చేరా మాస్టారు

వ్యాసకర్త: డా. వైదేహి శశిధర్
*****
తెలుగు సాహిత్యం తో పరిచయం ఉన్నవారందరికీ చేరా మాస్టారి తో కనీసం పరోక్ష పరిచయం ఉండే ఉంటుంది . తెలుగు సాహిత్యంతో, తెలుగు భాషతో ఆయనకున్న విస్తృతమైన అనుబంధం,అభినివేశం వల్ల. ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం చేరాతలు వచ్చే రోజుల్లో నేను అంతగా వాటిని ఫాలో అవలేదనే చెప్పాలి. కాలేజీ చదువు,మెడికల్ ఎంట్రన్స్ ప్రిపరేషన్ తో తల మునకలైన రోజులు అవి. అయినా ఇప్పుడు లబ్దప్రతిష్టులైన అప్పటి వర్ధమాన కవులను ఎందరినో ఆయన తన చేరాతలలో పరామర్శ చేయటం, నేను అప్పుడప్పుడూ చదవటం నాకు ఇప్పటికీ గుర్తు.

1995 లో నా ప్రవాస జీవితం మొదలైనప్పటి నుండీ దాదాపు ఆరేడేళ్ళ వరకూ సాహిత్యంతో ఇంటరాక్షన్ తగ్గిందన్నది నిజం. కొంత నా చదువు, రెసిడెన్సీ, ఇతర బాధ్యతలు, వ్యాపకాలతో తీరిక లేకపోవటమే కాకుండా, ఇప్పటిలా వెబ్ పత్రికలూ, బ్లాగులు, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సాహిత్య వాతావరణంతో సంబంధం కొనసాగించే అవకాశం లేకపోవటం మరో కారణం. అయితే ఆ తర్వాత రెండు మూడేళ్ళ లోనే ఏవికేఎఫ్ పుణ్యమా అని చేరా పుస్తకాలలో సింహభాగం మా లైబ్రరీ లో చోటుచేసుకుంది. ఆయన పుస్తకాలు చదివినప్పుడు నన్ను ఆకర్షించింది కవిత్వం పట్ల ఆయనకున్న ప్రేమ. గురజాడ మొదలుకొని వర్ధమాన కవుల వరకూ వారి వారి కవిత్వాల్లోని విశేషాలని ఎంతో ఉత్సాహంతో, నిష్పక్షపాతంగా పరామర్శ చేసే లక్షణం. అలాగే విమర్శ లో వారు చూపించే సంయమనం, పాజిటివ్ దృక్పధం కూడా నన్ను ఆకట్టుకుంది. తన బాల్యం గురించి, స్నేహితుల గురించి, గురువుల గురించి, తాను నివసించిన ప్రదేశాల గురించీ చక్కటి శైలిలో, నిరాడంబరమై భాషలో ఆయన వ్రాసిన అనేక వ్యాసాలలో ఆయన హృదయ సౌకుమార్యం తెలుస్తుంది.

చేరా మాస్టారు భాషాశాస్త్రవేత్త. చాలా మంది భాషా శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా,తులనాత్మకంగా భాషను విశ్లేషించే ప్రక్రియలో సాహిత్యాన్ని ఆ విశ్లేషణా మాధ్యమం గానే పరిగణించడం జరుగుతుంది. అంటే సాహిత్యాన్ని మేధస్సుతో విశ్లేషించే క్రమంలో హృదయంతో స్పందించకపోయే అవకాశం ఉంది. కారణం వారి దృష్టి ప్రధానంగా భాష, వాక్య నిర్మితి, వాక్య ప్రయోగాలపై ఉండటమే. అందులో అసహజమేమీ లేదు కూడా. అయితే చేరా మాస్టారు భాషా శాస్త్రాన్ని ఎంతగా ప్రేమించారో సాహిత్యాన్ని అంతగానే ప్రేమించారు. మంచి కవిత్వానికి, సాహిత్యానికి స్పందించి ఆనందించారు. బహుసా ఈయన స్వయంగా కవి కావడం అందుకు కారణం కావచ్చు.

