My Autobiography – Charlie Chaplin
చార్లీ చాప్లిన్ జగమెరిగిన నటుడు. అంతులేని కీర్తిని (ధనాన్నీ కూడా అనుకుంటాను) ఆర్జించాడు. అతను నటుడే కాదు – దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు కూడా. నిశబ్ద చిత్రాల యుగంలో గొప్ప సృజనాత్మకత కలిగిన వ్యక్తిగా పేరుపొందిన వాడు. అతని సినిమాలు చూసిన వారెవరికైనా, వాటిని హాస్యచిత్రాలుగా మాత్రమే కాక అనేక ఇతర కోణాలు ఉన్న చిత్రాలుగా చూడగలగడం అనుభవంలోనిదే అనుకుంటాను. నేను చూసిన చాప్లిన్ చిత్రాలు తక్కువే అయినా, నా మీద అవి బలమైన ముద్ర వేసాయి. నేను ఒకానొక సమయంలో గౌరవించినవ్యక్తులు ఇద్దరు ముగ్గురు కూడా చాప్లిన్ అభిమానులు కావడం వల్ల కూడా చాప్లిన్ ని నేను గౌరవించేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఒక మూడేళ్ళ క్రితం ఒకరికి కానుకగా ఇవ్వడం కోసం ఈ చాప్లిన్ ఆత్మకథ పుస్తకం కొని, వాళ్ళని కలిసేలోపు నేనే చదివేసాను దాన్ని! అప్పట్లో మొదలుపెట్టి ఆపేసిన పరిచయ వ్యాసం ఈమధ్యనే నా కంటబడింది.. అదే ఇది.
చాప్లిన్ బాల్యం, అతని కుటుంబ పరిస్థితులు, సినిమా రంగ ప్రవేశం, హాలీవుడ్, అక్కడి గాసిప్, ప్రముఖులతో పరిచయాలు, సినిమాల జయాపజయాలు, ఇలా అనేక జీవిత విశేషాల గురించి చాప్లిన్ అనుభవాలు, అభిప్రాయాలు అన్నీ కలిపితే ఈ పుస్తకం. చాప్లిన్ చిన్ననాటి పరిస్థితులు చదివి అక్కడ నుండి అతను ఎదిగిన చదువుతూ ఉంటే స్పూర్తిదాయకంగా అనిపించింది. ముఖ్యంగా, వాళ్ళమ్మ మానసిక సమస్యలు, కుటుంబ ఆర్థిక-ఆర్థికేతర సమస్యలూ చదువుతూంటే, వీటి మధ్య పెరిగిన వ్యక్తి భవిష్యత్తులో ఆ స్థాయికి చేరుకుంటాడు అని ఊహించడం కష్టంగా తోచింది నాకు.
అతని జీవితంలోని సంఘటనలు అటు పెడితే, అవి చెప్పడంలో చాప్లిన్ వాడిన వచనం నచ్చింది నాకు. అతని కథనంలో బాగా చదివించే గుణం ఉంది అనిపించింది. అందుకు చాప్లిన్ నాటకీయమైన వర్ణనలు ప్రధాన కారణం కావొచ్చు. సినిమాల్లో వీక్షకులని ఆకట్టుకున్నట్లే అతనికి పాఠకులని ఆకట్టుకోడం కూడా తెలుసు కాబోలు! కొన్ని సినిమాల గురించి రాస్తూ, కొన్ని దృశ్యాల చిత్రీకరణ గురించి తనకి ఆలోచనలు ఎలా కలిగాయో ఆయన చెబుతూ ఉంటే చదవడానికి ఆసక్తికరంగా ఉండింది. ఉదా: “గోల్డ్ రష్” సినిమాలో ఒక చోట, ఆకలి భరించలేక, హీరో తన లెదర్ షూ ని ఉడికించి, లెస్ ని స్పాగేట్టీ లా, షూ పై ఉన్న మేకులు ఎముక లాగా, ఇలా భావించుకుంటూ, ఆస్వాదించి తింటాడు. ఒక పక్క అతని సహచరుడు ఆకలి వల్ల కలిగిన భ్రాంతిలో చార్లీ ని కోడి అనుకుని, అతన్ని తినాలి అని ముందుకొస్తాడు (ఏమిటో, దీని గురించి అనుకున్న ప్రతిసారీ, “land of black gold” లో అనుకుంటా, కెప్టెన్ హేడాక్ టిన్టిన్ ని చూసి మందు సీసా అనుకుని మీద పడే దృశ్యం గుర్తొస్తుంది). ఈ దృశ్యం ఒక పక్క చాలా భయం గొల్పేది గా ఉన్నా, ఒక పక్క చాలా నవ్వు పుట్టిస్తుంది. చాప్లిన్ ఈ పుస్తకంలో తనకి ఆ ఆలోచన ఎలా కలిగిందో చెబుతాడు. ఇలాంటివి కొన్ని జగత్ప్రసిద్ధి పొందిన చాప్లిన్ సినిమాల-సీన్ల-పాత్రల గురించి ఆయన మాటల్లో చదవొచ్చు ఈ పుస్తకంలో. జగత్ప్రసిద్ధులైన వ్యక్తులతో చాప్లిన్ పరిచయాల కథలు కూడా ఆసక్తికరంగా చెప్పుకొస్తాడు, అక్కడక్కడా తనని తాను గ్లోరిఫై చేసుకున్నట్లు అనిపించినా కూడా.
