వెదురు వంతెన

వ్యాసకర్త: డా. చిత్తర్వు మధు
********
అనువాదాలు ఎందుకు అతి ముఖ్యమైనవి మన సాహిత్యంలో అంటే కారణాలు చాలానే ఉన్నాయి. మనం రాసేదే గొప్ప అని, మన భాషే, మన యాసే ముఖ్యం అనీ, మన సమస్యలే ముఖ్యం అనీ చుట్టూ గిరి గీసుకుని కూర్చోకుండా మన దేశంలో ఇతర ప్రాంతాలలో, రాష్ట్రాలలో ఎన్నో భాషలు మాట్లాడే ప్రజల జీవన విధానాలెన్నున్నాయో తెలుసుకోడానికి, వారి ఆవేదనలు, బాధలు, సంతోషాలు, సమస్యలు అర్థం చేసుకునీ, మనకీ ఇలాగే ఉన్నాయని స్పందించడానికి అనువాదాలు ఎంతో ముఖ్యం.

భారతదేశంలాంటి భిన్న భాషలు మాట్లాడే దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, మానవులందరి సమస్యలు ఒకటే అని గ్రహించడం అనువాద కథలతో సాధ్యం అవుతుంది. అనువాదాలే లేకపోతే అద్భుతమైన శరత్ సాహిత్యం, ప్రేమ్‌చంద్ కథలు, అనంతమైన సంస్కృతి సాహిత్యం, రష్యన్ సాహిత్యం… ఇవన్నీ జీవితంలో దొరికేవి కావు అని అనిపిస్తుంది.

కొల్లూరి సోమ శంకర్ అనువాదానికి ఎంచుకున్న కథలన్నీ సున్నితంగా మానవ సంబంధాలని, పరిస్థితులని స్పృశిస్తూ మన మనసుని స్పందింపజేస్తాయి. వీటిలో పాత్రలన్నీ సమాజంలో మనం నిత్యం చూసే సాధారణ వ్యక్తులవే. కొన్ని తీవ్రమైన పరిస్థితులున్న సరిహద్దు ప్రాంతాలు మనకు లేకపోయినా, మనల్ని ఆలోచించేలా చేస్తాయి. “వెదురు వంతెన” కథలో తీవ్రవాదులు సాయుధులై గ్రామాన్ని ఇబ్బంది పెడుతుంటే, గ్రామస్థులందరూ – వారిని రానీయకుండా రోడ్డుని మూసేసి, పంట కాలవ మీద వెదురు వంతెన కట్టుకోడానికి నిర్ణయించుకుంటారు. ఇది ఒక మణిపురి కథ. ఈ సమస్య ఆ ప్రాంతానికి సంబంధించినదే కావచ్చు. ప్రజల సంఘటిత శక్తికి ప్రతీక.

భవనంలో పనిచేసే వాచ్‌మెన్ చెట్టు కొట్టేయడానికి పడే బాధ, వృద్ధాప్యంలో కొడుకు తమని సరిగా చూడకపోతే, భార్య పోయిన మదన్‌లాల్ తీసుకున్న కఠినమైన నిర్ణయం – “నీవు నేర్పిన విద్యయే..” కథలో మనల్ని సమస్య గురించి బాధపడకుండా, పరిష్కారం గురించి ఆలోచించేటట్లు చేస్తుంది.

ఒకటేమిటి, ఈ సంకలనంలోనివి అన్ని మంచి కథలే. హిందీ, మణిపురి, తమిళం, మళయాళం భాషల నుంచి అనువదించిన కథలు. సోమ శంకర్ సరళమైన అనువాదంతో మనల్ని స్పందింపజేస్తాయి. ప్రతీ కథా ఆలోచింపజేస్తుంది. ప్రాంతం ఏదయినా, భాష ఏదయినా మనందరి సమస్యలు, సంఘర్షణలు ఒకటే అని గోచరింపజేస్తాయి ఈ కథలు. ప్రతీ కథా కళాత్మకం. అనువాదం సరళం. ప్రతి కథా చదివి ఆస్వాదించడం సోమ శంకర్ లాంటి మంచి రచయితలని, అనువాదకులని ప్రోత్సహించడమే కాదు, మన జాతీయ అవగాహనకి దోహదం చేస్తుంది.

“వెదురు వంతెన” ఈ-బుక్ కినిగెలో లభిస్తుంది.
124 పేజీల ఈ పుస్తకం వెల రూ.100/-

*****
డా. చిత్తర్వు మధు వృత్తిరీత్యా వైద్యులు. ప్రవృత్తి రీత్యా రచయిత. అనేక కథలు, నవలలు రచించారు. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ రాయడంలో నేర్పరి. ఆయన రచనలు కినిగె.కాంలో లభ్యం.

Veduru Vantena

You Might Also Like

Leave a Reply