క్యాన్సర్ చరిత్ర: Emperor of All Maladies
ఈమధ్యన ఇళయరాజా సంగీత దర్శకత్వంలో “ఉలవచారు బిర్యాని” అని ఒక చిత్రం వచ్చింది. అందులో, “ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా…” అని ఒక పాట. సినిమా విడుదలకు ముందు యూట్యూబులో ఈ పాట మేకింగ్ తాలుకా అధికారిక విడియో ఒకటి పెట్టారు . అందులో, గాయకుడు కైలాష్ ఖేర్ ఇళయరాజా వైపుకి చూపుతూ ఒక చోట అంటాడు – “each time he makes me sing, he makes me cry, he makes me smile…he makes me go through life” అని. ఈ పుస్తకం గురించి నేను చెప్పాలంటే కూడా అలాగే చెప్పాలి… గత రెండున్నర వారాల్లో రోజూ కొన్ని పేజీలు చదివాను. కొన్ని పేజీలు మళ్ళీ మళ్ళీ చదివాను (ఒక్కోసారి అర్థం కాక. చాలాసార్లు మళ్ళీ చదవకుండా ఉండలేక!). పుస్తకం తెరిచిన ప్రతిసారీ నవ్వు, ఏడుపు, బాధ, కోపం, ద్వేషం, గౌరవం – ఇలా రకరకాల భావోద్వేగాలన్నీ ఒకేసారి కలుగుతున్నట్లు అనిపించింది. పుస్తకం చివరిదాకా ఇదే అనుభవం కొనసాగింది. అంతకంటే ఆ పుస్తకం గురించి నిజంగా చెప్పాలంటే నేనేం చెప్పలేను. కానీ, అది చెప్పి వదిలేస్తే, పుస్తకంలో ఏముందో చెప్పినట్లు కాదు కనుక, ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఒక వ్యాసం రాయాలని నిర్ణయించుకున్నాను.
పుస్తకం పేరు:”The Emperor of all Maladies”
రచన: డాక్టర్ సిద్ధార్థ ముఖర్జీ
విషయం: వృత్తిరిత్యా క్యాన్సర్ చికిత్స నిపుణుడు అయిన ఒక వైద్యుడు తనదైన శైలిలో చెప్పిన క్యాన్సర్ జీవితచరిత్ర.
ఇతర వివరాలు: 2011 సంవత్సరానికి గాను నాన్-ఫిక్షన్ లో పులిట్జర్ ప్రైజు అందుకున్న పుస్తకం.
గుక్కతిప్పుకోకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ పుస్తకం రచయిత చికిత్స చేస్తున్న ఒక పేషంటు వద్ద మొదలై, క్యాన్సర్ అన్న పదం వ్యుత్పత్తి, ఆ పదం పుట్టకముందు నాటి క్యాన్సర్ కేసులు అని ప్రస్తుతం భావిస్తున్నవి, ప్రాచీన-మధ్య యుగాల్లో వైద్యులు ఈ రోగం గురించి అనుకున్నవి; ఆధునిక వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న కాలంలో క్యాన్సర్ గురించి, దాని చికిత్స గురించి క్రమంగా వైద్యులు ఏం కనుక్కున్నారు? ఎలా కనుక్కున్నారు? దీని వల్ల ప్రయోజనం కలిగిందా? శతాబ్దాల చరిత్రలో మైలురాళ్ళేవి? ముఖ్యమైన అంశాలను కనుగొన్న శాస్త్రవేత్తలెవరు? పేషంట్ల పరిస్థితులు ఎందాకా మెరుగుపడ్డాయి? ఈ మొత్తం పరిశోధనా పరిణామక్రమంలో రాజకీయాలే పాత్ర పోషించాయి? వైద్యులు కాని వారు ఎంతమంది క్యాన్సర్ నివారణ కోసం పోరాడారు? అసలు ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాము? ఎప్పటికైనా ఈ వ్యాధి నివారణ అయ్యే పనేనా? – ఇలాంటి ప్రశ్నలకన్నింటికి సమాధానాలు చెబుతుంది.
పుస్తకంలో చాలా చోట్ల చాలా అంశాలు నన్ను ఆకట్టుకున్నాయి. కొన్నింటిని మట్టుకు ప్రస్తావిస్తాను ఇప్పటికి. లంగ్ క్యాన్సర్ కి పొగత్రాగడానికి సంబంధం ఉందని ఇప్పుడు సామాన్య ప్రజానికానికి కూడా ఓ మోస్తరు అవగాహన ఉంది. ఒక్క మూణ్ణాలుగు దశాబ్దాల క్రితం ఈ సంబంధాన్ని కనిపెట్టిన/అనుమానించిన శాస్త్రవేత్తలని తోటి శాస్త్రవేత్తలే నమ్మలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పొగాకు సంస్థలు నమ్మకపోయినా ఓ అర్థం ఉంది. తోటి శాస్త్రవేత్తలు నమ్మకపోవడం ఏమిటో! ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు కోకొల్లలు ఈ పుస్తకంలో. క్యాన్సర్ గురించి పరిశోధనలు చేయడం కూడా ఎంత పెద్ద రాజకీయాంశమో అర్థమైంది. బేసిక్-అప్లైడ్ రిసర్చిలకి ఆర్థిక సహకారం అందడంలో సమతుల్యం లోపించడం గురించిన వ్యాఖ్యలు కూడా ఆసక్తితో చదివాను. గణాంకాలను కావల్సినప్పుడు కావల్సినట్లు మలుచుకోవచ్చనిపించింది “correlation does not indicate causation” అన్న స్టేట్మెంట్ ని భిన్న సందర్భాల్లో ఇక్కడ వాడిన విధానం చూస్తే . అలాగే, పేషంట్లను తీసుకుని experimental studies చేసేటప్పుడు sample selection లో లోపాల వల్ల ఫలితాలు తారుమారు కావడం వంటి అంశాలు కూడా వివరంగా చర్చించారు. ఈ గణాంకాల చర్చల్లో నాకు అన్నింటికంటే నచ్చినది – క్యాన్సర్ మందుల పనితీరు ఫలితాలను విశ్లేషించడానికి వాడే evaluation procedures గురించిన చర్చ. నన్ను అడిగితే, ఏదో ఒక విధంగా వృత్తిరిత్యా statistics వాడే అందరూ చదవాల్సిన భాగం అది. మనం ఎంపిక చేసుకున్న evaluation measure ని బట్టి మన పరిశోధన తేలిపోయిందా? విజయవంతమైందా? అన్న ప్రశ్నలకు సమాధానం ఎంత తారుమారు కావొచ్చో తెలుస్తుంది. చివరగా, ఒకప్పటి ట్రీట్మెంట్ పద్ధతుల గురించి, అనేకానేక పరిశోధనల్లో పాల్గొన్న పేషంట్ల గురించి -వారి తరువాతి జీవితం గురించి చదువుతూంటే చాలాసార్లు ఉలిక్కిపడ్డాను నేను. ముఖ్యంగా డాక్టర్ Werner Bezwoda ఉదంతం లో జరిగిన scientific fraud గురించి చదివాక ఈ పరిశోధనా పద్ధతుల గురించి భయం వేసింది. అదే సమయంలో కొందరు శాస్త్రవేత్తల కథలు, ఈ పరిశోధనలకోసం శ్రమించిన ఆక్టివిస్టుల కథలు, కొందరు పేషంట్ల అనుభవాలు చాలా స్ఫూర్తివంతంగా అనిపించాయి.
పుస్తకం చదవడానికి చాలా లోతుగా అనిపించింది కొన్ని చోట్ల – విపరీతమైన శాస్త్రీయ వివరాలు పొందుపరచడం వల్ల (నాకు వైద్యవిషయాల గురించి అవగాహన లేకపోవడం అసలు కారణం!). కొన్ని అధ్యాయాలను నన్నైతే చాలా ఇబ్బంది పెట్టాయి, ఇంకా నాకు సరిగా అర్థంకాలేదనే అనుకుంటున్నాను. కానీ, అదే సమయంలో కథనంలో ఒక విధమైన సింప్లిసిటీ ఉంది. పుస్తకాన్ని అందరికీ అర్థమయ్యేలా రాసేందుకు రచయిత బాగా శ్రమించారని అర్థమయింది నాకు. ఆ శ్రమకి తగ్గ ఫలితం దక్కిందనే అనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని గురించి పులిట్జర్ జ్యూరీ అన్న వాక్యం – “an elegant inquiry, at once clinical and personal” అక్షర సత్యం.
