబట్టి, ఇప్పుడు ఈ రోగాన్ని కోరుకుంటున్నాను” అని. ఈ వ్యాధిలో ఉన్న గమ్మత్తే అది. అది ఎంతటి తీవ్ర నిరాశానిస్పృహలు కలిగించి, మనిషిని ఎంత పాతాళానికి తోసేస్తుందో, అంతటి ఎనర్జీని ఇచ్చి అనితరసాధ్య కార్యాలకు కారణమవుతుంది. ఓ డాక్టర్ తనకున్న మెడికల్ కాంప్లికేషన్స్ ను ఇంత వివరంగా, ఇంత పబ్లిగ్గా రాయడం గొప్ప విషయం. రచయిత మాటల్లో:

“There is a particular kind of pain, elation, loneliness, and terror involved in this kind of madness. When you’re high it’s tremendous. The ideas and feelings are fast and frequent like shooting stars, and you follow them until you find better and brighter ones. Shyness goes, the right words and gestures are suddenly there, the power to captivate others a felt certainty. There are interests found in uninteresting people. Sensuality is pervasive and the desire to seduce and be seduced irresistible. Feelings of ease, intensity, power, well-being, financial omnipotence, and euphoria pervade one’s marrow. But, somewhere, this changes. The fast ideas are far too fast, and there are far too many; overwhelming confusion replaces clarity. Memory goes. Humor and absorption on friends’ faces are replaced by fear and concern. Everything previously moving with the grain is now against– you are irritable, angry, frightened, uncontrollable, and enmeshed totally in the blackest caves of the mind. You never knew those caves were there. It will never end, for madness carves its own reality.”

రచయితలో మంచి హ్యూమర్ ఉంది. చాలా విషాద విషయాలను కూడా subtle humourతో చెప్పుకొస్తుంది. ముఖ్యంగా, తన కుటుంబాన్ని గురించి, తన ప్రేమ వ్యవహారాల గురించి చాలా ఓపిగ్గా, తీరిగ్గా, ఎవర్నీ నెగిటివ్ షేడ్‍లో చూపించకుండా వారిని గురించి చెప్పుకొస్తుంది. ముఖ్యంగా తండ్రికున్న వ్యాధి, ఒకరకంగా హెరిడెటరీగా ఈమెకు వచ్చిన వ్యాధి. అయినా, ఆయన గురించి చాలా అభిమానంతో, గౌరవంతో మాట్లాడుతుంది. “మానిక్ డిప్రెషన్ తల్లిదండ్రులనుండి సంక్రమించేది, నీ నుండి నీ పిల్లలకూ వస్తుంది. అందుకని నువ్వు పిల్లల్ని కనే ఆలోచన వదులుకో” అని ఒక ఫిజిషియన్ సలహా ఇచ్చినప్పుడు, ఆ మాటలకు కడుపు మండి, గుండె రగిలి పొగిలి పొగిలి ఏడ్చినా, చివరకు “నేను పుట్టినందుకు ఎప్పుడూ వగచలేదు. చచ్చిపోవాలనుకున్నాను సరే.. కానీ ఎప్పుడూ పుట్టినందుకు వగచలేదు. ” అని అంటుంది. తాను ప్రేమించిన మనిషి అర్థాంతరంగా చనిపోవడం వల్ల ఆవిడ పిల్లల్ని కనాలనే కోరిక కూడా అక్కడే ఆగిపోయింది.

ఇహ, పర్సనల్ లైఫ్ లోనే కాక ప్రొఫెషన్ లైఫ్‌లో ఈ వ్యాధి వల్ల ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి కూడా వివరంగా రాశారు. ముఖ్యంగా, పరిచయమై మనుషులతో స్నేహం పెరిగే కొద్దీ, వాళ్ళకి తన పరిస్థితిని వివరించకపోతే, వాళ్ళనుండి ఏదో దాస్తున్నాన్న భావన. అలా అని వాళ్ళకి చెప్తే, ఒక్కోరు ఒక్కో విధంగా స్పందించటం. ఆ సంభాషణలన్నీ బాగా రాశారు. మెడికల్ యూనివర్సిటిల్లో ఇలాంటివారి సాధకబాధకాల గురించి తెల్సుకునే వీలుంది.