ఏదన్నా ఒక్క సంఘటనని నలుపు-తెలుపులో చూడగలం ఏమో కానీ, ఒక జీవితాన్ని రంగుల్లో తప్ప చూడ్డం కష్టం. ఊహ తెలిసాక, వయసు పెరిగే కొద్దీ నాకు అనిపిస్తున్న అభిప్రాయం ఇది. చాప్లిన్ ఆత్మకథ చదివాక, మరొక్కసారి అదే విషయం అనిపించింది. అతని జీవితంలో పలు రంగులు. అందులో నాకు నచ్చినవీ ఉన్నాయి, నచ్చనివీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక సంఘటనో, మరొకటో పట్టుకుని అతన్ని నేను విమర్శించడం సబబు కాదు అనుకుంటాను. ఈ పుస్తకంలో, నిజానికి ఎలా చూసినా చాప్లిన్ జీవితంలో కూడా, బోలెడు డ్రామా ఉంది. పుస్తకంలోని కొన్ని సంఘటనలు నిజంగానే నాటకీయంగా జరిగినవైతే, కొన్ని చాప్లిన్ కథనం వల్ల నాటకీయంగా తోస్తున్నవనుకుంటాను. ఆత్మకథ అంటే ఆత్మస్తుతి, పరనింద అంటారు – అది ఈ ఆత్మకథకి తప్పకుండా వర్తిస్తుంది. కానీ, చెప్పింది చాప్లిన్ కనుక, అతనికి అతనే సాటి కనుక, అతనేం చెప్పినా చెల్లుతుందంతే. చాప్లిన్ అంటే అభిమానం ఉన్న ఎవరికైనా తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఆమధ్య తెలుగులోకి కూడా అనువాదం చేసారు.
ఆంగ్ల పుస్తకం వివరాలు :
My Autobiography
Charlie Chaplin
Penguin Classics
512 Pages
అమేజాన్ లంకె
తెలుగు పుస్తకం వివరాలు:
నా కథ – చార్లీ చాప్లిన్
అనువాదం: వల్లభనేని అశ్వినీ కుమార్
వెల: 299 రూపాయలు
కొనుగోలు లంకె
ఈ పుస్తకాన్ని గురించి సత్యజిత్ రాయ్ “Our films, their films” పుస్తకంలో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఇక్కడ.
Autobiography
gks raja
సౌమ్య గారు! లేటు గా అయినా నా వరకూ ఇది లేటెస్టు విషయమే. ఎందుకంటే ఈ మధ్యనే అతి కష్టం మీద ఈ పుస్తకాన్ని లండన్ నుండి స్నేహితుడి ద్వారా తెప్పించ్కున్నాను. సరే! విషయానికి వస్తే — మీరు కొన్ని సినిమాలే Chaplin వి చూసానన్నారు. ఇవి మిస్ అయ్యారేమో అని నా తాపత్రయం — ది కిడ్, మోడరన్ టైమ్స్ , గ్రేట్ డిక్టేటర్ , సిటి లైట్స్ — ఇంకా లఘు చిత్రాలు చాలానే ఉన్నాయి.మీరు మొదలు పెడితె ఆపరన్న సంగతి తెలుసనుకోండి. మంచి పుస్తక పరిచయానికి ధన్యవాదాలు.
రాజా.
సౌమ్య
రాజా గారూ,
ఆ పుస్తకానికి 2011లో నేను పారిస్ లో కొన్నాను. అప్పటికి ఆ పుస్తకం ఇండియాలో ఎక్కడ చూసినా out of stock అని కనబడేది. తరువాత 2012లో నేను ఇండియా వచ్చినపుడు అక్కడ ఒకట్రెండు చోట్ల డిస్ప్లేలో చూసినట్లు గుర్తు. నేను పారిస్ లో కొన్నది కూడా కొత్త ఎడిషన్ కావడంతో అది మళ్ళీ ఇండియాలో దొరుకుతోంది అనుకున్నాను. ప్రస్తుతం మళ్ళీ ఫ్లిప్కార్ట్ లో చూస్తే అవుటాఫ్ స్టాక్ అని కనిపిస్తోంది.
మీ సలహాకి ధన్యవాదాలు – నేను గ్రేట్ డిక్టేటర్ ఇంకా చూడలేదు. నా వద్ద కొన్నేళ్ళ బట్టి దాని విడియో మట్టుకు అలాగే ఉంది. “మోడరన్ టైంస్” మా ప్రొఫెసర్ ఒకాయన చెబితే 2006లో చూశాను. నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా.