రెండు Jonas Jonasson స్వీడిష్ నవలలు
గత మే ఒకటో తేదీన స్వీడెన్ లోని ఒక ఎయిర్ పోర్టు పుస్తకాల షాపులో “The 100 year old man who climbed out of the window and disappeared” అన్న పుస్తకం కనబడ్డది. గతంలో దీని పేరు వెబ్-పత్రికల సమీక్షల్లో చూశాను. టైటిల్ తో పాటు కవర్ పేజీ కూడా ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. రచయిత పేరు Jonas Jonasson. నవల స్వీడిష్ మూలానికి ఆంగ్లానువాదం. అప్పుడే “Millenium Trilogy” లోని ఆఖరు భాగాన్ని చదువుతూ ఉన్నందువల్ల ఆధునిక స్వీడిష్ రచయితల రచనలు ఏవైనా చదవాలనుకుంటూ ఉన్నాను. తరువాతి వారాలలో ఈ నవల, దీని తరువాత ఇదేరచయిత రాసిన తాజా పుస్తకం – “The Girl who saved the king of sweden” కూడా కిండిల్ పుణ్యమా అని వెంటనే చదివేశాను. రెండూ ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా బహుళ ప్రజాదరణ పొంది అనేక భాషల్లోకి అనువాదం చేయబడి, సినీరంగాన్ని కూడా ఆకర్షించిన పుస్తకాలు. నాకు ఈ తరహా imaginative రచనల మీద ఉన్న ఆసక్తి వల్ల ఈ పుస్తకాలు రెండూ నచ్చాయి. వాటి గురించి ఓ నాలుగు ముక్కలు ..
మొదటి పుస్తకం: అలాన్ అన్న వందేళ్ళాయన తన వందవ పుట్టినరోజు వేడుకలు కాసేపట్లో ప్రారంభమవుతాయి అనగా వృద్ధాశ్రమంలోని తన గది కిటికీలోంచి దూకేసి, దగ్గర్లోని బస్టాండ్ వైపుకి వెళతాడు. అక్కడ అనుకోకుండా ఓ పెట్టెతో సహా ఓ బస్సెక్కేస్తాడు. తర్వాత పెట్టెలో మిలియనుల కొద్దీ డబ్బున్నట్లు తెలుస్తుంది. ఇక, ఆడబ్బు గురించి సహజంగానే ఆ పెట్టె తాలూకా వాళ్ళూ, వాళ్ళ తాలూకా వాళ్ళూ వెదుకుతూంటారు. వాళ్ళ నుండి తప్పించుకోడానికి మొదట అలాన్, ఆ తరువాత అతనితో క్రమంగా కథానుగుణంగా జతచేరే ఇతరులూ ప్రయత్నిస్తూంటారు. మరో పక్క పోలీసులు వీళ్ళ వెంట పడుతూంటారు. అనేక అనూహ్య, అసాధ్యాలైన ఈ సంఘటనల నడుమ అంతకంటే విచిత్రమైన మలుపులు తిరిగే అలాన్ గతం కూడా కథలో భాగమే. ఇది గాక, రెండు ప్రపంచ యుద్ధాలు, కోల్డ్ వార్ కాలంలో ప్రపంచంలోని నాయకులందరూ ఈ కథలో పాత్రలే. చివర్లో సుఖాంతమే అవుతుందనుకోండి – కానీ, ఇక్కడ కథ కాదు ముఖ్యం…ఆ non-sensical మలుపుల వల్ల నా మట్టుకు నేను మహా ఉత్కంఠతో చదివాను నవలని. ఆహా, ఓహో అనలేకపోయినా నవ్వించేంత హాస్యం ఉంది.
