ఒక చదువరి విన్నపం
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
ఒక హరిత విప్లవం వచ్చినట్టు చిన్నకథల విప్లవం భారతీయ సాహిత్యంలో ఒక కాలంలో ఎందుకొచ్చిందో గానీ వచ్చేసినట్టుంది. మన రామాయణాలు, భారత , భాగవతాదులూ ప్రేమాయణాల గాథలూ కూడా అన్నీ పెద్ద కథలే. ఇప్పటికాలం నవలలకు ఎన్నోరెట్లు పెద్దవి. అవన్నీ ఏళ్ళతరబడి, దశాబ్దాల తరబడి, ఏం యుగాల తరబడి మనమీద ప్రభావం చూపినాయి. చూపిస్తూనే ఉన్నాయి. మంచీ చెడూ నేర్పినాయి. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగల మహాశక్తివంతమైన రచనలు పెద్దకథలుగానే మనకొచ్చినాయి.
అయితే మన సాహిత్యంలో మునుపు చిన్నకథలు లేవా అంటే ఉన్నాయి. ప్రతీ పెద్దకథలో అనేక చిన్న కథలు పిట్టకథలు దాగిఉంటాయి. అవి ప్రత్యేకప్రతిపత్తి కూడా కలిగిఉంటాయి. విడదీసి రోజు కొక్కటి విడిగా పిల్లలకు చెప్పుకోవచ్చు. హరికథలూ బుఱ్ఱకథల వాళ్ళూ ఇవి చెప్పి కథను మరింత రసవత్తరం చేయడమూ ఉంది. అంతేకాదు. అనేక చిన్నకథలు కలిపి ఒక పెద్ద బృహత్కథ , కథాసరిత్సాగరం, పంచతంత్రం మొదలైన పేర్లతో సాహిత్య ప్రపంచాన్నే ఉర్రూతలూగించే అద్భుతమైన రచనలున్నాయి.బృహత్కథ కాలిపోయి సగం లభ్యమైతేనే అంత పెద్దగా ఉంది.
ఈ విధంగా పురాతన సాహిత్యంలో చిన్న కథలూ కథలూ పే………..ద్దకథలూ అనేకం దండిగా ఉండగా తర్వాతి కాలంలో చిన్నకథల విప్లవం వచ్చిందనుకోవడం ఎందుకు?
ఎందుకంటే అప్పటికే ఎంతో ప్రసిద్ధి పొంది వ్యవస్థీకృతమై ఉన్న పెద్ద కథారీతిపై యుద్ధం ప్రకటిస్తూ వచ్చింది గనుక ఇది విప్లవమే అయింది.
ఒకకాలంలో పరభాషా సాహిత్యాలు మన భాషాసంస్కృతీసాహిత్యాల మీద కూడా కొట్టిన దెబ్బగా భావించడంలో తప్పులేదు. లేదా ప్రతిచోటా మార్పు సహజమన్నట్టు దీనిని సహజమైన మార్పుగా తీసుకున్నా అభ్యంతరం లేదు. అదీ ఒక కోణమే. కానీ ఇది చిన్న మార్పు కాదు. పెనుమార్పు.
దేశీయభాష, సాహిత్యం, ఆలోచనాధోరణి పై వ్యతిరేకత, నిరాసక్తత ప్రబలి ఉన్న రోజుల్లోనే ఇదీ జరిగింది. అంత పెద్ద కథలు చదివేదెవరన్న నిర్లిప్తత పాఠకలోకాన్నావరించింది.విపరీతంగా పెరిగిన ప్రసార సంపర్కసాధనాల వలన కూడా మనిషి పుస్తకపఠనాభిలాషకు సమయం కేటాయించడం కూడా కష్టమైంది. ఉదాహరణకు ఒక ఊళ్ళో ప్రక్కూళ్ళో ఉన్న తోటి పాఠకులతో సాహిత్యం కలసి చదవడం చర్చింటానికున్న సమయాన్ని అనేకరకాలైన కాలక్షేపపు పత్రికలు, రేడియో టీవీలు పంచుకోవడమే కాక ప్రయాణసాధనాలు విరివిగా పెరగడం తో దూరదేశాల సాహిత్యకారులతో మమేకం కావడానికి రచనాసక్తి/పఠనాసక్తి పటిమ ఉన్నవారు ఇష్టపడడంతో ప్రయాణాలకుకూడా సమయాన్ని కేటాయించాల్సిరావడం జరుగుతున్నది.