2007 లో మా నాన్నగారు, సి.ఎస్ .రావు గారు, అమెరికాకి వచ్చినప్పుడు నా లైబ్రరీలో ఉన్న చేరా మాస్టారి పుస్తకాలన్నీ ఇష్టంగా చదివేవారు. నేను హాస్పిటల్ నుంచి రాగానే కొన్ని సాయంత్రాలు ఆయన పుస్తకాల గురించి, రచనా శైలి గురించి, నరసరావు పేట, విశాఖపట్టణం పై ఆయనకున్న ప్రేమ గురించి మా నాన్నగారితో చర్చించటం ఇంకా గుర్తే.

2009లో మొదటసారిగా మా నాన్నగారు చేరా గారిని కలిసారు. వారిద్దరూ ఎంతో ఇష్టంగా సాహిత్యం గురించి అనేక విశేషాలు ముచ్చటించుకున్నారు కూడా. ఆ సందర్భంలో నా నిద్రితనగరం కవితా సంకలనానికి ముందు మాట వ్రాయమని ఆయనను అడిగితే, మీరే రాయవచ్చు కదా అని మా నాన్నగారి తో అన్నారట. తనకి అంకితం ఇస్తున్న పుస్తకానికి తానే ముందుమాట వ్రాయటం సరి కాదని నాన్నగారు జవాబిచ్చారు. అప్పుడు చేరాగారు అనేక వ్యాసంగాలతో, పనులతో తీరిక లేకుండా ఉన్నారు. చాలా పనులు ఉన్నాయి, సకాలంలో ముందుమాట రాయగలనో లేదో అని సంకోచిస్తూనే నా కవితలు తీసుకున్నారట.

అయితే ఆ తర్వాత నాలుగైదు రోజులలోనే నాన్నగారికి ఫోన్ చేసి “ముందుమాట రాసేసాను, వచ్చి తీసుకెళ్ళండి” అని చెబితే నాన్నగారు ఆశ్చర్యపోయారట. అంతేకాదు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో ఉల్లాసంగా నా నిద్రితనగరం కవితలను గురించి మాట్లాడి ఆవిష్కరణ సభ పెట్టాలని కూడా అన్నారట. ఏ మాత్రం పరిచయం కూడా లేకుండానే నా కవితా సంకలనానికి సహృదయతతో “అచ్చమైన కవితా స్వరూపిణి వైదేహి” అన్న మకుటంతో ముందుమాట వ్రాసారు. కవిత్వాన్ని చదివి ఆయన పొందే ఆనందం, కవిత్వాన్ని ఎక్కడున్నా ప్రోత్సహించాలనే తపన మన హృదయాన్ని తాకుతాయి.

ఆతర్వాత నేను ఒక ఫామిలీ ఫంక్షన్ కోసం ఒక వారంరోజుల పాటు ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఆయనను కలవటానికి వెళ్లాను. అదే మొదటసారి ఆయనను చూడటం. ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తన పుస్తకాలు కొన్ని ఇచ్చారు. నా నిద్రితనగరం గురించి ఎంతో సంతోషంగా మాట్లాడారు. కేవలం వెబ్ పత్రికలలోనే కాక తెలుగునాట అచ్చు పత్రికలలో కూడా కవిత్వం ప్రచురించమని, ఇంకా విరివిగా కవిత్వం వ్రాయమని అన్నారు. అంతేకాదు, నేను రాయబోయే కొత్త కవితలను తనకి పంపమని చెప్పారు. ఈ మెయిల్ అడిగితే తను అంతగా కంప్యూటర్ వాడనని, రెగ్యులర్ మెయిల్లో పంపమని కూడా చెప్పారు. ఆయన అడిగినట్లు నా కవితలు పంపుదామని అనుకుని కూడా, నా వృత్తి వ్యాసంగాలలో తీరిక లేకపోవడం, కొంత బద్ధకం ఒక కారణమయితే, నా కవిత్వం గురించి నేను ప్రస్తావించడానికి సందేహించడం, ఒక అంతర్ముఖత్వం కూడా ముఖ్య కారణమే. అయినా ఆయన అడిగినట్లు నా కవితలు పంపలేకపోయానన్న విషయం నన్ను అప్పుడప్పుడూ ఇబ్బందికి గురిచేయడం మాత్రం సత్యం.