పుస్తకాన్ని ముగించిన విధానం కూడా గొప్పగా ఉంది. ఒక పక్క క్యాన్సర్ ని ఎప్పటికీ జయించలేమేమో అంటూనే ఇన్నాళ్ళలో జరిగిన అభివృద్ధిని సంక్షిప్తంగామరోసారి చెప్పడం బాగుంది. పుస్తకం చదవాలా వద్దా అన్న సందేహం ఉన్నవారు మొదట చివ్వర్లో epilogue లా ఉన్న “Atossa’s war” అన్న అధ్యాయం చదివితే తప్పకుండా పుస్తకం చదవాలనుకుంటారని నా అభిప్రాయం (గూగుల్ బుక్స్ ప్రివ్యూలో ఈ అధ్యాయంలోని కొంతభాగం చదవడానికి లభ్యం). రచయిత వచనం చాలా బాగుంది. చాలా చోట్ల ఆకట్టుకునే, ఆలోచింపజేసే కొటేషనులు ఉన్నాయి. ఇప్పటికే వ్యాసం చాలా పెద్దదవుతోంది కనుక ఏదీ కోట్ చేయకుండా ఆపుతున్నాను. ఈ పుస్తకం చదివాక మనం క్యాన్సర్ నిపుణులు అయిపోము. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? ఎలాంటి వ్యాధులను క్యాన్సర్ అంటారు? వాటికి మందులున్నాయా? – ఇలాంటి అంశాల గురించి ప్రాథమికంగా అవగాహన కలుగుతుంది. పుస్తకంలోని అంశాలు ఎంత లోతుగా చదివారు అన్న దాన్ని బట్టి అవగాహన పెరగొచ్చు, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న కోరిక కలగొచ్చు.
మొత్తానికి ఈ పుస్తకం నామీద మానసికంగా చాలా ప్రభావం చూపింది. మొదటి సగంలో ఉన్నప్పుడు ఆ సంఘటనలన్నీ చదువుతూ షాక్ వల్ల చాలాసేపు అలా శూన్యంలోకి చూస్తూ గడిపాను. కొంచెం ఆధునిక కాలంలోకి (అంటే ఎనభైలలోకి) వచ్చేసరికి స్థిమిత పడ్డాను..బహుశా ఆ సరికి అలవాటు పడ్డానేమో ఆ తరహా విషాదాలకి. ఈమధ్యనే వచ్చిన “The Fault in our stars” సినిమా నన్ను ఆకట్టుకోవడంతో అదే పేరు గల దాని మూల నవల (రచన: జాన్ గ్రీన్) చదివాను. నవల బాగుంది. పుస్తకం గురించి రచయిత రాసిన అన్న కొన్ని మాటలతో నేను “The Emperor of All Maladies” పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాను. అంతకుముందు ఈ పుస్తకం గురించి తెలిసినా నేనెప్పుడూ చదవాలనుకోలేదు. కనుక, ఆ సినిమా తీసినవారికి, పుస్తకం రాసినాయనకీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పుస్తకం యదార్థగాథల సంకలనమే అయినా, సినిమాలని మించిన డ్రామా, సస్పెంస్ ఉన్నాయి ఇందులో! ఇది చదవిన రెండున్నర వారాలు అనేకరకాలుగా నా జీవితంలో విలువైన సమయం అనుకుంటున్నాను. బహుశా ఏ ఐదారేళ్ళ తరువాతో, లేకపోతే ఆ పైనరాబోయే సంవత్సరాలలోనో మళ్ళీ చదివితే మరింత ప్రభావం చూపుతుందేమో అనిపిస్తోంది ఇప్పటికైతే!
2010
592
IM
False cause అన్నది ఒక logical fallacy.
“లంగ్ క్యాన్సర్ కి పొగత్రాగడానికి సంబంధం ఉందని ఇప్పుడు సామాన్య ప్రజానికానికి కూడా ఓ మోస్తరు అవగాహన ఉంది. ఒక్క మూణ్ణాలుగు దశాబ్దాల క్రితం ఈ సంబంధాన్ని కనిపెట్టిన/అనుమానించిన శాస్త్రవేత్తలని తోటి శాస్త్రవేత్తలే నమ్మలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.”
I think this is due to the lack of knowledge rather than having ulterior motives or smth.
సౌమ్య
నాకు అర్థమైనంతలో రెండూ ఉన్నాయండి ఈ ఉదంతంలో. కొందరిది అజ్ఞానం. కొందరిది తమ భవిష్యత్తు గురించి భయం. కొందరిది denial కూడా అయ్యుండొచ్చు – ఈ అభిప్రాయం ఆ పుస్తకంలో ఆ అధ్యాయంలో రాసిన దానికి మట్టుకే పరిమితం. నేను డాక్టర్ని కాను, సైకాలజిస్తుని అంతకన్నా కాను. 🙂
నా వ్యాసం ఈ పుస్తకం చదివేలా చేసిందన్నారు – సంతోషం 🙂
IM
నిన్న అమెజాన్(kindle store)లో పట్టాను. ఒక ధ్రిల్లర్ చదువుతున్నట్లుగా ఉంది. Thanks for intro-ing this book.