ఈవిధంగా అనేక కారణాల వల్ల ఎందుకు పెద్ద కథలు? చిన్నకథలు కావాలని, తొందరగా చదివేయాలని, వర్ణనలు తగ్గించాలని, క్లుప్తంగా సూటిగా చెప్పాలనుకున్నది చెప్పాలని, సంభాషణల్లో నాటకీకరణలు తగ్గించాలని అనేకానేక నియమాలు. ఈ నియమాలు నిజానికి మంచివే , పెద్దకథలకూ వర్తించేవే. కానీ ఈ నియమాలు పెద్దకథలకన్నా చిన్నకథలపై వత్తిడి పెంచుతాయి. ఈ విధంగా చిన్నకథ కుదించుకుపోతూ పోతూ… చివరకు చందమామలో పిల్లల కథల కన్నా పెద్దల చిన్న కథలు చిన్నవైపోయి పోస్ట్ కార్డ్ సైజు కు వచ్చినాయి.
ఎందుకిట్లా కుదించబడడం? ఒక చిన్న ఘటన, ఒక సాధారణమైన ఆలోచన, ఒక పరివర్తన, ఒక ఘర్షణ లేదా వీటికై ప్రయత్నము దీనినే కథాంశంగా తీసుకొని వ్రాసేస్తున్నారు.
ఈ విధంగా లక్షల కథలు ఈ రోజు సృష్టించబడుతున్నాయి. ప్రతీ ఒక్కరూ రచయితలు కావడం సంతోషకరమైన సంగతే గానీ వీటివల్ల పాఠకునికి పఠనానందం నానాటికీ మృగ్యమయితున్నది. నైపుణ్యం కలిగిన రచనలు చేసేవారికీ గుర్తింపు రావల్సినంత రావడం లేదు.నిజం గుంపులో గోవిందా ఐపోతున్నారు.
పాఠకునికీ ఆనందం , కథకునికి తృప్తి కలిగించని పక్షంలో ఈ చిన్న కథలెందుకు అని ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది.పాత్రల వ్యక్తిత్వాల పూర్తి చిత్రణ, ఘటనా పరంపర, పాత్రల మధ్య ఘర్షణ- సమన్వయం, సమాజం పాత్ర, ఉత్కంఠను పెంపొందించే కీలకమైన మలుపులు, ఆశావహమైన/విషాదాంతమైన/సంతృప్తికారకమైన వైవిధ్యం కలిగిన ముగింపులు ఇవన్నీ కథకు గుండె, శిరస్సు, రక్తనాళాల వంటి ముఖ్యమైన లక్షణాలు.
ఈ లక్షణాలన్నీ ఉన్న పెద్ద కథలు రాణిస్తాయి. చదివేవారికి తృప్తినిస్తాయి. పఠనాసక్తి పెంచుతాయి. రాసేవారి ప్రతిభ బైటపడి గుర్తింపు దక్కుతుంది. నిలుస్తుంది కూడా. కథారచయితలూ పెద్దకథలు వ్రాయండి దయచేసి. పాఠకలోకం ఎదురుచూస్తున్నది. కవులూ ఏదో ఒక ఏకసూత్రత కల్పించి ఆధునిక రీతుల్లోనూ పెద్దకావ్యాలు వ్రాయండి. చిన్నకథలు, ఒక పది పంక్తుల కవితలతో ఆర్తి తీరడం లేదు. మీరు వ్రాయగలరనే నమ్మకముంది.
ఈమధ్య కాలంలో వచ్చిన హేరీపోటర్ సిరీస్ ఇంత ప్రపంచప్రసిద్ధి పొందడానికి కారణమిదే. పెద్దకథల మీద ఆసక్తి, తపన. అంతెందుకు ఊరిపేర్లు, సంవత్సరం పేర్లు, రచయితలపేర్లు ఏదో ఒక పేరుతో ఆ వర్గానికి చెందిన కథలన్నీ సంకలనంగా ప్రచురించడానికి కారణమేమి? ఎక్కువ చదవాలనే తపనే, ఒక్కకథతో, కవితతో తీరని దాహమే.
విమర్శకులూ ఆయా సంకలనాల్లో అంతర్లీనంగా కనిపించే ఏకసూత్రత ఏముందో నిరూపిస్తూ, ఏ రసం ప్రభావవంతంగా ప్రదర్శింపబడుతూ ఉందో చెప్పకనే చెప్తుంటారు.
రచయితల సంఘం ఒకటి కాదు. అనేకం ఉన్నాయి. చదువరుల సంఘాలు లేవు. చాలా తక్కువ. వారినుంచి సంఘటితంగా ఒక విన్నపం రావడం ఇప్పట్లో కష్టమే. కానీ పై సంగతులన్నీ గమనించండి. వ్రాయండి పెద్దకథలూ పెద్దకావ్యాలూ.
చివరగా ఒక్కమాట. ఉగ్గుగిన్నెలు చాలవు దోసిళ్ళనిండా సాహిత్యామృతాన్ని వర్షించండి.
నేను సర్వేలూ అవీ ఏమైనా నిర్వహించో తారీకులూ కొలతలూ చెప్తూనో వ్రాసిన వ్యాసంకాదు కాబట్టి “శాస్త్రీయం” కాకపోవచ్చు.కానీ సామాన్య చదువరులనేకుల్లో ఒక్కరిగా నా విన్నపం గమనించగలరని మనవి.
లక్ష్మీదేవి
హేలీ గారు, 🙂
రవి గారు, వ్రాసేవాళ్ళు లేరంటే ఒప్పుకోలేం . ఎక్కడన్నా కనిపిస్తారు, చిన్న కథల్లోనైనా వ్యాసాల్లోనైనా వాళ్ళ ప్రతిభ కనిపిస్తూనే ఉంటుంది.
మీరన్నట్టు కొంత సంకోచమైతే ఉండి నష్టం కలుగజేస్తూంది. సంపాదకులు ఒప్పుకోరనో, పాఠకుల సంఖ్య తగ్గిపోతుందనో… 🙁
రవి
లక్ష్మీదేవి గారు, మీకొచ్చిన అనుమానమే కొంతకాలం క్రిందట నాకూ వచ్చింది. విపుల అనే మాసపత్రికలో పొట్టికథలు చూసినప్పుడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దకథలను రసస్ఫూర్తిగా వ్రాసే వాళ్ళు దొరక్కపోవచ్చు. పాఠకులే కాలక్రమంలో కథకులు, రచయితలుగా మారతారు. ఒక పెద్ద కథ లేదా కూసింత నిండైన రచన ఏదైనా రావాలంటే అది ఒక చక్కని, తీరికబాటు జీవితపు నేపథ్యంలో నుంచి రావాలి. మనకున్నది హడావిడి జీవితమాయె!
కథలు అటుంచితే నా వరకూ చక్కగా ఆసాంతం చదివించే చివర్న ’ఓహ్” అనిపించే వ్యాసం, అలాంటి వర్గానికి చెందిన రచన కూడా ఈ మధ్య కాలంలో కంటబడలేదు. తప్పులు వెతికే పాఠకవర్గం, తప్పులను భూతద్దాల్లో చూసే సంపాదకవర్గం, తప్పులు వ్రాస్తామేమోనని కాస్తో కూస్తో వ్రాయగలిగిగినా వ్రాయలేని మనలో కొందరం! ఏం చేస్తే మారుతుందో తెలీదు.