రెండో పుస్తకం: సౌత్ ఆఫ్రికాలోని ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక అసాధారణ తెలివితేటలు గల అమ్మాయి తన జీవితకాలంలో స్వీడెన్ చక్రవర్తిని ప్రమాదం నుండి రక్షించేదాక ఎలా వెళ్ళింది? అసలు ఆమె జీవితం చివరకి ఎలాంటి మలుపులు తిరిగింది? -అన్నది ప్రధాన కథాంశం. ఈ పుస్తకంలో కథ సౌత్ ఆఫ్రికాలో మొదలై అక్కడే ముగుస్తుంది కానీ, కథలోని పతాక సన్నివేశాలన్నీ స్వీడెన్ లో సాగుతాయి. అణ్వస్త్రాలు, అణ్వస్త్ర దేశాలు కథలో ప్రధానాంశాలు. పై పుస్తకమంత కాకపోయినా, ఇందులోనూ స్వీడిష్ ప్రధాని, చక్రవర్తి, చైనీసు ప్రధాని, మండేలా, ఇలా కొన్ని నిజజీవిత పాత్రలు కాల్పనిక పాత్రలైపోతాయి. ఇందులో మొదటి నవలకంటే eccentric పాత్రలు ఉన్నట్లు అనిపించింది. మొదటి నవలలో పాత్రలకంటే సంఘటనలు eccentric గా అనిపించాయి. ఇందులో విపరీత ప్రవర్తన గల పాత్రలు కోకొల్లలు! ఈ రెండో నవలలో కథానాయకి పాత్ర చిత్రీకరణ నాకు Millenium Trilogy లో Lisbeth Salander పాత్ర రూపకల్పనను గుర్తుకు తెచ్చింది. ఈ రెండూ ఒకదానికి ఒకటి సంబంధం లేనివే అయినా, రెంటిలోనూ నాయికలు అసాధారణ ప్రతిభావంతులు. స్వీడిష్ రచనలు, అందునా ఆధునిక నవలలు నేను ఎక్కువగా చదవలేదు. కాని, వీళ్ళ రచనల్లో కథానాయిక పాత్రల గురించి కొంచెం కుతూహలం కలిగింది.
మొత్తానికి పుస్తకాలు రెండూ ఆసక్తికరంగా రాశారు. ఫిక్షన్ నవలల్లో యదార్థాలకోసం అన్వేషించకూడదని ఇటీవలే సినిమాగా వచ్చిన “The Fault in our stars” నవల రచయిత జాన్ గ్రీన్ సెలవిచ్చారు (“Neither novels nor their readers benefit from attempts to divine whether any facts hide inside a story. Such efforts attack the very idea that made-up stories can matter, which is sort of the foundational assumption of our species. I appreciate your co-operation in this matter”). నేను వెదకలేదు. Forrest Gump నవల/సినిమా తరహాలో ఈరెండు నవలల్లో కూడా ప్రధాన పాత్రలు రెండూ అనేక చారిత్రక ఘట్టాలలో (ముఖ్యంగా అలాన్ ఐతే మరీనూ!!) ప్రత్యక్ష సాక్షులు. వీళ్ళు ఊరికే సాక్షులే కాదు – ఆయా ఘట్టాల్లో కొన్ని భాగాలకి కర్తలు కూడా. అన్ని చారిత్రక ఘట్టాలను ఒక పాత్రతో ముడిపెడుతూ కథ రాయడం (అదీ రెండు సార్లు) అంటే చాలా సృజనాత్మకత అవసరం అనుకుంటున్నాను నేను. పుస్తకాల్లో పరిసరాల వర్ణన చాలా తక్కువగా ఉంది కనుక, రచయిత బహుశా ఈప్రాంతాలకి వెళ్ళకుండా రాజకీయ, చారిత్రక సత్యాల/కథల ఆధారంగా స్వీడెన్ లోనే ఉండి రాశాడేమో అని నా అనుమానం. ఏదేమైనా, ఇతని కథలు విని, nonsense! అని కొట్టిపారేయకుండా ప్రచురించారంటే ఆ ప్రచురణకర్తలు కూడా అభినందనీయులు. అతను అదృష్టవంతుడు! చదివి ఆస్వాదించాను కనుక నేనూ అదృష్టవంతురాలినే 🙂
మీకు అసంగత కథాంశాలు (absurdities – “అసంగత సంగతాలు” అన్న ఎ.వి.రెడ్డి శాస్త్రి కథల సంకలనం గుర్తు వచ్చి, అలా అనువదించాను ఆ పదాన్ని) మీద ఏ కాస్త ఆసక్తి ఉన్నా తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు రెండూ అని నా అభిప్రాయం. వీటిని సాహిత్య పరంగా ఎలా వర్గీకరిస్తారో నాకు తెలియదు. తార్కికమైన దృక్కోణంతో చదివితే ఈ కథలు రెండూ అవాస్తవికంగానూ, ఆ పాత్రల గమనాలు అసంభవాలుగానూ అనిపిస్తాయి. అందుకని అసంగత కథాంశాలు అన్నాను.
పుస్తకాల వివరాలు:
మొదటి పుస్తకం: The 100 year old man who climbed out of the window and disappeared
రచయిత: Jonas Jonasson
అనువాదం: Rod Bradbury
రెండో పుస్తకం: The Girl Who Saved the King of Sweden
రచయిత: Jonas Jonasson
అనువాదం: Rachel Wilson Broyles
Leave a Reply