ఆ తర్వాత 2010 వేసవిలో మరోసారి నేను, నాన్నగారు ఆయన్ని కలిసి మాట్లాడాము. ఆయన వ్రాసిన పుస్తకాల గురించి, భాష గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన వ్రాసిన పుస్తకాలలో చాలా భాగం నా దగ్గర వున్నాయని చెప్పినప్పుడు చిన్న పిల్లవాడిలా సంతోషపడ్డారు. ఏ యే పుస్తకాలు ఉన్నాయో, నేను ఏ పుస్తకాలు చదివానో, వాటి పట్ల నా అభిప్రాయాల్ని అడిగి మరీ తెలుసుకున్నారు. నేను రెండవ సంకలనం తేవాలని, ఇంకా తరచుగా, విస్తృతంగా రాయాలని మళ్ళీ మళ్ళీ చెప్పారు. ఆ తర్వాత నాకు నాలుగేళ్ల పాటు ఇండియా వెళ్ళడానికి కుదరనే లేదు.

మొన్న జనవరిలో (2014) నాన్నగారు వారిని చూడటానికి వెళ్ళినప్పుడు వారి ఆరోగ్యం సరిగా లేదని, ఎక్కువ మాట్లాడలేకపోయారని చెప్పినపుడు చాలా బాధ పడ్డాను. నా రెండవ సంకలానికి ముందుమాట పాపినేని శివశంకర్ గారితో, పీఠిక చేరా మాస్టారితో వ్రాయించాలని మా నాన్నగారు చాలా అనుకున్నా వారి ఆరోగ్య పరిస్థితి చూసి అడగలేక పోయారు. నా కవితా ప్రస్థానంలో తొలి అడుగైన నిద్రితనగరాన్ని ఎంతో సహృదయతతో, అభిమానించి ప్రోత్సహించిన చేరా మాస్టారు ఆరోగ్యం సహకరించక మొన్న ఏప్రిల్ లో జరిగిన నా పునశ్చరణం పుస్తకావిష్కరణ సభకు రాలేకపోవటం నాకెప్పటికీ లోటుగానే మిగిలిపోతుంది.

తిరిగి వచ్చేసే ముందు నా పుస్తకాలు ఇవ్వటానికి వారి ఇంటికి వెళ్ళాము. వారు రాత్రంతా ఇబ్బందిపడి నిద్రలేక అప్పుడే నిద్ర పోయారని వారి అమ్మాయి ద్వారా తెలిసింది. అక్కడే దాదాపు అరగంట పైగా కూర్చుని ఆమెతో వారి గురించి మాట్లాడాము. వారిని నిద్ర లేపుతామని ఆమె అన్నా, అలసి నిద్ర పోతున్న ఆయనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మళ్ళీ వస్తామని పుస్తకాలు ఆమెకు ఇచ్చి వచ్చేసాము. కానీ ఆ మర్నాడు రాత్రే నా దుబాయ్ ప్రయాణం వల్ల వెళదామనుకుని కూడా ప్రయాణపు హడావుడిలో వెళ్ళలేక పోవటం నాకు ఇప్పటికీ బాధ కలిగించే విషయం.

జులై మాసం చివరి వారం ఒక సూర్యాస్తమయ సమయంలో చేరా మాస్టారి మరణం గురించి విన్నాను.

“అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల
విశ్రాంతి గృహమ్ము, అందు ఇరు సంజెల రంగుల వాకిళుళ్ …….” అన్న దువ్వూరి పద్యం గుర్తుకి వచ్చింది.

కవులు రచయితలూ విమర్శకులు సాహిత్యవేత్తలు కోకొల్లలుగా ఉంటారు. కాని చేరా మాస్టారిలా సహృదయులు, స్నేహశీలులు, నిరాడంబరులు అయిన సాహిత్యవేత్తలు మాత్రం నాకు తెలిసి బహుకొద్దిమంది మాత్రమే. ఈ వ్యాసం వారి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకునే నివాళి మాత్రమే కానీ,వారి సాహిత్యసమీక్ష కాదు. నిజానికి ఆయన సాహిత్య కృషి గురించి, భాషాశాస్త్రానికి చేసిన సేవ గురించి వ్రాయాలంటే ఒక్క వ్యాసం తో అయ్యే పని కూడా కాదు.

వారికి నా శ్రద్ధాంజలి.

డాక్టర్ వైదేహి శశిధర్
August 8th 2014

You Might Also Like

Leave a Reply