Halley
బాగుందండీ ! ఇదే విషయం పై మీరు ఒక పెద్ద వ్యాసం రాసి ఉంటే ఈ మాత్రం మంది కూడా చదివి స్పందించే వారు కాదేమో 🙂
లక్ష్మీదేవి
మాలతి గారు, మణి గారు, శివరామకృష్ణగారు, నారాయణ స్వామి గారు
మీరంతా స్పందించడం నాకు గౌరవకారణం. 🙂
కవులు నిరంకుశులని ఒకప్పుడన్నారేమో గానీ సంపాదకులు ఇప్పుడు నిరంకుశులై (వాళ్ళ పరిమితులు కాదనలేనివైనా) రచయిత భావావేశాన్ని నియంత్రిస్తూ పాఠకుల భావోద్వేగాల స్పందనల అంతర్ధానానికి కారణమౌతున్నారు.
నా వినయపూర్వకమైన విన్నపం ఒక్కటే. ఏ కథా విధానాన్నీ పనికి రానిదని తీర్మానించలేము అనేది మనందరం అంగీకరించవలసిన సంగతి. ఆధునిక పాఠకుల్లోనూ అన్ని రకాలూ వారూ ఉన్నారు.
మాలతి
లక్ష్మీ దేవిగారు, బాగుంది మీ వ్యాసం. మంచి విషయాలే చెప్పేరు. ముఖ్యంగా చిన్నకథలవిషయంలో మీరు చెప్పింది కొంతవరకూ నిజమే. నిడివి తగ్గడమే కాక చెప్పేతీరులో పస తగ్గిపోతోంది. ఏదో ఒక అంశం తీసుకుని Coffee table conversation లా చెప్పుకుపోవడమే, కానీ “చదివించేగుణం” మీద రచయితలకి శ్రద్ధ ఉన్నట్టు కనిపించదు. పోతే, ఈ స్పీడ్ రీడింగ్ కాలంలో పెద్దకథలకి గిరాకీ కూడా తక్కువే కదా. పత్రికలు చూడండి, కథలని కత్తిరించేస్తున్నారు, చెప్పో చెప్పకో తమకాలాలకి పట్టడంలేదని. కొంతకాలం క్రితం నెట్ పత్రికకి ఒక వ్యాసం పంపితే, అంత పొడుగు బాగులేదు, కుదించండి అని నాకు తాఖీదు పంపేరు. నెట్ లో నిడివి ప్రశ్న ఎందుకొస్తుంది అంటే పాఠకులకోరికలననుసరించే అనుకోవాలి కదా.
చదువరుల సంఘాలు కూడా ఉన్నాయండి నీడల్లా. ఒకొక రచయితకి అభిమానులు సంఘాలు అని పేరు పెట్టుకోకపోయినా ఒక సంఘం చేసేపనే వారు చేస్తుంటారు. 🙂
mani vadlamani
లక్ష్మిదేవి గారు మీ వ్యాసం లో అంతర్లీనంగా కొంత ఆవేదన కనిపించింది. అది కధపట్ల,కధకుల పట్ల మీకున్న మమకారమే అలా పరావర్తనం చెందింది నిజమే మీరు రాసిన అన్ని అంశాలతోను ఏకీభవిస్తాను. మనం ఎప్పుడూ ఆశాజీవులమే కదండీ. రానున్న కాలం లో పెద్దకధలకి మళ్ళి పూర్వ ప్రాభవం రావచ్చు.కదకులు ప్రతిభ రాణించే అవకాశము కలగొచ్చు
Sivaramakrishna Vankayala
కథలాగే కవిత కూడా పొట్టిది గా మారిపోయి హైకూలు గా కనిపిస్తోంది. కాలప్రవాహం లోని మార్పులు ఇవన్నీ.
మీ వ్యాసం చాలా బాగుంది లక్ష్మీదేవి గారూ!
ఇదివరలో 24 రీళ్ల సినిమాలు వచ్చేవి. మనకు అవి గుర్తున్నంతగా నేటి గంటన్నర సినిమాలు హాలు బయటికి వచ్చేకా అసలు గుర్తే ఉండడము లేదు కదా!
Narayanaswamy
ఆమెన్!