రచయితకు చిన్ననాటి నుండి సాహిత్యంపై ఆసక్తి ఉంది. కవిత్వం రాస్తుంది. అందుకని ఆవిడ వచనం కూడా బాగా చదివించగలుగుతుంది. ఈ పుస్తకాన్ని మొదలెట్టినప్పుడు, భారీ సబ్జెక్టు కాబట్టి చదవటానికి టైమ్ పడుతుందనుకున్నాను కానీ, ఆవిడ శైలి ఎక్కడా ఆగనివ్వలేదు.

ఈ పుస్తకంలో నాకు చాలా ఊరట కలిగించిన లైన్లు ఇవి:

“Others imply that they know what it is like to be depressed because they have gone through a divorce, lost a job, or broken up with someone. But these experiences carry with them feelings. Depression, instead, is flat, hollow, and unendurable. It is also tiresome. People cannot abide being around you when you are depressed. They might think that they ought to, and they might even try, but you know and they know that you are tedious beyond belief: you are irritable and paranoid and humorless and lifeless and critical and demanding and no reassurance is ever enough. You’re frightened, and you’re frightening, and you’re “not at all like yourself but will be soon,” but you know you won’t.” 

“Sad”, “Unhappy”, “Upset”, “Grief” లాంటి పదాలన్నింటికి మూకుమ్మడిగా “D” పదం వాడ్డం ఓ రకం ఫాషనేమో. కానీ, డిప్రెషన్ అంటే, మన ఆపార్ట్మెంటులో పిల్లలు వచ్చి మనల్ని ఆంటీ/ అంకుల్ అనప్పటి ఫీలింగ్ కాదు. మనల్ని ఎవరో దారుణంగా మోసం చేసినప్పటి ఫీలింగ్ కాదు. మనం ఎవరో కాళ్ళదన్నుకొని వెళ్ళిపోయిన ఫీలింగ్ కూడా కాదు. అదో మహమ్మారి.. నల్లటి ఊబి. ఎంత ప్రయత్నించినా అప్పటికప్పుడు బయటపడలేని వివశత. దాన్ని గురించి తెల్సుకోవడం, దాన్ని గురించి మాట్లాడ్డం ముఖ్యం. అయితే, సరైన రిసోర్సెస్ నుండి సరైన సమాచారం తెల్సుకోవడం ముఖ్యం. అందుకు ఈ పుస్తకం బాగా పనికి వస్తుంది.

 

An Unquiet Mind: A Memoir of Moods and Madness
Kay Redfield Jamison
Non Fiction
ebook
224

You Might Also Like

3 Comments

  1. shakthi

    ఈ పుస్తకం మొత్తం తెలుగు లో చదవాలనుకుంటే ఎక్కడ దొరుకుతుంది

    1. సౌమ్య

      ఎక్కడా దొరకదండి. నాకు తెల్సినంతవరకు పుస్తకానికి తెలుగు అనువాదం లేదు.

  2. Sitha

    మనము ఇంకాdepression అంటే తప్పుడు భావన లోనే ఉన్నాము.శారీరకమైన రుగ్మతలలాగే దానికీ మందులు వాడాలనే అభిప్రాయమే కన పడదు.ప్రారంభ దశ లో దానికీపొగరు ,క్రాక్ లాంటి పేర్లు, ముదిరాకా పూనకాలు,దయ్యంపట్టడా లు లాంటిపేర్లు పెడతారు .సిటీస్ లో ఇప్పుడు అ లాంటి పరిస్థితి కూడా లేదు .మౌన పోరాటమే !nuclearfamilies కారణంగా ..సరి ఐన అవగాహన కల్పించడం ద్వారా ఎన్నో ఆత్మహత్య లను ముఖ్యంగా teenage పిల్లలలో తగ్గించవచ్చు.ఏమిటో తెలియక తమలో తామే కుమిలిపోయే ఎన్థో మందికి ఊరటకల్పించడం
    ఎంతయినా అవసరం .తొలిదశలో కౌన్సిలింగ్ ద్వారా ఆ అంతర్మధనం నుండి బయటకు రప్పించ vacs uh అని పిస్తుంది .మీ analysys చాలా బాగుంది.

Leave a Reply